Monday, July 27, 2009

హేతువాదం......

హేతువాదులు-6
మరిచిపోయాను—మొన్న ఉగాదికి—పాత సంవత్సరం మధ్యాన్నమెప్పుడో వెళ్ళిపోయింది—చైత్ర శుధ్ధ పాడ్యమి ప్రవేసించి, కొత్తసంవత్సరం ప్రారంభమయ్యింది!
కానీ—వీళ్ళకి ఉగాది ఆ మర్నాడుగానీ ప్రారంభం కాలేదు—పైగా ప్రభుత్వానికి కూడా సలహా ఇచ్చి, ఉగాది వాళ్ళు చెప్పిన రోజే జరిపించారు!
ఇంతకన్నా పరాకాష్ట యేముంటుంది!
జాతకాలు : — వీటిగురించి యెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది!
శిశువు పుట్టగానే జాతకం వ్రాయించేవారు ఇదివరకు—జన్మ సమయాన్ని బట్టి—స్థూలం గా ఆ శిశువు భవిష్యత్తు తెలుసుకోవచ్చు అని ఓ నమ్మకం వుండేదిట ఆ రోజుల్లో!
పాత రాజుల సినిమాల్లోనూ, జానపద సినిమాల్లోనూ చాలా చూశాము కదా—రాజుగారి కోడుకో కూతురో పుట్టగానే ఆస్థాన జ్యోతిష్కులు వచ్చి ఫలానా సంవత్సరం లో ఫలానా గండం వుంది అని చెప్పడం, రాజుగారు బెంగపెట్టుకోవడం, ఆఖరికి హీరో వచ్చి ఆ గండం నించి రక్షించడం!
మహా మంత్రి తిమ్మరుసు ఓ జ్యోతిష్కుడు జాతకం చెప్పాక, ‘మీ జాతకం లో మీరు యెప్పుడు చచ్చిపోతారో వ్రాసి వుందా?’ అని అడిగి, ‘నాకు పూర్ణాయుర్దాయం వుంది’ అని చెప్పగానే, ఆ ప్రక్కనించి ఓ సైనికుడు వేసిన బాణానికి గురై చచ్చిపోవడం కూడా చూశాము!
ఇక ఇప్పుడు కంప్యూటర్ జాతకాలు! ఇవెంత గొప్పవంటే, ఒకే వ్యక్తి జాతకం—అదే జన్మ స్థలం, సమయం, తేదీ లతో—ఢిల్లీలోనూ, కలకత్తాలోనూ, ముంబాయిలోనూ, చెన్నైలోనూ, బెంగుళూరులోనూ, హైదరాబాదులోనూ, వేరు వేరు వ్యక్తులు వేరు వేరు కంప్యూటర్లలో వ్రాయిస్తే, 6 రకాల జాతకాలు వచ్చాయి—ఒకదానికీ, ఒకదానికీ పొంతన లేకుండా!
ఇంతకన్నా ఇక చెప్పేదేముంది!
అయినా, ఇప్పటికి కూడా వీటికి ప్రచారం జరుగుతూనే వుంది—ముఖ్యం గా పెళ్ళి సంబంధాలు కుదరాలంటే ఒకలాగా, చెడగొట్టాలంటే ఇంకోలాగా—వుపయోగించుకొని!
మరి గిరీశం కాలం నించీ (జాతకాలు ‘బనాయించడం’ విషయంలో) మనమేమి నేర్చుకున్నట్టు?

Friday, July 24, 2009

హేతువాదం....

హేతువాదులు-5
మూఢనమ్మకాలని పెంచి పోషిస్తున్నవాళ్ళు 30 శాతం బ్రాహ్మణులే అని యెందుకన్నానంటే—అది నిజం కనుక!
ముహూర్తాలూ, జాతకాలూ, వాస్తులూ, ప్రత్యేక పూజలూ, విశేష పూజలూ, బ్రహ్మోత్సవాలూ అంటూ జనాల్లో మూర్ఖత్వాన్ని పెంచుతున్నారు!
ముహూర్తాలు :— ‘పంచాంగం’ అంటే—తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం!
మనకి తెలిసున్న తిథి వారనక్షత్రాల గురించే—(యోగ కరణాలని వాటి ఖర్మకొదిలేసినా) సవాలక్ష సందేహాలూ, వివాదాలూ!
అసలు ముహూర్తం అంటే, ‘మంచి సమయం’! ‘అయం ముహూర్తో సుముహూర్తమస్తు!’ అని పురోహితులు చదువుతారు—అంటే ఈ ముహూర్తమే సుముహూర్తమగుగాక! ఆని.
ఇప్పటికీ, రాయలసీమ జిల్లాల్లో మనలాగ 4-04 నిమిషాలకి, 11-52 నిమిషాలకి అని కాకుండా, 4-15 నిమిషాలనించి 5-32 నిమిషాల మధ్య—అని ప్రకటిస్తారు! అదీ సరైనది!
నిజంగా యే రెండు పంచాంగాలు గానీ, కేలండర్లు గానీ, తిథి వార నక్షత్రాలకి మొదలు/చివరా ఒకే సమయాన్ని సూచిస్తున్నాయా? సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలని ఒకేలాగ ఇస్తున్నాయా?
ఇవి కాకుండా, వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం—ఇవోటి! కనీసం వీటినైనా ఒకేలా అందరూ సూచిస్తున్నారా?
సరే—కొత్తగా ‘అమృతఘడియలు’ అని ఇంకోటి!
ఇవన్నీ కాకుండా యెవరి జాతకాన్ని బట్టి వారికి, సంవత్సరం లోని 365/366 రోజుల్లోనూ, యేరోజు యే సమయాలు మంచివి అని ఓ పట్టిక తయారు చేసిస్తున్న గురువులూ, బాబాలూ కో కొల్లలు! (వీటికీ, పంచాంగాలకీ, కేలండరులకీ అసలు పొంతన వుండదు!)
శ్రీరామచంద్రుడి కళ్యాణాన్ని సహితం వివాదాస్పడం చేసేశారుగదండీ! (బుఖారీల్లాంటి సాయిబ్బుల్ని చూసి పోటీ పడుతున్నారేమో అనిపిస్తుంది!)
యేదైనా బ్రాహ్మణుల్లో మిగతా శాఖలవాళ్ళందరూ తిథి ‘తగులు’ నీ, వైష్ణవులు మాత్రం ‘మిగులు’ నీ పరిగణిస్తారు—పురాతన కాలం నించీ!
మిగిలినవాళ్ళూ అష్టమి వెళ్ళి, నవమి ప్రవేశించే రోజున శ్రీరామ నవమి అంటే, వైష్ణవులు ‘అష్టమి మిగులు వుండకూడదు—నవమి అసలు లేకుండా, దశమి ప్రవేసించి పూర్తిగా వున్నాసరే, ఆ రోజే శ్రీరామ నవమి '—అంటారు!
అమావాస్య అరవ్వాళ్ళకి చాలా మంచిది—మనకి పనికి రాదు!
రాహుకాలం అరవ్వాళ్ళకే పట్టింపు--మనకి కాదు--అయినా దాన్నీ పట్టించుకుంటున్నారు మనవాళ్ళు!
ఇలాంటివి చెప్పుకుంటూ పోతే, పేజీలకి పేజీలు ఖర్చయిపోతాయి!
వుపయోగం యేమైనా వుంటుందంటారా?
చూద్దాం!

Tuesday, July 14, 2009

హేతువాదం....

హేతువాదులు—4
శ్రీ యెక్కిరాల వేద వ్యాస్--అంతటి మేధావి—‘యుగాంతం’ వ్రాసి, 1999 డిసెంబరు 31న ‘కలియుగాంతం’ అయిపోతుందని చెప్పి—నవ్వులపాలయ్యాడు!
ఇంకొంతమంది వున్నారు—‘కోతి నుంచి మానవుడు పుట్టాట్ట! మీరు (అంటే మనుషులు) యెవరైనా, యెప్పుడైనా, ఇప్పటివరకూ ఒక్క కోతైనా మనిషిగా మారడం చూశారా?’—ఇలాంటి విమర్శలు చేస్తూ వుంటారు!
డార్విన్ చెప్పిన ‘జీవపరిణామ సిద్ధాంతం’ కొన్ని కోట్ల సంవత్సరాలుగా జరుగుతూ వచ్చిన నిజమనీ, యేక కణజీవి నించీ పరిణామం మొదలయ్యింది అనీ వీళ్ళని యెవరు నమ్మించగలరు!
అబ్రహాం టి కోవూర్ అని ఒక డాక్టరు—40 యేళ్ళ క్రితం ఓ బ్యాంకులో ఒక లక్ష డిపాజిట్ చేసి, బహిరంగ సవాలు విసిరారు—యెవరైనా సరే, యేవైనా సరే మహిమలు మా ముందు చూపిస్తే, ఆ లక్ష వెంటనే బహుమతిగా ఇచ్చేస్తాను—అని!
వూరారా ప్రదర్శనలు ఇస్తూ, ‘మహిమలు’ అని అప్పటికి చెప్పుకొనే—విభూతి ప్రసాదించడం, పువ్వులు సృష్టించి ఇవ్వడం, వుంగరాలూ, గొలుసులూ తెప్పించి ఇవ్వడం, ఆత్మలింగం కడుపులోంచి నోట్లోకి తెప్పించి ఇవ్వడం, నాడి కొట్టుకోకుండా ఆపెయ్యడం, భజన చేస్తూ వుంటే దేవుడు కనిపించాడని చెప్పడం, దెయ్యాలూ, భూతాలూ, శకునాలూ—ఇలాంటి వాటి గురించి వివరించి, చేసి చూపించేవారు!
మరి ఇప్పటివరకూ యెవరూ ఆ బహుమతి సొమ్ముని చేజిక్కించుకోలేకపోయారు! ఇంకెక్కడి మహిమలు?
విజయవాడాలోనైతే, ప్రత్యక్షం గా ఓ పాతిక మంది చేత ‘కోకా కోలా—కోకా కోలా’ అంటూ భజన చేయించి, తెల్లవారుఝామయ్యేసరికి అందరూ ఒక రకమైన పూనకం తో వూగుతున్నట్టు వుండగా—వారిని ప్రశ్నిస్తే, ‘నాకు రాముడు కనిపించాడు’ అని కొందరూ, ‘వెంకటేశ్వరడు కనిపించాడు’ అని కొందరూ, ‘సాయి బాబా కనిపించాడు’ అని కొందరూ—ఇలా వాళ్ళకి నచ్చిన దైవాలందరూ తలొకళ్ళూ చెపితే, మేము స్థబ్దం గా విని, తరవాత హాయిగా నవ్వుకున్నాము!
దాదాపు అదే రోజుల్లో డాక్తర్ సమరం ‘మూఢనమ్మకాలు—అసలు నిజాలు’ అనో, ఇంకేదో అలాంటి అర్థం వచ్చే పేరుతో పుస్తకం వ్రాశారు! ఇంకా రోగాలూ, చికిత్సలూ, పథ్యాలూ—ఇలాంటివాటి మీద కూడా పుస్తకాలు వ్రాశారు!
ఇక స్త్రీవాద, హేతువాద రచయిత్రి ముప్పాళ్ళ రంగనాయకమ్మ యేకం గా ‘రామాయణ విష వృక్షం’ వ్రాసి, రామాయణం లో ఒక్క శ్లోకం కూడా హేతువాదానికి నిలబడదు అని నిరూపించింది!
ఈ తరం వాళ్ళకి ఇవేవీ తెలియవు! ఆ పుస్తకాలు కూడా ఇప్పుడు దొరకడం లేదు!
కనీసం ఆ రోజుల్లో ఆ పుస్తకాల ద్వారా ‘మూర్ఖత్వం’ మరింత ప్రబలకుండా తగ్గింది!
ఇప్పుడో! ఇంకా, ఇంకా, ఇంకా—ఇంతింతై, వటుడింతై—అన్నట్టు పెరుగుతోంది!
పెంచుతున్నవారుకూడా—మొహమాటం లేకుండా చెపుతున్నాను—ఓ 30 శాతం మూర్ఖత్వాన్ని బ్రాహ్మణులూ, ఇంకో 30 శాతాన్ని—సినిమావాళ్ళూ, ఇంకో 30 శాతన్ని ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళూ, ఇంకో 5 శాతాన్ని పత్రికలవాళ్ళూ, మిగిలిన 5 శాతాన్ని ఇతరులూ—పెంచుతున్నారు!
మరి ఇంకో ‘కోవూర్’ యెవరైనా, ఇంకో సమరం యెవరైనా, ఇంకో రంగనాయకమ్మ యెవరైనా బయలుదేరితే బాగుండును!
కదా!

Saturday, July 11, 2009

హేతువాదం

హేతువాదులు-3
1971 లో మా డిగ్రీ చదువులు పూర్తయ్యాక, 1972 లో కాన్వొకేషన్ యేర్పాటుచేశారు.
1970 వరకూ, విద్యార్థులకి వైజాగ్ లో యూనివర్సిటీలో కాన్వొకేషన్ నిర్వహించేవారు! ఆ సందర్భం గా నెత్తిమీద నల్లని గుడ్డతో కప్పబడిన స్క్వేర్ అట్టనీ, నల్లని—జడ్జీలు తొడుక్కొనేలాంటి గౌనుల్నీ విద్యార్థులు ధరించవలసివచ్చేది! (ఆ గౌన్లూ అవీ అక్కడే ఆ కాసేపూ అద్దెకి ఇచ్చేవారట!) మా నాన్నగారైతే—‘వీణ్ణి కాన్వొకేషన్ కి యెలా పంపించాలో! అక్కడ గుడ్డల అద్దెలూ అవీ యెలా భరించాలో!’ అని బెంగ పడ్డారు!
ప్రభుత్వం పుణ్యమా అని, మా బ్యాచ్ నించే కాన్వొకేషన్లని ‘వికేంద్రీకరించి’ యెవరి కాలేజీ లో వాళ్ళు నిర్వహించుకోవచ్చు అన్నారు! విద్యార్థులు ధరించడానికి ఒక ‘మెరూన్’ రంగు స్చార్ఫ్—ముక్కోణాకారపు గుడ్డ—దీన్ని వీపు మీద మెడ చుట్టూ ధరించి, ముందుకు లాక్కొని, రెండు కొనలూ ముడివేసుకోవాలన్నమాట—లని కూడా వుచితంగా ఇచ్చే యేర్పాటు చేశారు! దాన్ని యెవరికి వారు ‘ఙ్ఞాపిక’ గా తీసుకెళ్ళిపోవచ్చు! (హమ్మయ్య! అనుకొన్నారు మా నాన్నగారు!)
ఆ రోజున మేమందరం వుత్సాహం గా కాలేజీ కి వెళ్ళాము, స్కార్ఫ్లూ, బేడ్జీలూ ధరించి, ఆడిటోరియం లోకి చేరాము—అంతకు ముందే, బ్యానర్లు ప్రకటించాయి ‘ముఖ్య అతిథి—శ్రీ వేదవ్యాస్—డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, యే యూ’ అంటూ!
ఇంగ్లీషు మీడియం లో డిగ్రీ అయితే చదివాముగానీ, ‘డీన్’; ‘ఫ్యాకల్టీ’ లాంటి మాటలకి మాకర్థం తెలియదు—ఒకర్నొకరు అడుక్కుంటూ, ఆడిటోరియం లోకి వెళ్ళడానికి ముందు తెలుసుకున్నాము—డీన్ అంటే, మన హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ లాగ, యూనివర్సిటీలో ఒక పదవి అనీ, ఫ్యాకల్టీ అంటే పాఠాలు చెప్పేవాళ్ళని అలా అంటారనీ!
ఇంకా, లోపల ముందువరసలలో ప్రేక్షకుల కుర్చీలలో కూర్చొని, ‘వీడెవడో వేద వ్యాసుడట! భారతం, భాగవతం చెపుతాడో యేమిటో! యెలా భరించాలిరా బాబూ! అనుకొని, ‘ఆన్! అంతకీ అయితే మన గ్యాస్—‘స్స్ స్స్ స్స్ స్’ అనే సౌండ్ వదలడం వుందిగా! వాడే ఆపేస్తాడు’ అని ఆనందిస్తూ కూర్చొన్నాము!
ముందు మా ప్రిన్సిపల్ గారు అతిథుల్ని ‘వెల్ కం’ చేశారు—‘మిష్టర్ డీన్’—అంటూ! తరవాత, డీన్ గారు ‘మిష్టర్ ప్రిన్సిపల్!’ అనగానే—“అహాన్! ఇలా డెజిగ్నేషన్లతో పిలిచేటప్పుడు ‘మిష్టర్’ వాడచ్చన్నమాట”—అనుకొన్నాము!
పేరు పేరునా అందరినీ పిలిచి, డిగ్రీ సర్టిఫికెట్లని—చక్కగా చుట్టి, సన్నటి రంగు రిబ్బన్లు కట్టి—ప్రదానం చేశారు. తరవాత—వేదవ్యాస్ గారి ‘కీనోట్ అడ్డ్రెస్’ (భారతమా, భాగవతమా…….!) ఉత్సుకతతో మా వెయిటింగ్—ఆయన మామూలుగా మొదలు పెట్టగానే, మా ‘స్స్ స్స్…’ లతో స్వాగతం! ఆయన చెక్కు చెదరలేదు—పైగా,
‘స్స్ స్స్….’ అనే శబ్దం పాములదనీ, వాటిని ‘వాయుభుక్కులు’ అంటారనీ…..ఇలా యేవేవో చెప్పి, అనర్గళంగా వేదాల్లోంచీ, పురాణాలలోంచీ, ఉపనిషత్తుల్లోంచీ శ్లోకాలు వుదహరిస్తూ, మాట్లాడుతూంటే—చెపితే నమ్మరు—పిన్ డ్రాప్ సైలెన్స్! అందరూ హిప్నటైజ్ అయిపోయారు!
ఆయన ఆ రోజు చెప్పిన మాటలు ఈ రోజుకీ మా చెవుల్లో మార్మోగుతూ వుంటాయి—‘మనో వేగాన్ని మించినది వేరే లేదు—రాబోయే కాలం లో, యుద్ధాలు ఆయుధాలతో కాదు—మనస్సులతో జరుగుతాయి—అవి మేథోయుద్ధాలు! మనస్సు కన్నా పవర్ ఫుల్ ఆయుధం వేరేదీ లేదు……….’ ఇలా చెప్పుకు పోయారు!
…..ఇంకా వుంది!

Friday, July 10, 2009

మరో రకం.....

హేతువాదులు-2
(నిన్న వ్రాసిన నా టపా మీద వచ్చిన కామెంట్లు చదివి, ‘ఆహా! ఇంకో నాలుగు టపాలకి మెటీరియల్ దొరికింది!’ అన్న ఆనందం తో మళ్ళీ రెండో టపా వ్రాస్తున్నాను—చదవండి మరి!)
మాకో హిందీ మేష్టారు వుండేవారు. (ఇప్పుడింకా వున్నారనుకోను). శ్రీ ఫ్రాన్సిస్ గారు! ఆయన బై బర్త్ క్రిస్తియన్. అయినా, పురాణాలూ, ఉపనిషత్తులూ, అవీ, ఇవీ చదివేశాడు! పచ్చటి శరీరం, సన్నగా ఓ ఆరడుగులు పొడుగూ, చక్కటి పంచె కట్టూ, పనసతొనరంగు తో ఆ రోజుల్లో వచ్చే సిల్కు షర్టూ (పొడుగు చేతులూ, రోల్డ్ గోల్డ్ కఫ్ లింక్సూ, బొత్తాలూ వుండేవి!) వేసుకొని, వూచలా నడిచేవాడు. చేతిలో ఓ చిన్న గుడ్డ సంచీ! దాంట్లో పుస్తకాలూ!)
ఆయన పరిశోధించి, కనుక్కున్న విషయం గా అందరికీ చెప్పేవాడు—క్రీస్తూ, కృష్ణుడు ఒకడే అని! క్రీస్తు తన శిష్యులచేత ‘యఙ్ఞం’ చేయించాడని! (అన్న ఎన్ టీ ఆర్ లాగ ఆయన కూడా ‘యఙ్ఞం’ అండానికి ‘యగ్నం’ అనేవాడు! అదే పేరు తను వ్రాసిన పుస్తకానికీ పెట్టాడు!)
‘అనన్యస్చింతయం తోమా’ అన్న గీతావాక్యాన్ని వుదహరించి ‘క్రీస్తు తన శిష్యుడు తోమా తో ‘నువ్వూ యేమీ ఆలోచించకు! పరమతాన్ని వదిలెయ్యి! నా మతాన్నే అనుసరించు! పరమతాలు భయావహాలు!’ అని చెప్పాడని బోధించేవాడు!
వుద్యోగాన్ని గాలికొదిలేసి, చేతులో గుడ్డ సంచి తో తన ‘యగ్నం’ పుస్తకాన్ని చెత్తో పట్టుకొని, వీధులు తిరిగేవాడు—కొనండి కొనండి అంటూ!
కానీ ఆయన మేధావి! యెవరైనా యెదైనా వాదనకి దిగితే, వేదాల్లోంచి, పురాణాల్లోంచీ, ఉపనిషత్తుల్లోంచీ శ్లోకాలు వుదహరిస్తూ, అనర్గళం గా వాదించి, ‘ఓహ్!’ అనిపించేవాడు!
మరి హేతువాదులూ, ఆస్థికులూ ఈయన్ని యేమంటారు?

Thursday, July 9, 2009

సూడో.....

హేతువాదులు!
మా ఫ్రెండు ఒకతను వుండేవాడు—ఇప్పుడూ వుండే వుంటాడు—అంటే, మాకు బాగా తెలిసిన మా వూరి అమ్మాయిని, (పెద్దలు కుదిర్చిన సంబంధమే) పెళ్ళి చేసుకొని, మాకు ఫ్రెండు అయ్యాడ—‘వటకాళేశ్వరుడు‘ అని!
వాళ్ళ పెళ్ళి యెలా జరిగిందనుకున్నారు?—విజయవాడలో నాస్తిక కేంద్రం లో, డాక్టరు సమరం గారూ, ఇతర నాస్తికుల, హేతువాదుల సమక్షం లో, కూరగాయల దండలు మార్చుకొని!
వాళ్ళది యేలూరు దగ్గర యేదో వూరు—అక్కడ ఓ వట వృక్షం క్రింద ఓ శివలింగం ‘కాళేశ్వరుడు’ పేర వుండేదట! (వట వృక్షం అంటే రావి చెట్టేనా?!) అందుకని అతనికి ‘వటకాళేశ్వరుడు’ అని పేరు పెట్టారట! క్లాసు పిల్లలు, ‘ఒరే వటా!’ అనో, ‘ఒరే వట్టా!’ అనో పిలిచేవారు(ట)! పెద్దవాళ్ళైతే, ‘ఒరే వట్టూ’ అనేవారట! ‘నేను చిన్నప్పటినించీ నాస్తికుణ్ణి, హేతువాదిని! అందుకని నన్నెవరెలా పిలిచినా, నాకేమీ వూడదుగా!’ అనేవాడు!
సరే, పెళ్ళయ్యాక, ఆ అమ్మాయి కాపురానికి వెళ్ళాక (అతని వుద్యోగం యేలూరు లో కాబట్టి, ఓ బొమ్మరిల్లు లాంటి యిల్లు అద్దెకి తీసుకొని, ‘చిలకపచ్చ కాపురం’ మొదలు పెట్టారు!
ఓ ఆర్నెల్ల తరవాత, ఆ అమ్మాయి యెవరిదో పెళ్ళికో, మరే కారణంతోనో మా వూరు వచ్చినప్పుడు, ‘అదేంటో అన్నయ్యా! ఆయనకి నిలకడ లేదు! చాలా భయం గా వుంటుంది!’ అని వాపోయింది! సంగతేమిటని ఆరా తీస్తే, అంత నాస్తికుడూ, రోజు రెండు పూట్లా సంధ్యావందనం చేస్తాడట! పోనీలే, బ్రాహ్మణ పుటక కదా, ఫర్వాలేదు అనుకొంటే, ఈ యోగా అనీ, ఆ యోగా అనీ, రకరకాల చేష్టలు చేశేవాడట!
ఆ మర్నాడెప్పుడో ఆయన కూడా రాగానే, ‘బావగారూ! యేమిటి—యోగాలేవో చేస్తున్నారట—కాస్త మాక్కూడా నేర్ప కూడదూ?’ అని సరదాగా పలకరించాను.
‘అవీ—గురువు ముఖతహా వుపదేశం పొందాలండి!’ అని చెప్పి, నాకు ఫలానా బాబాగారు వుపదేశం చేశారు—అసలు యేమిటంటే, మనకి ఒక అక్షరం, ‘ఓం’, ‘హ్రీం’, ‘శ్రీం’, ‘క్లీం’—లాంటిదొకటి చెవిలో వుపడేశిస్తారన్నమాట! దాన్ని, మనం మన దృష్టి భౄ మధ్యంలో వుంచి, ఆ అక్షరాన్ని పదే పదే మనసులోనే వుచ్చరించుకుంటూ వుంటే, కాసేపటికి ఓ దివ్యానందం కలుగుతుంది!’ అన్నాడు!
నేను సరదాగా, ‘అసలు మనదారిని మనం హాయిగా వుండక, ఈ బాధంతా యెందుకు?’ అంటే, ‘ఈ యోగా చెయ్యగానే, మనసుకి యెక్కడలేని ప్రశాంతత వస్తుంది! హాయిగా వుంటుంది. యేవిధమైన వత్తిడులూ, టెన్షన్లూ వుండవు!’ అన్నాడు!
‘అయ్యా! మీకేమి టెన్షన్లు వున్నాయి? మీరు చేసేది స్కూల్లో వుపాధ్యాయులుగా! కేర్ ఫ్రీ జాబ్! మరి బ్యాంకులో పదిమందికి ఒకేసారి సమాధానం చెపుతూ, అందరినీ సంతృప్తిపరచడానికి నేను యెంత టెన్షన్ పడాలి? అయినా, అలాంటి పరిస్థితి వస్తే, ఆ చోటు నించి కొంత దూరం వెళ్ళి, ఒక సిగరెట్టు వెలిగించుకొని, ఓ దమ్ములాగి చిటిక వెయ్యగానే, యెంత టెన్షనైనా దూరమయిపోతుంది నాకు! దీని కోసం, గంటలతరబడి యోగాలూ, వుప్పుదేశాలూ యెందుకండీ!’ అని కాస్త గడ్డి పెట్టాను!
‘అబ్బే! మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు! మహేష్ యోగి శిష్యులు గాలిలో యెగురుతున్నారు తెలుసా!’ అన్నాడు.
‘వాడి శిష్యుల గొడవెందుకు—వాడు గాలిలో యెగరగలడా? గలిగితే, పధ్నాలుగో యెన్నో ‘రోల్స్ రాయిస్’ కార్లు యెందుకు? ప్రైవేటు జట్ విమానమెందుకు? జనాలు వెర్రివాళ్ళా? వాడి శిష్యులు వాడిని మించిన వాళ్ళా? అయితే ఒక్కణ్ణైనా యెగురుకుంటూ ఇండియాకి రమ్మనండి!’ అనేసరికి ఇక నోరెత్తలేదు!
మూడేళ్ళు తిరిగేసరికి, పాపం ఆ అమ్మాయి తన బీ యే డిగ్రీతో వేరే వూళ్ళో ఓ కాన్వెంట్ లో టీచరు వుద్యోగం చూసుకొని, వొంటరి జీవితానికి అలవాటు పడింది!
మరి ‘వట్టు’ యేమయ్యాడో—అప్పటినించీ మాకు తెలీదు!

Sunday, July 5, 2009

తెలుగు పేర్లు

మన ఆంధ్ర సంగతో!
కేంద్రం నించి ముష్టి యెత్తుకోవలసిన వాటి సంగతి సరే! మన ఎం పీ లు అందుకు పనికి రారు అని మరోసారి నిరూపణ అయిపోయింది కదా!
కనీసం మన రాష్ట్రం లో, కేంద్రం దాతృత్వం తో అవసరం లేని పనులు చెయ్యడానికి మన రెండొందల పైచిలుకు మెజారిటీ వున్న ఎం ఎల్ యే లు యేమైనా చెయ్యచ్చుకదా? వాళ్ళకి మిగిలిన ప్రతిపక్ష ఎం ఎల్ యే లు కూడా మద్దతు ఇస్తారుగా?
ఉదాహరణకి ‘శ్రీ గిరి శ్రీ పతి దేవస్థానం’ అని మార్చడం, (ఆ వూళ్ళ పేర్లు మార్చగల ధైర్యం వుంటే ఇంకా మంచిది!), హైదరాబాదు ని భాగ్య నగరం అని మార్చడం, బెజవాడ, రాజమహేంద్రి—ఇలా పేర్లు మార్చడం—ఇలాంటివి చెయ్యచ్చు కదా—మన తెలుగుదనం వుట్టిపడేలా!
ఆలోచించండి!