Monday, August 31, 2009

హేతువాదులు-10


వూరేగింపులు


దేవుళ్ళనీ, రాజులనీ, వధూవరులనీ పల్లకీ లో వూరేగించడం యెప్పటినించో వస్తున్న ఆనవాయితీ! కొంచెం పెద్దింటి మహిళల్ని మేనాల్లో అత్తవారిళ్ళకీ, పుట్టిళ్ళకీ పంపించేవారు! (వధూవరులని అలా వూరేగించడం ఇప్పుడు అనాగరికం! రాజులెలాగా లేరు! మేనాలు ఇప్పుడు అవసరం లేదు!)  


ఇవన్నీ, ఒకేఒక వెదురు బొంగు ఆధారంగా, ముందూ వెనుకా మోసేవాళ్ళ భుజాల మీద వుండేలా, మధ్య భాగం లో దేవుడైనా, రాజైనా, వధూ వరులైనా, మహిళలైన కూర్చోవడానికి అనువుగా పీఠాలూ, పైకప్పులూ, మేనాలకైతే తలుపులూ నిర్మించేవారు.  


ఆ బొంగులని ప్రత్యేకంగా 'కణాది బొంగు ' అనే జాతి వెదురు కర్రలతో తయారు చేశేవారు. (అలాంటి బొంగులతోనే ఆ రోజుల్లో, సోలలూ, అరసోలలూ, తవ్వలూ తయారుచేసేవారు.)  


మా చిన్నప్పుడు మా మాతామహులవారి వూరు వెళ్ళినప్పుడు ఓ వెదురు పొదలో పల్లకీ బొంగు ఆకారంలో వున్న ఒక లావుపాటి బొంగుని చూసి, 'అయ్యబాబోయ్! అంతలావు బొంగుని--ఆ ఆకారం వచ్చేలాగ యెలావంచారో?' అని ఆశ్చర్యపడిన మాకు, మా నాన్నగారు చెప్పారు--'ఆ వెదురు లేతగా, సన్నగా వుండగానే, అది పల్లకీకి పనికొస్తుంది అనుకున్నప్పుడు--దాన్నీ ఆ ఆకారం లో వంచి, తీగలతో కట్టేస్తారు--అదింక ఆ ఆకారం లోనే పెరుగుతుంది--పెద్దదయ్యాక దాన్ని నరికి, పల్లకీలు తయారు చేస్తారు.' అని.  


పల్లకీలో దేవుణ్ణి (వుత్సవ మూర్తులని) చక్కగా ఆసీనుణ్ణిచేసి, పడిపోకుండా చక్కగా బందోబస్తు చేసి, గుడిలోంచి బయటికి అర్చక స్వాములే స్వయంగా మోసుకొంటూ వస్తారు. గుడి గుమ్మం దాటేముందు--వాళ్ళ భుజం మీద వున్న పల్లకీ బొంగుని (దండెని) గుండ్రంగా ఇటూ అటూ తిప్పి, దేవుడు 'పడిపోవడంలేదు ' అని నిర్ధారణ చేసుకొని, బయటికి తెస్తారు (వూరిలోకి వెళ్ళాక విగ్రహాలు పడిపోతే, వూరికే అరిష్టం అని నమ్మేవారు!)--అక్కడనించి, చాకలివాళ్ళకి అప్పచెపుతారు పల్లకీ మోతని!  


అదీ ఈ అచారానికి మూలం.  


మరి ఈ రోజు, ప్రతీ నాలుగడుగులకీ ఆ దండెల్ని పైకీ కిందకీ యెగరెయ్యడం లో యేమైనా అర్థం వుందా--వేలం వెర్రి కాకపోతే!  


కాదంటారా?

Friday, August 28, 2009

హేతువాదం…..


హేతువాదులు-9
ఇక బ్రహ్మోత్సవాలు :—  

పాపం ఆ బ్రహ్మ యే ముహూర్తంలో శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరిపించాడోగానీ, ఆయనక్కూడా ‘రిమ్మతెగులు’ పుట్టేలా ఆయన చేత అనేక గుళ్ళలో ఉత్సవాలు జరిపించేస్తున్నారు!  

రేపు సెప్టెంబర్ లో మొదలౌతాయి శ్రీ వారి ‘వార్షిక’ బ్రహ్మోత్సవాలు. మొన్ననే మొదలయ్యాయి ‘కాణిపాక’ వినాయక బ్రహ్మోత్సవాలు! శ్రీ కాళ హస్తీస్వరుడికో యెవరికో మొన్న ముగిశాయి.  

ఇక మొన్ననే మా వూరి దగ్గరలో వున్న ‘తలుపులమ్మ’కి పూర్తయ్యాయి. రేపెప్పుడో మావూరి ‘పుంతలో ముసలమ్మ’కి ప్రారంభమౌతాయి! తరవాత ఇంకో ‘రాట్నాలమ్మకి’ ఇంకో ‘ఆంజనేయుడికి’ ఇలా!  

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో, రోజూ రెండుపూటలా స్వామి తన వాహనాలపై శ్రీమాడ వీధుల్లో భక్తుల కనులపండువుగా వూరేగుతారు. బాగానే వుంది.  

మరి నాకర్థం కాని విషయం—ఓ నాలుగడుగులు ముందుకి స్వామివారిని తీసుకెళ్ళగానే, వాహనాన్నీ, స్వామినీ, పక్కన అర్చకుల్నీ ‘దండెల’పై మోస్తున్నవారు, పైకీ కిందకీ యెగరేస్తూ వుంటారు! ఇది యెందుకో యెవరికైనా తెలుసా? (తెలిస్తే చెప్పండి—లేకపోతే నన్నడగండి.)  

అలా యెగరేస్తూంటేనే, మొన్నోసారి ఓ ‘దండె’ దూలం విరిగిపోయి, స్వామితో సహా భూపతనం కావలసిన పరిస్థితి వచ్చింది!  

ఇక, ఇదివరకు ఈ ‘స్నపన తిరుమంజనాలూ’ అవీ జరిగేవో లేదో తెలియదుగానీ, ఇప్పుడు టీవీలకోసం సుశిక్షిత సైనికుల్లా అర్చకస్వాముల శిష్యులూ, ప్రశిష్యులూ కాడ చెంబుల్ని పంచామృతాల్లో ముంచడం, అవి స్వాములకి అందించడం ఓ రెండు మూడు గంటల కాలక్షేపం!


తరవాత ఉత్సవ మూర్తుల్ని తుడవడం, అలంకరించడం—ఇలాంటి వాటికో రెండు గంటలు—ఇలా మరో కాలక్షేపం! (మరి ఆ గంగాళాలకొద్దీ పంచామృతాలు యే డ్రెయినేజీల్లో కలుస్తున్నాయో!)  

అగ్నిహోత్రానికి ఓ రెండో రెండున్నరో అడుగుల చదరం లో ఇటుకలతో కుండం నిర్మించి, లేనిపోని తిప్పలు పడడం! 

కుండానికి నాలుగుపక్కలా మంత్రాలతో దర్భల్ని వుంచుతారు. తరువాత, ‘…………అనుమతేన మన్యస్వాహ్ సరస్వతేన మన్యస్వాహ్……………..’ ఇలా కుడిచేతి మూడువేళ్ళతో వాటిపై ఓ దిక్కునించి ఇంకోదిక్కుకి నీళ్ళు జల్లుతారు.  

మరి కర్త చేతులు అంతపొడవు వుండవుగా! అందుకని కుడిపక్క మంత్రం చెప్పే ఆయనకీ, యెడమపక్క ఇంకో శిష్యుడికీ, యెదురుగా టీవీ కెమేరా ఆపరేటర్లకీ ఇచ్చి, వాళ్ళచేత పెట్టిస్తున్నారు దర్భలు! (నీళ్ళు జల్లడం నాకు కనిపించలేదు—కెమేరా స్థంభాలమీదకీ, సీలింగుమీదకీ తిరిగి పోవడం తో!)  

ఇక మంత్రం చెప్పే ఆయన చెప్పుకుంటూ పోతే, కర్త పెదాలు కదుపుతూ, గబగబా యాక్షన్ చేశేస్తూ వుంటాడు! (వీళ్ళముందూ యే డబ్బింగు ఆర్టిస్టులూ, ఉత్తరాది హీరోయిన్లూ దిగదుడుపే!)  

యెందుకంటారు ఇవన్నీ?  

ఈ భక్తి చానెల్ని మూసేస్తే యెంతబాగుండును! శ్రీవారి పవిత్రత కాస్త నిలబడును—అనిపిస్తూంటుంది నాకు.  

ఆలోచించండి!

Sunday, August 16, 2009

హేతువాదం…..

హేతువాదులు-8
మా కాలేజ్ చదువులయిపోయాక నిరుద్యోగ పర్వం రోజుల్లో, సాయంత్రం కాలక్షేపానికి మా ఫ్రెండ్ సైకిలు షాపు దగ్గర కాసేపు కూర్చొనేవాళ్ళం.
అప్పట్లో యెవరైనా కొత్తసైకిలు కొనుక్కుంటే, సైకిలు బిగించిన తరవాత, దానికి తీగతో నిమ్మకాయ హేండిలుబారుకి బిగించి, సిందూరం మెత్తి, మడ్ గార్డులమీద కూడా సిందూరం చల్లి, ‘ఇలా తూర్పుగా తొక్కుకు వెళ్ళండి. అక్కడున్న కనక దుర్గమ్మ గుళ్ళో ఓ కొబ్బరికాయ కొట్టండి! అంతా శుభం జరుగుతుంది.’ అనేవాడు ఆ షాపు వోనరు!
ఓసారి ఈ వ్యవహారం యేమిటో చూద్దామని మేము కూడా ఓ కొత్త సైకిలాయన తో గుడి దాకా వెళ్ళాము.
ఆయన ‘కొత్త సైకిలుకి పూజ జరిపించండి’ అంటే, ఆ పూజారి గారు నిర్మొహమాటం గా ‘సైకిలు పూజలూ, బండి పూజలూ అని ప్రత్యేకం గా వుండవు—మీ పేరూ గోత్రం చెపితే, మీ పేరున అమ్మవారికి అష్టోత్తరం చేస్తాను!’ అన్నాడు!
మరి ఇప్పుడో—సైకిలుకీ, మోటర్ సైకిలుకీ, కారుకీ, లారీకీ—కాకుండా ఆయుధ పూజల పేరుతో బీరువాలకీ, ఇనప్పెట్టెలకీ కత్తులకీ చాకులకీ, పెన్నులకీ—ఇలా ‘ప్రత్యేక’ విశేష పూజలు చేసేస్తున్నారు!
ఇక ప్రతీ నేతా, వీ ఐ పీ ప్రతీ గుడిలోనూ, ఆఖరికి శ్రీ రామనవమి, వినాయక చవితి పందిళ్ళలో కూడా—ప్రత్యేక పూజలూ, విశేష పూజలూ చేసేసే వాళ్ళే—మన మీడియా వాటిని ప్రముఖ వార్తల్లా ప్రకటించడమే!
ఆఖరికి గద్దర్ కూడా ఆ మధ్య శ్రీవారికి బ్రేక్ దర్శనం చేసుకొని, విశేష పూజలు చేసేశాడు.
(గద్దర్ ప్రత్యేకతేమిటంటే—రోడ్లమీద చొక్కా లేకుండా ఓ నల్ల కంబళీ కప్పుకొని తిరుగుతాడు—గుడికి మాత్రం చక్కగా పొడుగుచేతుల చొక్కా ధరించి వెళతాడు!)
అదో సంగతి!

Friday, August 14, 2009

స్నేహమేరా జీవితం

నా కొండెగాడు-2
నల్లబల్ల యెదురుగా ఓ తిన్నె మీద కుర్చీ, మేజా వుండేవి—ఉపన్యాసకులు కూర్చోడానికి వీలుగా.
ఆ తిన్నెకు కుడివైపున ఒక వరుసా, ముందు ఒక వరుసా, యెడంవైపు ఒక వరుసా వుండేవి—విద్యార్థులు కూర్చొనే బెంచీలు.
తిన్నె యెదురుగా వున్న వరుసలో, రెండో బెంచీ అన్నమాట మాది. అదృష్టం కొద్దీ ఆ తరగతిగది మారకపోవడం వల్ల, డిగ్రీ 3 సంవత్సరాలూ అదే బెంచీ లో, అవే సీట్లలో కూర్చొనేవాళ్ళం!
వాడు రోజూ పదింటికి కాలేజీ అయితే, తొమ్మిదిన్నరకల్లా తన చోటులో కూర్చొని వుండేవాడు! నేను పది గంటలకి ఓ పది నిమిషాలు ఇటూ అటూ వెళ్ళేవాణ్ణి. మాకు మొదటిరోజే చెప్పేశారు—మీరు స్కూళ్ళు వదిలి పెట్టేశారు. ఇది కాలేజ్. మీరు తరగతి గది లోకి వచ్చినా, బయటకి వెళ్ళినా ‘మే ఐ కమిన్’ ‘మే ఐ గో’ అనడగక్కర్లేదు! మిగిలిన వాళ్ళని డిస్టర్బ్ చెయ్యకుండా యెప్పుడైనా రండి, యెప్పుడైనా వెళ్ళండి—అని.
వాడూ నేనూ యెప్పుడు ‘ఒరే ఒరే’ అనుకున్నది లేదు! ‘గురూ అంటే గురూ’ అనుకునేవాళ్ళం. ఇద్దరం యెప్పుడూ ఒకరి మీద ఒకరం కోపగించుకున్నది లేదు! యెప్పుడైనా వేళాకోళమాడుకోవలసి వస్తే, ‘నా కొండిగా’ అనుకునేవాళ్ళం! అంతే!
వాడి నించి నేను చాలా నేర్చుకున్నాను—ముఖ్యంగా కుల మతాలతో నిమిత్తం లేకుండా అందరితో సమానం గా స్నేహం గా వుండగలగడం!
వాళ్ళింట్లో వాడికి ఓ గది వుండేది—వాళ్ళ నాన్న ఇంటి ముందు వైపు వెరే ఓ గది కట్టించుకుని, అందులోనే వుండేవాడు. ఓ పక్క పోర్షనులో వాళ్ళన్నయ్య కాపరం. వెనుక వసారాలో బట్టలూ, ముందు వరండాలో ఇస్త్రీ బల్లలూ, ఇస్త్రీ అయిన బట్టల మూటలూ. వాడు ఇంట్లో వున్నా, లేక పోయినా, యే సమయం లో అయినా నేను ఆ గదిని నా స్వంతం లా వాడుకొనే వాడిని.
మా కాలేజ్ లో తరగతి గదుల కట్టడాలకి ఓ పక్కగా, ఆట సామానుల గదులున్న ఓ షెడ్డూ, డ్రిల్లు మాష్టారి గది వుండేవి. ఆ షెడ్డు పక్కగా స్థలం లో పేరలల్ బార్లూ, హారిజాంటల్ బారూ వుండేవి!
సాయంత్రం నాలుగింటికి కాలేజ్ అయిపోగానే, తప్పకుండా Foot Ball, hockey, kho-kho, ball badminton లాంటి ఆటలు ఆడుకొనేవాళ్ళం. ఇంటికి వచ్చేసి, మళ్ళీ సాయంత్రం ‘బారు’ దగ్గరికి (పొడవు బారు కాదండోయ్—ఎక్సర్ సైజులు చేసే బారు!) వెళ్ళిపోయేవాళ్ళం! వెయిట్ లిఫ్టింగు కూడా చేసేవాళ్ళం! నేను అదనం గా ‘జిమ్నాస్టిక్స్’ నేర్చుకొని, సాధన బాగా చేసేవాణ్ణి!
నిజంగా నా శరీరం ఇప్పటివరకూ యే ఇబ్బందీలేకుండా నడిపిస్తోందంటే, అప్పుడు చేసిన కసరత్తులే కారణం. నాకు అందులో ఆసక్తి కలగడానికి కారణం నా కొండెగాడే!
ఇంకో ముఖ్య విషయం యేమిటంటే, కాలేజీలకి వచ్చినా, మాకు పాకెట్ మనీలు వుండేవికాదు!
మధ్యాన్నం లంచి బ్రేకు లో ఇంటికి వచ్చి, భోజనం చేసి వెళ్ళదానికి వీలుగా కాలేజ్ దగ్గరలో వున్న ఓ అద్దె సైకిలు షాపులో సైకిలు అద్దెకి తీసుకుని, మళ్ళీ కాలేజి కి వచ్చేటప్పుడు తిరిగి ఇచ్చేసేవాళ్ళం—దూరం ఇళ్ళు వున్నవాళ్ళం!
సైకిలు కి అద్దె అరగంటకి పావలా! అదికూడా, మానాన్నగారు జీతాలు రాగానే, యెన్నిరోజులు వాడుకున్నామో లెఖ్ఖ చూసి, షాపువాడికే ఇచ్చేసేవారు! బయట చిరుతిళ్ళు తినే అలవాట్లు వుండేవి కాదు! యెప్పుదైనా ఇస్తే, మా అమ్మ ఓ పావలా ఇచ్చేది—జేబులో వుంచుకో—అవసరం రావచ్చు—అని!
ఇక చిన్నప్పుడు (టిక్కెట్టు లేని వయసులో) మా అమ్మతో టూరింగు టాకీసులో చూసిన సినిమాలు తప్పితే, మళ్ళీ కాలేజీ కి వచ్చేవరకూ సినిమాలు చూసింది లేదు! అలా మా అమ్మతో చూసిన వాటిలో నాకు ఙ్ఞాపకం వున్నవి—వినాయక చవితి; పాండు రంగ మహత్మ్యం; అప్పుచేసి పప్పుకూడు, ఇల్లరికం, వెలుగు నీడలు, ఇద్దరు మితృలు; ఇలా కొన్ని!
ఇంకో సంగతి యేమిటంటే, మధ్యతరగతి వాళ్ళమనో, టిక్కేట్ల కోసం పెద్ద క్యూలలో వెళ్ళాలనో—పెద్ద క్లాసులకే వెళ్ళాలి అని గానీ, నేల టిక్కెట్ కి వెళ్ళకూడదు అనో ఫీలింగ్ వుండేది నాకు!
గమ్మత్తుగా, నా కొండెగాడు నాకు అనేక సినిమాలు చూపించాడు! చాలా మటుకు సెకండ్ షోలే!
బారు దగ్గరనించి ఇంటికి వస్తూంటే, ఇవాళ కొత్త సినిమా వచ్చింది—వెళదామా? అనేవాడు. (అప్పట్లో మా వూళ్ళో రెండే సినిమాహాళ్ళు కట్టారు.) ‘డబ్బులు లేవు గురూ’ అంటే, నీ జేబులో పావలా వుంటుందిగా, ఓ పదిపైసలు నేనిస్తాలే—మళ్ళీ నాకిచ్చేద్దువుగాని! అనేవాడు! (నేల టిక్కెట్టు ఖరీదు 35 పైసలు మరి).
కొత్త సినిమా—పైగా నేల టిక్కెట్—దొరుకుతాయంటావా? అంటే ‘అవన్నీ నేను చూసుకుంటాగా!’ అనేవాడు!
సరే, భోజనాలు చేసేసి, బయలుదేరి హాలు దగ్గరకి వచ్చేసరికి, అప్పటికే అక్కడ పెద్ద క్యూ!
మనవాడు వెంటనే చొక్కా విప్పేసి, యేవి గురూ డబ్బులివ్వు అంటూంటే, కొంతమంది తెలిసున్నవాళ్ళు కూడా, మాకో టిక్కెట్టు, మాకో టిక్కెట్టు అంటూ వాడి చేతిలో డబ్బులు పెట్టేవాళ్ళు—కనీసం ఓ పది పన్నెండు టిక్కెట్లకి!
‘ఇక మీరువెళ్ళి గేటు దగ్గర నించోండి—టిక్కెట్లు తేగానే దూరేసి, మంచి చోట్లు చూసుకోవాలి’ అనేవాడు! బయట వున్న జనాలని పక్కనించి దాటేసి, ఇనప కంచెలతో వున్న క్యూ లైను మొదటికి వెళ్ళిపోయేవాడు. అక్కడెవరో తనకి తెలిసున్నవాళ్ళో, తన కులం వాళ్ళో ఖచ్చితం గా వుండేవారు—వాళ్ళతో చేరిపోయేవాడు క్యూలో! అవసరం అయితే కండబలం చూపించేవాడు—చెప్పానుగా మంచి కండపుష్టి వుంది అని—బుల్ డోజరులా దూసుకు పోయేవాడు!
పది నిమిషాలలో అందరికీ టిక్కెట్లతో వచ్చేసి, పొలోమంటూ హాల్లోకి జొరబడి, వెనుకగా హాలు మధ్య వుండే చోటులో సెటిలయ్యిపోయి, హాయిగా కాళ్ళు జాపుకొని కూర్చొని, సినిమా చూసేసేవాళ్ళం! అలా లెక్కలేనన్ని పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక సినిమాలు చూపించాడు నాకు! ఇంకా, నాలో వుండే కొన్ని ‘ఇన్ హిబిషన్స్’ దూరం చేశాడు నాకు!
అంత ముఖ్యుడు నాకు నా కొండెగాడు!

Wednesday, August 12, 2009

స్నేహమేరా జీవితం

నా కొండెగాడు
వాడి పేరు భాస్కర్రావు!
కులం—శూద్రులు….వృత్తికి వాళ్ళమ్మ చాకలి; వాళ్ళ నాన్న ఓ భూమితనఖా బ్యాంకిలో మెసెంజర్. వాళ్ళన్నయ్య కూడా భూమితనఖా బ్యాంకులోనే అటెండరు. వాళ్ళ వదిన కూడా చాకలి. వాళ్ళకో చిన్న పిల్ల. అదీ వాడి కుటుంబం.
నేను హైస్కూల్లో 5వ ఫారం (ఇప్పటి 10వ క్లాసు) చదువుతున్నప్పుడు, వాడు ఎస్ ఎస్ ఎల్ సీ లో వుండేవాడు.
ప్రత్యేకం గా అందరూ వాడిని గమనించడానికి కారణం—వాడి రంగు నల్లజీడిగింజ నలుపు. కటి పైభాగం చక్కగా V షేపులో, చేతులు కండలు తిరిగినట్టు, వుండి, క్రింది భాగం మాత్రం సన్నగా—ఓ కార్టూన్ కేరెక్టర్ లా వుండేవాడు—దానికి తగ్గట్టు ఆ రోజుల్లో స్కిన్ టైట్ పేంట్లూ, పట్టేసినట్టుండే సగం చేతుల చొక్కాలూ ఫేషను!
కానీ, వాడి తలకట్టు—సినీ హీరోలే అసూయపడేట్టు వుంగరాలుగా పైకి లేచి, చివర్లు నుదుటిమీద తారాడుతూ—భలే అందంగా వుండేది!
దానికి తగ్గట్టు, తెల్లని చక్కని పలువరుసతో యెప్పుడూ నవ్వుతూన్నట్టే వుండేవాడు!
వాళ్ళిల్లు సరిగ్గా మా స్కూలు బిల్డింగునానుకొని లోపలికి వెళ్ళే సందులో లోపలకి వుండేది—ఆ సందులో సైకిలు కూడా నడిపించుకు వెళ్ళవలసిందే—తొక్కుతూ వెళ్ళాలంటే ఓ పదడుగులైనా ఆ సందు తిన్నగా వుంటే కదా!
వాళ్ళ ఇల్లు మాత్రం విశాలమైన ఆవరణలోనే వుండేది—అది ఆ సందుకి డెడ్ ఎండ్ కాబట్టి!
అప్పట్లో మేము పలకరించుకున్నది కూడా లేదు—మాకు సీనియర్ కదా! పైగా సోషల్ స్టేటస్ ఒకటి—మాది పెద్ద కులం, యెగువ మధ్యతరగతిలో లెఖ్ఖ!
వాడు పీ యూ సీ ఓ సంవత్సరం తప్పడంతో, నేను ఆ సంవత్సరం పీ యూ సీ పూర్తి చేసుకొని, వాడు కూడా అదే సంవత్సరం పేసయి, ఇద్దరం కాల్ళేజీ లో ఒకే క్లాసు—బీకాం లో చేరడం జరిగింది!
మొదటిరోజు క్లాసులో బెంచీకి కుడి చివర కూర్చున్నవాడు, నేను రాగానే కాస్త లోపలికి జరిగి తన సీటు నాకిస్తూ ‘కూర్చోండి’ అన్నాడు!
వెంటనే నేను ఆ సీట్లో కూర్చొని, వాడిని చూసి ఓ ఆత్మీయ నవ్వు నవ్వాను—అప్పటికింకా థాంక్సులు చెప్పడాలు ఫేషన్ కాదు!
(……మిగతా తరవాత!)

Saturday, August 8, 2009

హేతువాదం…..

హేతువాదులు-7
వాస్తు :—
పూర్వకాలం లో జనావాసాలు యేర్పరచడానికి అన్నివిధాలా అనువైన ప్రాంతాలని యెన్నిక చేసి, ఫలానా చోటైతే అన్నివిధాలా సురక్షితం గా వుంటుంది కాబట్టి అక్కడ నివసించండి—అని చెప్పేవారు—పండితులు—అంటే మేధావులు!
రాను రాను, ఈ విధంగా సురక్షితం గా వుండడానికి కావలసిన ‘అవసరాలని’ కొన్ని నియమాలుగా తీర్చిదిద్ది, ‘ఇవన్నీ ఇలా వుంటే—ఇక చూడక్కర్లేదు—క్షేమం గా, లాభం గా అక్కడ వుండచ్చు అని చెప్పి--ఆ నియమాలనే ‘వాస్తు’ అన్నారు.
ముఖ్యం గా మన భారత దేశానికి తగ్గట్టు ఈ వాస్తుని రూపొందించారు—ఉత్తరం నించి తూర్పుగా ప్రవహించే జలవనరు ఈశాన్యం లో వుండాలి; ఉత్తరాన్ని యెత్తైన ప్రదేశం (కొండలు) వుంటే మంచిది (ఉత్తరాన్నించేకదా శత్రువులు వచ్చేది!); వాయవ్యం నించి మంచిగాలి వచ్చేలాగ లోయలు వుండాలి; నైఋతి మూల దట్టమైన అరణ్యాలు వుండాలి; ఆగ్నేయం లో నీటి నిలవలు వుండాలి—ఇలా!
పూర్వులు యేర్పరిచిన వూళ్ళు, నగరాలే కాదు, నిర్మించిన కోటలు కూడా దాదాపు ఇవే నియమాలతో కట్టారు—యెలాంటి దండయాత్రలకైనా తట్టుకునేలాగ.
మరి ఈ రోజున, ఈ శాస్త్రాన్ని అన్నివిధాలా భ్రష్టు పట్టించి, వాస్తు బాగోలేదు అంటూ ప్రతి నిర్మాణానికీ తనకి తోచిన మార్పులు సూచిస్తూ, అవి చేసేదాకా మానసిక క్షోభ, చేశాక ఆర్థిక క్షోభ జనాలకి కల్పిస్తున్న వాస్తు శిల్పులూ, అపర మయ బ్రహ్మలూ, వాస్తు సర్వఙ్ఞులూ యెంతోమంది!
వూరికి వాస్తు, వూరిలో వీధికి వాస్తు, వీధిలో ఇంటికి వాస్తు, ఇంటిలో గది కి వాస్తు, గదిలో మంచాలకీ, టేబుళ్ళకీ వాస్తు—ఈ అన్నిట్లోనూ ఈశాన్యం తేలికగా వుండాలి, నైఋతిలో బరువు వుండాలి, కొంచెం పైకి లేవాలి, ఆగ్నేయం లో అగ్ని వుండాలి, వాయవ్యం లో వాయువుండాలి—ఇలా!
మునుపు దూలాలతో నిర్మించిన ఇళ్ళల్లో యెప్పటికైనా అవి కూలే ప్రమాదం వుందని, వాటి క్రింద కూర్చోవద్దు, పడుకోవద్దు అన్నారు! ఇప్పుడు ఆఫీసుల్లో కూడా, ‘బీం’ క్రింద సీటు వస్తే, అక్కడ కూచోడానికి తిరస్కరించేవారెందరో!
వాస్తుపురుషుడంటూ కాళ్ళు చేతులూ వంచేసి, ఓ చతురస్రం లో వాణ్ణి ఇరకబెట్టేసి, యేవేవో సిద్ధాంతాలు చెపుతారు!
ఇవన్నీ బ్రాహ్మణుల్లోనే పుట్టి, పెరిగి, ఇప్పుడు ఇతర కులాలకి కూడా వ్యాపించాయి!
దారిలో యెదురుదెబ్బ తగిలినా, ఓ పదిరూపాయలు పారేసుకున్నా, కాస్త వొళ్ళు వెచ్చబడినా, వుద్యోగం లో యేదైనా చిన్న కష్టం కలిగినా—వీటన్నిటికీ వాస్తే కారణం అని దాదాపు అందరూ నమ్మే స్థాయికొచ్చేశారు!
మరి వీటికి విరుగుడెప్పుడో!