Monday, March 15, 2010

నా ఇంకో కొండె.....3

వెంకట 'మరణ'

వాళ్ళ రూమ్ ప్రక్కన వుండే ఫంక్షన్ హాళ్ళలో దాదాపు సంవత్సరమంతా యేదో ఫంక్షన్ జరుగుతూనే వుండేది--దాంట్లో మనవాడికీ, వాళ్ళ అన్నదమ్ముల అనుబంధానికీ ఉచిత భోజన పథకం అమలయ్యేది. (అదీ అడ్వాంటేజ్!)

మా ఇంకో స్నేహితుడు వరప్రసాద్, బీసెంటురోడ్డులో యేవో జాతరలు జరిగి, పేదవాళ్ళకి అన్న సంతర్పణలు జరుగుతుంటే, 'ఒరే! పందిరేసి, విస్తరేశారు.....ఇక మనదే ఆలస్యం!' అని మమ్మల్ని వేళాకోళమాడేవాడు............వాడి ముందు!

(దయచేసి వాణ్ణి హేళన చెయ్యడానికి ఈ టపాలు వ్రాస్తున్నాననుకోవద్దు! వాడు చిరునవ్వుతో అనుభవించిన కష్టాలని మీ చెవిన వేద్దామనే నా తపన.)

అలాంటి మా రమణ (వాళ్ళది ప్రకాశం జిల్లా), గోదావరి జిల్లాల్లోని ఓ పట్టణం లో వుండే కుటుంబం లో అమ్మాయిని పెళ్ళిచేసుకొన్నాడు!  వాళ్ళ అత్తవారిది కూడా పెద్ద కుటుంబం. ఆ వూళ్ళో మెయిన్ బజారులో ఓ వీధంతా రెండువైపులా వాళ్ళ షాపులే వుంటాయి. ఇంకో పేటలో ఒక వీధిలో రెండువైపులా వాళ్ళ ఇళ్ళే వరసగా వుంటాయి.

వాడి అదృష్టం ఆ అమ్మాయిరాకతో తిరిగింది. బాగా సంపాదించాడు. ఇంకో జిల్లా ముఖ్యపట్టణం లో రాజభవనం లాంటి ఇల్లు కట్టాడు. ఇద్దరు మగపిల్లల్నీ ఇంజనీర్లని చేశాడు. ఆడపిల్లకి అమెరికా సంబంధం చేశాడు! అందరూ చాలా సంతోషం గా వున్న సమయం లో.............

యాభయ్యారేళ్ళ వయసులో 'మహమ్మారి' బారిన పడ్డాడు......కొండనాలుకకి కేన్సరు వచ్చింది. రెండేళ్ళు బాధపడి, లక్షలు ఖర్చుపెట్టి, చివరకి యేడాది క్రితం పై లోకాలకి వెళ్ళిపోయాడు.

కాకతాళీయం గా వాడు పోవడానికి ఓ వారం ముందు నాకు ఫోన్ లో కలిసాడు. అప్పుడు వాడు వేసిన జోకు--"ఒరే! వక్కపొళ్ళు తినేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, మందుకొట్టేవాళ్ళు మన ఫ్రెండ్స్ అందరికీ రాని జబ్బు నాకొచ్చిందేమిట్రా?" అనడిగితే, నా సమాధానం "కేరేఝాట్ అనేవాళ్ళకి యేమీ రావు. నువ్వుకూడా కేరేఝాట్ అను............నా అంత్యక్రియలకి నువ్వు వద్దూగాని!' అని. "అంతమాటనకురా! నా టైము అయిపోయింది........అంతే! పైలోకాన్నించి వస్తాన్లే!" అన్నాడు.

ఇంకో చిన్న జోకు చెప్పి వాడి కథనం ముగిస్తాను.

వాడు ఓ నేమ్ బోర్డు వ్రాయించి పెట్టుకున్నాడు. యే వూరు వెళ్ళినా, ఇంటిముందు అది తగిలించేవాడు. దాని కొలతలు--వెడల్పు 3 అడుగులు, పొడవు 4 అడుగులు.

దానిమీద అందంగా తన పేరు, భార్యపేరు వ్రాసివుండేవి.

ఆ క్రింద, తన పిల్లల అందరివీ (అసలు పేర్లుకాదు) ముద్దుపేర్లు వ్రాసి వుండేవి! (వాళ్ళ ఫ్రెండ్స్ కి ఈ ఇంట్లో వాళ్ళు వుంటారని తెలియాలి కదురా! అనేవాడు. మరి ముద్దు పేర్లు యెందుకు? స్కూల్లో పేర్లు వ్రాయించవచ్చుకదా--అంటే--అక్కడే వుంది మజా! అని నవ్వేవాడు!)

ఓ రోజు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజరు వాళ్ళ ఇంటికి వచ్చాడు. (హనుమంతు అని, వాడింకా పెద్ద జోకర్!)

నేమ్ బోర్డు చూసి, "ఇంకా చాలా వ్రాయడం మరిచిపోయారు! వెంటనే వ్రాయించండి. 'పని మనిషి సావిత్రి, చాకలి మంగమ్మ, మంగలి ముఖలింగం.............' ఇలా......"

అదీ సంగతి!

Sunday, March 14, 2010

నా ఇంకో కొండె.....2

వెంకట 'మరణ '

అప్పట్లో, బ్యాంకుల్లో ఐదు రూపాయలు, రెండు రూపాయలు, ఒక రూపాయి కూడా తమ సేవింగ్స్ బ్యాంకు ఖాతాల్లోంచి డ్రా చేసుకోడానికి వచ్చేవారు జనం.

ఇక మా రమణ తన బ్యాంకులో డ్యూటీలో వుండగా, ఓ తమ్ముడు వచ్చేవాడట. 'నాకు ఓ కొత్త రబ్బరు (ఇరేజరు) కావాలన్నయ్యా' అంటే, ఓ విత్ డ్రాయల్ ఫారం తీసి, తన ఖాతాలోంచి ఓ ఇరవై పైసలకి వ్రాసి, ఆ డబ్బు తన తమ్ముడికిచ్చి పంపించేవాడట.

కాసేపటికి ఇంకో తమ్ముడు వచ్చి, 'నా పెన్నులో రీఫిల్ అయిపోయింది' అంటే, ఇంకో యాభై పైసలకి విత్ డ్రాయల్ వ్రాసేవాడట.

ఇంకో తమ్ముడు వచ్చి, 'లెఖ్ఖల పుస్తకం అయిపోయిందన్నయ్యా' అంటే, ఓ రూపాయి ఇరవై పైసలకి ఇంకో విత్ డ్రాయాల్ వ్రాసేవాడట.

కేషియర్ వీరాస్వామిగారు 'బుధ్ధి లేదా? ప్రతీరోజూ ఓ ఐదు రూపాయలు డ్రా చేసి జేబులో వుంచుకోవచ్చుకదా?' అని కోప్పడేవాడట.

వుత్తర భారతం నించి వచ్చిన ఓ ప్రొబేషనరీ ఆఫీసరు (తెలుగు రానివాడు) వాణ్ణి 'అన్నదమ్ముల అనుబంధం వచ్చింది' అని గేలిచేసేవాడు.

ఇవిలా వుండగా, బ్యాంకు వాళ్ళందరికీ కొత్త సినిమాలు రిలీజు అయ్యే ముందు మొదటిరోజు మొదటి ఆటకి టిక్కెట్లు ఇప్పించేవారు--ఆంధ్రా బ్యాంకులో ఖాతాలు వున్న ఫిలిం డిస్ట్రిబ్యూటర్లు.

మా రమణ సినిమా చూస్తూంటే, ఆహ్లాదకరమైన సన్నివేశం వచ్చినప్పుడు, ప్రక్కవాడి తొడమీద చరిచి, వ్రేళ్ళని దగ్గరకిలాక్కుంటూ చెయ్యి పైకిలాగి, 'హహ్హహ్హా' అని నవ్వేవాడు. వూహించండి మీ తొడని అలా లాగితే మీకెంత నెప్పెడుతుందో!

అందుకని మా రాంబాబు (వీడిని మా 'డైరెక్టరు' అనేవాళ్ళం. ఆక్కడక్కడా వచ్చిన మా బ్యాంకువాళ్ళ సీట్లని 'అడ్జస్ట్' చేసి, అందరినీ ఒకే వరుసలో కూచోబెట్టేవాడు) వాడికి ప్రత్యేకంగా తెలియనివాళ్ళ ప్రక్కన సీటు వచ్చేలా యేర్పాటు చేసేవాడు.

హైలైట్ యేమిటంటే, 'షోలే' సినిమా మొదటిరోజు మొదటి ఆట చూస్తున్నాం--అమితాభ్ 'ఆ తుపాకీ నాకందించండి' అని అడుగుతాడు సంజీవ్ కుమార్ని. అందించడు! తరువాత కాస్సేపటికి, ఓ పెద్ద గాలి వీచి, సంజీవ్ కప్పుకున్న వుత్తరీయం యెగిరి పడ్డాక, కనిపిస్తుంది--తనకి రెండు చేతులూ లేవు--అని!

వెంటనే మా రమణ 'అర్రే! చేతులు వెనక్కి పెట్టి కట్టేశాడ్రా!' అన్నాడు.

మా రాంబాబు 'నువ్విచ్చే రెండున్నర రూపాయలకోసం వాడి చేతులు నిజం గా నరికేస్తారన్నుకున్నావేంట్రా? బేవకూఫ్' అని వాణ్ణి తిట్టాడు. చుట్టూ జనాలందరు 'ఘొల్లు '!

.............మిగతా ఇంకోసారి.

నా ఇంకో కొండె.....

వెంకట 'మరణ'

మేము వుద్యోగాల్లో చేరిన కొత్తల్లో, విజయవాడ లో వుండే రోజుల్లో, మా స్నేహితుల్లో వెంకట రమణ అని వుండే వాడు. (చనువు పెరిగాక వాడినే 'మరణా' అని యేడిపించేవాళ్ళం).

వాళ్ళ తండ్రిగారు అప్పటికే రిటైర్ అయ్యారు. పెద్ద కుటుంబం--వాడితో పాటు యేడుగురు అన్నదమ్ములూ, ఇద్దరో ముగ్గురో అక్క చెల్లెళ్ళూ. వీడు రెండో వాడనుకుంటా. వాళ్ళన్నయ్యకో చిన్న వుద్యోగం.

మంచి సరదాగా వుండేవాడు. యెవరేమన్నా యేడిచేవాడు కాదు. తనమీద తనే జోక్స్ వేసుకొని నవ్వించి, నవ్వేవాడు.

వీడు ఆంధ్రా బ్యాంకులో పని చేసేవాడు. కొత్తల్లో వాణ్ణేడిపించడానికి 'యెలావుంది మీ 'అంధేరా' బ్యాంకు?" అనడిగితే, "అంధేరా అనకండి సార్! 'ఆంధ్రా బంకు' అనండి కావాలంటే!" అనేవాడు.

"సరే, మీ బంకు యెలావుంది" అంటే, "మాది బంకు అయితే, మీది కూడా బంకే కదా? మీ బంకు యెలా వుందో మా బంకూ అలాగే వుంది!" అని చంకలు గుద్దుకొనేవాడు!

కులానికి శూద్రులైనా, చక్కటి సంస్కారం వుండేది వాళ్ళ కుటుంబం లో అందరికీ. మా స్నేహితుల్లో యెవరైనా 'వెధవా' లాంటి తిట్లు తిట్టినా, బూతులు మాట్లాడినా, నవ్వుతూ 'బూతులు మాట్లాడకండిరా--తప్పు!' అనేవాడు. 

వాళ్ళ కుటుంబంలో యెవరికైనా ఇంకెవరిమీదైనా కోపం వస్తే, 'నీకివాళ బాగా ఆకలెయ్యా!' అనో, 'అమ్మ నిన్ను బాగా తిట్టా!' అనో, 'దారిలో నిన్ను చీమ కుట్టా!' అనో, 'సాయంత్రం దోమ నిన్ను బాగా కుట్టా!' అనో, ఇంకా బాగా కోపం వస్తే, 'దారిలో నీ కాలికి యెదురుదెబ్బ తగలా!' అనో తిట్టుకొనేవారట!

మొదట్లో, ఓ ఇంట్లో వీధి కొట్టుగది (7 X 5 అడుగులు) లో అద్దెకు చేరాడు--అద్దె నెలకి ఇరవై రూపాయలు! 

(ఆ యింటివాళ్ళు వెన్న వ్యాపారం చేసేవారు--అంతకు ముందు ఆ గదిని వెన్న డబ్బాలు వుంచడానికే వాడుకొనే వారు). 

దానికి కిటికీలుగానీ, వెంటిలేటర్లు గానీ వుండేవి కాదు. యేడడుగులు వెడల్పులోనే గోడ మధ్యలో ఆ గదికి ద్వారం. 

ద్వారానికి యెడం పక్క (దక్షిణం వేపు) ఓ ట్రంకు పెట్టె, దానిమిద ఓ గాలి దిండు, దుప్పటి వుండేవి. ఓ మూల చాప వుండేది. దానికి వ్యతిరేక దిశలో, వుత్తరం వైపు తన పుస్తకాల అట్ట పెట్టె! 

(వాడో పుస్తకాల పురుగు! ఇంకేమీ చదవడానికి లేకపోతే, డిక్షనరీ చదివేవాడు! అలాగే బ్యాంకు పరీక్షలు ప్యాసు అయ్యాడు మా అందరికన్నా ముందుగా!)

పగలైతే, గదిలో నిలువుగా చాప వేసుకొని,  అడ్డంగా పడమరవైపు తలపెట్టుకొని, గుమ్మం లోంచి కాళ్ళు బయట పెట్టుకొని పడుకొనేవాడు. రాత్రి, నిలువుగా దక్షిణ వుత్తరాలుగా పడుకొనేవాడు.

భోజనం తప్ప, టిఫిన్, టీ, కాఫీ, వక్కపొడి--ఇలాంటివన్నీ నిషిధ్ధం. మేము స్వేచ్చగా మా జీతాలు ఖర్చుపెట్టుకొని, పైవాటితో పాటు సిగరెట్లు, సినిమాలు కూడా అలవాటు చేసుకొని ఆనందిస్తుంటే, వాడు 'యెందుకురా చెడిపోతారు?' అని బాధపడేవాడు.

ఓ పదినెలలు వుద్యోగం చేసి, జీతం లో కొంత నిలువచేసుకోగలగ గానే, కొత్త 'రూమ్' (ఓ ఫర్నిచరు వర్క్ షాపు వాళ్ళ రేకుల షెడ్) లోకి మారి పోయాడు--నెలకి 50 రూపాయల అద్దెకి. ఆ షెడ్ లో ఒకగది, వసారా వుండేవి. 

ఆ గదికి వుండే అడ్వాంటేజ్ యేమిటంటే, ప్రఖ్యాత ఫంక్షన్ హాల్స్ రెండుమూడు వుండేవి చుట్టుపక్కల. (ఆ అడ్వాంటేజ్ యేమిటో తరవాత చెపుతాను.)

అప్పటికి అకడమిక్ ఇయర్ అయిపోయి, మళ్ళీ కొత్త ఇయర్ మొదలవగానే, వాళ్ళ తమ్ముళ్ళనందరినీ తనదగ్గరకి రప్పించేసుకొని, స్కూళ్ళలో చేర్పించేశాడు. (వాళ్ళ పెద్దతమ్ముడు అప్పటికే డిగ్రీ అయిపోయి, వుద్యోగ ప్రయత్నాల్లో వుండేవాడు.  తరవాత రైల్వే లో మంచి వుద్యోగం వచ్చింది--ఈ పాటికి యే జనరల్ మేనేజరో అయిపోయి వుంటాడు)

............తరువాయి మరోటపాలో!

   

Sunday, March 7, 2010

ఇంకో.......

వింతాభిషేకం

తూర్పుగోదావరి జిల్లాలోని అయినవిల్లి లోని సిధ్ధి వినాయక స్వామికి మొన్న లక్ష కలాలతో అభిషేకం నిర్వహించారట.

వ్యాసమహర్షి ఆఙ్ఞతో గణపతి మహాభారతాన్ని వేగం గా లిఖించినట్లు పురాణాల్లో వుందట--అందుకని!

మరి ఆయన రాసినది 'గంటం' తో ననుకుంటా!

ముందుగా స్వామికి గరికగడ్డి, నారికేళఫలాలతో మహారుద్రాభిషేకాన్ని నిర్వహించారట!

సరే, గరిక అయితే, విగ్రహం నెత్తిమీద వేసేస్తారనుకోవచ్చు--మరి కొబ్బరికాయలు యెలా అభిషేకిస్తారో?

ఆ తరవాత లక్ష పెన్నులను స్వామి పాదాల ముందు గుట్టగా పోసి, పూజలు చేశారట. ఈ కలాలతో పరీక్షల్లో వ్రాస్తే, తప్పకుండా ప్యాసు అవుతారట.

మరి అవి చెక్కకలాలా, వూట కలాలా, బంతి కలాలా--యెలాంటివో తెలియదు. వాటికి ఖర్చు యెంతయిందో తెలియదు. ఆ డబ్బు మాత్రం ప్రజలదే అయి వుంటుంది.

అక్కడి ప్రజా ప్రతినిథులు నలుగురో యెంతమందో ఆ పెన్నులని విద్యార్థులకి అందించారట--ఆ పెన్నులకోసం విద్యార్థులు రెండుకిలోమీటర్ల మేర బారులు తీరారట!

అదండీ సంగతి!