Monday, July 26, 2010

భక్తి పేరుతో.....

"క్రిమినల్ వేస్ట్"

ద్రవ్యోల్బణం రెండంకెలనించి దిగిరానంటోంది. కూరగాయలేవీ వినియోగదారుడికి కేజీ 20 నించి 40 లోపు దొరకడం లేదు.

వర్షాలు బాగా పడితే, వరదలు ముంచెత్తకుండా వుంటే, పంటలు బాగా పండితే....ఇలా కొన్ని 'తే' లతో, వచ్చే ఆరేడు నెలల్లో ద్రవ్యోల్బణం ఒక అంకె స్థాయికి దిగి 'రావచ్చు' అంటాడు ప్రథానమంత్రి.

ఇక తొలేకాశి తో మొదలయ్యింది భక్తి పర్వం!

ఇక్కణ్ణించీ ప్రతీ రోజూ చాలా పవిత్రమైనదే! ప్రతీ రోజుకీ యేదో మహత్యం వుంటుంది--ఉపనిషత్తులూ, పురాణాలూ, భగవద్ గీతా, భారత భాగవతాలూ, ఇంకా ఈనాడు అంతర్యామీ--ఇలా యెక్కడో అక్కడ ఆ మహత్యం గురించి వర్ణించబడే వుంటుంది.

ఇక మధ్యలో గురుపూర్ణిమ లాంటివి వస్తూనే వుంటాయి.

మూడురోజులుగా, కనకదుర్గ అమ్మవారికి 'శాకాంబరీ' అవతారం లో పూజలు చేస్తున్నారట.

నిన్న ఒక్కరోజే, భీమవరం లో అమ్మవారికి అక్షరాలా 1200 కేజీల కూరగాయలతో (ఆకు కూరలు కాకుండా) అలంకరించారట.

ఒక్క విశాఖపట్నం లోని ఒక సాయిబాబా గుళ్ళోనే, అక్షరాలా 800 కేజీల బియ్యం తో అన్నం వండి, అన్నాభిషేకం చేశారట.

ఇక కొన్ని లక్షల బాబా గుళ్ళలోనూ, కొన్ని వేల అమ్మవారి గుళ్ళలోనూ, యెన్ని కిలోల బియ్యం, కూరగాయలూ వినియోగించారో!

ఇలాంటివాటికి, సామాన్యుడు ఐదో పదో విరాళమిస్తుంటే, కోట్లు సంపాదించినవాడు లక్షల్లో విరాళాలిస్తున్నాడు.

యేదైనా, భారం పడేది సామాన్యుడిమీదేకదా?

రేట్లెలా పెరిగినా ఫరవాలేదు--మా భక్తి మాది అంటారా--మీ ఇష్టం.

యేమైనా ఆహార పదార్థాల క్రిమినల్ వేస్ట్ నిరోధించడానికి ఒక చిన్న ప్రయత్నమైనా యెవరైనా చేస్తే బాగుండును!

Sunday, July 18, 2010

అమానుష....

సోంపేట

...........అంటే నాకు మొదట గుర్తు వచ్చేది సర్దార్ గౌతు లచ్చన్న--ఆయన స్వగ్రామం మందస అన్నా, ఆయన నియోజకవర్గం సోంపేట అన్నా గుర్తు వచ్చేది ఆయనే.

మొన్న అక్కడ జరిగింది మహా దారుణం--అంటే చాలా తక్కువ చెప్పినట్టు.

నాకు కొన్ని చిన్న చిన్న సందేహాలు.

అన్ని రోజులనించీ, అంతమంది పోలీసువాళ్ళని రప్పించి, మోహరించి, కవాతులూ గట్రా చేయించి, వాళ్లు ఫలానా రోజు జనాలు యెవరూ ఫలానా చోటకి రావద్దు అని హెచ్చరికలు చేసినా, అన్నిరోజులూ మన మీడియాలు యేమి చేస్తున్నట్టు?

'పోలీసులు కొంత అతిగా ప్రవర్తించినట్టు తోస్తూంది' అని పెద్దాయన అన్నాట్ట--ఆయన అనుభవం లో లోక్ నాయక్ మీద లాఠీఛార్జీ లాంటి పెద్ద పెద్ద అతి ప్రవర్తనలు ఇంకా చాలా వుండి వుంటాయి కాబట్టి, ఇది పెద్ద తప్పు కాదేమో!

డీజీపీ లాంటి పోలీసు వున్నతాధికారులెవరూ ఆ రోజు రాష్ట్రం లోనే లేరట. మరి అక్కడి పోలీసువాళ్ళకి ఆదేశాలు యెవరిచ్చారో?

కొంతమంది చిన్న వున్నతాధికారులు, 'మేము పోలీసువాళ్ళు అందరికీ ఆయుధాలు ఇవ్వలేదు. కేవలం లాఠీలే పట్టుకెళ్ళమన్నాము. టియర్ గాస్ ఇచ్చాము. ఆయుధాలు ఇచ్చినవాళ్ళకి కూడా రబ్బరు బుల్లెట్లే ఇచ్చాము. మరి.......' అని జుట్లు పీక్కున్నారట. మరి పేలిన గన్ లూ, బుల్లెట్ లూ 'ప్రైవేటు' సైన్యానివేనా?

ఆరోజు సాయంత్రం ఐదు గంటలవరకూ, మాననీయ హోం మంత్రి, చెల్లెమ్మ సబిత కూడా, 'మాకు పూర్తి వివరాలు తెలియవు--వచ్చాకే చెపుతాను' అనీ, వివరాలు తెప్పించుకొని, 'వెనక్కి వచ్చేస్తున్న పోలీసుల మీద జనం దాడి చేశారు కాబట్టి పోలీసులు కాల్పులు జరిపారట' అని చెప్పడమేమిటి?

(టీవీల్లో వీడియోలు చూసిన వాళ్లందరూ చెప్పగలరు--ఇందులోని నిజమెంతో!)

'అక్కడ శంకుస్థాపన యేమీ జరగలేదు' అని కంపెనీ ప్రతినిధులు భుజాలు తడుముకున్నారంటే, అసలు ప్లాన్ యేమిటో తెలియడం లేదూ?

కొణిజేటివారు ఇప్పటికైనా 'యెవరి బాధ్యత యెంత' అని నిగ్గదీస్తారా?

బాబ్లీ గురించి జరుగుతున్నది చూస్తూంటే, యెవరికైనా ఆ నమ్మకం వస్తుందా?

మిగతా మరోసారి.