Saturday, August 28, 2010

రాహుల్ ప్రజాసేవా........

..............సంతృప్తీ

నన్ను ప్రథాన మంత్రిగా చూడాలని చాలా మంది ఆశిస్తున్నారు. 

కానీ, నాకు ఆ పదవి లేకుండానే యెంతో సేవ చెయ్యగలుగుతున్నాను. నాకు చాలా బాగుంది--అన్నాడట రాహుల్!

(బహుశా తనని పీఠం పై కూచోబెట్టి ఈ కాంగీరేసులు వేల వేల కోట్లు యెలా దండుకుంటారో ఇప్పటికే కళ్లముందు రీళ్లకి రీళ్లు తిరిగి పోయి వుంటాయి....పాపం!)

ఇకనైనా మన పగటివేషగాళ్లూ, పులివేషగాళ్లూ ఆయన ఫోటోలని నెత్తిమీద గరగల్లా ధరించి, "2014 లో రాహులే ప్రథాని" అని పిచ్చి పిచ్చి గంతులు వెయ్యడం మానేస్తే బాగుంటుందేమో!

మీరూ, మీ కుటుంబాలూ, తరతరాలూ భవిష్యత్తుకోసం బలి అయిపోడానికి రాహుల్ సిధ్ధం గా లేడు అని తెలుసుకోండి!

తింగరోళ్లలారా! ఇప్పటికైనా బుధ్ధి తెచ్చుకోండి!

Thursday, August 26, 2010

ఈనాడు

తెలుగుకు తెగులు

ఈ మధ్య మిత్రుడెవరో "ఐ న్యూస్ కి తెగులు సోకిందహో!" అనే ఓ టపాని వ్రాశాడు. దానిమీద నా వ్యాఖ్య కూడా వ్రాసాను. అది ప్రచురితమయ్యిందో లేదో తెలియదు.

ఇప్పుడు, ఈనాడు వారు కూడా తెలుగు నేర్చుకోవలసిన దుస్థితిలో వున్నారేమో అనిపిస్తూంది.

వుదాహరణకి, వారి జిల్లా ప్రచురణల్లో నమూనా ప్రకటన ఇస్తూ, "5వ వివాహ" వార్షికోత్సవ శుభాకాంక్షలు అనే ఓ హెడ్డింగు చూపించారు!

ఇక వారి ప్రకటనల్లో, "పదమూడవ విహాహ", "పధ్ధెనిమిదో వివాహ" వార్షికోత్సవ శుభాకాంక్షల ప్రకటనల్ని విడుదల చేస్తున్నారు!

మొన్న, ఓ 85 యేళ్లాయనకి "65వ వివాహ" వార్షికోత్సవ శుభాకాంక్షలందించారు!

బాప్రే! 85 యేళ్లలో 65 వివాహాలా! హేట్సాఫ్ బాస్! అనచ్చు మనం.

ఇలాగే--"హత్యకేసులో భర్తకు జీవిత ఖైదు" అని ఓ వార్త! యెవరి హత్యో, యెవరి భర్తో యెవరికీ తెలియదు!

"భార్య హత్య" అనో, "ఓ మహిళ హత్య" అనో వ్రాసి, "కేసులో భర్తకు" అంటే అర్థవంతం గా వుంటుంది కదా?

ఇక మొన్న వరలక్ష్మీ వ్రతం సందర్భం గా, ఈనాడువారు, "శ్రావణ శుక్ర" పౌర్ణిమకు ముందువచ్చేదే "శ్రావణ శుక్రవారం" అన్నారు! శ్రావణ శుక్రం యెక్కడ తెచ్చారో!

"భవిష్యోత్తర పురాణం" ప్రకారం, 'ముత్తయిదువలకు ' వాయినాలు ఇస్తారట. "ముత్తయిదువలు" అంటే యెవరు?

కలశం లో "మర్రి, మామిడి, రవి, జువ్వి చిగుళ్లను" వుంచుతారట! ఈ కాలం లో మామిడి చిగుళ్లు దొరకవు! "....పురాణం" లో ఇది యెక్కడ వుందో చెప్పగలరా?

"....మొలకెత్తిన శనగలు" వాయినాలుగా ఇస్తారట! (ఇలా శనగలు ఇవ్వడం లోని "ఆరోగ్యసిధ్ధిని" ఆనాడే పెద్దలు గుర్తించారట!) ఇదే పురాణం లో వుంది? (మొలకెత్తిన ధాన్యాలు, పప్పులు, దానం చెయ్యడం, వాయినం ఇవ్వడం నిజంగా నిషిధ్ధం!)

అసలు ఇదంతా యెందుకు?............అంటే.....(ప గో) జిల్లలో సుమారు 450 బంగారు దుకాణాలు వున్నాయి. గత యేడాది ఈ నెలలో రూ.కోటి వ్యాపారం జరిగింది. ఈ యేడాది అంతకన్నా యెక్కువ వ్యాపారం జరుగుతుందని ఆశాభావం!

అదండీ సంగతి!

ఇక వేదాంత విజయ వెంకట రామానుజాచార్యులంటాడూ....."విష్ణు ధర్మోత్తర పురాణం" అనుసరించి....."ట! ఇంకా "రుగ్వేదఖిలకాండలో శ్రీసూక్తం........." అంటాడు.

పెద్దబిందెమీద చిన్న బిందెనిపెట్టి, దానిమీద మూతపెట్టి, చెంబుని వుంచి, దానిమీద కొబ్బరికాయకి ముక్కూ, నోరూ, కళ్లూ చెవులూ పెట్టి, ఖరీదైన పట్టుచీరలు కట్టి, బంగారు వడ్డాణాలూ, చెవి, ముక్కు పోగులూ, మెడలో కాసుల పేర్లూ ఇలా అలంకరించి, ఫోటోలు తీసుకొని, పేపర్లోనూ, టీవీల్లోనూ, నెట్ లోనూ వుంచి, ఆనందిస్తే యేమవుతుంది?

ఇక బంగారు రూపులూ, విగ్రహాలూ వుంచడం?

నాకు తెలిసి, 1975 లో మా వివాహమయ్యక, మా యింట్లో యెప్పుడూ ఈ రూపులు పెట్టుకొని, కొబ్బరికాయకి అలంకరణలూ చెయ్యలేదు!

అసలు....శ్రీమహాలక్ష్మికి అలంకారం చెయ్యడం నిషిధ్ధం! (ఆవిడ యే పురాణం లో అయినా, యే కథలో అయినా, ముసలి ముత్తయిదువ రూపం లోనే ప్రకటితమయి, వరాలు ఇచ్చింది!)  

పైగా, యెంత అలంకారం చేస్తే, అంతకు తగ్గా శాంతులు జరిపించాలి.....అంత నిష్టగా పూజించాలి ఆవిడని!

కానీ, ఈ రోజు వేలం వెర్రిగా ఈ పనులు చేస్తున్న గృహిణి యెవరైనా, క్రితం యేడాది ఈ పూజలు చేసిన తరవాత, తమకి యెంత నష్టం జరిగిందో.....గుండెలమీద చెయ్యివేసుకొని, ఆలోచించి, సమాధానం చెప్పగలరా?

(యెందుకంటే ఇలాంటి చాలా కేసులు నాకు తెలుసు మరి!)

యేమిటో! తెలుగు భాషతో మొదలు పెట్టి, యెక్కడికో వెళ్లిపోయాను......అయినా ఇవీ తెలుగు "సంప్రదాయాలే" అంటున్నారుగా మరి!

Friday, August 6, 2010

భక్తీ, రక్తీ, విద్యా

గుడీ, బడీ, మధ్యలో మద్యం!?

ఈ మధ్య మన సర్వోన్నత న్యాయస్థానం "దేశ వ్యాప్తం గా, అనుమతిలేకుండా, రోడ్లు, పార్కులు లాంటి బహిరంగ ప్రదేశాల్లో నిర్మించిన 'ప్రార్థనా స్థలాలని' తొలగించడం/వేరే చోటుకు మార్చడం/క్రమబధ్ధీకరించడం పై తమ వైఖరిని స్పష్టం చేయాలి" అంటూ రాష్ట్ర ప్రభుత్వాలని ఆదేశించిందట. 

ఇందుకు నాలుగు వారాల సమయం ఇచ్చిందిట. (కేసు సెప్టెంబర్ 14 కి వాయిదా పడిందట)

ఇంతకు ముందే రాష్ట్రాలు ఈ వివరాలతో కూడిన అఫిడవిట్లు సమర్పించాయట--సుప్రీం వారికి.

వాటి ప్రకారం--తమిళనాడులో అత్యధికంగా 77,450 ప్రా. స్థ. లు బహిరంగ ప్రదేశాల్లో వున్నాయట. రాజస్థాన్ లో 58,253; గుజరాత్ లో 15 వేలూ ఇలా వున్నాయట.

అరుణాచల్ ప్రదేశ్ లో ఒక్కటీ లేదట!

మరి మన రాష్ట్రం యెన్ని అని చెప్పిందో సమాచారం లేదు--మనం యెలాగూ సరైన లెఖ్ఖలు ఇవ్వం కదా!

ఈ లెఖ్ఖకొస్తే--నరసాపురం నించి మార్టేరు వరకూ కేవలం 20 కిలో మీటర్ల దూరం లో, రోడ్డు కీ కాలవకీ మధ్య యెడమ వైపూ, రోడ్డుకి కుడివైపూ కనిపించే, చిన్నా చితకాతో సహా గుళ్ళూ అవీ లెఖపెడితే, 200 కి పైగా వస్తాయి. (ఇంకా ఆయా వూళ్లలో వాటిని లెఖ్ఖ పెట్టకుండానే!--ఇతర మతాలవి కలపకుండానే)

మరి ఈ లెఖ్ఖని, ఒక జిల్లాలోనే, లక్షకి పైగా వుంటాయేమో. 

రాష్ట్ర వ్యాప్తం గా యెన్నో!

వీటికి తోడు, నిర్మాణం లో వున్నవీ, పునరుధ్ధరణ క్రింద వున్నవీ, ప్రాచీనమై అలనా పాలనా లేనివీ కలిపితే, యెన్ని వుంటాయో వూహించుకోండి! 

(ఇంకా వీటిలో రోడ్డు ప్రక్కన వేపా, రావీ మొదలైన చెట్లక్రింద వుంచబడిన--నాగదేవతల, పసుపూ బొట్టూ పెట్టి వుంచబడిన రాళ్ల సంఖ్య పరిగణనలోకి తీసుకోలేదు!)

ఇక వీధికి కనీసం ఐదారు బడులు; కళా శాలలు; ఇతర విద్యాలయాలు వుంటున్నాయి.

'మద్యాంధ్రప్రదేశ్' అని యెంత వెక్కిరించుకున్నా, హిపోక్రసీ లేకుండా మాట్లాడుకుంటే, కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తూ, లక్షల్లో మామూళ్లు ముట్టచెపుతూ, సరుకు కొనుక్కొంటూ, అమ్ముకుంటూ, పదో పరకో లక్షలు సంపాదించుకోవాలనుకొనే మద్య వ్యాపారులు తమ వ్యాపారాలు చేసుకోవాలి కదా?

మరి అడుక్కో గుడీ, బడీ వుంటే, గుడికీ బడికీ సమీపం లో షాపు వుండకూడదంటే--నివాస స్థలాల మధ్య యెలాగూ కుదరదు--వాళ్లు షాపులెక్కడ పెట్టుకోవాలి?

గుడుల విషయంలో--ఎండోమెంట్ వాళ్ల చేతుల్లో వున్న గుళ్లే లెఖ్ఖలోకొస్తాయిట. మరి బళ్లకి యే నిబంధన వుందో!

మరి మన ప్రభుత్వం యెన్ని తొలగిస్తుందో? యెన్ని మారుస్తుందో? యెన్ని మరేదో చేస్తుందో?