Friday, April 29, 2011

అంత్యక్రియలు అనే…..3


హై డ్రామా

(మొదలు పెట్టడం “శుక్లాంబరధరం……” అనీ, “ఆచమ్యా….కేశవాయస్వాహా….” అనీ, “పవిత్రం ధృత్వా…..” అనీ, మళ్లీ “ప్రాచీనావీతి” అంటూ జంధ్యం మార్పించి, ఆ తరవాత ‘పవిత్రాన్నీ’, ‘జంధ్యాన్నీ’ మరిచిపోయారు!) 

9-25 కి “ఆవు పంచకం”, పేడ, పాలు, పెరుగు, నెయ్యి “కలిపి” అందులో “దర్భ” ముంచి,…..చల్లిస్తూ….మంత్రాలు చదివారు(ట).

రాముడు-భీముడు సినిమాలో అనుకుంటా—రమణారెడ్డి హోటల్లో పేపరు చదువుతూ, “రోజుకి 8 లీటర్లు పాలిచ్చే ఆవు” అని చదివి, “పాలా….పంచితమా!” అంటూ వెక్కిరిస్తాడు. తెలుగువాళ్లెవరూ ఆ డైలాగ్ నీ, పంచితం అనే మాటనీ మరిచిపోరు. మరి “పంచకం” యెక్కడనించి వచ్చిందో!

మామూలు వ్యవహారంలో దీన్ని “పంచ గవ్య ప్రాశనం” అంటారు. అంటే, “గో పంచితం (మూత్రం), గోమయం (పేడ), గోక్షీరం (పాలు), గోదధి (పెరుగు), గోఘృతం (నెయ్యి)”—వీటిని “విడివిడిగా”—ప్రాశనం (అన్నప్రాశనం తెలుసుగా?)—తినిపించడం! నిజానికి ఈ “ప్రాశనం” ఇప్పుడు యెవరైనా చేస్తున్నారోలేదోగాని, ప్రతీ పూజా కార్యక్రమం లోనూ, వేదపఠన కార్యక్రమంలోనూ, బ్రహ్మోత్సవాలు మొదలైనవాటిలోనూ, ఇదో “ప్రముఖ” కార్యక్రమంగా ప్రకటించబడుతుంది. 

(ఓ నలభై యేళ్ల క్రితం, నరసాపురంలో “సరిపల్లివారి” ఇంటిలోనూ, తూర్పు గోదావరి జిల్లా (“వెల్ల” అనుకుంటా) లోనూ, “పచ్చ కామెర్లు” నివారణకి, “అరుకు” మందు ఇచ్చేవారు. బత్తిన సోదరుల “వుబ్బసానికి చేప మందు”లా. వాటి రహస్యం వాళ్ల కొంతమంది కుటుంబ సభ్యులకే తెలుసు!)

ఇక, పార్థివ దేహాలకి, పంచగవ్యాలతో “సంప్రోక్షణ” చేస్తారు. అక్కడ వేదమంత్రాలు చదవరు!

9-45 కి…..”పుణ్యపురుషులకి నాభికి పై భాగం నుంచే ఆత్మ గాల్లో కలుస్తుందన్నది విశ్వాసం. ఈ మేరకు నవ రంధ్ర, నవరత్న చేదనం జరిపించారు. ఇందులో భాగంగా నవరత్నాలను సాయి నోటిలో పోశారు”…….ఇదీ వార్త!

నవరంధ్రాలు అంటే (వివరించక తప్పడంలేదు)—2 నయన (కళ్లు) + 2 నాసికా (ముక్కు) + 2 శ్రవణ (చెవి) + 1 గ్రహణ (నోరు) + 1 మూత్ర + 1 పురీష (చివరి రెండింటికీ తెలుగు అఖ్ఖర్లేదు అనుకుంటా) = 9 రంధ్రాలు. ఇవి కాకుండా, కంటికి కనిపించని దశమ రంధ్రం, “బ్రహ్మ రంధ్రం”—అంటే, కపాలం పై “మాడు” అనబడే స్థానం. వీటిలో యేదో ఒక రంధ్రం నుంచి జీవుడు "తుది శ్వాస" రూపం లో నిష్క్రమిస్తాడు.

మహాయోగులూ, సన్యాసులూ తమ దేహ పరిత్యాగ సమయాన్ని ముందుగానే తెలుసుకొని, సమాధిని నిర్మింపచేసుకొని, అందులో తపో దీక్షలో వుంటూ, బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణ త్యాగం చేసేవారట. అదీ వారి “సమాధి స్థితి”. నాకు తెలిసి, యోగి వేమన ఒక్కడే అలా సమాధి అయినవాడు. (షిర్డీ సాయి కూడా అలాగే అంటారు కొంతమంది వీర భక్తులు.)

అనంతపురం జిల్లాలో, రాయదుర్గం లాంటి వూళ్లలో, అలాంటి యోగులు కొంతమంది వుండేవారనీ, వాళ్లు అలాగే సమాధి స్థితిని చేరారనీ ప్రతీతి. వాళ్ల “యిళ్లని” గుళ్లుగా నిర్మించి వాళ్లని ఆరాధిస్తూంటారు, జాతరలు జరుపుతుంటారు. చాలా కొద్ది కాలం క్రితం “భం భం బాబా” (పేపర్లలో అనేక కథనాలు వచ్చాయి ఈయన గురించి అప్పట్లో) తాను తపస్సు చేసిన కొండ గుహలోనే అలా సమాధి అయ్యారని అక్కడి ప్రజల విశ్వాసం!

ఈ దశమ రంధ్రాన్ని ప్రక్కనపెడితే, “నవరంధ్ర ఛేదనం” యేమిటీ?

దేహాన్ని యేదో ఓ రంధ్రంలోచి వదలిన జీవుడు, మళ్లీ యేదో ఒక రంధ్రం ద్వారా దేహాన్ని చేరడానికి ప్రయత్నిస్తాడట. మన “మిషన్” అల్లా, ఆ జీవుడిని కనీసం భువర్లోకానికి పంపించడమే! అందుకని ఆ నవరంధ్రాలనీ మూసెయ్యాలి. మామూలుగా మనకి వీలు కాదు. పైగా, ఆ రంధ్రాలని మేలిమి రత్నాలు (రాళ్లతో) మూసేస్తే, వచ్చే జన్మలో “ఫలానా” రంధ్రం ద్వారా జన్మిస్తే, వుత్తమ జన్మ వస్తుంది అని ఓ నమ్మకం! దాంతో, ముత్యము, వజ్రము, పగడము, నీలము, కెంపు, మరకతము, మాణిక్యము, గోమేధికము, పుష్యరాగము అనబడే నవరత్నాలతోనూ నవరంధ్రాలనీ మూసెయ్యడానికి ప్రయత్నిస్తాము.  

(సాధారణంగా శవాన్ని భూశయనం చేస్తారుకాబట్టి, పురీష రంధ్రాన్ని ముయ్యడం జరగదు. ఆ రత్నాన్ని కూడా ఇంకెక్కడో వేసేస్తారు.)

మరి నవరత్నాలనీ “నోటిలో” పోసేస్తారా? పోయించేస్తారా?

అదీ సంగతి.

9-55 కి……దేహాన్ని వుంచారు……బంధువులు……మృత్తికను…..వేశారు. ….ముఖ్యులు …..భక్తులు ….. భస్మాన్ని చల్లారు …….పుష్పాలతో అలంకరించారు.

ఇదీ వార్త. 

ఇవెవ్వరూ (సామాన్య ప్రజలు) చూడలేదు. ఈనాడు కెమేరాలు కూడా చూడలేదు. 

వొళ్లంతా చెవులు చేసుకొంటే వినిపించిన ఆడియో ప్రకారం….”పచ్చ కర్పూరం చల్లండి…..పచ్చకర్పూరం మాత్రమే……ఇప్పుడు మృత్తిక వేయండి……ఇంక మిగిలిన మట్టితో పూడ్చండి…..” ఇదీ జరిగింది. సేవాసమితి వారు మళ్లీ బయటి మట్టిని సంచులతో, బేసిన్లతో మోసుకురావడం కనిపించింది. 

తెర తీశాక, అందరూ యెగబడి మట్టినో, భస్మాన్నో చల్లడం ఇదివరకే వ్రాశాను. 

పుష్పాలంకరణ యెప్పుడు జరిగిందో నాకు తెలీదు. 

ప్రజల సమాధి దర్శనానికి మళ్లీ కెమేరాలు అమర్చేముందు జరిగి వుంటుంది బహుశా.

అదీ ఆ ప్రహసనం అనే “ఫార్స్”.

(రత్నాకర్ “నిత్య విధి” చేస్తున్నాడా? దశదిన కర్మలూ జరుగుతాయా? “సపిండీకరణం” వగైరా వుంటాయా? తరవాత, సమాధి వెనకున్న గణపతి విగ్రహాన్ని తొలగించి, సాయి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారా? లెక, సమాధి పై మట్టీ, పువ్వులూ తొలగించి, పాలరాతి తిన్నె నిర్మించి, దానిమీద షిరిడి లెవెల్లో సాయి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారా? ఆయనకి యే వారం ప్రత్యేకిస్తారు?......మిగతా కథ “వెండి తెరపై”!)
    
……అందుకే అన్నది…..యెవరి పాట్లు వారివి…..అని!
          
……ఇంకోసారి. 

Thursday, April 28, 2011

అంత్యక్రియలు అనే.....2హై డ్రామా

(నా టపా మీద వెంటనే వ్యాఖ్యానించినవాళ్లకి నా ధన్యవాదాలు. త్వరలోనే జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. దయచేసి నిరీక్షించండి.)

సన్యక్+ఆధి (సమాధి) అట! నా ఇన్నాళ్ల జీవితంలో ఈ “డెఫినిషన్” యెప్పుడూ వినలేదు! (ఇది యెవరైనా చెప్పారా, లేక ఈనాడువారు కనిపెట్టారా అన్నది కూడా నాకు తెలీదు.)

ప్రేత కర్మలూ, అపర కర్మలూ చేయించేవాళ్లు వేరే వుంటారు. వాళ్లు పట్టు వస్త్రాలు ధరించరు. ఆ కర్మలు జరిపిస్తున్నంతకాలం వేరే నియమాలు పాటిస్తారు. దైవార్చన, పూజా పునస్కారాలు చెయ్యరు. దేవాలయాల్లోకి వెళ్లరు. (శివాలయాలకి ఈ నిబంధన లేదు). వాళ్లలో (క్షమించండి) ‘ప్రేతకళ‘ వుట్టిపడుతూ వుంటుంది అని జనవాక్యం. 

నాకు తెలిసీ, మామూలుగా పురోహితులూ, వేదపండితులూ వగైరాల కుటుంబాల్లో యెవరిదైనా మరణం సంభవించినా, అలాంటి వాళ్ల చేతే కర్మలు జరిపించుకొంటారు కానీ, తామే ఆ కర్మలు నిర్వహింప చెయ్యరు. మరి యఙ్ఞాలూ, యాగాలూ చేయించారంటున్న అవధానులూ, ఇతర వేద పండితులూ, పట్టు వస్త్రాలు ధరించి, ఖననం చేయించడం యేమిటి?

వాళ్లు చేయించిన పధ్ధతీ, చదివిన సో కాల్డ్ మంత్రాలూ వింటే, అంతకు ముందు ప్రత్యేకంగా తయారు చేసుకొని, బట్టీ పట్టి, చదివి, నిర్వహింపచేసినట్టు అనిపిస్తూంది. (ఇలాంటి సందర్భం వాళ్లకి యెదురవడం మొదటి సారే అని నా అనుమానం.) బెంగుళూరు బృందం వారు టీవీలో కనపడలేదు కానీ, వాళ్లు యెక్కడో కూర్చొని, మంత్రాలు చదువుతూనే వున్నారు. వేద పఠనం లో వీళ్లకి బాగానే చేదోడు అయ్యారు. 

(నేను చూసినవాటికి, ఈనాడు వారు ఇవాళ (28-04-2011) ప్రచురించిన కథనంతో అనుసంథానం చేస్తూ వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను. అంతే.)

ముందురోజు రాత్రే తవ్వించి (మట్టి బయటికి మోస్తున్న సేవాదళ్ కార్యకర్తల ఫోటో కూడా ప్రచురించారు అంతకు ముందు రోజు) వుంచిన గుంత ని గ్రానైట్ రాళ్లతో తాపడం చేసి, 6’ X 3’ (అటు ఆరు, ఇటు మూడు—యెవరికైనా అదే ప్రాప్తం చివరికి అంటారు పెద్దలు!) “సన్యక్” లో, వుదయం 7-35 కి, “పవిత్ర” గంగ, నర్మద తదితర నదుల ఒడ్డు నుంచి తెచ్చిన “సప్త మృత్తిక” (మట్టి) చల్లారట. 

7-45 కి గంగ, యమున, సరస్వతి(??!!), గోదావరి, కృష్ణ, పెన్నా తదితర పవిత్ర నదుల నుంచి తెచ్చిన జలాల్ని వేదమంత్రాలు చదువుతూ, గుంతలో చల్లారట.

8-35 కి ……”ప్రముఖులు”……చివరిసారిగా “నివాళు”లర్పించారట. 

9-00 కి ……ప్రభుత్వం తరఫున………..”నివాళు”లర్పించారట.
(ఇవన్నీ నేను చూడలేదు. అందుకనే “ట” లతో)

9-10 కి ……దశదానాలు (లవణదానంతో సహా) చేయించారు. (ఈనాడు లో ‘బంగారం, వెండి, రాగి, ఇత్తడి, కంచు, ఇనుము తదితర లోహాలని‘ అని వ్రాశారు. మా చిన్నప్పుడు జీళ్లు అమ్మే అబ్బాయి, “ఇత్తడీ, రాగీ, కంచూ, సేవెండీ, వెండీ, బంగారాలకి జీళ్లు….జీళ్లు…" అని సరదాగా అమ్ముకోడం గుర్తొచ్చింది నాకు.)

ఇంకా, గోవుని…..దానం చేశారు అని కూడా వ్రాశారు. (గోవు మీద వస్త్రం కప్పి వుంచడం తో అది మూపురం వున్నదా లేనిదా తెలియలేదు నాకు. ఈ మధ్య ఇదోటి కదా….మూపురం లేని ఆవులు ఆవులే కాదు, అవిచ్చే పాలు ఆవు పాలే కదుట.)

9-15 కి “ప్రాణోత్కారణ” దోష పరిహారార్థం కోసం “ఉపనిషత్తుల రెండో భాగం”లోని “వేద మంత్రాలను”………దోషాలు అనుభవించినా……తొలగిపోవటానికి….చదివారట. (నిన్నటి పేపర్లో కూడా ఈ వుపనిషత్తుల రెండో భాగం……..మంత్రాల ప్రసక్తి వచ్చింది. ఆ విలేకరికి ఇవన్నీ యెవరైనా చెపితే వ్రాశాడో, తనకి తోచినవి తోచినట్టు వ్రాశాడా అని నా అనుమానం).

(ఈ టపా పూర్తిగా వ్రాసేద్దామనే వుంది కానీ కుదరడం లేదు……అందుకే……)

…….ఇంకోసారి.

Wednesday, April 27, 2011

అంత్యక్రియలు అనేహై డ్రామా

సత్యసాయి అంటే నాకు చాలా గౌరవం. 

ఇదివరకోసారి చెప్పాను....పెద్దవాళ్లెవరైనా.....65 యేళ్లు పైబడినవాళ్లు (ఇదే మన దేశం లో ఇప్పటి జీవన ప్రమాణం అనుకుంటా.) యెవరైనా, యేకులం, మతం వాళ్లయినా, ఆడైనా, మొగైనా, వాళ్ల పాదాలని అంటి "మీ ఆశీర్వాదం కావాలి" అని మ్రొక్కుతాను....'మీ ఆయుష్షులో కొంచెం నాకివ్వండి' అనో, 'నా ఆయుష్షులో కొంచెం తీసుకోండి' అనో కాదు.....'మీలాగా నాకు దీర్ఘాయుష్షు ని ప్రసాదిస్తూ ఆశీర్వదించండి' అని. యెందుకంటే వాళ్లు పసివాళ్లతో సమానం. దేవుడి తో సమానం. అలాగే.....సత్యసాయి అయినా, ఇంకెవరైనా. ఆయన్ని దర్శించుకొనే అవకాశాలు వచ్చినా, నేను యెగబడలేదు. 

ఆయన ఆ వయసులోనే ధర్మ కార్యాలు చెయ్యడం మొదలుపెట్టాడు. అంతకు ముందు నేనుకూడా చాలా మందిలాగానే, ఆయన ఓ దొంగ, మోసగాడు, ఇంద్రజాలికుడు అన్నవాణ్నే. ఆ సమయంలోనే ఆయన తాను దేవుణ్ని అని చెప్పుకోవడం మానేశాడు. అందుకనే ఆయనంటే గౌరవం కలిగింది. అది పెరిగింది. 

28 రోజులకి పైగా ఆయన మృత్యువుతో పోరాడటం, దేహ యాత్ర చాలించడం ఒకెత్తు. ఆయన చెప్పినట్టే--(సామాన్యుడికి యెలా అంత్యక్రియలు జరిపిస్తారో అలాగే నాకూ జరిపించండి!)--నిర్వహిస్తాం అని చెప్పిన ట్రస్టు వాళ్లు సర్వమత ప్రార్థనలూ వగైరా నిర్వహించడం బాగానే వుంది. 

కానీ, కుల, మతాచారాల ప్రకరం ఆ పార్థివ దేహాన్ని దహనం చెయ్యకుండా ఖననం చెయ్యడం యెందుకు? పద్మాసనంలో కూర్చోబెట్టాలి అనీ, పడుకోబెట్టే ఖననం చెయ్యాలి అనీ వాదనలెందుకు? (మృతదేహం లో ఒకసారి ‘రిగొర్ మోర్టిస్’ ప్రారంభం అయ్యాక, బిగిసిపోయిన ఆ అవయవాలని ఇష్టం వచ్చినట్టు వంచడం మానవమాత్రులకి సాధ్యమేనా?)

లైవ్ టీవీ కవరేజితో, పంచగవ్యాలతో సంప్రోక్షణా, దశదానాలూ చేయించి, ఆడవాళ్లు చూడకూడదు అంటూ తెరవేసేసి, రెండుగంటలపాటు ఆ తెరలు మాత్రమే చూపించడం యెందుకు? (టీవీ9 లాంటివాళ్లు మొత్తుకొని వుంటారు—కోట్ల విలువైన టీవీ సమయం ఒక్క ప్రకటన కూడా లేకుండా వృథా అయినందుకు!)

తెరలు తీయగానే, గవర్నరూ, ముఖ్యమంత్రీ, తరవాత అందరు నాయకులూ, నాయకమ్మన్యులూ యెగబడిపోయి, సమాధి మీద మట్టినో, విబూధినో జల్లెయ్యడం యేమిటి? (ఇంకా ఆడవాళ్లు యెగబడలేక పోయారు!)

సామాన్య ప్రజలకి ఫలానా టైమునించీ సమాధి దర్శనం మొదలవుతుంది అని ప్రకటించారు. 

ఈ లైవ్ వేషాలు లేకుండా, అసలు తతంగమంతా పూర్తయ్యాక, కావాలంటే ముందు వీఐపీలకీ, తరవాత సామాన్యులకీ సమాధి దర్శనం యేర్పాటు చేస్తే యెంత హుందాగా వుండేది?

సరే లెండి….యెవరి పాట్లు వాళ్లవి!

Monday, April 25, 2011

ఆత్మ..........శాంతి

ఆత్మలగురించి వ్రాయడం మొదలుపెట్టి చాలా కాలం అయ్యింది. 28-09-2009 న నా ‘ఓసామా’ బ్లాగులో ఆత్మల గురించి టపా వ్రాశాను. దానిమీద వచ్చిన వ్యాఖ్యల గురించి వేరే కొన్ని టపాలు వ్రాయ వలసి వచ్చింది. అదంతా గతం.

మరి ఇప్పుడు మళ్లీ ఇంకో టపా వ్రాయాలని……యెందుకో అనిపించింది.

జీవి మరణించడం అంటే దేహత్యాగం చెయ్యడం. జీవుడు (ఆత్మ) భువర్లోకానికి చేరడానికి ‘కర్మ‘ చేసే కర్తలు దోహదం చేస్తారు. భువర్లోకమెక్కడ వుంది? భూమి చుట్టూ ఆవరించిన వాతావరణానికి పైన, మేఘాల క్రింద వుంది. (నువ్వు చూసొచ్చావా అని అడగకండి.....మన పురాణాలూ, భగవద్గీతలూ అవీ నమ్మితే)

‘పునరపి జననం, పునరపి మరణం‘ అని చెప్పాడు శంకరాచార్యులు.

‘యఙ్ఞమువలన మేఘము కలుగును; (మేఘము వలన వర్షము కలుగును); మేఘము వలన (వర్షము వలన) అన్నము పుట్టును‘ అన్నాడు గీతాకారుడు.

మన ప్రాచీన మహర్షుల దగ్గర నుంచి, రామకృష్ణ పరమహంస నుంచి, అరవిందుడినుంచి, జిడ్డు కృష్ణమూర్తి నుంచి, ఙ్ఞానులూ, యోగులూ, సన్యాసులూ, ఆధ్యాత్మిక గురువులూ, యెవరు చెప్పినా, మనిషి ప్రయత్నించవలసింది ఈ జనన మరణ వలయాన్ని చేదించి, పునర్జన్మ లేకుండా ‘మోక్షాన్ని‘ అంటే కనీసం ‘స్వర్లోక‘ ప్రాప్తిని సాధించమని. అంతే కదా?

(మళ్లీ స్వర్లోకమంటే యేమిటి అంటారా? భూలోక, భువర్లోకాలపైన వుండేది స్వర్లోకం. స్వః+లోకము=(రుగాగమ సంధి అయి) స్వర్లోకము. స్వర్గము అంటే స్వర్లోకానికి గమించడం. అంతేగానీ ఆ లోకం స్వర్గం కాదు!)

అక్కడ చేరితే, క్రమక్రమంగా మహర్లోకానికీ, జనలోకానికీ, తపోలోకానికీ, సత్యలోకానికీ జీవుడు (ఆత్మ) చేరుకోవచ్చు. అందుకే దాన్ని మోక్ష సాధన అన్నారు.

తేలిగ్గా స్వర్లోకానికి చేరడానికి సాధనంగా విశ్వామిత్రుడు “గాయత్రి”ని మనకి ప్రసాదించాడు అని ఇదివరకే చెప్పాను. ఆ మంత్రాన్ని అనుష్టించడం ద్వారా స్వర్లోక ప్రాప్తిని సాధించవచ్చు. (గాయత్రిని ఇష్టం వచ్చినట్టు 'పాడద్దు', సెల్ ఫోన్ లో రింగ్ టోన్లుగా పెట్టుకోవద్దు అని నేనే కాదు, గరికిపాటివారు కూడా టీవీల్లో మొత్తుకొంటున్నాడు.)

(పైనున్న లోకాలు యేడూ కాకుండా, క్రింద మరో యేడు లోకాలున్నాయనీ, మొత్తం 14 లోకాలనీ పెద్దలు చెప్పారు. క్రింద వున్నవి, “అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ” లోకాలు. వాటి గురించి మరో టపా వ్రాస్తాను.)  

ఇంక, “నేను క్రితం జన్మలో ఫలనా, ఈ జన్మలో నేను, వచ్చే జన్మలో ఫలనా” అని యెవరైనా ప్రకటిస్తే, ఆయన “ముముక్షువు” కాదు….జన్మరాహిత్యం కోసం ప్రయత్నించడంలేదు….లౌకికంగా ఇంకా బోళ్లు సుఖాలూ, శుభాలూ పొందాలి అనీ, యే సీ లూ, ఖరీదైన కార్లూ, వాటర్ బెడ్లూ, కోట్లాదిగా ధనం, బంగారం, వెండీ, ప్లాటినం, అనేకమంది ప్రముఖ శిష్యులూ కలిగి వుండాలని కోరుకున్నట్టే కదా అర్థం? అలాంటివాళ్లు ప్రపంచంలో యెవరైనా వున్నారా? వుండేవాళ్లా?

కొన్ని నమ్మకాలని హేతువాదులు మూఢ నమ్మకాలు అంటారు. అలాంటి వాటిలో పునర్జన్మ అనేది వొకటి. 

అలా అని మన పూర్వులు యెంతో దీక్షతో తపస్సు చేసి, దర్శించి, చెప్పిన విషయాలని మూఢ నమ్మకాలు అనకూడదు కదా?

(ఇది యెవరిమీదో విమర్శ కాదు—గమనించండి.)

మన ప్రాచీన విఙ్ఞానం యెంత గొప్పదో ఒక్కసారి గుర్తు చెయ్యడానికే. 

ఇంక, దేహాన్ని వీడిన ఆత్మ ప్రయాణం యెలా సాగుతుంది? అది భువర్లోకంలో యెంతకాలం వుండాలి? అక్కడేమి జరుగుతుంది?

……ఇంకోసారి.

Wednesday, April 20, 2011

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి......3......కళ్యాణం అనే ఓ ప్రహసనం

చిన జీయరు స్వామి ఇంకా మైకులో చెపుతూనే వున్నాడు. ఇంతలో అహోబిలం స్వామి యెందుకో క్రిందకి దిగివచ్చేశాడు. క్రింద నుంచొని, చేతులు వూపుతూ యెవరితోనో యేదో మాట్లాడడం కనిపించింది. మళ్లీ ఆయన పైకి యెక్కలేదు.

జనాలకి అమ్మడానికి తలంబ్రాల పొట్లాలు ఆ ముందురోజునే ప్యాకెట్లలో సిధ్ధం చేసేశారు. 
ఆ తలంబ్రాలు వేరు.

తరవాత క్రొత్త దంపతుల చుట్టూ తెర పట్టుకొని, స్వామివారి ప్రక్కన అమ్మవారిని కూర్చోపెట్టి, హారతి ఇచ్చేశారు. తతంగం పూర్తి అయినట్టే.

ఇదంతా చూస్తే, మన వివాహ వ్యవస్థని, విధానాన్ని అపహాస్యం చెయ్యడానికి కంకణం కట్టుకున్నారా అనిపించింది.

అదండీ సంగతి.

Thursday, April 14, 2011

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి......2......కళ్యాణం అనే ఓ ప్రహసనం

ముఖ్యమంత్రి రావడానికి ఓ పావుగంట పైగా పడుతుంది అని ఫోను వచ్చిందేమో, మధ్యలో "నారికేళ సమర్పణ" అని ఒకటి ప్రవేశపెట్టారు. 

ఓ అర్చక స్వామి ఓ ఒలిచిన కొబ్బరికాయని దోసిట్లో పట్టుకొని, బిగిసిపోయినట్టుగా నిలబడి, వూపిరి తీస్తూ వొదులుతూ, ఓ పావుగంట సేపు పట్టుకొనే వున్నాడు. మొదట ఆ కాయ ముచ్చికని కుడివైపు తిరిగి వుండేలా పట్టుకొన్నాడు. తరవాత నెమ్మదిగా వేళ్లతో దాన్ని తనవైపుకు వుండేలా తిప్పుకున్నాడు. అంతసేపూ యేమి మంత్రాలు చదివారో తెలియదు. తరవాత ఆ కాయని స్వామి పాదాలదగ్గరనుకొంటా పెట్టేశారు.

యే వివాహం లోనూ ఇలాంటి తంతు జరగడం నేను చూడలేదు. ముహూర్తానికి ముందు యెక్కువ సమయం వుంటే వీనుల విందుగా "మహా సంకల్పం" చెపుతారు. మరి వీళ్లకి అది రాదో యేమిటో.

సరే, ముహూర్తం పేరుతో జీలకర్రా, బెల్లం ముద్దలు--తిరపతి లడ్డూ సైజులో--ఇద్దరి కిరీటాలమీదా పెట్టేశారు. వ్యాఖ్యాత ఒకరు ఆ పదార్థాన్ని "మాడు" మీద పెట్టడం గురించి వివరిస్తూ, నవరంధ్రాలేకాకుండా దశరంధ్రాలో, ద్వాదశరంధ్రాలో--ప్రసక్తి కూడా తెచ్చాడు. సరే బాగుంది.

ఇంక మాంగల్య ధారణ. యెవరు చెప్పినా, చేయించినా ఆ తంతునెవరూ మార్చలేరు కాబట్టి, బాగానే జరిపించారు. మూడు తాళి బొట్లగురించి వివరించడం కూడా మరిచిపోలేదు.

ఇంక మిగిలిన తంతు అల్లా తలంబ్రాలే. మంటపం చుట్టూ ఫేన్లు ఆపేసి, అర్చకస్వాములిద్దరూ, తెల్లని ముత్యాలని ఇద్దరిమీదా పొయ్యడం మొదలెట్టారు. అలా కొన్నిసార్లు పోశాక, ఓ వ్యాఖ్యాతకి గుర్తొచ్చింది "జానక్యా కమలాంజలి పుటే యా" చెప్పేశాడు. తరవాత "ప్రభుత్వం" ప్రతి యేటా సమర్పించే ముత్యాలు. (అవి గులాబీ రంగులో వున్నాయి. ఓ కేజీ కుంకంపువ్వు లో దొర్లించారో లేక యేదో రంగు కలిపేశారో--ప్రజల డబ్బులేకదా). అవి పోశాక ఓ అర్చక స్వామి ప్రత్యేకంగా శ్రీరాముడి ముఖాన్ని, కళ్లనీ ఆ పౌడరు రాలిపోయేలా తుడవడం కనిపించింది. ఇంకో వ్యాఖ్యాతకి గుర్తొచ్చింది......మళ్లీ ఆయన "జానక్యా....." చదివేశాడు.

ఈ ముత్యాల దగ్గరకి వస్తే, మొట్టమొదట గోల్కొండ నవాబు ఆ ముత్యాలని తానీషా ద్వారా కళ్యాణానికి తలంబ్రాలుగా పొయ్యమని పంపించాడు అని చరిత్ర. అప్పటినుంచీ "అవే ముత్యాలు" ప్రతీయేటా ప్రభుత్వం వారు జాగ్రత్తచేసి, సమర్పిస్తూ వుంటారు అని జనం విశ్వాసం. మరి వాటి మూలాల్లోకి వెళితే, వెంకన్నకి శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన వస్తువుల కథే పునరావృతం అవుతుందేమో అని నా అనుమానం.

స్వామికి రామదాసు చేయించాడని చెప్పుకొనే నగలన్నీ, కళ్యాణం అయిపోయాక మళ్లీ బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తారు. వాటి రికార్డుల సంగతి యేమిటో మరి. ఇదివరకు దేవాలయం లోనే ఓ గదిలో, అద్దాల కేసుల్లో వాటిని ప్రదర్శించేవారు. అప్పుడు పెద్ద పెద్ద పచ్చలతో అరచేయి సైజులో ఆ పతకాన్ని చూసిన గుర్తు నాకు. ఇప్పుడు చూపిస్తున్న పతకానికి, క్రింద వ్రేళ్లాడుతూ మాత్రమే కొన్ని చిన్న చిన్న పచ్చలు కనిపిస్తున్నాయి. చింతాకు పతకం ప్రసక్తే రావడం లేదు. దొంగలుపడి వాటిని దోచుకున్నాక, వాళ్లు పట్టుబడి అవి పోలీసులు స్వాధీనం చేసుకున్నాక, వాటిని లాకరులో భద్రపరుస్తున్నారు.   

తలంబ్రాల ముందో, తరవాతో గుర్తులేదు గానీ, ఈ మధ్యే ప్రవేశపెట్టిన--కొబ్బరి కాయతో బంతులాట. ఇద్దరు అర్చకులు, మంటపం ముందువైపు చెరో ప్రక్కనా కూర్చొని, ఓ వొలిచిన కొబ్బరికాయని, ముచ్చికతో సహా, ఒకరికొకరు దొర్లిస్తూ ఆడుకుంటారు. (అలా యెంతసేపు ఆడారో నేను చూడలేదు) 

.........తరువాయి మరోసారి.

Wednesday, April 13, 2011

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి............కళ్యాణం అనే ఓ ప్రహసనం

నిన్న (12-04-2011) అనూచానంగా వస్తున్న శ్రీ సీతారామ కళ్యాణం తో పాటు, "పుష్కర పట్టాభిషేకం" కూడా ఘనంగా, అత్యంత వైభవంగా జరిపిస్తామని ప్రకటించారు.

నాకు ఙ్ఞానం తెలిసినప్పటినుంచీ, ప్రతీ యేడూ జరిగే కళ్యాణాన్ని రేడియో ద్వారా వినడం, తరవాత టీవీలో చూడడం మా నాన్నగారు చేసిన అలవాటు. (అలాగే రిపబ్లిక్ డే పెరేడ్).

మహామహులు అనర్గళంగా వ్యాఖ్యానం చేస్తుంటే, భక్తిభావమో యేదో గానీ, రోమాలు నిక్కబొడుచుకొని, కళ్ల నీళ్లు తిరిగేవి. ఆ రోజులు పోయాయి.

యెందుకంటే......నిన్న జరిగింది చూశాక, యెవరైనా వొప్పుకుంటారు--అది ఒక "తంతు" లేదా "ప్రహసనం" గా మారింది అని.

ముఖ్యంగా, ఇదివరకు వ్యాఖ్యాతలు అక్కడ జరుగుతున్న విశేషాలని మంత్రాలతో సహా విననిచ్చి, మధ్య మధ్యలో వ్యాఖ్యానించేవారు. 

నిన్నటి ఇద్దరు వ్యాఖ్యాతలూ (దూరదర్శన్ లో నాక్కనిపించింది ఇద్దరే మరి) రామదాస విరచితమైన దాశరథీ శతకం లోని నూటయెనిమిదో యెన్నో పద్యాలన్నీ చదివేశారు. మధ్య మధ్యలో అవేవో రామాయణాల్లోని శ్లోకాలు కూడా.

అవి కాకుండా, వాళ్లు చెప్పిన వ్యాఖ్యానమల్లా, "స్వామికి పట్టు పుట్టాలూ, నగలూ అలంకరిస్తున్నారు." "అదిగో! పచ్చల పతకం!" (చింతాకు పతకం ప్రసక్తి రాలేదు యెందుకో!) "మధుపర్కాలు సమర్పించారు." "స్వామికి చెమటలు పట్టకుండా, వీవెనలు వీస్తున్నారు!" (ఇది చాలాసార్లు చెప్పబడింది--వింజామరలూ లాంటి మాటల మార్పిడితో) "జీలకర్రా, బెల్లం పెడుతున్నారు" (దాని అవసరం వగైరాలు), "ముత్యాల తలంబ్రాలు పోసుకొంటున్నారు" "కళ్యాణం అయిపోయింది"--ఇలాగే సాగింది.

ఇదివరకు, కన్యావరణం దగ్గరనించీ, ప్రవరలు చెప్పడం వినిపించి, యఙ్ఞోపవీత ధారణ నుంచీ, పాద ప్రక్షాళణం, ముహూర్తం, మధుపర్క ప్రాశన, తలంబ్రాలు, సప్తపది జరిపించి, మంగళహారతి ఇచ్చేవారు.

ఇప్పుడు--ముందే అనేక "పట్టుపుట్టాల"తోపాటు, మధుపర్కాలనీ పెట్టేసి, నగల అలంకరణకి అనవసర ప్రాథాన్యం ఇచ్చి (ఒక్కో నగనీ 'అర్చక స్వామి' ఓ పది నిమిషాలసేపు అందరికీ.....అంటే టీవీ కెమేరాలకి.....చూపించడం), ముఖ్యమంత్రీ, మరింతమందీ ముత్యాల తలంబ్రాలనీ, పట్టు వస్త్రాలనీ, చెవులమీదనించి దౌడలమీదువా గడ్డం క్రిందనించి కండువాలు కప్పేసుకొని, నెత్తిమీద 'పళ్లాలలో' మోసుకొంటూ.....కారు దిగినప్పటినించీ, కళ్యాణ వేదిక వరకూ......మధ్యలో అవి క్రింద పడేస్తూ, యెడం చేతితో తీసి పైన పెట్టుకొంటూ, అడ్డమైనవాళ్లూ అవి క్రింద పడిపోకుండా వాళ్ల 'నెత్తిమీద చేతులు' వేస్తూ.....ఇవన్నీ అయ్యాక, అప్పుడు "ముహూర్తం". 

కనీసం అందరూ తెచ్చిన వాటిని సంప్రోక్షణ కూడా చెయ్యకుండా, వాడెయ్యడం. అన్నన్ని బట్టలూ, చీరలూ కప్పెయ్యడం యెందుకో మరి. 'స్వామికి చెమటలు పట్టకుండా......' అంటూ వ్యాఖ్యానాలు. నిజానికి మానవమాత్రుడెవరైనా అన్ని బట్టలు కప్పేస్తే, చెమట ధారలుగా మారి, క్రింద ఓ మడుగైపోయేది. స్వామి కాబట్టి తట్టుకున్నాడు. 

అప్పటివరకూ, అలంకరింపబడుతున్నవాటిని చేతులతో ముట్టుకొంటూ మాత్రమే వున్నారు జీయరు స్వాములు. ముఖ్యమంత్రి వచ్చాక చిన జీయరు స్వామి మైక్ అందుకొని, రామాయణమ్మీద వ్యాఖ్యానం మొదలెట్టారు. అది వినపడకుండా, వ్యాఖ్యాతలు.....మామూలే.....పద్యాలూ, శ్లోకాలూ, ఆనందరాముడు, అందాల రాముడు, కళ్యాణరాముడు అంటూ వర్ణనలూ, చెమటపట్టకుండా అని వ్యాఖ్యలూ!    

.........తరువాయి మరోసారి.

Tuesday, April 12, 2011

యెవడిగోల వాడిది
ఇవోరకం


"పరమహంస పరివ్రాజకాచార్య హంపీ విరూపాక్ష పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామీజీ" మొన్నోరోజు ఏలూరులో "అనుగ్రహభాషణం" చేశారట.

"యెక్కడ శుభ్రత వుంటుందో అక్కడ శ్రీమహాలక్ష్మి వుంటుంది" అన్నారట. అంతేకాదు శ్రీవారినీ, అమ్మవారినీ సేవించి, "భక్తులకు మంగళాశాసనాలు" తెలిపారట.

ఇవన్నీ యేమిటో??!! శంకరా! నారాయణా!

అన్నట్టు, ఈ మధ్య గుళ్లలో వేస్తున్న పాటలు క్రొత్త పోకడలు పోతున్నాయి!

"కేశవా! నారాయణా! మాధవా! గోవిందా!" లని తనకి ఇష్టంవచ్చిన రాగాలతో, తబలా విద్వాంసులు సహకరించగా, పాడేసి, రికార్డు చేసేసేవాడొకడు.

"మత్స్య, కూర్మ, వరాహా, నారసిమ్హ, వామన" అంటూ, అలాగే ఓ రాగం లో పాడేసి, రికార్డు చేసేవాడొకడు! (అవేవో తమ సొంత సాహిత్యమైనట్టు!)

వీళ్లకన్నా, కిరస్థానీ పాటలు వ్రాసి పాడేవాళ్లు నయం. యెన్ని కొత్త కొత్త పాటలో! (వాళ్ల సాహిత్యంలోనే అయినా!)

ఎమ్మెల్యేలకు "సొంత కార్యాలయ భవనాలు" నిర్మించేందుకు వీలుగా, "ప్రభుత్వ స్థలాలు" సేకరించాలని ప్రభుత్వం అదేశించడంతో, రెవెన్యూ శాఖ స్థలాలకోసం "దృష్టి" సారించిందట. కొన్ని నియోజకవర్గాల్లో స్థలాలని "గుర్తించా"రట. నరసాపురంలో రెవెన్యూ స్థలాలు "లేవ"ట. అందుకని ఎమ్మెల్యేగారు "ఆర్డీవో కార్యాలయ ఆవరణలోనే" స్థలం కేటాయించాలని కోరారట. ఆస్థలం కేటాయిస్తే, తమ "కార్యకలాపాలకు అన్నివిధాలా అనుకూలంగా వుంటుంది" అని అధికారులు, వున్నతాధికారులకి తెలిపారట!

అసలు వీళ్లకి కార్యాలయాలు యెందుకట? ఇవాళ కార్యాలయం నిర్మాణమూ, దానికి టెండర్లూ.....రేపు తమ భద్రతా సిబ్బందికీ, తైనాతీలకీ క్వార్టర్లూ....మళ్లీ టెండర్లూ.....ఇలా చేసి, చివరికి ఆర్డీవో కార్యాలయాన్ని వూరి చివర "డంపింగ్ యార్డు" లోకి తరలించడానికా?

భూమి యెప్పుడూ ఇక్కడే వుండేది, వుంది, వుంటుంది. "నువ్వే పోయేవాడివి!" అనే విషయం యెవరు చెపుతారు వీళ్లకి?

అలెగ్జాండరు పాపం తను చనిపోయాక, తన శవపేటిక రెండువైపులా తన చేతులు పట్టే రంధ్రాలని చేయించమని శాసిస్తే, అడిగారట....."అలా యెందుకు?" అని. దానికాయన జవాబు--"నేను జగజ్జేతను. దానికోసం కొన్ని లక్షలమందిని బలిపెట్టాను. అయినా, 'వొట్టి చేతులతోనే' ఈ ప్రపంచం వీడి వెళ్లిపోతున్నాను. అందుకని, నా ఖాళీ చేతులు బయటికి కనపడేలా నన్ను సమాధి చెయ్యండి. ఇది చూసైనా అందరికీ బుధ్ధి రావాలి" అన్నాడట. 

ఈ విషయం మన రా నా ల తలకెప్పుడు యెక్కుతుందో మరి!?

Saturday, April 2, 2011

"కల్ట్" అనే...........వేలం వెఱ్ఱులు

"సృష్టి, స్థితి, లయ" అనేవి అందరికీ తెలుసు. యెటొచ్చీ, సృష్టి, స్థితి మన చేతుల్లో వుంటాయికానీ, లయ మాత్రం వుంటే గింటే ఆ పరమేశ్వరుడి చేతుల్లోనే!

ఒక "కల్ట్" (అంటే స్థూలంగా 'పంథా' అనొచ్చునేమో) సృష్టించడం, దాన్ని పెంచి పోషించడం (Originate; Build & Promote) అనేవి మన చేతుల్లోనే వుంటాయి. 

ప్రపంచంలో వివిధ మతాలు వాటి 'పంథా' లని నిర్దేశించుకున్నాయి. వాటి ప్రకారమే నడవమన్నాయి. (మన హిందూ కే యే పంథా లేదు--ధర్మం అనేది తప్పితే!). అయినా, వివిధ మతాల్లోనూ ఇంకా అనేక పంథాలు ప్రవేశపెట్టబడ్డాయి. అనుసరించబడుతున్నాయి. 

బౌధ్ధుల్లో--అహింసా, పునర్జన్మలమీద నమ్మకం, బుధ్ధుడి అవశేషాలమీద స్థూపాలూ, అవేవో గంటలూ, శబ్దాలు వెలువరించే 'గిరికీలు ' లాంటివీ, దమ్మపథ పఠనం--ఇలాంటివి.

మహమ్మదీయుల్లో--మక్కా వైపే తిరిగి ప్రార్థనలు చెయ్యడం, హజ్ యాత్రల్ని నిర్వహించడం, మహమ్మదు ప్రవక్త శరీర భాగాలకి దర్గాలు కట్టి ఆరాధించడం, మరణించిన మహాత్ముల దర్గాలని దర్శించి కోరికలు తీర్చుకోవడం, భూతప్రేతపిశాచాల నుంచి గురువులు రక్షణ కల్పించడం ఇలాంటివి.

క్రిస్టియన్లలో చెప్పఖ్ఖర్లేదు--ప్రతీవాడూ ఓ చర్చి కట్టేవాడే, బోధలు చేసేవాడే. కొన్ని వందల యేళ్లగా అనేక లక్షల చర్చిలు వెలిశాయి. రోమన్ కాథలిక్కుల దగ్గరనించి, సిరియన్ కేథలిక్కులూ, ప్రొటెస్టెంట్లూ నించి 'మార్మన్ '; 'లేటర్ డే సెయింట్స్ '--ఇలా.

అన్ని మతాల్లో అందరూ చేసింది--ఓ "కల్ట్" నిర్మించడం, పెంచడం, పోషించడం--అంతే!

మన దేశంలో కూడా, శంకరాచార్యుల దగ్గరనించి రామకృష్ణ పరమహంస, వివేకానంద, విప్లవయోగి అరవింద ఘోష్, రమణ మహర్షి, షిర్డీ సాయిబాబా, సత్య సాయి బాబా, ఆచార్య రజనీష్, మహేష్ యోగి, జిడ్డు కృష్ణమూర్తి, మాస్టర్జీలు, ఎక్కిరాలవారూ, నేటి గణపతి సచ్చిదానందలూ, సుందర చైతన్యానందలూ, చివరికి మొన్నటి ప్రేమానందలూ--వీళ్లెవరూ తమ పేరిట ఒక "పంథా" నిర్మించమనీ, ప్రచారం చెయ్యమనీ, ప్రమోట్ (అంటే పదోన్నతి కాదు కదా?) అదే--పెంచి పోషించమనీ యెవ్వరినీ వేడుకోలేదు!

అలాగే, స్వామి అయ్యప్పా, విజయవాడ కనక దుర్గా, అన్నవరం సత్యదేవుడూ, తిరపతి వెంకన్నా, నిర్మలగిరి మరియమ్మా, వీళ్లెవరూ మాలలు ధరించమనీ, భజనలు చెయ్యమనీ, మండల పూజలు చెయ్యమనీ, యాత్రలు చెయ్యమనీ, పూజించమనీ యెవరికీ చెప్పలేదు!

కానీ--జరుగుతున్నదేమిటంటే, వాళ్ల పేర్లు చెప్పుకొని కొంతమంది "ముఖ్య శిష్యులూ, భక్తులూ, అనుచరులూ, పూజారులూ, పరిశయ్యులూ"--ఇలా బయలుదేరి, "కల్ట్" ప్రారంభం, నిర్మాణం, పెంచి పోషించడం--జరుగుతున్నాయి.

ఇవన్నీ అమెరికా మొదలైన పాశ్చాత్య దేశాల్లో కొన్ని వందల యేళ్లుగా జరిగి, లయం చెందినవే! (ఫలానా గ్రహణం రోజున మన పంథా వాళ్లందరూ ఓ శిఖరాగ్రం మీద చేరి, నేను "ఓకే" అనగానే క్రిందకి దూకెయ్యాలి! అన్న పంథాలూ చూశాము కదా?)

మరి ఇప్పుడు భారత దేశానికి యేమి దౌర్భాగ్యం? ఈ యెంగిలి కూడు "కల్ట్" లని దేశంలో ప్రవేశపెట్టడం యెందుకు? యేమి సాధిస్తున్నారు? అంటే--"స్వ సంపాదన కోసమే" అనే సమాధానం వస్తుంది.

.......మళ్లీ మరోసారి.

Friday, April 1, 2011

పథకాలూచెవిలో పువ్వులూ

ఎన్ తులసి రెడ్డి--కోతిక్కొబ్బరకాయ దొరికినట్టు ఈయనకో పదవిచ్చారు--20 సూత్రాల కార్యక్రమం అమలు అదేదో చైర్మన్ ట. ఆ ఇరవై సూత్రాల్లో కనీసం ఓ పదైనా వరసగా వెంటనే చెప్పమనండి ఈ కాంగ్రెస్పండితుణ్ణి!

"మునెపెప్పుడో పడవల్లో ప్రయాణం చేసే రోజుల్లో......" అన్నట్టు, 1975 లో "గరీబీ హటావో" నినాదం తో యెన్నికలకు వెళుతూ ఇందిరాగాంధీ ప్రకటించింది ఈ 20 సూత్రాలనీ. నిజానికి గరీబీ హటావో అన్నది అప్పటి రక్షణ మంత్రో, హోం మంత్రో (ఇందిర కుడి భుజమో యేదో) అయిన బాబూ జగజ్జీవన్ రామ్ ఇచ్చిన నినాదం. అది పార్టీ నినాదంగా మారి, ఇందిర పేరున స్థిరపడిపోయింది.

తరవాత సంజయ్ గాంధీ ఆ 20 నీ భ్రష్టు పట్టించడంతో, సవరించబడ్డ (రివైజ్డ్) 20; మళ్లీ ఇందిర అధికారం లోకి వచ్చాక "క్రొత్త" (న్యూ) 20; ఇంకా తరవాత "నూతనీకరించబడ్డ" (మాడిఫైడ్) 20--ఇలా ఆ పరంపర కొనసాగుతూ వచ్చింది. ఫలితం మాత్రం హళ్లికి హళ్లి. కానీ ఈ పథకాల పేరుతో ప్రభుత్వ/అధికారుల కార్యక్రమాలూ, సమీక్షలూ, చర్యలూ, ప్రోత్సాహకాలూ వగైరాలకీ, బ్యాంకులు పంచిపెట్టి వసూలు చేసుకోలేకపోయిన ఋణాలకీ, వాటిమీద ప్రభుత్వానికి సమర్పించవలసిన/సమర్పించిన నివేదికలకీ, కొన్ని వేల కోట్లు హారతి కర్పూరమయ్యాయి!

అప్పటినించీ, కాంగ్రెస్ ప్రథానులూ, మన రాష్త్ర కాంగ్రెస్ ముఖ్య మంత్రులూ ఆ 20 భజన చేస్తూనే వున్నారు--కిరణ్ కుమార్రెడ్డి తో సహా. 

పోనీలెండి--తులసి కూడా, తనవంతు కృషి (ఖర్చు) చేస్తున్నాడు ఇంట్లో కూర్చొని గోళ్లు గిల్లుకోకుండా (అసమ్మతిలోజేరి దాన్ని యెగదోయకుండా!). 

ఇందిరకీ, ఆ 20 కీ జై!