Sunday, May 29, 2011

"మా" లాలిగాడు...........వాడి "బదారు పువ్వులు"!

"లాలిగాడు"! కొంతమంది "లాల్ గాడు"; "లాలుగాడు" ; "లల్లీగాడు" అనికూడా పిలిచే వాడి పేరు (గాడు మినహా) వాళ్లమ్మా నాన్నా పెట్టారోలేదోగాని, "వాడు" కులరీత్యా మాలవాడు; వృత్తిరీత్యా యాదవుడు--గో, మహిష (గేదెలని ఇలా అనచ్చా?!) పాలుడు! (లాలూ ప్రసాద్ యాదవ్ కి వీడి పేరే పెట్టారేమో తెలీదు.)

మా వయసు యేడెనిమిదేళ్లప్పుడు, వాడి వయసు మొదటి ముఫ్ఫైలలో అనుకుంటా! 

ఓ బ్రాహ్మణ భూస్వామి పొలంలోని కళ్లంలో ఓ పాకవేసుకొని, కాపలా నిర్వహిస్తూ, ఆయన ప్రోద్బలంతోనే, ".....పాల" వృత్తిని స్వీకరించాడు......యెప్పుడో తెలీదు. తెల్లవారుతూనే లేచి, ఓ నాలుగు కిలోలు నడిచి, గోదావరి వొడ్డువరకూ వెళ్లి, అక్కడనించి వాళ్ల భూస్వామి గారి ఆవులనీ, గేదెలనీ తోలుకొంటూ, దారిలో మిగిలినవాళ్ల పశువులని కూడా తోలుకొంటూ, తన "ఇంటి" దాకా తీసుకెళ్లి, పగలంతా ఆ చుట్టుప్రక్కల మేపి, సాయంత్రానికల్లా మళ్లీ తోలుకొంటూ, యెవరి పశువులని వాళ్లకి అప్పచెప్పేవాడు.

విశేషమేమిటంటే, వూరి జనాలెవరూ "గడియారాలు" చూడవలసిన అవసరం వుండేదికాదు. వాడి "మంద" మా యింటిదాకా వచ్చేసరికి వుదయం ఖచ్చితంగా 9.00; సాయంత్రం శీతాకాలమైతే 3.00, వేసంకాలమైతే 4.00!

ఇంక, వర్షాలు వెనకబట్టగానే, దగ్గరలోని మెరకలో, స్వయంగా రాగిడిమట్టితో ఇటుకలు తీసి, యెండాక "ఆఁవ" వేసి, వ్యాపారం చేసేవాడు. యేదో వేణ్నీళ్లకి చన్నీళ్లు! వాడికి భార్య వుండేది. సంతానం సంగతి తెలీదు. ఆవిడకూడా వాడికి సహకారం అందించేది--మట్టి తొక్కీ, నీళ్లు కలిపీ, యెండిన ఇటుకలని పేర్చీ, కాల్చడానికి సరిపడా పుల్లలూ అవీ సేకరించీ--ఇలా "కార్యేషు దాసీ......" వగైరాల్లా!

ఇంక, దసరాలకీ, అట్లతద్దికీ, పగటివేషాలు వేసేవాడు. ఇంటింటికీ తిరిగి, యెవరేమిస్తే అవి తీసుకొనేవాడు. దసరాల్లో వచ్చినవాటితో పేదలకి "అన్నదానం" చేసేవాడు! అట్లతద్దికి వచ్చినవి, గొంతెమ్మ పండుగకి ఖర్చుచేసేవాడు! (మిగిలినవాళ్ల మందిరాలు సామాన్యంగా వుంటే, లాలిగాడి మందిరం ప్రత్యేకంగా మెరిసిపోయేది!)

వాడు వేసిన వేషాల్లో నాకు గుర్తున్నవి రెండే రెండు--ఒకటి కాళిక వేషం, రెండోది అర్థనారీశ్వరుడి వేషం!

వాడి వెనక ఇద్దరో ముగ్గురో డప్పులవాళ్లూ, ఓ హార్మణీవాడు కూడా వచ్చేవారు. మాఇళ్లకి ఓ ఫర్లాంగు దూరం వాడొచ్చాడంటేనే, పిల్లలందరూ పొలోమంటూ "లాలిగాడొస్తున్నాట్ట" అంటూ పరిగెత్తేవాళ్లం--యేవేషం వేశాడో చూద్దామని! 

కాళిక వేషం వేశాడంటే, మేకప్పు యెలా చేసుకొనేవాడో వూహించలేముగానీ, నోట్లోంచి భయంకరంగా వ్రేళ్లాడుతున్న, రక్తం బొట్లు కారుతున్న, యెర్రని నాలుకా, ప్రక్కన తెల్లని కోరలూ, ఓ మెరుస్తున్న అట్ట కిరీటం, బానపొట్టా, నల్లటి గౌనుతో దుస్తులూ, వంటిచుట్టూ ఆకులూ, కొమ్మలూ, ఓ చేతిలో ఓ త్రిశూలం, ఇంకో చేతిలో ఓ కల్లు ముంతా! (నిజంగానే కాళికాదేవి రాక్షసుల రక్తం, కల్లూ తాగేదిట!)

విపరీతమైన ఆవేశంతో చిందులు చేస్తూ వచ్చేసేవాడు....వాడి నడుంచుట్టూ ఓ బలమైన త్రాడు కట్టి, దాంతో వెనక్కి లాగేవాడు ఒకడుండేవాడు! (వాడి ఆవేశం లో నిజంగా "కల్లు" పాత్ర కూడా వుందని అనుకొనేవారు జనాలు! అది నిజం భక్తి తో వచ్చిన పూనకమో, కల్లు మహాత్మ్యమో యెవరికీ తెలీదు!) చంటి బిడ్డ తల్లులు వాళ్లకి తమ కొంగులు కప్పేసేవారు.....తాము చూడకుండా వుండలేరు కాబట్టి.....పిల్లలు దడుచుకుంటారేమోనని! మేమైతే, వాడో అడుగు ముందుకు వేస్తే, కెవ్వుమని అరచుకుంటూ నాలుగడుగులు వెనక్కి వేస్తూ, అలాగే అనుసరించేవాళ్లం.

ఇంక అర్థనారీశ్వర వేషం వేస్తే, (మామూలుగా వాడెప్పుడూ జుట్టూ, గడ్డం, మీసం గొరిగించుకున్న దాఖలాల్లేవు.....వాటంతట అవి వూడిపోవడమే! మాకు తెలిసేటప్పటికి తన జుట్టు చక్కగా పిలక జడ వేసుకొని, నెత్తిమీద చుట్ట చుట్టి, పైన తలపాగా కట్టేవాడు. మెలిత్రిప్పిన మీసాలూ, చిన్న పిల్లి గడ్డం లాంటిదీ కూడా వుండేవి.) జుట్టుని మధ్యపాపిడి తీసి దువ్వి, శివుడి పోర్షనుని చుట్టచుట్టీ, రెండో వైపుని వాలుజడ అల్లి, పువ్వులు కుట్టుకొనీ, సగం మీసం, సగం గడ్డం గొరిగించుకొనీ, ఓ నల్లటి బట్టని వాడి దేహంలో సగభాగం కప్పేలా తలపైనుంచి వ్రేళ్లాడేసుకొనీ, ఓ వైపు సగం రవికా, కాలికి చీరా చుట్టుకొని, రెండో వైపు చాతీ అనాఛ్ఛాదితంగా, మొలకి గేదె చర్మం చుట్టుకొని, శివుడి వైపు నెత్తిమీద మెరుస్తున్న ఓ అట్ట నెలవంకా, ఆ పైన నెత్తికి చిల్లు పెట్టిన ఓ రబ్బరు ఆడపిల్ల బొమ్మా, దానికి క్రింద చిల్లులోంచి ఓ రబ్బరు గొట్టం, ఆ గొట్టం చివర, చంకక్రింద ఓ రబ్బరుబ్లాడరూ, దాంట్లో నీళ్లూ! అదీ వాడి వేషం. తలపై వ్రేళ్లాడే గుడ్డని కాసేపు శివుణ్ని కప్పుతూ, కాసేపు పార్వతిని కప్పుతూ, నటించేవాడు!

మా సరదా యేమిటంటే, ప్రతీ యింటిముందూ వాడు కాసేపు ఆడగానే, వాళ్లిచ్చినది తీసుకొని వెళ్లిపోబోతూంటే, "లాలీ! గంగని వదులు!" అని అరిచేవాళ్లం. తన చంకలోని బ్లాడరుని ఓ సారి వత్తితే, కొప్పులోని బొమ్మ నెత్తిమీంచి ధార పైకి చిమ్మేది!

చిత్రమేమిటంటే, వాడోసారి తనచేతిలోని పెద్ద బాణాకర్ర చుట్టూ ఓ కాలు మెలివేసుకొని, కుంటుకుంటూ, గుండ్రాలు తిరుగుతూ డ్యాన్సు చేస్తూ అడుక్కోడానికి వస్తే, మా తాతగారు వాణ్ని గుర్తుపట్టలేదు. "చెయ్యి ఖాళీలేదు. పైకెళ్లు" అన్నారాయన! వాడు "పైకెళ్లమంటే పోతామేటండి?" అన్నాడు కొంచెం వెకిలిగా పళ్లు బయటపెట్టి. అంతే.....ఆయనకి చిర్రెత్తుకొచ్చి, తనచేతిలోని పెద్ద కర్రతో వాడిమీదకి వొంటికాలిమీద వెళుతూ, "భడవకానా....." అంటూ వొకటి వెయ్యబోయారు. "....అయ్ బాబోయ్! నేనండి...." అంటూ తనవేషం కొంచెం తొలగించి చూబించేసరికి, మా తాతగారు మళ్లీ "భడవకానా! నువ్వట్రా!" అని నవ్వుతూంటే, మా ఇంటిల్లపాదీ వొకటే నవ్వు! తరవాత వాడెప్పుడు కనిపించినా, ఆయన "భడవకానా" అంటూనే, చేతిలోయెంతవుంటే అంతా వాడి చేతిలో పెట్టేసేవారు! అంత సహజంగా వుండేవి వాడి వేషాలు.

ఇంక "బదారు" సంగతి యేమిటీ అని విసుక్కొంటున్నారా! అక్కడికే వస్తున్నా!   

(.......మరోసారి!)

Saturday, May 28, 2011

"లాభసాటి...........వ్యాపారాలు"

వెండీ, బంగారం, ఇతర లోహాలూ, పప్పులూ, వుప్పులూ, ఆయిల్లూ, ఇతర కమోడిటీలూ, షేర్లూ, డెరివేటివ్ లూ, రియల్ ఎస్టేట్.....ఇవేవి కాదు....ఇవాళ లాభసాటి వ్యాపారాలు రెండే రెండు--రాజకీయాలూ, భక్తీ!

రాజకీయాలగురించి యెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది; భక్తి గురించి యెంత యెక్కువ మాట్లాడినా యెవడూ లెఖ్ఖచెయ్యడు!

ఇవాళ (27-05-2011) ఈనాడు ప గో జి ఎడిషన్లో మెయిన్ హెడ్డింగ్--"లక్ష తమలపాకు అర లక్ష". అంటే ఒక్కో ఆకూ 0.50 పైసలు!

మా చిన్నప్పుడు, మిగిలిన కులాలవాళ్ల సంగతేమోగానీ, బ్రాహ్మణ ఇళ్లల్లో, యెంత పేదవారైనా, చందన చర్చలూ, తాంబూల చర్వణాలూ వుండేవి. (చదవండి శ్రీపాద వారి రచనలు.)

చందనం సంగతి ప్రక్కనపెడితే, మా చిన్నప్పుడు (శ్రీపాదవారి చిన్నప్పుడు కాదుస్మీ!) ఓ మోద తమలపాకులు అంటే 150 ఆకుల లెఖ్ఖ. మోద పదిహేను పైసలు. అంటే 10 ఆకులు ఓ పైస. మరీ సరుకు లేకపోతే, మోద పావలా! ఆకులని అరటి తడపలలో చుట్టి, ఆరారగా తడుపుతూ, తాజాగా వుంచుతూ, మనం కొన్నాక కూడా మరోసారి తడిపి మన చేతుల్లో పెట్టేవాళ్లు! 

అవీ, వయోవృధ్ధుడి అరచేయి పూర్తిగా చాపితే యెంత వుంటుందో అంత సైజులో, (ముదిరిపోయి, ముట్టుకుంటే పిట్లిపోయేవి కాదండోయ్!) వయసులో వున్న ఆడవారి అరచేతులంత మృదువైన లేత తమలపాకులు! ఓ మోద తెచ్చుకొంటే, నెల్లాళ్లూ భార్యా భర్తలిద్దరికీ సరిపోయేవి. 

భోజనమయ్యాక, పడక మంచమ్మీద చేరి, ఆకులకి సున్నం రాసి, మధ్యకి మడిచి, సున్నితంగా క్రింది చివళ్లు త్రుంచి, తొడిమనుంచీ ఈనెలని తొలగిస్తూ ఆకుని రెండుగా విభాగించి, కాస్త పచ్చ కర్పూరం, రెండు కుంకంపువ్వురేకలూ, కొంచెం కుజానా పువ్వూ విదిల్చి, కొంచెం వక్కపొడివేసి, చిలకచుట్టి, వ్రేళ్లకి తగిలించుకొని, భర్తకోటి నోటికందించి, తానోటి నోట కరచుకొని.....ఇలా....ఓహ్!  (మా అమ్మకి నేను యెడపిల్లాడిగా వున్నప్పుడు, ఆ సమయంలోకూడా అమ్మ ప్రక్కనే వుంటే, మానాన్న తన నోట్లోంచి "తమ్మి" నేరుగా నా నోట్లో పెట్టి, పోయి ఆడుకో అనేవారు!)   

ఇప్పుడు మోద అంటే 100 ఆకులేనట! అవీ, మొదటి నాణ్యత ఆకులు (పైన చెప్పినంత మృదువైనవీ లేతవీ కాకపోయినా, ఒకే సైజు వుండేవి) మోద 300 నించీ 450 వరకూ మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక మొదలైన రాష్ ట్రాలకి యెగుమతి అయిపోతాయట. (అక్కడ అసలైన శివసేన, బీజేపీ మార్కు హిందువులుంటారట. అక్కడ అవి యెంతకు అమ్ముకుంటున్నారో మరి!)

మొన్నటి వర్షాలవల్లా, వరదలవల్లా రోజుకి కేవలం 100 లారీల సరుకే యెగుమతి అవుతూందటకానీ, ఇంతకు ముందు రోజూ 300 నించి 400 లారీల సరుకు యెగుమతి అయ్యేదట!

రైతులు తమ పంటకి పెట్టుబడి కూడా రావడంలేదు అని యెంతొస్తే అంతకి తెగనమ్ముకుంటుంటే, దళారులు బాగుపడుతున్నారట! (ఇది అన్ని పంటలకీ సామాన్యమే కదా??--అర్థాంతరన్యాసం!)

చెప్పొచ్చేదేమిటంటే--మాకు తెలిసినవాళ్లమ్మాయి ఒకావిడ యేదో నోము పట్టి, ప్రతీరోజూ కొంతమంది దంపతులకి తాంబూలాలు ఇచ్చి, వాళ్ల కాళ్లు మ్రొక్కి, ఆశీర్వాదం తీసుకొంటుంది--తన సౌభాగ్యం కోసం. 

రిటైరయిపోయి వున్న నేనూ, కేవలం గృహిణి అయిన మా ఆవిడా యెప్పుడూ తనకి అందుబాటులో వుంటాం. వుద్యోగులైన మా తమ్ముడూ, మరదలూ సెలవు రోజుల్లోనే అందుబాటులో వుంటారు. మొన్న మా ఆఖరి తమ్ముడూ మరదలూ ఎల్ టీ సీ మీద వచ్చి ఓ 20 రోజులుంటే, ఆవిడ యెంత సంతోషించిందో--ఒకే ఇంట్లో ముగ్గురు జంటలు దొరికారు అని!

విషయమేమిటంటే, ఓ రోజు తాంబూలాలు యథావిథిగా ఇచ్చేసి, "పిన్నిగారూ! తమలపాకులు యెంతరేటు పెట్టినా దొరకడంలేదు. మీకిచ్చినవి దయచేసి మీ ఫ్రిజ్ లో పెట్టి, మళ్లీ నేనడిగినప్పుడు ఇవ్వండీ! ప్లీజ్!" అంది. 

కళ్లనీళ్ల పర్యంతమైన మా ఆవిడ "దానికేం భాగ్యం అమ్మా! అన్నీ దాస్తాను. నీకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్లు!" అని హామీ ఇచ్చేసింది.

ఇంకో రెండు మూడు రోజులుపోయాక, మా ఆవిడ "యెంత ఫ్రిజ్ లో పెట్టినా, కరెంటు పోతూండడంతో కొంచెం వాడిపోతున్నాయమ్మా. కావాలంటే ఇవాళ తీసుకెళ్లు. లేకపోతే యేమీ చెయ్యలేను" అన్న మా ఆవిడతో, "సరే ఇచ్చెయ్యండి పిన్నిగారూ" అని ఓ యెనిమిదో పదో ఆకులు తీసుకొని, తన బ్యాగ్ ఓ సారి తడిమి ఓ అర్థరూపాయి మా ఆవిడచేతిలో పెట్టింది!

"అదేమిటీ?" అంటే, "ఆకులు ఫ్రీగా తెస్తే వ్రతఫలం దక్కదు! అందుకని...." అందావిడ.

మా ఆవిడ, "బాగుందమ్మ! ప్రతిఫలం ముట్టింది!" అంటూ ఆ అర్థరూపాయిని ముద్దుపెట్టుకొంది నవ్వుతూ!

(అంతకు ముందోవారం క్రితం, "పిన్నిగారూ! అరటిపళ్లు దొరకటంలేదు....మీ వీధిలోకొస్తే ఓ రెండు డజన్లు కొనిపెట్టండి. నేను తీసుకొంటాను యెంత రేటైనా" అంటూ, "ప్రస్తుతానికి తాంబూలంలో యెండు ఖర్జూరాన్ని వుంచి ఇస్తున్నాను. యేమీ అనుకోకండి. పండుకి అదే ప్రత్యామ్నాయమట. కానీ, తాంబూలంలో అరటిపండు పెట్టి ఇస్తేనే తాంబూలం ఇచ్చినట్టు ఓ తృప్తి!" అంటూ నిట్టూర్చింది!)

ఇది జరిగిన, జరుగుతూన్న, జరగబోతున్న కథ! సరే.

నిన్ననో మొన్ననో అక్కడెక్కడో, అభయాంజనేయస్వామికో, భయాంజనేయ ప్రసన్నానికో, యెవరికో "లక్ష తమలపాకుల పూజ" చేశారట. 

వాడెవడో వొళ్లు బలిసిన భక్తుడు, లక్ష (చిన్నా, చితకా సైజులవి కలుపుకొని) తమలపాకులనీ, ఓ యాభై వేలకి కొని, (లక్షా ఒకేచోట దొరకవు కాబట్టి అనేక వూళ్లలో అనేకమందినుంచి సేకరించి, 'నా స్వంతం కోసం కాదు....స్వామి పూజకోసం' అంటూ డబాయించి బేరమాడి, ఆకుకి ఓ పైసో, అరపైసో తగ్గించమని బ్లాక్ మెయిల్ చేసి మరీ) ఆ స్వామికి పూజ చేస్తే, లాభం యెవరికి? ముక్తీ, మోక్షం యెవరికి?

(ఇంకా "హనుమజ్జయంతి" సందర్భంగా, శుక్రవారం (27-05-2011 న) యెన్ని లక్షల తమలపాకులతో ఆయనని పూజించారో శనివారం పేపర్లు చూస్తేగానీ తెలీదు).

నిన్ననే, ప గో జి, కాళ్ల మండలం, సీసలి గ్రామంలో, షిర్డీ సాయి పాలరాతి విగ్రహానికి యేకంగా 1,110 కిలోల (ఇదివరకు వెయ్యి కిలోలు విన్నాం--మరి ఈలెఖ్ఖేమిటో? చివర యెనిమిది చేర్చలేదెందుకో ఆ వె పం లు!) బియ్యంతో వండిన అన్నంతో "అన్నాభిషేకం" నిర్వహించారు. పత్రికల్లో ఆ ఫోటోలు--అన్నంతోపాటు అవేవో పూలో, పిండివంటలో--సహితంగా బాబా విగ్రహం తలమీదనించి పోసేస్తున్నట్టు ఫోటోలు కూడా ప్రచురించారు పత్రికల్లో!

(ఈ లెఖ్ఖలు ఇలా 18 నించీ 108 కీ, 1080 కీ, నూటపదహార్లకీ, వెయ్యినూట పదహర్లకీ--ఇలా పెరగడం చూస్తుంటే, మా లాలిగాడూ, వాడి "బదారు" పువ్వుల వైనం గుర్తొస్తోంది! ఆ వైనం మరో టపాలో.)

ఆ తరవాత ఆ అన్నం యెవరైనా తినడానికి యోగ్యంగా వుందో, లేదో! మరి ఆ అన్నాన్ని యేమి చేశారో!

అదీ భక్తంటే!

భక్తి వ్యాపారులూ జిందాబాద్!

Friday, May 13, 2011

ఐదు రాష్ ట్రాల.....యెన్నికలూ......కొన్ని 'వుప.....'లూ

"రాజుగారివీ, నావీ కలిపి వెయ్యి ఆవులు" అన్నాట్ట వెనకటికి ఓ 'గో' 'పాల' మిత్రుడు! ఆరా తీస్తే చెప్పాడట, "ఆయనవి 999, నా గుడ్డి ఆవు వొకటీ" అని! ముగ్గురు ముసలి మూర్ఖులు ఇంకా నోరు విప్పినట్టు లేదు కానీ, వాళ్లకన్నా కొంచెం చిన్న మూర్ఖులు, మూర్ఖిణులూ కొంతమంది ఐదింట్లో "న్నాల్లుగ్గు" రాష్ ట్రాల్లో జయకేతనం యెగరేసి, ప్రభుత్వం స్థాపించబోతున్నాం! అని ప్రకటించేశారు.

జగన్ కి కనీవినీ యెరుగని మెజారిటీ వచ్చింది--అదీ పార్లమెంట్ యెన్నికలో ఐదులక్షల నలభై అయిదు వేల చిల్లర! విజయమ్మ కి 85 వేల చిల్లర! 

"ఇది మేము ముందుగా వూహించినదే!" అంటున్నారిప్పుడు.

(వీళ్లకి సిగ్గూ యెగ్గూ వుంటే వాళ్లు......వాళ్లే యెందుకవుతారు?)

మరి నెల్లాళ్లనుంచీ, వాళ్ల మంత్రులందరూ కోట్లకొద్దీ పార్టీ డబ్బూ, సొంత డబ్బూ, దొంగడబ్బూ ఖర్చుపెడుతూ యేమి పీకారో? 

ముందుగా ప్రజలతో సంబంధంలేని (అధిష్టానం చేత రుద్దబడిన) మన ప్రజా ముఖ్యమంత్రి పదవికి మూడుతుంది....జగన్ నుంచో, టీడీపీ నుంచో కాదు.....అహ్మద్ పటేల్, గులాం నబీ, వీరప్ప మొయిలీ, రాహుల్, సోనియా ల నుంచి!

ఇంక కేంద్రంలో, యూపీయేకి క్రొత్తరకం కష్టాలు పుట్టుకొస్తాయి.....మింగలేరు, కక్కలేరు.....కరుణా వాళ్లని వెళ్లగొట్టలేరు, వుంచుకోలేరు! 

కమీనిష్టోళ్లయితే, మళ్లీ యూపీయేలో చేరినా చేరవచ్చు......"అవినీతిగురించి ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ఆమోదించినందుకు" అనే వంకకాని డొంకతో!

జగన్ కి నా సలహా వొక్కటే.....కుంభస్థలాన్ని కొట్టు....నీకు మంత్రి కావాలంటే, "ఢిల్లీ సుల్తాన్, పట్టుకుపోతాన్...." అనడానికి సిధ్ధంగా వున్న "యుగంధరులు" సిధ్ధంగా వున్నారు! అని.

సరేగానీ, "భారతీయుడిగా జన్మించినందుకు సిగ్గుపడుతున్నాను" (ఇటలీ అమ్మకి పుట్టినందుకు గర్విస్తున్నాను, భారతీయుడు 'కాని' తండ్రికి పుట్టనందుకు చింతిస్తున్నాను.......అన్నాడో, అనుకున్నాడో తెలీదు) అన్నవాణ్ణి భారతీయులెలా సహిస్తారో చూడాలి. ఆవేశంలో అన్నాను అనో, మీడియా వారు వక్రీకరించారు అనో బుకాయించడం కూడా చెయ్యలేదు ఇప్పటివరకూ వాడు.

నిన్నటివరకూ, 2014 లో వాణ్ణి ప్రథానమంత్రిని చెయ్యడమే మా ధ్యేయం అన్నవాళ్లు ఇవాళ నుంచి యే మొహం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతారో మరి?

అసలు వాడు రాష్ట్ర ప్రభుత్వం కళ్లుగప్పి, భద్రతా నియమాలని వుల్లంఘించి, అక్కడకి వెళ్లడం యెందుకూ, ధర్ణా పేరుతో అరెష్ట్ చేయించుకోడం యెందుకూ, మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం వాణ్ణి బెయిలుపై విడుదల చేయించి, "పటిష్ట భద్రతతో" ఢిల్లీ పంపించడం యెందుకూ? ఇంతకన్నా చౌకబారు రాజకీయం వాడికెవరూ నేర్పలేదేమో మరి!

ఈలోపల వాణ్ని యే ముజాహిదీన్ వాడో వేసేస్తె, "దేశం కోసం 'నిస్వార్థంగా' త్యాగం చేసిన గాంధీ-నెహ్రూ కుటుంబం నాలుగోనో, ఐదోనో తరం వ్యక్తి" అని పోస్టర్లు వేసేసి, 2014 లో యే ప్రియాంక కొడుక్కో ప్రథాన మంత్రి పదవి కట్టబెట్టెయ్యొచ్చు అని వెనకున్న వాళ్ల ఆలోచనేమో! (పాపము శమించుగాక!)

యెంతబాగుందో....ఇంకెంతబాగుండబోతోందో....భారత రాజకీయం!

యెలక్షన్లయిపొయాయికాబట్టి, వుద్యమం వుధ్ధృతం చేస్తాడట.....బొర్రముక్కోడు! ఇంకో వందో, పదివేలో "ఐకాస"లు యేర్పాటు చేసుకుంటూ పోతాం....జీతాలు తీసుకొంటూ పని చెయ్యని నాలాంటి వాళ్లందరితో అంటున్నాడు కోదండోడు. (అలాంటి వాళ్లని బెదిరించడానికి వో జీవో ఇచ్చి, థూ నా బొడ్డు అన్నాడు మన ము. మం.) యాదవకులంలో ముసలంలా పుట్టాడు నాగం. అందరూ గురివెందలే మరి! ఇంక రాష్ ట్రంలో అపోజిషన్ యెవరో? కి కు రె తరవాత.....అరాచకమేనా?)

వెండితెరపై చూద్దాం!

Saturday, May 7, 2011

ఆత్మ…..-2…..శాంతి 

ఇంక, దేహాన్ని వీడిన ఆత్మ ప్రయాణం యెలా సాగుతుంది? అది భువర్లోకంలో యెంతకాలం వుండాలి?

ఇంగ్లీషువాళ్లు మనకి అంటకట్టినవి—“మే హిజ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్”—వాడి (ఆయన) ఆత్మకి శాంతి కలుగు గాక! లాంటివి!

ఆత్మకి శాంతి యెప్పుడు కలుగుతుంది? “ప్రేతశ్చ దహంచైవ తాపోపశమనార్థం” అంటూ, ఆ ఆత్మని అవాహన చేసిన బొమ్మరాయికి (గులక రాయికి) వుదకంతో (నీళ్లతో) అభిషేకం చేసి చల్లబరచినప్పుడే. (ఖననం చెయ్యబడ్డవాళ్ల ఆత్మలకి మంత్రం కొంచెం మారుతుంది కానీ, పధ్ధతి వొకటే)

సరే. ఆ ఆత్మ చల్లబడి, (శరీరంలో యే రంధ్రంలోంచీ మళ్లీ చొరబడలేక), ఆ చుట్టుప్రక్కలే తిరుగుతూ వుంటుంది. 

కర్మ చేసే వ్యక్తి, “నిత్యవిధి” చేస్తూ, (వుడకేసిన అన్నాన్ని, ఆ ఆత్మకి నైవేద్యం పెడుతూ, దాన్ని ప్రతీరోజూ కాలవ/నది లో కలిపేస్తూ) ఆ నీటిని భూశయనం చేసిన ప్రదేశంలో పైన కట్టిన ఆ”పిడత”లో పోస్తూ, ఆ నీళ్లు చుక్క చుక్కగా ఆ ప్రదేశం పై పడుతుంటే, ఆ ఆత్మ నెమ్మది నెమ్మదిగా ప్రయాణం ప్రారంభిస్తుంది—పైకి—అంటే “భువర్లోకానికి”. 

ఆ మధ్యలో యెన్నెన్నో అడ్డంకులు—“వైతరణి” లాంటివి! “పుత్” అనే నరకం లాంటివి! (అపుత్రస్య గతిర్నాస్తి!). 

దానికోసం, “గోదానం” చేస్తే, ఆ గోవుతోక పట్టుకొని, జీవుడు వైతరణిని దాటుతాడు(ట). ఆ దానం పుత్రులే చెయ్యాలి. “పున్నామ నరకం” దాటాలంటే, పుత్రులే కావాలి. కాబట్టే “అపుత్రస్య……”.

ఈ లోపల, మనకి ఓ నెల ఐతే, ఆత్మలకి ఓ రోజు(ట). అందుకనే “మాసికాలు” పెడతారు. (త్రైపక్షికాలు అంటే, 45 రోజులకి పెట్టేవి—అంటే టిఫిన్లలాంటివేమో నాకు తెలీదు). అలా 12 మాసికాలు పెట్టేటప్పటికి, ఆత్మ 12 రోజుల యాత్ర పూర్తిచేసుకొని, తన పూర్వీకులని చేరుకొంటుంది(ట).

13వ రోజున, ఆ ఆత్మని (జీవుడిని) మంత్రసహితంగా, వాడి ముత్త ముత్తాత ఆత్మతో “సపిండీకరణం” చేస్తారు. అప్పటికి వాడి ముత్త ముత్తాత స్వర్లోకానికి గమించినట్టే! అక్కడినించీ, తన ముత్తాత (తాత తండ్రి); తాత (నాన్న తండ్రి) నాన్న (తండ్రి) కి “పిండాలు” పెడితే సరిపోతుంది.

ఆత్మ భువర్లోకానికి చేరాక, మనకి ఒక సంవత్సరమైతే, వాళ్లకి ఓ రోజు(ట). అందుకని, సంవత్సరానికొకసారి “తద్దినాలు” పెడతారు. ఆ రోజున, “పితృ, పితామః, ప్రపితామః” లకి పిండాలు పెట్టి, అవి ఓ కాలవలో కలిపెయ్యడమో, ఓ ఆవుకి పెట్టడమో చేస్తే, వాళ్ళు ఆ ఆహారాన్ని నేరుగా తిన్నట్టే భావిస్తారు. ఇంకా ఓ పిడికెడు అన్నాన్ని “భోక్తల” కి వడ్డించే ముందు తయారు చేసి, ఆ ముద్ద (పిడచ)--తంతు ముగిశాక, ఓ యెత్తైన ప్రదేశంలో పెట్టి, ఓ కాకి ఆ పిడచని తినాలని యెదురు చూస్తారు. అలా యే కాకీ రాకపోతే, ఆయనకి ఇంకా తీరని కోరికలు వున్నాయనీ, అవి తీరుస్తామనీ మ్రొక్కుకొంటారు. (పియ్యి తినెడు కాకి పితరుడెత్లాయెరా? అని వెక్కిరించాడు వేమన!)

భోక్తలు (అంటే భోజనం చేసేవాళ్లు) ఇద్దరుంటారు. ఒకళ్లని “విశ్వేదేవతల” ప్రతినిధి గానూ, ఇంకొకరిని పితృ దేవతల ప్రతినిధిగానూ ఆవాహన చేసి, తృప్తిగా భోజనాలు పెడతారు—పెసర ముద్ద పప్పూ, నాలుగు కూరలూ, నాలుగు పచ్చళ్లూ, చారూ, గారెలూ, ఇంకా వోపిక వుంటే బూరెలూ, అరిశెలూ, (వాటిన్నింటికీ సరిపడా ఆవునెయ్యితో), అన్నం పరమాన్నం, పెరుగూ తో. (వంటకాల్లో వాడవలసిన కూరలూ, పదార్థాలకి కొన్ని నిషేధాలు వున్నయి. అవి వాడరు.)

అలా ప్రతి సంవత్సరం (అంటే వాళ్లకి ప్రతి రోజూ) పితృ దేవతల ఆకలి తీరుస్తారు.

(ఈ విషయమ్మీద ప్రస్తుతానికి టపాలు ముగిద్దామనుకొంటున్నా--మిగతా టపాలు వెనకబడుతున్నాయని. మళ్లీ యెవరైనా అడిగినప్పుడో, నాకు సమయం దొరికినప్పుడో మళ్లీ కొనసాగిస్తాను.)

అందుకే………మరోసారి.

Sunday, May 1, 2011

అంత్యక్రియలు అనే.....4ఆచారాలు

శైవ మతస్తులు--బ్రాహ్మణులూ, సాలి, కంసాలి, రజక మొదలైన కులస్థులు--మరణం సంభవించగానే, దేహాన్ని వీలైనంతవరకూ పద్మాసన స్థితిలో కూర్చోబెట్టి, రావలసిన వాళ్లందరూ వచ్చాక, వెదురు కర్రలతో ఓ మందిరం కట్టి, దానికి రంగు కాగితాలతో అలంకరించి, దేహాన్ని అందులో కూర్చోబెట్టి, తల ముందుకు వాలకుండా వెనక ఓ గుంజకి త్రాళ్లతో కట్టి, వాహకులు అంతిమ యాత్ర నిర్వహించేవారు, బుక్కా చల్లుతూ (బుక్కాతోపాటు పువ్వులూ, చిల్లర పైసలూ పైకి యెగరేసేవారు కొంతమంది), వాయిద్యాలతో (అవి వాయించే పధ్ధతిని "చావు డప్పులు" అనేవారు). తరవాత అదే స్థితిలో "ఖననం" చేసేవారు (మందిరం మినహా). 

(చాలా వూళ్లలో 'శైవ కులస్థుల శ్మశానాలు' వేరే వుంటాయి గమనించండి. ఈ మధ్య అవి--ఈ ఆచారం చాలా మటుకు అంతరించడంతో--ఆక్రమణలకి గురి అయ్యాయని ఆందోళనలు సైతం జరుగుతున్నాయి!) 

మా తెలుగు మేష్టారొకాయన యేదైనా ప్రశ్న వేసినప్పుడు యెవరైనా తలను అటూ, ఇటూ వూపుతుంటే, "కంసాలి శవం లా యేమిటా బుర్ర వూపడం--నోరు విప్పి యేడువు!" అని తిట్టేవారు.

క్రిస్టియన్లు, దేహాన్ని ఓ తెల్ల వస్త్రంలో చుట్టి, (వీలైనంతవరకు "మమ్మిఫై" చేసి), శవపేటికలో వుంచి, శవపేటికకి చుట్టుప్రక్కల రంధ్రాలు చేసి, ఆ శవపేటిక పళంగా సమాధి చేస్తారు. మృతుడికి సంబంధించిన ఆడవాళ్లు కూడా ఈ "బరియల్" ని చూస్తారు. 

మహమ్మదీయులైతే, మూతతో వున్న పల్లకీ లాంటి శవపేటిక (అందరికీ ఒకటే) లో దేహాన్ని మోసుకొచ్చి, అంతకు ముందే తవ్వి వుంచిన గోతిలో ఆ దేహాన్ని మాత్రమే (పేటిక కాకుండా) వుంచి, సమాధి చేస్తారు. ఆడవాళ్లు శ్మశానానికి వెళ్లరు. 

పార్శీలైతే, వాళ్ల ఆచారం ప్రకారం దేహాన్ని ఓ యెత్తైన కొండ మీదికి తీసుకెళ్లి అక్కడ వదిలేస్తారు(ట.)......గ్రద్దలకీ, రాబందులకీ ఆహారంగా.

ఇంకా కొన్ని దేశాల్లో, మతాల్లో వివిధ (వింతైన) ఆచారాలు వున్నాయట.

సిక్కులూ, బౌధ్ధులూ మొదలైనవాళ్ల గురించి పెద్దగా పైకి రాలేదు కాబట్టి మనకి తెలీదు.

శంకరాచార్యులవారు యేడేళ్లకే సన్యాసం స్వీకరించి, దేశమంతా పర్యటించి, అప్పటి సో కాల్డ్ పండితులనందర్నీ తన "తర్క, మీమాంస" శాస్త్రాల పాండిత్యంతో వోడించి, "దాసోహం" అనిపించుకొన్నాడు. హైందవాన్ని సంస్కరించాడు.

ఆమ్రపాలి ఆయనని "శృంగారం గురించి మీకేమి తెలుసు?" అని అడిగేసరికి, జవాబుకి ఓ సంవత్సరమో యెంతో గడువడిగి, అప్పుడే మరణించిన కాశీ రాజో యెవరో, వాడి దేహంలో (పరకాయ ప్రవేశ విద్యతో) ప్రవేశించి, 'తన అనుభవాలని ' ఆమెకి చెప్పి, ఆమెని కూడా జయించాడు(ట).   

తెనాలి రామలింగడు తన "తిలకాష్ట మహిష బంధనా"లతో అలాంటి కొంతమంది మహా పండితులని వోడించాడు.   

......మరోసారి.