Friday, September 30, 2011

డ్రామా....హై డ్రామా....హై హై డ్రామా! -- 7విచారణలు

మామూలుగా మనం మన సినిమాల్లో వినే "యూ ఆర్ అండర్ అరెస్ట్" అనే మాటల తరవాత, అమెరికాలాంటి దేశాల్లో ఆ మాటలన్న పోలీసు అధికారి కొన్ని మాటలు చెపుతాడు--అలా చెప్పకపోతే, అది రికార్డుకాకపోతే, ఆ అరెస్టు చట్టవిరుధ్ధం! 

ఆ మాటలు--"ప్రపంచంలో యెవరికైనా వొక్క ఫోన్ కాల్ మాత్రమే చేసుకొనే హక్కు మీకు వుంది. ఇక్కడనుంచీ, యేమీ మాట్లాడకుండా మౌనంగా వుండే హక్కు మీకు వుంది. ఇకనుంచీ మీరు యేమి మాట్లాడినా, దాన్ని మీకు వ్యతిరేకంగా కోర్టులో వుపయోగించబడే అవకాశం వుంది......" ఇలా! 

ఇవి దశాబ్దాలుగా చెప్పబడుతున్న స్టాండర్డ్ మాటలు. వాటికి ఓ అందమైన పేరుకూడా వుంది! అలాంటి అరెస్టులెక్కడా? గాలి అరెస్టులెక్కడా?! 

నిన్ననో మొన్ననో మా జిల్లా ఓ వూళ్లో, ఒకతన్ని పోలీసులు "ప్రశ్నించడానికి" అని పిలిపించి, డైరెక్టుగా కోర్టులో దింపి, న్యాయమూర్తిని అడగ్గానే అయన రిమాండు విధించాడట అతనికి. 

"హాత్తెరీ! నన్ను ఇలా మోసం చేస్తారా....ముందు చెపితే నేను బెయిలుకి యేర్పాట్లు చేసుకొనేవాణ్ని కదా? నేను జైలుకి రాను" అంటూ ఓ మూడు నాలుగు గంటలు వీరంగం చేశాడట! ఊహుఁ! ఇలాంటివి మనదేశంలో చెల్లుతాయా! 

చట్టం ప్రకారం అన్నీ పుస్తకాల్లో వున్నాయి....కానీ అరెస్టు చేసినా 24 గంటలలోపు మేజిస్ట్రేటు ముందు హాజరు పరచకపోవడం, యే శనివారం సాయంత్రమో అప్పుడే అరెస్ట్ చేసినట్టు హాజరుపరిచి, బెయిలు యేర్పాట్లు చేసుకోడానికి అవకాశం ఇవ్వకుండా, రిమాండు విధింపజేసి, ఆ మర్నాడు సెలవు కావడంతో, వెంటనే సెంట్రల్ జైలుకి తరలించడం....ఇలాంటి చిన్నెలు చాలా చేస్తారు పోలీసులు! 

మొన్నీమధ్యనే, వరల్డ్ బ్యాంక్ ఛెయిర్మన్ అనుకుంటా అదేదో హోటల్లో ఆరోపణలు యెదుర్కొంటే, ఆయన్ని అరెస్టు చేశారు. తరువాత విచారణలో ఆ ఆరోపణలు తప్పని ఋజువు అవగానే, విడుదల చేశారు! అలా సరైన న్యాయ విచారణ పధ్ధతులకి యెవరూ అతీతులు కారు...సాక్షాత్తూ ప్రథాన మంత్రి అయినా, అధ్యక్షుడైనా! 

మన సీబీఐ వారు మాత్రం, ప్రతీరోజూ వివిధ కేసుల్లో తమ దర్యాప్తులని "ముమ్మరం" చేసుకుంటూ పోతున్నారు--కొన్ని రీముల కాయితాల రికార్డులని తయారుచేసుకొంటూ పోతూ....."ఇంకా చాలామందిని అరెస్టు చేసే అవకాశం వుంది" అనికూడా చెపుతున్నారు! 

యెన్ని కొండలని తవ్వుతారో, చివరికి యెన్ని యెలకలని పడతారో! 

చూద్దాం!

Thursday, September 29, 2011

డ్రామా....హై డ్రామా....హై హై డ్రామా! -- 6విచారణలు

నాకో విషయం నవ్వొస్తూ వుంటుంది. గత నాలుగైదేళ్లుగా, ఈమెయిల్ వ్రాశాక ఓ తోక తగిలించడం ఓ ఫేషన్ అయిపోయింది--"అత్యవసరమైతేనే దీన్ని ప్రింటు తీసుకోండి--పర్యావరణాన్ని రక్షించండి" అనో యేదో! ఆహా! పర్యావరణమ్మీద హెంత మమకారం! అనుకోవాలి ఆ మెయిల్ చదివినవాళ్లు. 

తీరా చూస్తే, కంప్యూటర్లు వచ్చాక వాటికి సంబంధించిన చెత్త పెరిగిపోవడం సంగతి అటుంచి, రీములకి రీములు పేపరు వేస్ట్ అయిపోతూంది--యే ఆఫీసులో చూసినా! 

ఇంక ప్రభుత్వం చూస్తే, యెంత పేపరు దండగ అవుతూందో అంచనాలకి అందదు! 

వుదాహరణకి, "గాలి"కి బెయిలు ఇవ్వాలా వద్దా అనే అంశంపై సీబీఐ కోర్టులో ఓ వారం పైగా వాద ప్రతివాదనలు జరిగాయి అని విన్నాం. కోర్టుల్లో, న్యాయవాదులూ, జడ్జీలూ, ముద్దాయిలూ, సాక్షులూ యెవరేమి మాట్లాడినా, అవి రికార్డు చెయ్యబడతాయి. బెంచి క్లర్క్ కమ్ టైపిస్ట్ వెంట వెంటనే టైపు చేసేసి, రికార్డు చేసేసేవారు. ఇప్పుడు కంప్యూటర్లలో చేస్తున్నారేమో చాలా చోట్ల. మరి న్యాయవాదులు ప్రతీరోజూ చేసే వాదనలు యేరోజుకారోజు రికార్డు చెయ్యబడి, వాటిని సరిపోయినన్ని ప్రింట్లు తీసి, వలసినవారందరికీ అందజేస్తారు. అలా యెన్ని కాపీలు తీస్తారో వూహించుకోండి. 

ఇంక పాడిందే పాటరా అంటూ వారం రోజులపాటు, ప్రతీ రోజూ జరిగిన వాదనలని యెన్ని పేజీల, యెన్ని కాపీల ప్రింట్లు తీశారో వూహించుకోండి! 

వాదనలు ముగిసాక, తీర్పు.....వాదనల్లోని సారాంశాన్ని యథాతథంగా వుటంకిస్తూ, కొన్ని వందల పేజీలు వెలువరిస్తారు. మళ్లీ ఆ తీర్పుకి వలసినన్ని కాపీలు తియ్యలి. యెన్ని పేజీలు అవుతాయో వూహించండి!

ఇంకో వుదాహరణకొస్తే, సీబీఐ వారు విజయసాయిరెడ్డిని, దిల్ ఖుషా అతిథిగృహాన్ని తమ కార్యస్థానం చేసుకున్న రోజు నుంచీ, ప్రతీరోజూ వుదయం 9 నుంచి సాయంత్రం వరకూ, 23 రోజులుగా ప్రశ్నిస్తూనే వున్నారు అని చదివాము. ఇప్పటికి అది 30 రోజులు దాటిందేమో! 

ఆ ప్రశ్నించే విధానం యెలా వుంటుందంటే, ముందు ప్రమాణం తో మొదలవుతుంది. అక్కడనుంచి, ఓ ప్రశ్న అడగడం, దానికి ఆయన సమాధానం చెప్పడం, ఇవన్నీ తెల్లకాయితాలమీద 'రఫ్' గా రికార్డు చేస్తారు. ఆ రోజుకి పూర్తి కాగానే, అప్పటివరకూ తయారైన ప్రశ్న సమాధానాలని 'ఫెయిర్' గా తయారు చేసి, ప్రతీ పేజీమీదా ఆయన సంతకాలు తీసుకొంటారు! 

మధ్య మధ్యలో యే సిగరెట్టు కాల్చడానికో, పానో, బిస్కెట్లూ టీలకో కాస్త విరామం ఇచ్చినప్పుడు, అప్పటివరకూ వ్రాయబడ్డ రఫ్ నోట్స్ ఫెయిర్ చెయ్యడానికి వెళ్లిపోతాయి. బ్రేక్ తరవాత మళ్లీ ఓ ఫ్రెష్ కాయితం తో సిధ్ధం. 

ఆరోజు పూర్తైన ఫెయిర్ కాపీని ప్రశ్నించబడ్డవాళ్ల సంతకాలతో, వలసినన్నీ కాపీలు జెరాక్స్ తీయిస్తారు. 

ఇంకా, యెలాగైనా కావలసిన సమాధానాన్ని రాబట్టాలని, వేలికేస్తే కాలికీ, కాలికేస్తే వేలికీ వేస్తూ, అడిగిన ప్రశ్ననే అనేకవిధాలుగా మార్చి అడుగుతూ వుంటారు! మరి వీటన్నింటికీ రోజుకి యెన్ని "రీముల" కాయితాలు ఖర్చు అవుతున్నాయో వూహించగలరా?

పేపర్లో వచ్చే, ఫలానా కేసులో న్యాయమూర్తులు 8 వేల పేజీల తీర్పు ఇచ్చారు; ఫలానా కమిటీ 7 వేల పేజీల, 9 వాల్యూముల నివేదిక సమర్పించింది.....అని చదువుతాము కదా?  మరి అన్ని పేజీల/వాల్యూముల రిపోర్టులని యెన్ని పదుల/వందల కాపీలు తీస్తారో, అవి బుట్టదాఖలా అయి, ఇంకో తీర్పో, కొత్తకమిటీనో వేస్తే.....షరా మామూలే!

ఈ మెయిల్ తరవాత తోకని చూసి, హాయిగా, మనస్పూర్తిగా నవ్వుకోవడంలేదూ?

ఈ దేశాన్నీ, పర్యావరణాన్నీ బుర్రోవాదులనుంచి పరమాత్ముడే రక్షించుగాక!

Thursday, September 22, 2011

డ్రామా....హై డ్రామా....హై హై డ్రామా! -- 5గాలి మీద దర్యాప్తులు

అన్నట్టు, మొన్న అమర్ సింగ్ కిడ్నీలూ అవీ నిజంగానే పాడయిపోయి, నిమ్‌స్ లో చేరాడట. పాపం అపార్థం చేసుకున్నాము!

ఇంక గాలి బెయిలు విషయంలో "రెండురోజుల" వాదనలు అని వ్రాశాను. కానీ, "ఐదు"రోజులు వాదనలు జరిగాయట!

తీరా కోర్టు, సీ బీ ఐ కస్టడీకి పంపిస్తూ, ఆయన్ని తన లాయర్ల సమక్షంలోనే విచారించాలి అని చెప్పారాయె. 

వాళ్లేమో, లోపాయకారీగా అదేదో స్టేషన్ లాకప్పు సెల్ లో పెట్టి, యే అర్థరాత్రో వాళ్ల బుర్రల్లో యేదో మెరిస్తే, వెంటనే వచ్చేసి, ప్రశ్నించేస్తున్నారట. 'యేమో, నాకు గుర్తులేదు, గుర్తు తెచ్చుకొని చెపుతాను....' అంటే, సహకరించడం లేదు.....అడ్డగోలు సమాధానాలు ఇస్తున్నాడు....డొంకతిరుగుడుగా మాట్లాడు తున్నాడు....మా సహనాన్ని పరీక్షిస్తున్నాడు.....ఇలా యాగీ చేస్తున్నారు! 

"అవసరమైతే", నార్కో యెనాలిసిస్ కోసం ప్రయత్నిస్తారట....దానికీ ఆయన పర్మిషన్ కావాలని మరిచిపోతున్నారు! అయినా "ట్రూత్ సీరమ్" (అనబడే సోడియం పెంటథాల్) ఇస్తూ మాట్లాడించడం, వాళ్లు మాట్లాడిందాన్ని, "బిట్వీన్ ది లైన్స్" చదువుకొని, నిర్ధారణలకి వచ్చెయ్యడం, తీరా ఆ సాక్ష్యాలు కోర్టుల్లో చెల్లకపోవడం....ఇదంతా ఇంకో ప్రహసనం!

ఇంక ప్రతిరోజూ, "దర్యాప్తు వూపందుకొంది"; "ముమ్మరమైంది" అని విశేషణాలతో వార్తలు! ఇంతాజేసి యేమి ముమ్మరం అయ్యింది అంటే, ఇంకా కొన్ని వందలమందికి నోటీసులు ఇచ్చాము, ఒక్కొక్కళ్లనీ కొన్ని గంటలపాటు "విచారణ" చేస్తున్నాము....అంటూ చెప్పడం! అదీ నడుస్తున్న డ్రామా! 

ఇంక బళ్లారిలో "గాలికి ఆకు కదిలినా" అది గాలి వల్లనే అని పుట్టించేస్తున్నారు. ఓ లారీ కేబిన్ పై, సంచులలో నింపిన కొన్ని కోట్ల డబ్బుని, టర్పాలిన్లు కప్పి, యెక్కడికో రవాణా చేసేస్తుంటే, (అది కూడా యెవరో ఆచూకీ చెపితే) ఆ డ్రైవరునీ, సంచులు పెట్టినవాడినీ అరెస్టు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారట! 

ఆ డబ్బు ఫలానా బ్యాంకులో డ్రా చేశారు అని చెపుతున్నారు. (ఇంకా విచిత్రం యేమిటంటే, కొన్ని కట్టలమీద "2009 వ సంవత్సరం" స్టాంపులు వుండడంతో, రెండు సంవత్సరాలనుంచీ ఆ డబ్బు యెక్కడ దాచారు? అంటూ పరిశోధనట! బ్యాంకుల గురించీ, నోట్ల కట్టల గురించీ వీళ్లకి కనీస పరిజ్ఞానం లేదనుకోవాలా మనం?!). ఆ డ్రైవర్లూ వాళ్లూ యేమి చెపుతారు? 

ఆ బ్యాంకు ఖాతాలో ఆ డబ్బు యెప్పుడెప్పుడు, యెవరెవరు డిపాజిట్ చేశారో యెదురుగుండా కనిపిస్తూనే వుంటుంది! ఆ మాత్రానికి ఈ డ్రామాలు యెందుకు? 

ఇంక, శ్రీనివాసరెడ్డిని మళ్లీ బళ్లారికి తరలించి, ఓ రోజంతా ఓ బ్యాంకులో దర్యాప్తు చేశారట! ఆయన బ్యాంకు లాకర్లు తెరిస్తే, 14 కిలోలో యెంతో బంగారం, కొన్ని కోట్లూ దొరికాయన్నారు. 

మర్నాడు, ఆ లాకర్లు ఇంకెవరి పేరుమీదో వున్నాయి అనీ, వాళ్లు ఈయనకి 'బినామీ'లు గా భావిస్తున్నారు అనీ ఇంకో వార్త! 

ఈలోపల కస్టడీ ముగిసేపోయింది! మళ్లీ చంచల్ గూడా జైలుకి తరలింపు....అక్కడ ఆయన గుళ్లలోనూ, ఆధ్యాత్మిక పుస్తకాలతోనూ కాలక్షేపం! "ప్రత్యేక" పూజలకి అవకాశం వుందా అని కూడా కనుక్కున్నారట! యేమో, చంచల్ గూడా శివుడికీ, ఇంకా అక్కడ దేవుళ్ల అదృష్టం బాగుంటే భవిష్యత్తులో వాళ్లకీ బంగారు కిరీటాలు అమరుతాయేమో! 

ఇలాంటి డ్రామాలవల్లా, దర్యాప్తులవల్లా, నిజాలు బయటికి వస్తాయి అంటే యెవరైనా నమ్ముతున్నారా?

Tuesday, September 13, 2011

డ్రామా....హై డ్రామా....హై హై డ్రామా! -- 4గాలి అరెస్టు

ఇంక, అరెస్ట్ అయినవాళ్లిద్దరికీ బెయిలు ఇవ్వాలి అని వాళ్ల తరఫు న్యాయవాదులూ, ఇవ్వడానికి వీల్లేదు అని సీబీఐ న్యాయవాదులూ పూర్తిగా రెండురోజులు వాదించుకున్నారు. నిన్న (12-09-2011) ఐతే, వుదయం 11 నుంచి సాయంత్రం 6 వరకూ నడిచాయట. చివరికి రాత్రి 9 కి "తీర్పు రేపిస్తాం" అన్నారట.

(బెయిలు నిరాకరించి, 19 వ తేదీవరకూ సీబీఐ కస్టడీ విధించారు అనీ, వారు వెంటనే "ప్రశ్నల పరంపర" ప్రారంభించారు అనీ ఇవాళ (13-09-2011) వార్త. అందరూ వూహించినదే! "న్యాయం జరగడమే కాదు, 'జరిగినట్టు కనిపించాలి' కూడా" అన్నాట్ట వెనకటికెవడో! అందుకోసమే ఈ "డ్రామాలు"! లేకపోతే, రెండురోజులపాటు ఈ వాదనలెందుకు? కోర్టుల్లో కేసులు పేరుకుపోతున్నాయంటే.....పోవూ మరి!)

ఇంతకీ యెవరి వాదనల్లో "పస" వుందో మీరే ఆలోచించండి.

సీబీఐ వారి వాదనలు : 

 • లీజు పొందిన ప్రాంతాల్లో తవ్వకాలు జరపలేదు. కానీ ఆ పర్మిట్లతో ఇంకోచోట త్రవ్విన ఖనిజం యెగుమతి చేశారు.


 • త్రవ్వకాలగురించి సమాచారం యెవరూ ఇవ్వడం లేదు. ఆయనకి భయపడుతున్నారు. 


 • లీజు పొందిన ప్రాంతం లో లభించే ఖనిజం కన్నా, యెక్కువ నాణ్యమైన ఖనిజం యెగుమతి చేశారు. 


 • వుపగ్రహ చిత్రాలూ వగైరా సీడీలూ, డాక్యుమెంట్లూ సీల్డ్ కవర్లో సమర్పించాము.


 • సంవత్సరానికి 18 కోట్లు జీతం పొందారు. ఆస్తి అప్పుల పట్టీలో, డైరెక్టర్లుగా గాలి దంపతులే సంతకాలు చేశారు. జాతీయ సంపదని దోచుకున్నారు!


 • ఇంట్లో వుంచుకున్న 5 కోట్ల నగదుకీ లెఖ్ఖలు లేవని తేలింది. దాన్ని తాడిపత్రి బ్యాంకునించి తెచ్చారు. 


 • బెయిలు మంజూరు చేస్తే, పారిపోయే అవకాశం వుంది.


డిఫెన్స్ న్యాయవాదులు : 

 • లీజుకి సంబంధించిన ఫైళ్లన్నీ అందుబాటులో వున్నాయి. అధికారులెవరో వారికి తెలుసు. వాళ్లెవరినీ పిలిచి విచారించకుండా, వీళ్లని అరెస్ట్ చేసి, వివరాలు చెప్పమంటామనడం యేమిటి? కేసు నమోదు చేసి రెండేళ్లయినా, ఇప్పటిదాకా ఆధారాలు యెందుకు సేకరించలేదు? అరెస్ట్ ను సమర్థించుకోడానికే వివరాలు సేకరించాలని కస్టడీ అడుగుతున్నారు!


 • ముడుపులు తీసుకున్నారంటున్న అధికరులని యెందుకు వదిలేస్తున్నారు?


 • లీజు పొందినచోటకాకుండా, వేరేచోట (కర్ణాటకలో) తవ్వారంటున్నారు. ఆ భూమి కర్ణాటకలో వుందని, సరిహద్దు నిర్ణయం జరగకుండా యెలా నిర్ధారిస్తారు?


 • సరిహద్దు వివాదాలగురించి సుప్రీం కోర్టులో పలు కేసులున్నాయి. అవి తేలేదాకా యెందుకు ఆగలేదు? 


 • ఇప్పటికే ఆధారాలు (సీడీలూ, డాక్యుమెంట్లూ) వున్నాయంటూ, మళ్లీ కస్టడీ యెందుకు?


 • బ్యాంకు ఖాతాల్లో యెగుమతుల వివరాలు అన్నీ వున్నాయి కదా? కేసు డైరీ యెందుకు లేదు? అరెస్ట్ తరవాత, ఎఫ్ ఐ ఆర్ లో సెక్షన్లని సవరించారు.


 • వ్యక్తిగత స్వేచ్చ వుల్లంఘన జరిగింది.


(పేకాట ఆడేవాళ్లు ఓ సామెత చెప్పుకుంటారు--మన పేక మనం యెప్పుడైనా చూసుకోవచ్చు, ముందు ప్రక్కవాళ్ల పేకలని చూసి గుర్తు పెట్టుకోవాలి--అని. అలా, 'మన లీజులు మనం యెప్పుడైనా త్రవ్వుకోవచ్చు, ముందు.......' అనుకున్నాడేమో ఆయన!)

నిజానిక్కూడా, వీళ్లు "ఇంటరాగేట్" చెయ్యగానే, ఆయన అన్ని "నిజలూ" కక్కేస్తాడా....."మూడో డిగ్రీ" వుపయోగిస్తే తప్ప? రేపెప్పుడో కడుపునొప్పో, కాలునొప్పో అని హాస్పిటల్లో చేరతాడు. రోగీ పాలే కోరాడు, వైద్యుడూ పాలే ఇమ్మన్నాడు అన్నట్టు సరిపోతుంది. అమర్ సింగ్ నిన్న "నిమ్‌స్"లో చేరలేదూ?

......మరోసారి.

Monday, September 12, 2011

డ్రామా....హై డ్రామా....హై హై డ్రామా! -- 3గాలి అరెస్టు

ఇంకెవరైనా చేస్తే నేరం, మనం చేస్తే అది వ్యూహం అన్నట్టుంది సీబీఐ వ్యవహారం. 

హోటళ్లలో గదులు బుక్ చేసుకోవాలంటే, మన ఫోటో ఐడీ అడిగి, దాని వివరాలు వాళ్ల రికార్డులో వుంచుకుంటున్నారు. 

అయినా, అలాంటిదేమీ లేకుండా, మారుపేర్లతో, కనీసం ఓ పది గదులు హోటళ్లలో బుక్ చెయ్యగలిగారంటే, లొసుగు యెక్కడ వుంది?

తమ అధికార హోదాని వుపయోగించో, ఇన్‌ఫ్లుయెన్స్ వున్న ఓ స్థానిక పెద్దమనిషిని బ్లాక్ మెయిల్ చేసో సాధించి వుంటారు. (సాధారణంగా హోటళ్లలో గదులు ఇచ్చే రిసెప్షన్ లో వుండే వుద్యోగులని యెవరూ "ఫలనా గది వాళ్లకే యెందుకు ఇచ్చావు?" అని ప్రశ్నించరు. తరవాత యేమైనా కొంప ములిగితే, వాళ్లని మూసేసి, వుద్యోగాలు పీకేస్తారంతే!) 

మరి అలా సీబీఐకే సాధ్యం అనుకుంటే, మనం మూర్ఖులమే! 

సామాన్య నేరస్థులనుంచి, తీవ్రవాదులవరకూ అందరికీ అది సాధ్యమే కదా? ఇంక మనవాళ్ల ఇంటలిజెన్స్ ఇలా యేడుస్తోంది అని తిట్టుకొని యేమి లాభం?

అందుకే తీవ్రవాదులు హైకోర్టునే కాదు, సుప్రీం కోర్టుని కూడా పేల్చేస్తాం అని బెదిరించగలుగుతున్నారు!

ఇంక సోదాలు చెయ్యడానికి అని చెప్పి వెళ్లినవాళ్లు, అరెస్టు చెయ్యవలసిన అవసరం యేమి వచ్చింది? 

సొదాలపేరుతో, బంగారం , వెండీ వస్తువులని స్వాధీనం చేసుకొని, కోర్టులో డిపాజిట్ చెయ్యడం యెందుకు?

ఒకవేళ ఆయన "అక్రమంగా" సంపాదించాడు అని రేప్పొద్దున్న కోర్టు నిర్ధారించి, ప్రభుత్వానికి జరిగిన నష్టానికిగానూ, ఆయన ఆస్తులని జప్తు చెయ్యండి అంటే--అప్పటికి ఆ ఆస్తులు అన్నీ కరిగిపోతాయనో, అన్నీ మూట కట్టుకొని, యే చైనాకో, జపాన్ కో పారిపోతాడని భయమా? అలా పారి పోవడానికి ఆయనేమైనా షా ఆఫ్ ఇరానా? ఇమెల్డా మార్కోసా?

నిజంగా ఖత్రోచీలనీ, యాండర్సన్లనీ మాత్రం గుట్టు చప్పుడుకాకుండా వాళ్ల దేశాలకి పారిపోనిస్తారా!

కార్లూ, హెలికాప్టరూ స్వాధీనం చేసుకోవాలా? లేకపోతే వాటిని స్వయంగా నడుపుకొంటూ, ఇతరదేశాలకి యెగిరిపోతాడా? అయినా అంత అవసరం ఆయనకి యేమిటి?

సత్యం రామలింగరాజు సంగతి వేరు. ఆయన జైల్లో కాకుండా బయట వుంటే, సాక్ష్యాధారాలని నిర్మూలించడానికి అవకాశం వుండేది.

గాలి విషయంలో, కొన్ని లక్షలు ఖర్చుపెట్టి సేకరించిన శాటిలైట్ ఇమేజస్ తో సహా అన్నీ రికార్డెడ్ గా వున్నాయంటున్నారు. వాటి ఆథారంగానే నిర్ణయానికి వచ్చామంటున్నారు--కేసులు కోర్టులో విచారణ చెయ్యడానికి!

ఇదంతా చూస్తుంటే, సీబీఐ అధికారులు వాళ్ల సొంత ఇమేజ్ ని పెంచుకోడానికో, లేక కొంతమంది రాజకీయులకి మేలు చెయ్యడానికో ఈ డ్రామాలన్నీ ఆడుతున్నట్టులేదూ?
  
......మరోసారి.

Saturday, September 10, 2011

డ్రామా....హై డ్రామా....హై హై డ్రామా! -- 2గాలి అరెస్టు

ఇంక అరెస్టు యెలా జరిగింది?

సీబీఐ బృందం జగన్ అక్రమ ఆస్తులు, ఎమార్ ప్రాపర్టీస్ కేసులతో బిజీగా వుండడంతో, "గాలి" 'నాదాకా రావడానికి ఇంకా టైముందిలే' అనుకుంటూండగా, అదనపు ఎస్పీ ఖాన్ జేడీ ఆదేశాలపై కొద్దిరోజుల క్రితమే బళ్లారి చేరి, పరిస్థితులని అధ్యయనం చేసి, యెప్పటికప్పుడు సమాచారం జేడీ కి చేరవేశారట. 

జనార్దన్ రెడ్డి ఇంటి వాతావరణం, కుటుంబ సభ్యులు, పని మనుషులు తదితర వివరాలు సేకరించారట. ఆదివారం జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇళ్లలోనే వున్నారని నిర్థారించుకున్నారట. 

(ఇక్కడో చిన్న విషయం గుర్తొచ్చింది నాకు. పూర్వం రాజులు తమ కోటల్లో రహస్య మార్గాలనీ, నేల మాళిగలనీ వగైరాలు నిర్మించిన మేస్త్రీలని పని పూర్తవగానే చంపేశేవారట--ఆ రహస్యాలు బయటికి పొక్కకుండా. పాపం టిప్పు సుల్తాన్ తన కోటలో మురుగునీటి పారుదల మార్గాల్లో ఓ చోట అంతరాయం యేర్పడినప్పుడు దాన్ని బాగుచేసినవాడిని చంపడం మరిచిపోయాడో, సహాయం చేశాడు కదా అని కృతఙ్ఞత చూపాడో! బ్రిటీష్ నక్కలు వాణ్ని పట్టుకొని, ఆ మార్గం తెలుసుకొని, రాత్రికి రాత్రి కోటలో చేరి, వుదయమే టిప్పు బహిర్భూమికి వెళుతూండగా కాల్చి చంపేసి, "వాహ్యాళికి వెళుతుంటే చంపేశాము" అని చరిత్రలో రాసేశారు!)

ఆదివారం మధ్యాహ్నం జేడీ తన సిబ్బందితో బళ్లారి పయనమయ్యారట. బెంగుళూరు సీబీఐ డీఐజీ హితేంద్ర ని కూడా బళ్లారి వచ్చెయ్యమన్నారుట. 

అప్పటికే అక్కడవున్న ఖాన్--"వారందరికీ" మారుపేర్లతో హోటళ్లలో గదులు సిధ్ధం చేశారట!

ఆదివారం అర్థరాత్రి రెండు గంటల సమయానికి జేడీ బృందం బళ్లారి చేరిందట. అప్పటికే హితేంద్ర బృందం బళ్లారి పోలీస్ ఆఫీసర్స్ మెస్ లో దిగారట. అధికార వాహనాలు కూడా వాడకుండా మామూలు అతిథుల్లా ప్రవర్తించారట! అర్థరాత్రి బళ్లారి ఎస్పీ తో మాట్లాడి, పోలీసు రక్షణ యేర్పాటు చేసుకున్నారట. మహిళా సిబ్బందిని కూడా రప్పించారట. 

"ఒక గంట" మాత్రమే విశ్రాంతి తీసుకొని, నాలుగ్గంటలకల్లా అరెస్టు ప్రయత్నాలు మొదలెట్టారట. 

వుదయం ఆరుగంటలకల్లా, జేడీ జనార్దనరెడ్డి ఇంటితలుపూ, ఖాన్ శ్రీనివాసరెడ్డి ఇంటి తలుపూ తట్టారట. 

సీబీఐ నుంచి వచ్చాము, సోదాలు చెయ్యాలన్నారట. జనార్దనరెడ్డి తన భార్యతో మాట్లాడాక, ఆయన్ని అరెస్టు చేస్తున్నాము అని ప్రకటించారట. ఆటునుంచి శ్రీనివాసరెడ్డిని కూడా ఖాన్ తీసుకొచ్చారట.  ఇద్దరినీ తీసుకొని, జేడీ హైదరాబాదు బయలుదేరారట వెంటనే. 

దాడుల విషయం బయటికి పొక్కేలోపే, వాళ్ల బృందం బళ్లారి శివార్లు దాటేసిందట.

మీడియావాళ్లు వుదయం యేడున్నర గంటలకే విషయం తెలుసుకొని, కర్నూలు జాతీయ రహదారి పొడుగునా, టోలుగేట్ల దగ్గర కెమేరాలు పెట్టుకొని, వాళ్లని వెంటాడారట.

జనార్దనరెడ్డి ఇంట్లో మూడు కోట్లూ, శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఒకటిన్నర కోట్లూ నగదూ, బంగారు "నగలూ" స్వాధీనం చేసుకుని, ఇన్‌కమ్ టేక్స్ వాళ్లకి సమాచారం ఇచ్చి, మంగళవారం న్యాయ స్థానానికి అప్పగించారట! (ఈ బృందాలు యెప్పుడు యెలా హైదరాబాదు చేరాయో సమాచారం లేదు.)

జనార్దన రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకొన్న (యెన్నో తెలీదు) కోట్ల ఖరీదైన కార్లని హైదరాబాదు తరలించడానికీ, జాగ్రత్తగా కాపాడడానికి యేర్పాట్లు చేస్తున్నారట.

హెలికాప్టరుని తరలించాలా వద్దా అని గుంపుతెంపులు పడుతున్నారట.

అదండీ వాళ్ల ఘనకార్యం!

(ఇదంతా ఈనాడు సెప్టెంబరు 7, బుధవారం పేపర్లో వచ్చింది మాత్రమే). 

......మరోసారి.

Thursday, September 8, 2011

గాలి అరెస్టుడ్రామా....హై డ్రామా....హై హై డ్రామా!గాలిని బంధించగలమా?

అదే సాధ్యమైతే, మన పూర్వ ఋషులు, అగస్థ్యుడో యెవరో సముద్రాన్ని తన కమండలంలో బంధించినట్టు, గాలిని కూడా బంధించి చూపించేవారే! తనంతటతాను వాయుదేవుడు స్థంభించిన దాఖలాలు మాత్రం వున్నాయి కొన్ని కథల్లో. అంతే.

గాలిని మనం బుడగల్లో బంధించి, బుడగనో, దాని మూతిని దారాంతోనో, ముడేసి, "ఆహా! గాలిని బంధించాం" అని ఆనందిస్తాం ! కానీ యెంతగట్టిగా ముడేసినా, తెల్లారి చూసేసరికి, చాలామటుకు గాలి అందులోంచి నిష్ క్రమించేసి వుంటుంది!

సరే....ఇలాంటి సరదా విషయాలు ప్రక్కన పెడితే, గాలి జనార్దన రెడ్డి ని సీబీఐ వారు "బంధించగలిగారు". యెలా? అనేక డ్రామాల తరవాత! 

అంత అవసరమా అంటాను నేను.

నా ప్రశ్న వొక్కటే....జేడీ లక్ష్మీనారాయణకి "గాలిని అరెస్టు చెయ్యమని" ఆయన పై అధికారుల్లో యెవరు ఆదేశాలు ఇచ్చారు? ఒకవేళ ఆదేశించి వుంటే, ఆ ఆదేశం "చట్టబధ్ధమేనా"?

(తొందరపడి నాది వితండవాదం అనెయ్యకండి. టపా పూర్తిగా చదివాక మాత్రమే అలాంటి వ్యాఖ అవసరమేమో ఆలోచించండి.)

జేడీ కి రాజకీయాలతో సంబంధం లేదు. ఆయన ఒక వుద్యోగి మాత్రమే! ఆయన కూడా ఆవిషయం మొన్ననే ప్రకటించవలసి వచ్చింది. వొప్పుకొంటారుగా? మరి ఆయనకి పై అధికారులూ వుంటారుగా?

జేమ్‌స్ బాండ్ కథల్లో సైతం, ఆయనని పిలిచి, వాళ్ల బాస్ "ఎమ్" ఫలానా కేసు పరిశోధించు. దానికోసం నీకు ఫలానా అధికారాలు ఇస్తున్నాము--అని కేసు అప్పగిస్తారు. కానీ బాండ్, తానే వెళ్లి ఫలానా పని చేస్తాను, మీరు అనుమతి ఇవ్వండి అని అడగడు!

మనదేశంలో యెమర్జన్సీ విధింపుకి ముందు, లోక్ నాయక్ జేపీ పోలీసులకి "చట్టవిరుధ్ధమైన ఆదేశాల అమలుకి తిరస్కరించండి" అని పిలుపు ఇచ్చాడు. దాంతోనే, ఆయన పోలీసులని "తిరుగుబాటు" చెయ్యమంటున్నాడు అనే వంకతో యెమర్జన్సీ విధింపు, తరవాత అరెస్టులూ జరిగాయి. అదంతా చరిత్ర.

వుద్యోగులు చెయ్యవలసింది, తమకిచ్చే జీతానికి సరిపడా, పనివేళల్లో, తమ వుద్యోగ నిబంధనలని అనుసరించి, విధి నిర్వహణ చెయ్యడమే!

"పావలా తీసుకొని, రూపాయి ఏక్షన్ చేసేస్తున్నాడు చూడండ్రా!" అంటారు సినిమా చూస్తూ. అలా చెయ్యాల్సిన అవసరం వుందా అంటారు అలా అనేవాళ్లు.

బ్యాంకులలో కూడా "విజిలెన్స్" విభాగాలుంటాయి. దాంట్లోకి కొంతమంది వుద్యోగులని బదిలీ చేస్తారు. అలాంటి కొందరు "జేయెమ్‌వన్"గాళ్లు--తమ పై అధికారులు--వుద్యోగి యెవరిమీదైనా ఫలానా విషయంలో "దర్యాప్తు" చెయ్యమంటే, వాళ్లు ఆ వుద్యోగుల ఇళ్లకి వెళ్లి, వాళ్ల ఆడవాళ్లనీ, పెద్దలనీ, పిల్లలనీ--మీవాడు తప్పు చేశాడు....మీరు నిజం చెప్పకపోతే, చాలా దూరం వెళుతుంది.....మేము సీ ఐ డీ నుంచి వచ్చాము. నేను డీ ఎస్ పీ రాంక్ వాడిని. "నాన్ బెయిలబుల్ అరెస్టు వారంటు" జారీ చేసేందుకు నాకు అధికారాలు వున్నాయి.....అంటూ బెదిరించి వాళ్లదగ్గర వీళ్లకి కావలసినట్టు వాఙ్ఞ్మూలాలు సంతకాలు పెట్టించేసుకునేవారు ఆ దౌర్భాగ్యులు! ఆ వుద్యోగి వీళ్లకన్న పెద్ద స్థాయి వాడు--యే స్కేల్ మూడో, నాలుగో అయినా సరే--వీళ్లే దర్యాప్తులు! 

అదీ పావలా తీసుకొని, రూపాయి ఏక్షన్ చెయ్యడం అంటే!

తరవాత ఎంక్వైరీలో డిఫెన్సువాళ్లు వాటిని అన్నీ ఖండ ఖండాలు చేసేసినా, ఎంక్వైరీ ఆఫీసర్లు (వీళ్లకి ప్రత్యేక ఆదేశాలుంటాయి) "గిల్టీ" అని తీర్పు ఇచ్చేస్తారు! 

పైగా, ఆ కేసులు వాదించిన విజిలెన్స్ విభాగం జేయెమ్‌వన్‌గాళ్లు--నేను చేపట్టిన కేసులన్నింటిలోనూ, అందరికీ శిక్షలు పడ్డాయి, యెవరూ తప్పించుకోలేదు--అని బోర విరుచుకునేవాళ్లు!

ఇలా వుంటాయి ప్రహసనాలు!    

......మరోసారి.

Friday, September 2, 2011

వుద్యమ..........క్షేత్రాలు

అన్నా దీక్ష సఫలం తరవాత యేమిటి?
లోక్ పాల్ తరవాత 'జీవితం 'యేమిటి?
ఇంకా వుద్యమాల అవసరం వుందా?
వుద్యమాలని రాజకీయ పార్టీలతో అనుసంధానం చెయ్యాలా?

ఇలా అనేక ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. 

పుణ్య క్షేత్రాల్లో "పూల మాఫియా"; "ట్రావెల్ మాఫియా"; "హోటెల్ మాఫియా"--ఇలా వాపోతోందో ఛానల్.

నన్నడిగితే, లోక్ పాల్ కన్నా ముందు ఈ "క్షేత్ర నిర్వహణ" లకి వ్యతిరేకంగా చెయ్యాలంటాను--వుద్యమాలని.

(వాళ్లు 'మా క్షేత్రం--మా యిష్టం' అంటారేమో!)

మా చిన్నప్పుడు పుణ్యక్షేత్రాలంటే, తిరుపతి, కాళహస్తి, శ్రీశైలం, కంచి, మధుర, రామేశ్వరం--ఇలా చెప్పేవారు.

తరువాత, తి తి దే వారు తిరుచానూరుని వృధ్ధి చేశారు. 1970లలో అయ్యప్ప చేరాడు. తరువాత షిరిడీ. ఈమధ్య కాణిపాకం చేరింది. ఇంకా చాలా చేరుతున్నాయి.

అన్నట్టు, రాజుగారు టిఫిన్ డబ్బాల్లో పెట్టుకొని, నగలు యెత్తుకుపోతుంటే, ఓ వుద్యోగి చూశాడు అనీ, అందుకే ఆ వుద్యోగిని తొలగించారు అనీ, ఆరోపించాడు అచ్యుతానందన్.

అక్కడి వాడుక యేమిటంటే, రాజుగారు గుడి బయటికి వచ్చేముందు, కాళ్లకంటిన ఇసుక రేణువులని కూడా శుభ్రంగా దులిపేసుకొని బయటికి వాస్తాడు అని!

నిజానిజాలు అనంత పద్మనాభుడికే తెలియాలి మరి!

యేమంటారు?

Thursday, September 1, 2011

"విగ్నేస్వర..........సుబాకాంక్సలు!"

"అందరికీ వినాయక చతుర్దశి షుభాకాంక్షలు!"

ఇప్పుడే, ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోడానికి, జోరుగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెఖ్ఖచెయ్యకుండా వచ్చిన ఓ మహిళ ఓ టీవీ ఛానెల్లో చెప్పిన మాట!

ఈ లండాచోరీ అంతా మనకు తెలియని, రాని, చదవని, వ్రాయలేని "సంస్కృతం" వల్లే అని వొప్పుకుంటారా?

శుభ్రంగా "వినాయక చవితి" అనకుండా, "చతుర్థి" అనబోయి, "చతుర్దశి" అనడం యెందుకు?

తెలుగుభాషా పండితులూ....వెయ్యేళ్ల తెలుగు వారూ!....మీడియావాళ్లు చక్కని తెలుగునే మాట్లాడి, ప్రసారం చేసేలా కృషి చేస్తారా?

మీ యిష్టం మరి!