Wednesday, October 12, 2011

తెలుగోళ్లూ..........!



......యెన్నాళ్లీ 'అరవ' వూడిగం?

"తిరు" అని వింటేనే, నా చెవుల్లో యెవరో "తిరి" పెట్టినట్టవుతుంది నాకు! 

అరవ వైష్ణవులు, తెలుగు వైష్ణవులకన్నా యేవిషయంలో గొప్ప? అని ఇదివరకే క్రొశ్నించాను నేను. యెవరూ సమాధానం చెప్పలేదు. 

మా నరసాపురంలోని "ఆదికేశవ యెంబెరుమన్నారు" కోవెలని, ".........యెంబెరుమనార్" అని యెందుకు మార్చారు అనీ, ఈనాడువారు "యెంబెరుమానార్" అని యెందుకు అంటున్నారు అనికూడా క్రొశ్నించాను. సమాధానం లేదు! 

చక్కగా తెలుగులో యేకాక్షర పదం "శ్రీ" వుండగా, ఆ "తిరు" దౌర్భాగ్యం యేమిటో నాకు అర్థం కాదు! 

"స్నపన తిరుమంజనం"ట! ఇదేభాషో? తెలుగులో స్నపనం అంటే, స్నానం చేయించడం అని అర్థం అయివుండొచ్చు. మరి "మంజనం" యేమిటి? అంజనం, భంజనం లా? సరే. 

అదేదో 'తొక్కలో' వాహనం అన్నట్టు ఒకడు "తొక్కళం వాహనం" అంటాడు. ఇంకోడు "తొళక్కం వాహనం" అంటాడు! 

ఇంక "ఇస్తెకఫాల్ స్వాగతం"; "మేల్ చాట్ వస్త్రం" లాంటి మాటలు యేభాషవో తెలీదు అని ఇదివరకే వ్రాశాను. యెవరూ తెలియజెప్పలేదు. 

ఇంకా, "చక్రత్తాళ్వారు"ట! అరవ్వాళ్ల "పన్నిద్దరాళ్వారు"ల్లోనే ఈ ఆళ్వారు లేడేమో! 

తిరుమలలో అంటే, అది తమిళనాడుకి దగ్గరగా వుంది కాబట్టో, కొన్నేళ్లక్రితం వరకూ అరవ పూజారులే వుండేవారు కాబట్టో ఆ వ్యవహారపదాల వాడకం ప్రసిధ్ధికెక్కిందనుకుందాం. (ఇప్పుడు రమణదీక్షితులూ, జీయంగార్లూ, శేషాద్రులూ అరవ్వాళ్లు కాదనుకుంటా). 

మరి రాష్ట్రవ్యాప్తంగా వున్న (ద్వారకా తిరుమలతోసహా) వేంకటేశ్వరాలయాల్లోనూ ఈ అరవ పడికట్టు పదాలనే వాడడం ఓ గొప్ప అనుకుంటున్నారా? మీడియావాళ్లు అలా ప్రచారం చేస్తున్నారా? యేమో. 

ఇప్పుడు మళ్లీ అడుగుతున్నా......తెలుగు వైష్ణవులు అరవ వైష్ణవులకి యెందుకు బానిసలుగా కొనసాగుతున్నారు? 

బాపిరాజూ! మీకు మహాభక్తీ, పరమభక్తీ అన్నీ వుండొచ్చు. బ్రహ్మోత్సవాల్లో "చిందులు" వేసుకో, "డోళ్లు" కొట్టుకో, "కోలాటాలు" ఆడుకో, ఇంకా భక్తి యెక్కువైతే, యేడుకొండలూ పొర్లుదండాలు పెడుతూ పైకెక్కి, దిగు--అంతేగానీ--యెప్పుడో 1970 ల్లో రిజిస్టర్ అయిన "అన్నదానం ట్రస్టు" ని కాదని, "అన్నప్రసాదం" అని మార్చడానికి మీకేమి అధికారం వుంది? 

మీకు చేతనయితే, తిరుమల తిరుపతిని "శ్రీగిరి శ్రీపతి" గా మార్చు! తెలుగువాళ్లు వచ్చే వెయ్యి సంవత్సరాలవరకూ మీకు కృతజ్ఞులై పడి వుంటారు! 

నేను పైన వ్రాసిన పేర్లన్నీ, యెవరైనా "తెలుగుమాటలే" అంటే, వాటి "వ్యుత్పత్యర్థాలని" తెలుగులో వివరిస్తే, నా ఈ బ్లాగుముఖంగనే, క్షమాపణలు వేడుతాను! 

ఇంక మీ ఇష్టం! 

వాకే???


Tuesday, October 11, 2011

తెలుగు గౌరవాలు.....



.....గౌరవ వాచకాలూ

శ్రీ, బ్రహ్మశ్రీ, మహారాజశ్రీ, పార్వతీ సమానురాలు, గంగాభాగీరథీ సమానురాలు--ఇలాంటివి పేరు ముందూ; గారు, అయ్యవారు లాంటివి పేరు తరవాతా వుపయోగించేవారు. వీటిని గౌరవాచకాలు అంటారు. 

(ఒకేసారి పేరుముందు వొకటీ, చివర వొకటీ వుపయోగించడం నిషేధం. అలాచేస్తే నిజంగా వారిని అగౌరవపరచినట్టు.) 

ఇంగ్లీషులో అయితే, Mr.,Mrs., Sir, His Highness, His Holiness, His Excellency, His/Her Majesty, వగైరాలూ (HH, HE లాంటి Abbreviation లూ), చివర్లో Esquire (Esq.) లాంటివీ వాడేవారు. ఇంగ్లీషులో కూడా పేరుకి ముందూ, తరవాతా ఒకేసారి గౌరవవాచకాలుంచడం నిషేధం. 

ఈ మధ్య, Gender Equality వుద్యమకారులు, Mr. అంటే వాడికి పెళ్లి అయిందో లేదో తెలీదుకదా, మరి ఆడవాళ్లకి పెళ్లయితే Mrs. అనీ, అవకపోతే Miss. అనీ యెందుకు వాడాలి? అంటూ Ms. అనేది ఒకటి కనిపెట్టారు. యేభాష అయినా, అతి గౌరవం పనికిరాదు అనే చెప్పారు. 

ఇదివరకో కవి ఓ రాజుగారిని "పూజ్యులు, కుబేరులు, నానావిధ సంపన్నులు......" ఇలా కొత్త కొత్త విశేషణాలు కనిపెట్టిమరీ పొగిడినట్టు కనిపిస్తూ, బూతులు తిట్టి మరీ కసి తీర్చుకున్నాడట. 

ఇంక ఇదివరకు వార్తా పత్రికల్లో అందరిపేర్లముందూ "శ్రీ/శ్రీమతి" తగిలించేవారు. ఓ వార్తలో ఓ పదిహేనుమందిపేర్లు వ్రాయవలసి వస్తే, 15 శ్రీలూ/శ్రీమతులూ కంపల్సరీ. తరవాత, ఇలాకాదు అని, ముందు "సర్వశ్రీ" అని వ్రాసి, తరవాత పేర్లు వరసగా వ్రాసేవారు. 

మా బ్యాంకులో 1972లో 63 రోజులపాటు చరిత్రాత్మక సమ్మె జరిగింది. బ్యాంకు స్థంభించింది. అప్పుడు అధికారుల సస్పెన్షన్ పర్వానికి తెరలేపుతూ, ఈ క్రింది అధికారులని సస్పెండు చేస్తున్నాము అంటూ "సర్వశ్రీ ఎ రామచంద్రరావు....."తో మొదలుపెట్టి, లిస్టు పూర్తిచేశారు. అప్పటినుంచీ ఆయన పేరు సర్వశ్రీ రామచంద్రరావు అయిపోయింది! 

ఇంగ్లీషు భాషలో ప్రతి సంవత్సరం "టైమ్" మేగజైన్ వారు కొన్ని సంస్కరణలు ప్రవేశ పెడతారు. కొన్ని క్రొత్త మాటలని భాషలో కలుపుతారు, కొన్ని మాటల వర్ణక్రమాన్ని మారుస్తారు--ముఖ్యోద్దేశ్యం మాత్రం, ప్రింటులో యెంత సొమ్ము పొదుపు చెయ్యగలం? అనేదే! 

ఇంతకు ముందోసారి రీసెర్చ్ చేసి కనిపెట్టిందేమిటంటే, "An American leaves his apartment by the elevator and enters his automobile to go to see a motion picture." Whereas, "An English, leaves his flat by the lift, climbs his car to go to  cinema!" ఇలా ఇంగ్లీషువాళ్లు కొన్ని బిలియన్ డాలర్లు పొదుపుచేస్తున్నారు--ప్రింటులో అని. 

అలాగే, Colour లాంటి మాటల్లో, 'ఓ' తరవాత వచ్చే 'యూ' ని తొలగించడం లాంటివి. కానీ యెందుకో 'క్యూ' తరవాత కంపల్సరీగా వచ్చే 'యూ' ని తొలగించడానికి మాత్రం జనాలు వొప్పుకోవడంలేదట! అదిమాత్రం ఇంతవరకూ చెయ్యలేకపోయారు. 

గమనించారోలేదూ, మన వార్తా పత్రికల్లో కూడా శ్రీలనీ, Mr. వగైరాలనీ వాడడం యెప్పుడో మానేశారు. తద్వారా బోళ్లంత పొదుపు చెయ్యడమేకాకుండా, మరిన్ని వార్తలనీ (ప్రకటనలనీ) ఇవ్వగలుగుతున్నారు! 

చెప్పొచ్చేదేమిటంటే, మనం వ్రాసేటప్పుడూ, మాట్లాడేటప్పుడూ యెవరిమీదైనా గౌరవం (అదంటూ వుంటే) ధ్వనిస్తే చాలు. అంతేగానీ, యెన్ని గౌరవవాచకాలు వుపయోగిస్తే, అంతగౌరవం అని వినేవాళ్లూ, చదివేవాళ్లూ అనుకుంటారనుకోవడం మూర్ఖత్వం! 

అదీ సంగతి.

Friday, October 7, 2011

తెలుగోళ్లూ......




తెలుగు ని ఖూనీ చెయ్యకండి!

ఓ బ్లాగరు ఓ టపా వ్రాశారు......శీర్షిక "వివేకానాందుడు యేమి చెప్పారు?"(ట).

వివేకానందుడు యేకవచనం. యేమి చెప్పాడు? అని అడగాలి. 

ఇంక, ఆయనమీద గౌరవం పొంగి పొర్లి కారిపోతుంటే, బహువచనంగా "వివేకానందులు" యేమి చెప్పారు? అని ప్రయోగించాలి! 

(దయచేసి దీన్ని 'కు'విమర్శగాతీసుకొని, రాధ్ధాంతం చెయ్యకండి!) 

తెలుగు భాషని సంకరం చేసేసి, ఖూనీ చెయ్యకండి!

వేయ్యీ 11 యేళ్ల తెలుగుభాషా! జిందాబాద్!

Saturday, October 1, 2011

డ్రామా....హై డ్రామా....హై హై డ్రామా! -- 8



విచారణలు

కొన్ని చిన్న చిన్న విషయాలని గమనించండి.

పొద్దున్నే 6-00 గంటలకి ఓ సీబీఐ చప్రాసీనో, గుమాస్తానో, ఇంకెవరో తలుపుకొట్టి, తలుపు తెరిచినవాళ్లని "జనార్దనరెడ్డి గారున్నారా?" అని అడిగి, వాళ్లు లోపలికి వెళ్లి యెవరో వచ్చారు అని చెప్పగానే, అయన లుంగీ బనీనుతో బయటికి వచ్చి "యెవడ్రా ఈ టైములో...." అంటూండగానే, తలుపు కొట్టినవాడు "మా జేడీ గారుకూడా వచ్చారండి" అంటే, ఆయన జేడీ గారిని "రండి రండి! ఇంత పొద్దున్నే......" అంటూండగానే ఆయన ముందుకు వచ్చి, "మీ ఇల్లు సోదా చెయ్యడానికొచ్చాం!" అంటే, ఈయన "అందుకు మీకు అధికారం యెవరిచ్చారు? అసలు వారంటు వుందా?" అని ఇంకా యేదో అనబోతే, ఆ "స్పర్ ఆఫ్ ది మూమెంట్"లో జేడీ "మీరు సహకరించకపోతే, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను" అన్నాడు.

ఈయన "వుండండి. మా ఆవిడకోమాట చెప్పి, డ్రెస్స్ వేసుకొని వస్తాను" అని లోపలికి వెళ్లి, వచ్చి, "సరే పదండి!" అన్నాడంటే......అది ఆయన అమాయకత్వం అనుకోను. చట్టం మీద ఆయనకున్న గౌరవం, తన పవర్ మీదా, డబ్బు మీదా వున్న నమ్మకం తో కూడిన అహంకారం మాత్రమే అయ్యుండాలి.

(నిజానికి ఆయన అంత కొంపలో, అన్ని గదుల్లో, అంత ఆవరణలో యెక్కడైనా దాక్కోవచ్చు, యెలాగైనా తప్పించుకొని బయటికి చెక్కేయచ్చు! ఆవూరు వాళ్లదీ, చుట్టూ మనుషులు వాళ్లవాళ్లు! కానీ యెందుకు పారిపోవాలి? వూరూ, ఆస్థులూ, అయినవాళ్లూ అందరినీ వదిలేసి?)

ఆయనకే గనక "మిరండా" హక్కులు చెప్పివుంటే, వాళ్లు హైదరాబాదు చేరేలోపల హైకోర్టులో బెయిల్ పిటిషన్ల వెల్లువ దాఖలైవుండేది!

(ఓ ప్రక్క డిసెంబరు 9 ప్రకటన వెలువడ్డాక, సీమాంధ్రలు భగ్గుమనగానే, హైకోర్టులో స్టే వెకేట్ అయ్యి, ఇనుప ఖనిజాన్ని పూర్తిగా తరలించగలిగాడని గుర్తు తెచ్చుకోండి!)

ఇంక, అంతకు కొన్నిరోజులు ముందే ఖాన్ బళ్లారి వెళ్లి దర్యాపు చేసి, వాళ్ల పనివాళ్ల జాతకాలతోసహా వివరాలు సేకరించారుకదా?

కోర్టులో ముద్దాయిని ప్రేశపెట్టేముందు, ఆ దర్యాప్తు వివరాలూ, పంచనామాలూ వగైరాలతో "పార్ట్-1 కేసు డైరీ" ని సమర్పించాలి. ఈ పార్ట్-1 సీడీ చాలా రహస్యమైనది. కోర్టు వారి పరిశీలన, రికార్డులకి మాత్రమే. పెద్ద పెద్ద లాయర్లు కూడా, కోర్టు సిబ్బందిని మంచి చేసుకొని దాన్ని పరిశీలించగలరు కానీ, నోట్సు కూడా తీసుకోలేరు! ఆ సీడీ లోని అంశాలపైనే అథారపడి డిఫెన్సు వాదనలూ, బెయిల్ కోసం వాదనలూ సిధ్ధం చేసుకొంటారు. (అవసరమైన వారికి ఆ సీడీల జెరాక్స్ కాపీలు కూడా యెలాగో అందుతూనే వుంటాయి అన్నది బహిరంగ రహస్యం!)

మరి ఈయన కేసులో సీడీ నే ఫైలు చెయ్యలేదు అని డిఫెన్సు వాదన! పంచనామా మీద యెవరూ సంతకాలు పెట్టలేదు అని కూడా సీబీఐ వాళ్లు చెప్పిందే! మరి ఇన్నాళ్లుగా ఆయన బందీగానే వున్నాడు అంటే.....అంతా "చట్టబధ్ధంగానే" జరుగుతోంది అని నమ్ముతారా?

ఇంకో వైపు, ఆండిముత్తు రాజా మీద దర్యాప్తు పూర్తి అయ్యింది అనీ, ఛార్జ్ షీటు దాఖలు చేశాము అనీ చెప్పారు. మళ్లీ కొన్ని కొత్త సెక్షన్లు కేసులో కలుపుతున్నాం కాబట్టి బెయిలు ఇవ్వద్దు అని సీబీఐ అంటే, "అసలు దర్యాప్తు పూర్తి అయ్యిందా, లేదా అనే విషయంలో వాళ్లని అఫిడవిట్ దాఖలు చెయ్యమనండి. అప్పటివరకూ నేను వాదించదలుచుకోలేదు!" అన్నాడట ఆయన లాయరు. యెంత బాగుందో చూశారా?

మా జిల్లాలో (ప గో జి) గత నాలుగురోజులుగా, జిల్లా కలెక్టరూ, అసిస్టెంట్ కలెక్టరూ, జాయింటు కలెక్టరూ--ఇలా ఆరు పోస్టుల బాధ్యతని ఎడిషనల్ జాయింట్ కలెక్టరు మిరియాల శేషగిరిబాబుకి మొత్తం బాధ్యతలు అప్పగించారు. నిన్న (30-09-2011 న)  ఆయన ఆరోగ్యం లోపించి, ఇవాళ పొద్దుణ్నించీ సెలవులో వెళ్లిపోయారుట. దాంతో, మొత్తం యేడు బాధ్యతలూ, ఓ మామూలు రెవెన్యూ అధికారికి అప్పగించారుట. ఆయన మొత్తం 8 బాధ్యతలూ నా శాయశక్తులా నిర్వహిస్తాను అని చెప్పాడు. (రాబోయే నాలుగు రోజులలో రెండురోజులు సెలవులు పోయినా, కనీసం రెండురోజులు ఆయన 8 బాధ్యతలూ వహించవలసిందే!

మరి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ దాదాపు పదికేసులు (అన్నీ కోట్ల రూపాయలూ, పెద్దపెద్దవాళ్లకి సంబంధించినవీ) ఒంటిచేత్తో నిర్వహిస్తున్నాడంటున్నారు! (ఆయనని మించిన మగాళ్లెవరూ సీబీఐలో లేరనుకోవాలా?) అయినా ఆయనకిమాత్రం అంత గాడిదల బరువు మోస్తూ, చాకిరీ చెయ్యవలసిన అవసరం యేమి/యెందుకు వచ్చింది? రేప్పొద్దున్న ఆయనకి యే బ్రెయిన్ హెమరేజో (పాపం శమించుగాక!) జరిగితే, సీబీఐకి దిక్కెవరో?

......మరోసారి.