Thursday, May 10, 2012

యజ్ఞమా? యాగమా?.........4........యెవరికి లాభం? యెంత శాతం?

ఇంక ద్వాపరాంతంలో, కృష్ణ నిర్యాణానంతరం, కలియుగ ప్రారంభం.

యాగంలో, యజమానికి భార్య వుండడం కంపల్సరీ అనడానికి, "శ్రీనాధుడు" వర్ణించిన "అశ్వమేధ మఖ తంత్రం" చక్కటి వుదాహరణ. పెద్దలందరికీ తెలుసు--ఈ విషయం--కానీ యెవరూ పబ్లిగ్గా చెప్పరు! 

"యజమాన ప్రమదా వికస్వర భగ న్యస్తాశ్వ దీర్ఘ స్మర ధ్వజదండంబౌ నయ్యశ్వమేధ మఖ తంత్రంబున్నిరీక్షించి యక్కలిపురుషుడొత్తిలి నవ్వె!" (అర్థం తేటతెల్లమేగా?) 

బుధ్ధావతారం గురించీ, తరవాత భారత చరిత్ర గురించీ, అశోకుడి కళింగ యుధ్ధం గురించీ, రాబోయే "కల్కి" (ఇప్పటి కల్కి భగవాన్, అమ్మ భగవాన్ లు కాదండోయ్!) గురించీ అందరికీ తెలిసిందేగా?

మరి ఈ కలియుగంలో, యెవరికివారు యజ్ఞాలూ, యాగాలూ చేసేస్తూ, యెవర్ని వుధ్ధరిస్తున్నారో? 

Tuesday, May 8, 2012

యజ్ఞమా? యాగమా?.........3........యెవరికి లాభం? యెంత శాతం?

హిరణ్యకశిపుడు (జయ విజయుల్లో రెండోవాడు) పేట్రేగిపోయినప్పుడు, సకల మునులూ, దేవతల కోరికపై 
"నరసింహావతారం" యెత్తాడు ఆయన. 

బలి చక్రవర్తి భరతం పట్టడానికి, మళ్లీ వాళ్లందరి కోరికపై, వామనావతారం యెత్తవలసి వచ్చింది.

అప్పటికి విష్ణువు సర్వసమర్థుడిగా, సర్వాధికారిగా ఎస్టాబ్లిష్ అయ్యేసరికి, మొదలయ్యాయి "యాగాలు". (ఆప్పుడుకూడా యజ్ఞాలు కొనసాగేవి--కొంతమంది చేత.) 

కృతయుగాంతంలో, సప్తర్షులూ ఆకాశంలో వుండిపోతే, వాళ్ల వారసులు భూమ్మీదకి వచ్చి, ప్రజోత్పత్తికి పాటుపడ్డారు. 

"స్వాయంభువ" మనువు వల్ల "బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర" కులాలు యేర్పడ్డాయి.

త్రేతాయుగం ప్రారంభంలో, "క్షత్రియుల" విజృంభణతో, మరోసారి పరశురామావతారం యెత్తి, 21 సార్లు భూమంతా తిరిగి, క్షత్రియుడు అనేవాడు లేకుండా నరికేశాడు. (ఒక్క దశరథుడే, గాజులు తొడుక్కొని, బ్రతికిపోయాడు!) 

తరవాత, రామావతారం. 

ఇక్కణ్నించీ అన్నీ ప్రాచుర్యంలో వున్న కథలే. ఆ కాలంలో, యజ్ఞాలూ, యాగాలూ కూడా జరిగేవి. 

విశ్వామిత్రుడు "యజ్ఞం" చేస్తుంటే, రాక్షసులు ఆటంకాలు కల్పిస్తున్నారనే రాముణ్ని తనతో పంపమన్నాడు.

మరి, దశరథుడు "పుత్రకామేష్టి" "యాగం" చేశాక కదా సంతానం పొందాడు?

యాగం అంటే, "ప్రతిఫలాపేక్ష" తో కూడింది. ఆశ్వమేధ, నరమేధ, రాజసూయ వగైరా యాగాలన్నీ అందుకే!

యాగానికి "యజమాని" (యాగం చేసేవాడు) వుంటాడు. (ఆయనకి భార్య వుండడం కూడా కంపల్సరీ--యెందుకో.....తరవాత.) "యూప స్థంభం" వుంటుంది. దానికి "బలిపశువు"ని కట్టేస్తారు. "ఋత్విక్కులు", ఆయన కోరికని తెలియజేస్తూ, యజమానిచేత "హోమం" చేయిస్తారు. ఆయన తరఫున "హోత"లు హోమం చేస్తారు. "ఉద్గాతలు" సహకరిస్తారు. 

"యజ్ఞానికి" శాలలు వుండవు. "యాగాలకి" వుంటాయి. యజ్ఞం బహిః ప్రదేశంలో నిర్వహించడం వల్లే, మారీచ సుబాహులు రక్త మాంసాలతో యజ్ఞ కుండాన్ని అపవిత్రం చేసి, అగ్నిని ఆర్పగలిగారు. 

యాగం తంతు యాగశాలలోనే జరుగుతుంది. ఒక్కో యాగానికీ ఒక్కో రకం శాలలూ, వేదికలూ యేర్పాటు చేస్తారు. 

యాగ ప్రక్రియ, స్థూలంగా, యజమానిని యాగ పశువులోకి ఆవాహన చేసి, ఆ పశువు ద్వారా యజమాని కోరిక నెరవేరేందుకు దోహదం చేసి, చివరికి ఆ పశువుని నవరంధ్రాలూ మూసి హత్యచేసి, ఖండఖండాలుగా నరికి, ప్రతీ అవయవానికి సంబంధించిన మంత్రాలతో అగ్నికి ఆహుతి చేయడంతో ముగుస్తుంది యాగం. అంటే, యజమానే అత్మార్పణ చేసుకున్న ఫలం సిధ్ధించి, "యజ్ఞ" పురుషుడు అగ్నిలోంచి ఆవిర్భవించి, యజమాని కోరికతీరేలా "ఫలం" అనుగ్రహించి వెళ్లిపోతాడు.  

త్రేతాయుగంలో శ్రీరాముడిగా అవతారం యెత్తి, పరశురాముడి అవతరానికి పరిసమాప్తి చేస్తాడు విష్ణువు. రావణవధ జరిగి, సీతని అడవిలో వదిలేశాక "అశ్వమేధ యాగం" చేశాడంటారు. (రావణ, కుంభకర్ణుల--జయ విజయుల రెండో జన్మ--వధ జరిపాడు విష్ణువు).  

ద్వాపర యుగంలో, ధర్మరాజు "రాజసూయ యాగం" చేశాడు. అప్పుడే శిశుపాల (జయ విజయుల్లో ఒకడు--మూడో జన్మ) వధ జరిగి, కురుపాండవుల మధ్య మచ్చరం రగిలి, కురుక్షేత్ర యుధ్ధానికి దారి తీసింది. ఇందులో "బలరామావతారం" పాత్ర చెప్పుకోతగ్గది. 

(మన సినిమావాళ్లు ఆయన్ని తీసేసి, కృష్ణావతారం ప్రవేశపెట్టారు! అలాగే విజయుడి మూడో జన్మ "దంతవక్తృడు" కథకి అంత ప్రాచుర్యం రాలేదు!)

......మిగతా మరోసారి.

Sunday, May 6, 2012

యజ్ఞమా? యాగమా?.........2........యెవరికి లాభం? యెంత శాతం?

కృత యుగంలో, ఋగ్వేద కాలంలో "యజ్ఞాలు" జరిగేవి. అప్పటికింకా భూలోక, భువర్లోకాలు యేర్పడలేదు. స్వర్లోకమే వుండేది. దానికి అధిపతి ఇంద్రుడు. ఆయనకి అష్ట దిక్పాలకులూ తోడు. భూలోకం యేర్పడ్డానికి రిహార్సల్ గా, ప్రజాపతులూ, వారి పరివారమూ వుండేవి. అప్పుడే ఋషులు "యజ్ఞాలు" నిర్వహించేవారు. మునులు మౌనంగా తపస్సు చేసుకొనేవారు. 

ఇంద్రుడి ప్రీతి కోసం, ఋక్కులు పఠిస్తూ, హోమాలు చేసేవారు. అలా నూరు యజ్ఞాలు చేస్తే, "ఇంద్రపదవి" పొందచ్చు. అలా చేసినవాళ్లూ వున్నారు.....భంగపడినవాళ్లూ వున్నారు. 

ఈ యజ్ఞానికి "ఆధ్వర్యుడు" (నిర్వహింపచేసేవాడు) వుంటాడు. "ఋత్విక్కులు" ఋక్కులు చదువుతారు. "హోత"లు హోమాలు చేస్తారు. "ఉద్గాతలు" వంతలు. హవిస్సులని, స్వాహాదేవి ద్వారా, అగ్నికీ, అక్కడినుంచి ఇంద్రుడికీ చేర్చేవారు. లోకం సుభిక్షంగా వుండేది. (ఇందులో ఆధ్వర్యుడికి ప్రతిఫలాపేక్ష వుండేదికాదు--యే తొంభై యజ్ఞాలో చేసేవరకూ!)

ఇప్పటికీ, స్మార్తులు అగ్నిహోత్రం లేకుండా నిర్వహించే వ్రతాల్లోనూ గట్రా, మంటపం యేర్పరచి, ఇంద్ర, అష్టదిక్పాలకాది దేవతలని "సాంగం, సాయుధం...."గా ఆవాహన చేసి, స్థాపించి, పూజిస్తారు. 

కృతయుగం చివరిలో, లింగోద్భవం జరిగి, శ్రీమహా విష్ణువు యోగనిద్రలోంచి లేచి, నాభికమలంలోంచి బ్రహ్మ పుట్టి, సృష్టి కొనసాగించడానికి అనుమతులు తీసుకొని, అప్పుడు భూ, భువర్లోకాలు యేర్పడ్డాయి.

బ్రహ్మ సృష్టికి ఆటంకం కల్పిస్తూ, సోమకాసురుడు వేదాలని దాచేస్తే, మత్స్యావతారం యెత్తాడు విష్ణువు.

(కూర్మావతారం, క్షీరసాగర మథనాలూ, అమృతం పుట్టుకా వగైరాలు అందరికీ తెలిసినవే!)

ఆ తరవాత హిర్ణ్యాక్షుడు (వైకుంఠ ద్వారపాలకులు జయ విజయుల్లో ఒకడు) అప్పుడే యేర్పడిన భూమిని చాపచుట్టగా చుట్టేసి, సముద్రం క్రింద ముంచేస్తే, వరాహావతారం యెత్తి, భూమిని పైకి తేల్చినప్పుడు యేర్పడ్డాయి--భరత వర్షమూ, భరత ఖండమూ, మేరువూ, హిమాలయాలూ వగైరా.

(ఈ వ్యాసం పూర్తయ్యాక "అతిమూత్రుల" వ్యాఖ్యలదగ్గరకొస్తాను. ఓపిక పట్టండి.)

......మిగతా మరోసారి.

యజ్ఞమా? యాగమా?.........
........యెవరికి లాభం? యెంత శాతం?

"అతిరాత్ర ఉత్కృష్ట మహా సోమయాగం" శాలా దహనం తో పూర్తయ్యిందట. ఫలితమేమిటో అందరూ చూశారు. (అతిమూత్రం కూడా యెవరికీ రాలేదు అని కొక్కిరించారెవరో!) 

ఆరున్నర కోట్లు ఖర్చు పెట్టారట. దేవాదాయ శాఖవాళ్లు ఇవ్వము అంటే, ప్రభుత్వం వారు కామన్ గుడ్ ఫండ్ నుంచి ఓ 50 లక్షలు చదివించారట. (దానికి బాధ్యులెవరో మరి!) 6 లక్షలమందికి "అన్న (అపాత్ర) దానం" చేశారట. (ఆఖర్రోజున యెందుకో ఆపేశారట!). ఇంకా ఓ 70 లక్షల "లోటు" మిగిలిందట. (రావలసిన చందాలు ఇంకా వున్నాయనుకోండి.....ట). 

శాలాదహనం అయిన మరుక్షణం "కుంభ వృష్టి" కురుస్తుందన్నారుగా? అంటే, "ముందురోజే కురిసేసింది కదా?" అని జవాబు!

నిన్న (05-05-2012న) యాగ నిర్వాహకులు పీవీఆర్ కే ప్రసాద్ వగైరాలు, గవర్నరుగారిని దర్శించి, యాగం ప్రసాదాన్ని, విభూతిని ఆయనకి అందజేసి, "యజ్ఞ వైభవం" అనే ప్రత్యేక, విశిష్ట సంచికని ఆయనచే ఆవిష్కరింపచేశారట. ఆయన ఇంకా ఇలాంటివి చాలా జరగాలని అభిలషించారట. (ఈ గవర్నరుగారు, 'మళ్లీ' నియమింపబడినప్పటినుంచే భక్తీ వగైరాలు యెక్కువైపోయాయి. రోజూ పేపర్లో కనిపిస్తున్నాడు. ఉపయెన్నికలు అయిపోయాక రాష్ట్రం మొత్తం పర్యటిస్తాడట! మరి రాజకీయ అజెండా యేమైనా వుందేమో......అంటున్నారు. పాపం ఆయన పదవీకాలం ముగిసినప్పటినుంచీ, మళ్లీ ప్రమాణ స్వీకారం చేసేవరకూ మనది గరర్నరు లేని రాష్ట్రం అయిపోయింది!).

ఇంతకీ అది యజ్ఞమా? యాగమా? (ఆ రెండింటికీ తేడా వుందా?)

నాకున్న పరిజ్ఞానం మేరకు వ్రాస్తున్నాను. 

పెద్దలు యవరైనా నన్ను ఖండించదలుచుకున్నా, కొన్ని విషయాలు సరిదిద్దదలుచుకున్నా అందరికీ ఆహ్వానం.

......మిగతా మరోసారి.