Tuesday, November 27, 2012

కార్తీక మాసం--"అతి" పవిత్రం



(అతి సర్వత్ర వర్జయేత్!)

2011-12 నూనెల సంవత్సరం (నవంబరు నుంచి మళ్లీ అక్టోబర్ వరకూ) లో మొత్తం "వంటనూనెల" దిగుమతులు 1 కోటీ 19 లక్షల టన్నులకి చేరాయట. ఈ విషయంలో గత "పదేళ్ల" రికార్డులు బ్రద్దలయ్యాయట. 

దేశంలో వాటి ఉత్పత్తి 7 లక్షల టన్నులు తగ్గగా, వినియోగం 8 లక్షల టన్నులు పెరిగి, మొత్తం లోటు 15 లక్షల టన్నులు పెరిగి, దిగుమతులుకూడా అంతమేర పెరిగాయట. 

రాష్ట్రం లో డెయిరీలు "ఆవుపాలు" కొనుగోలు రేటు 2 నుంచి 3 రూపాయలు తగ్గించారట--ఓ రెండు మూడు రోజులు. తరవాత అసలు కొనడమే మానేశారట! యెందుకంటే--పాల నిలవలు యెక్కువయ్యి, డిమాండు లేకపోవడం ట.

ఇంక కార్తీక మాసం పుణ్యమా అని, టీవీ నిండా, పేపర్ల నిండా యే గుళ్లలో యెన్నిదీపాలు వెలిగించారో ఆ వార్తలూ, దృశ్యాలే!

మచ్చుకి--మాజిల్లాలోనే--భీమవరం లో డిసెంబరు 12 న "లక్ష" దీపాలు వెలిగిస్తారట. దానికోసం కొందరు భారీ విరాళాలు ఇస్తూంటే, ఓ తొమ్మిదిమంది 9 నూనె డబ్బాలు విరాళంగా ఇచ్చారట.

బజార్లో వంకాయలూ, బీరకాయలూ సైతం కిలొ 45 దాకా పెరిగాయి. త్వరలో 50 కి చేరినా ఆశ్చర్యపడక్కర్లేదు. "మొన్నటి వార్షాలవల్ల సరుకు రావడంలేదు" అంటున్నారు దుకాణాలవాళ్లు. 

(అన్నట్టు, ఈ మాసంలో చాలా మంది చేపలూ, మాంసాలూ తినడం మానేసి, కూరగాయలే తింటారట. సోమవారాలు ఉపవాసాలు చేసేవాళ్లక్కూడా, చపాతీలకీ వాటికీ కూరగాయలే కావాలి. ఉప్పుడు పిళ్లూ, చప్పిడి పిళ్లూ తినే రోజులు కావు కదా! ఉప్పుడు పిండికి కూడా పప్పుల రేట్లు చుక్కల్లో వుంటున్నాయి.) 

యేలూరులో అయ్యప్ప స్వామిని "వెయ్యి కిలోల" కూరగాయలతో శాకాంబరుడిగా అలంకరించారట ఓ రోజు!

బియ్యం రేట్లు మళ్లీ పెరిగిపోతున్నాయి. సర్కారువారు యేవేవో పథకాలు వేస్తున్నారు--మిల్లర్లు ఇంకా బలిసేందుకు. రేట్లు ఇంకా పెరుగుతాయంటున్నారు.

యేలూరులోనే, శివాలయంలో 100 కిలోలతో "అన్నాభిషేకం" చేశారట!

దీపావళి రోజునా, కార్తీక మాసంలో రోజూనూ, తాటాకులతో "గుమ్మటాలు" చేసి, అందులో "ఉమ్మెత్త" కాయలని సగానికి కోసి, గింజలు తిసేసి, ముచిక భాగాన్ని ఆ గుమ్మటాల్లో గుచ్చి వాటిని చూరుకి వ్రాలాడదీసీ, పై భాగాలని ప్రమిదల్లా నేలమీదా పెట్టి, వాటిలో ఆవు నెయ్యో, ఆముదమో (అదికూడా వంటాముదం కాదు) పోసి, దూది వత్తులు వేసి వెలిగించేవారు. 

అదీ శ్రేష్టమైన పధ్ధతీ, వ్యవహారమూ! 

(అప్పుడు ఆవుపాలు కొనకపోవడమూ, నెయ్యి దొరకకపోవడమూ, వంట నూనెల దిగుమతులు పెరగడమూ వుండవు కదా?)

Friday, November 16, 2012

మన భాష......



.......తెలుగు 

మన తెలుగు భాష గురించి మాట్లాడితే, అనేక తెలుగు పదాలని చాలా మంది మరిచిపోయారు అనీ, ఇప్పటివాళ్లకి అవేవో గ్రీక్ & లాటిన్ లా ధ్వనిస్తున్నాయనీ చెప్పాలి.

“కుర్సీ” అనేది హిందీలోంచి వచ్చింది. (కిస్సా కుర్సీ కా అనే సినిమా ఇందిరాగాంధీ ని మూడు చెరువుల నీళ్లుతాగిస్తే, ఆ నిర్మాతని ఆవిడ ఆరు చెరువుల నీళ్లు తాగించింది!). ఆ పదాన్ని మన తెలుగులో “కుర్చీ పీట” గా ప్రవేశపెట్టారు! క్రింద కూర్చోడానికి వేసుకునేవి పీటలు. ఇవి కుర్చీ పీటలు. ఇప్పుడందరూ వాటిని కుర్చీలు అనే అనేస్తున్నారనుకోండి.

ఇంకా, “ముక్కాలి పీటలు” వుండేవి. తలంట్లు పోసుకోడానికీ, చదువుకొనేటప్పుడు లాంతర్లు పెట్టుకోడానికీ వగైరాలకోసం వాడే వారు. గుండ్రని చెక్కకి మూడు కోళ్లు బిగించేవారు. అందుకనే అవి “ముక్కాలి” పీటలు.

కూర్చునే “బెంచీ” లు వుంటాయి కదా? బెంచ్ అనేది ఆంగ్ల పదం. దానికి తెలుగులో “కవాచీ బల్ల” అని ఓ పదం వుండేది. దానిమీద “రెడ్డికం” వేసుకొని కూచోడం, ఇంకెవరైనా వస్తే వాళ్లని ప్రక్కన కూర్చోమంటూ “రెడ్డికం తో సహా” ప్రక్కకి జరగడం—శ్రీపాదవారి పుస్తకాల్లో చదువుతాం.

పెద్దలు—“ముందు నాలుగువేళ్లూ నోట్లోకి పోయే విధానం చూసుకోరా!” అనేవారు. తృప్తిగా భోజనం చేస్తే, కుడిచేతి బొటనవేలు మినహా, మిగిలిన నాలుగు వేళ్లూ నోట్లోకి వెళతాయి! బయట హోటళ్లలోనూ అక్కడా సరే. బొటనవేలూ, చూపుడు, మధ్య వేళ్లతో కలుపుకొని, కెక్కిరిస్తూ తినేస్తారు—స్పూన్లూ అవీ వాడకుండా తినేవాళ్లు. అక్కడ “ఎటికెట్”లూ, “టేబుల్ మేనర్సూ” వుంటాయి. మరి, ఇంట్లో శుభ్భరంగా తినేప్పుడు ఈ నాజూకులెందుకు? యెవరైనా అలా తింటే వెంటనే కూకలేస్తాను నేను. మన తెలుగు పధ్ధతులు మరిచి పోవద్దని!

మన తెలుగు వాళ్లింకా “మార్జాలం” అంటే “బిడాలం” అనే అనువాదాల్లోంచి బయట పడడం లేదు. మా చదువుల్లో గణిత శాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రాలూ వగైరాలు చదువుకున్నాం. అవన్నీ తెలుగులోనే చక్కగా అందరికీ అర్థమయ్యేలా “పైథాగరస్ సిధ్ధాంతం” (ఆయన్ని “పిథోగోరాస్” అనాలట!), “ప్లవన సూత్రాలూ”, “ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేయుట” లాటి పాఠాలు వుండేవి. ఇప్పుడు చూద్దుమా—తెలుగు మీడియం విద్యార్థుల సౌకర్యం కోసం పండితులు సూచిస్తున్న పాఠాల్లో ప్రశ్నలు—అర్థం అవడం సంగతి తరవాత—అసలు కొరుకుడు పడడమే లేదు! మరింకేమి చదువులో!

మన తెలుగు వాళ్లకో పెద్ద జబ్బుంది. యెవరినైనా పేరు అడగండి—పీ ఎస్ రావ్ అనో, కే టీ శర్మ అనో, డీ వీ ఎస్ వర్మ అనో--ఇలా చెపుతారు! పూర్తి పేరు చెప్పాలంటే నామోషీ కాదుగానీ, “అంత అవసరమా?” అనే ఫీలింగు! ఇంక చిరునామా చెప్పమంటే నూటికి 99 మంది యేమాత్రమూ సరిగ్గా చెప్పరు! అదేం దౌర్భాగ్యమో! దానికి  తగ్గట్టు మనవాళ్ల ఇంటిపేర్లు చాలా చిత్రంగా వుంటాయి. అందుకని అసలు చెప్పరు. 

మా ట్రెయినింగ్ కాలేజీలో వచ్చే ఉపాధ్యాయులని నేను వాళ్ల పూర్తి పేర్లు అడిగేవాణ్ని. నాకదో హాబీ. ప్రముఖుల ఇంటిపేర్లతోసహా పూర్తి పేర్లు సేకరిస్తూ వుంటాను. ఏ పీ జే అబ్దుల్ కలాం పూర్తి పేరు చాలామందికి తెలియక మునుపే నేను “అవుళ్ పకీర్ జైనుల్లా ఉద్దీన్ అబ్దుల్ కలాం” అని సేకరించాను. వ్రాశాను. (ఆయన ప్రమాణస్వీకారం చేస్తూ, “….జైనుల్లా అబ్దీన్…..” అని చేశాడు! సరే పోనీ అనుకున్నాను. 

అలా, ఒక ఉపాధ్యాయుడిని క్లాసు అయిపోయి, యెవరికైనా యేమైనా “డౌట్స్” వున్నాయా అనడిగితే, నేను “మీ పూర్తి పేరు చెప్పండి సార్!” అని అడగడం, ఆయన చేతి మూడువేళ్లతో నుదుటిమీద పైనుంచి ముక్కుమీదకి వ్రాస్తున్నట్టు అభినయించి, “పంగనామాల గోవర్ధన రావు. నీకేమైనా అభ్యంతరమా?” అనడం, క్లాసులోవాళ్లంతా ఘొల్లుమనడం జరిగాయి. నాకేం అభ్యంతరం వుంటుంది మరి?

యేతావాతా చెప్పొచ్చేదేమిటంటే, తెలుగువాళ్లు తమ తెలుగు పేర్లనీ, ఇంటిపేర్లనీ, చిరునామానీ చెప్పుకోడానికి సిగ్గు పడఖ్ఖర్లేదు అని.

మీరేమంటారు?

Saturday, November 10, 2012

ఇదో రకం.....



......పరాకాష్ఠ

ఈ మధ్య జనాలకి భక్తి యెక్కువైపోతూంటే, అర్చకులూ వాళ్లకీ కూడా “సెట్టింగుల” వ్యసనం యెక్కువైపోయింది. గుడి మొత్తం ప్రహరీలతో సహా విద్యుద్దీపాలంకరణ, లోపల కరెన్సీ నోట్ల అలంకరణ లాంటివి సరే. కానీ వుత్సవ విగ్రహాలకీ, కొండొకచో మూల విగ్రహాలకీ, కృత్రిమ చేతులూ, కాళ్లూ కూడా తగిలించేస్తున్నారు. ఆఖరికి తిరుమలేశుడికీ, చిన్న వెంకన్నకీ కూడా తప్పడంలేదీపాట్లు. 

కంచిలో వరదరాజస్వామిని--అరచేతులు పైకిపెట్టి, చేతులు ముందుకు చాపిన గరుడుని విగ్రహం పై వూరేగిస్తారు. స్వామిని ఆయన భుజాలపై కూర్చోబెట్టి కాళ్లు రెండూ గరుడుని చేతుల్లో వుంచుతారు. (నిజంగా అలాంటి ఉత్సవ విగ్రహం వుందేమో నాకు తెలీదు).

మలయప్ప స్వామిని మాత్రం గరుడినిపై కూర్చొన్నట్టు నిలబెట్టి, రెండు కృత్రిమ కాళ్లు గరుడుని చేతుల్లో వుంచుతున్నారు. (ఈ విషయంలో నేను వ్రాసినది  తప్పయితే నాకు తెలియబరచండి—సంతోషిస్తాను.)  

ఇంక చినవెంకన్న (ద్వారకా తిరుమల)అయితే, ఓ రోజు అదేదో 'వుట్టి కొట్టుడు' అనో వెన్న దొంగ అవతారం అనో—పైన వుట్టిలో ఓ కుండ వ్రేలాడదీసి, క్రింద అటకలా పేర్చి, దానికి ఓ నిచ్చెన వేసి, స్వామి  రెండు కృత్రిమ కాళ్లలో యెడం కాలుని నిచ్చెన మీద పెట్టి, కుడికాలుని వ్రేలాడేశారు. ఆ కాళ్లకి రేకుతో చేసిన పాదాల ఆకారంలో సాక్సులాంటివి కూడా తొడిగారు. 

ఇంకోరోజు “బక సంహార” అవతారం అని ఓ ఇత్తడి కొంగ బొమ్మని నిలబెట్టి, ఓ చేత్తో దాని ముక్కును చీలుస్తున్నట్టూ, రెండో చేత్తో దాన్ని పట్టుకున్నట్టూ, కాళ్లు మామూలుగా వ్రేలాడేసి అలంకరించారు.

అమ్మవార్లకైతే, సరస్వతీ అవతారం కోసం, అప్పటికే ఆవిడకి వున్న నాలుగు చేతులలో రెంటిని కప్పేసి, కృత్రిమ చేతుల్లో వీణని నిలబెట్టేస్తున్నారు. 

అసలు ఇలాంటి వాటికోసం వేరు వేరు వుత్సవ విగ్రహాలని తయారు చేయించచ్చు కదా? అలా చేయించి ఇచ్చే దాతలకీ, భత్తులకీ కొదవ లేదు కదా?

యేమిటో!

అన్నట్టు, అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఒరిజినల్ గా రెండు చేతులు పైకీ, రెండు చేతులు క్రిందుగా ప్రక్కకీ వుంటాయి. వాటిలో వుండవలసిన శంఖు చక్రాలు, గదా కమలాలూ వుంటాయి. కానీ తరవాత వీరశైవులైన రాజులకి భయపడి, ఓ కృత్రిమ చేయిని తగిలించి, అది క్రిందకి వ్రేలాడేసి, ఆ చేత్తో ఓ పుష్పాన్ని క్రింద వున్న ఓ చిన్న శివలింగం మీద వుంచబోతున్నట్టు మలిచారట. నిజంగా కూడా, ఆ గుళ్లో ప్రస్ఫుటంగా కనపడేది  ఆ చెయ్యి ఒకటే. మిగతా విగ్రహాన్ని చూడడానికి మూడు గదుల్లోకీ కళ్లు చించుకోవాలి!

ఇప్పుడుగనక ఆ వీరశైవులు వుంటే, ఇప్పటి వాళ్లని దశావతారం సినిమాలో కమలహాసన్ ని వీపులో హుక్కులు గుచ్చి వ్రేలాడదీసినట్టు చేసి సముద్రంలో ముంచేసేవారేమో!

ఈ మధ్య కొన్ని సినిమాల్లో బ్రాహ్మణులని అవమానించారు అని ఆందోళన చెయ్యడానికి భ్రాహ్మణ సంఘాలు అన్నీ సంఘటితం అవుతున్నాయి. మంచిదే. ఓ పెద్దాయన్ని మోహన బాబు ఫోనులో “మీ బుర్ర పగల కొడతాం” అన్నాడు అనీ, “పగలకొడతాం” అనడానికి ఓ బూతు మాట వాడారనీ ఆయన స్వయంగా ఓ టీవీ ఛానెల్లో చెప్పారు! హౌ డేర్ హి? (అంటే ఆ చెప్పినాయన కాదు).

అయినా మనబంగారం మంచిదైతే…..అన్నట్టు, మొదటినుంచీ ఈ చైతన్యం వుంటే ఈరోజు ఈ స్థితికి వచ్చేదికాదు కాదా?

ఇప్పటికైనా వెర్రిమొర్రి “బండిపూజలూ, కారుపూజలూ, సినిమా కెమేరాలకీ, మెగాఫోన్లకీ పూజలూ, తిరుమలలో ప్రతిసినిమాకీ మొదటి రీలు పూజలూ, శంఖుస్థాపనలకి తాపీకీ, ఉలికీ పూజలూ" వగైరాలు మానేస్తే బాగుంటుంది. ముఖ్యంగా కడుపు కక్కుర్తికోసం వేలం వెర్రులని ప్రోత్సహించకుండా, ఒకరిని మించి ఒకరు ఒకరి పొట్ట వొకరు కొట్టుకోవడం మానేస్తే ఇంకా మంచిది.

బ్రాహ్మణులూ—ఆలోచించండి.