Friday, March 27, 2015

శ్రీరామ నవమి......శ్రీరాముడూ, సీతాదేవీ.....తలంబ్రాలూ.....-3

ఇంతకీ "ఒంటిమిట్ట"లో సీతారామ కళ్యాణం శ్రీరామ నవమి నాడు కాదండోయ్! ఇవాళే అంకురారోపణ జరిగింది. రేపు ధ్వజారోహణం! పట్టువస్త్రాలు ఇవాళిచ్చేస్తే, వచ్చే "పౌర్ణమి నాడు" జరిగే కళ్యాణం లో వాటిని వుపయోగిస్తారట!!!

సరే.....ఇవన్నీ ఇలా వున్నా, మధ్యలో "పిడకలవేట" లా ఈ "తలంబ్రాల" గోలేమిటీ? దానికి "పరాకాష్టేమిటీ"? ....అంటే......

గత కొన్నేళ్లుగా, కళ్యాణం అయ్యాక తలంబ్రాలు "చిన్న పొట్లాల్లో" భక్తులకి అందిస్తున్నారు అని చెప్పుకున్నాం కదా? క్రితం యేడాది...."ఓ నెల ముందుగానే".....2 క్వింటాళ్ల (200 కిలోల) బియ్యాన్ని పొట్లాల్లో నింపేసి, "తలంబ్రాలు" సిధ్ధం చేసేశారు! ఇదో పరాకాష్ట.

అలాగే, కొన్నేళ్లుగా, తూర్పు గోదావరి జిల్లాలోని ఓ గ్రామం నుంచి...."కో(గో)టి తలంబ్రాలు" పేరుతో, కోటి ధాన్యం గింజలని, కొన్ని రోజులపాటు, కొన్ని వందలమంది, "గోళ్లతో" ఒలిచి, వాటిని కాలినడకన తీసుకెళ్లి, భద్రాచలం గుళ్లో అందిస్తున్నారు! (నిజంగా వాటిని యేం చేస్తున్నారో యెవరికీ తెలీదు.)

ఈ మధ్య ఆ గ్రామం లో ఓ మంచి ముహూర్తం పెట్టించి, పొలం "దున్నడం" మొదలెట్టి, మళ్లీ మంచి ముహూర్తం చూసి, "విత్తనాలు" జల్లి......అలా......చివరికి కాలినడకన.....మామూలే! ఇదో పరాకాష్ట!

ఈసారి, ఓ రెండు వారాలముందే, ఓ మూడు తట్టల్లో, 30 లక్షల గింజల్ని తీసుకెళ్లి అందించేశారు. మిగిలినవి ఇవాళ అక్కడకి చేరి వుంటాయి. ఇంకో విశేషం యేమిటంటే.....ఇంకొన్ని గింజల్ని "ఒంటిమిట్ట" కూడా పంపిస్తున్నారట!

వాళ్లని చూసి, ప గో జి వాళ్లు కూడా కొంతమంది మొదలెట్టారు!

ఇంకా, ఈ మధ్య భీమవరం లొ వుండే బెల్లంకొండ బిందుమాధవ రావు, ఆయన భార్య, బియ్యం గింజలు "ఒక్కోదాని" మీదా శ్రీరామ అని రంగు రంగుల్లో వ్రాసి, మళ్లీ వాటిని శ్రీరామ అనే "ఆకారం" లో పేర్చి, అందించి వచ్చారు. రెండు తట్టలు ఫోటో వేశారు పేపర్లో.....అంటే, ఓ 20 లక్షల గింజలు వుండొచ్చు! ఇదింకో పరాకాష్ట!

అసలు, "క్షుద్రమైన" గోళ్లతో వడ్లు ఒలిస్తే వచ్చే బియ్యం గింజలు "అతి పవిత్రం" యెలా అవుతాయో?

పైగా, భత్తులకి పొట్లాల్లో అందించే "తలంబ్రాలు" యెలా సద్వినియోగం అవుతున్నాయో యెవరికైనా తెలుసా? (ఇంకా కళ్యాణం మొదలెట్టక ముందే పొట్లాలు అందించేస్తారట!). వాటిని ఇళ్లకి తీసుకెళ్లి, పూజామందిరాల్లో పెట్టుకొని, ఓ యేడాదిపాటు పూజించే వాళ్లని కూడా వేళ్లమీద లెఖ్ఖపెట్టచ్చేమో!

మరి, "ఆహార ధాన్యాల వృధా" గురించి యెవరైనా ఆలోచిస్తున్నారా? "యె పి వా ఆ" అని నిర్లిప్తం గా వూరుకుంటున్నారా?

నిజమైన శ్రీరామ భక్తులందరినీ, "ఇవాళ" (సూర్యోదయాత్పూర్వమే అష్టమి వెళ్లిపోయింది. ఇవాళే నవమి!) తన "పుట్టినరోజు" సందర్భంగా, ఆయనే చల్లగా చూస్త్రాడు!

(ఇప్పటికి సమాప్తం)

Wednesday, March 25, 2015

శ్రీరామ నవమి


శ్రీరాముడూ, సీతాదేవీ.....తలంబ్రాలూ.....-2

మన తెలుగోళ్ల భద్రాచలాన్ని త్లంగాణోళ్లు పట్టుకుపోయారు. తప్పేముందీ? మనవాళ్లు రాముడి భక్తులూ, భద్రాచల భక్తులూ గానీ, అంధ్రోళ్లూ, త్లంగాణోళ్లూ కాదు కదా? కానీ, రేపు శ్రీరామనవమికి కేసీఆర్ తన ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలూ, మంచి ముత్యాలూ (హైద్రాబాద్ నుంచి) తీసుకెళ్లి "సమర్పిస్తాడే"?

మరి మన గతేమిటి?

అందుకే, మన ప్రభుత్వం మన రాష్ట్రం లో ఓ రామ క్షేత్రం లో పట్టు వస్త్రాలూ, "మంచి ముత్యాలూ" సమర్పించవద్దూ? అది యెక్కడ? యెప్పుడు? యెవరి చేత?

భద్రాచలం లో మన పండితులూ, వాళ్ల పుత్రులూ, శ్రీరామనవమి యెప్పుడు జరపాలీ, కళ్యాణం యెప్పుడు చేయాలీ, అసలు వాడెప్పుడు పుడతాడూ అంటూ లా పాయింట్లు తీసి, ప్రభుత్వ సెలవుదినాల్ని ముందుకీ, వెనక్కీ జరిపి, తమ పబ్బం గడుపుకోవడం అలవాటు చేసుకున్నారు.

ఓ రోజు తెల్లవారి అరగంటసేపు అష్టమి వుండి, తరువాత నవమి ప్రవేశిస్తే, స్మార్తులు ఆరోజే శ్రీరామ నవమి అన్నారు. ఠాఠ్! అలా వీల్లేదు....."అసలు అష్టమే ఆ రోజు వుండకూడదు".....అన్నారు వైష్ణవులు! సరే....ఆ మర్నాడు, సూర్యోదయాత్పూర్వమే నవమి వెళ్ళిపోయి, "దశమి" వచ్చేసిందే? అయినా సరే, ఆరోజు అష్టమి లేదు కాబట్టి, "నవమి వున్నా, లేకపోయినా, దశమే వున్నా", ఆరోజే రాముడు పుట్టాడు కాబట్టి, అదే శ్రీరామ నవమి, ఆరోజే భద్రాచలం కళ్యాణం అన్నారు!

అప్పటినించీ అలాగే చెల్లించుకుంటున్నారు. సరే! ఇంక ఈ బాధలన్నీ కేసీఆరే పడతాడు. కానీ, మన సంగతి యేమిటీ?

ప్రభుత్వం.....యెక్కడ, యెలా, యెప్పుడు, యెవరిచే........?

విజయనగరం జిల్లాలోని "రామతీర్థాలు" లో......అని డిమాండు చేశారు కొందరు! ఆహా....అధి "మధ్యలో" వుండాలికదా? పైగా......అన్ని జిల్లాలకీ అన్నీ అనే లెఖ్ఖల్లో....అపోజిషనోళ్ల ఫాక్షన్‌ జిల్లాలో వుంటే మరీ మంచిది కదా? అక్కడ "ఒంటిమిట్ట రామాలయం" వుంది కదా? అక్కడే జరిపించేద్దాము.....! అన్నాడట నాయకుడి అనుచరుడు! అదే ఖాయం అయ్యింది.అందునిమిత్తం, వెంటనే ఓ యాభై కోట్లో యెంతో పెట్టి, యెర్పాట్లు చేసేశారు. ఇంకా భవిష్యత్తులో కూడా, ఆ గుడిని అభివృధ్ధి చేస్తారట.

మరి మంచి ముత్యాల మాట రాలేదుగానీ, "పట్టు వస్త్రాలు" యెవరు ఇవ్వాలి? ముఖ్యమంత్రిగారు తాత అయ్యారు కాబట్టి, కుదరదు. ఇంక ఓ ఉప ముఖ్యమంత్రి గారి బంధువులు యెవరో పోయారని, ఆయనా కుదరడు. ఇవాళే తేల్చారు ....ఇంకో ఉప ముఖ్యమంత్రి పట్టువస్త్రాలని సమర్పిస్తాడు....28 వ తేదీని....అని!

(మిగతా.......మరోసారి)

Tuesday, March 24, 2015

శ్రీరామ నవమి


శ్రీరాముడూ, సీతాదేవీ.....తలంబ్రాలూ.....

"అదుగో భద్రాద్రీ.....గౌతమి అదుగో చూడండీ....రామదాసు నిర్మించిన ఆలయం...." అని పరవశించి పాడుకుంటూ శ్రీరామనవమి నాటి కళ్యాణానికి తరలిపోయేవారు తెలుగు జనాలు.

తానీషా, ప్రతీ సంవత్సరం తలంబ్రాల నిమిత్తం గోల్కొండ నుంచి మంచి ముత్యాలు పంపించేవాడట. (తరువాత వాటిని యెలా యేరేవారో, మళ్లీ భద్రంగా గోల్కొండ యెలా చేర్చేవారో తెలీదు గానీ, ఆ తరువాత యేడాది మళ్లీ అవే ముత్యాలని పంపించేవాడట!)

ప్రజా ప్రభుత్వాలు యేర్పడి, ఆంధ్ర రాష్ట్రం యేర్పడ్డాక, హైదరాబాదు సంస్థానం విలీనం అయ్యేవరకూ ఇది కొనసాగినట్టుగానే వుంది. విలీనం తరవాత, ఆంధ్ర ప్రదేశ్ యేర్పడే వరకూ ఈ ఆచారం కొనసాగినట్టు దాఖలాలు వున్నాయో లేదో నాకు తెలీదు.

ఆంధ్ర ప్రదేశ్ కి హైదరాబాదు రాజధాని అయ్యాక, మళ్లీ యెప్పుడో....తలంబ్రాలకి మంచి ముత్యాలూ, పట్టు వస్త్రాలూ ప్రభుత్వం తరఫున పంపించడం మొదలెట్టారు. (అప్పుడు కూడా అవి హైదరాబాదు యెలా తిరిగి వెళ్లేవో, తరువాత యేడాది వాటినే యెలా పంపించే్వారో....ఆ రాముడికే యెరుక!)

తరవాత తరవాత, అనేకసార్లు ఆలయం లో చోరీలూ, పునరుధ్ధరణలూ జరిగాక, క్రమ క్రమంగా తలంబ్రాల బియ్యాన్ని చిన్న చిన్న పొట్లాలు కట్టి, భక్తులకి అందజేయడం మొదలెట్టారు. 

ఇటీవల ఈ 'తలంబ్రాల' బాగోతం యెంత పరాకాష్ట కి చేరిందంటే......

(........మరోసారి)