ఇక రెండో విషయం యేమిటంటే, అప్పుడెప్పుడో బ్రహ్మానందరెడ్డి హయాం నించీ, వెంగళరావు మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిపించడం, అలా అంజయ్య హయాంవరకూ తెలుగు అభివృద్ధికి చా………లా కృషి చేసేశారు! అందులో తెలుగు సాంకేతిక పదకోశం, నిఘంటు నిర్మాణం లాంటివి ఉన్నాయి!
అదుగో అక్కడే జనం తెలుగంటే భయపడ్డం మొదలు పెట్టారు!
ఆటోమేటిక్ రైల్వే సిగ్నల్ అనడానికి ‘ధూమ శకట ఆగమన నిర్గమన నిర్దేశక స్వయం చాలిత సూచిక’ అనీ, ఇలాంటి ఘోరమైన అనువాదాలు బోళ్ళు చేసేసి, జనాన్ని తెలుగునించి పారద్రోలారు!
ఇక అన్నగారు తెలుగువెలుగుల ప్రాంగణాలూ, లలితకళా తోరణాలు ఇలా కొన్ని శాశ్వత నిర్మాణాలు, చా…….లా కృషీ చేసి, మళ్ళీ తెలుగుకి ప్రాణం పోశారు! తెల్ల యేనుగులైపోయిన అకాడెమీలని రద్దేశారు! ఇంకా కొన్ని చేశారు! కానీ, యేకంగా బుద్ధుడి కాలానికి వెళ్ళిపోయి ‘దమ్మ మహా మాత్ర’ ల వంటివాటిని తీసుకొచ్చేసరికి, మన బ్యూరోక్రాట్ దొరలు తెలుగు వుత్తరాల్ని తెలుగు భాషలో ఇంగ్లీషు టైప్ రైటర్లపై వ్రాయించడం మొదలు పెట్టేసరికి, దీని కన్నా ఇంగ్లీషే నయం అనిపించింది జనాలకి!
తరవాత, చెంద్రబాబు హైటెక్ ఆంధ్ర ప్రదేశ్ త్వరగారావాలని, తెలుగు ని నిర్లక్ష్యం చేశారు!
మన వై యెస్ గారికి రామచంద్రరావు గానీ, సూరీడుగానీ “‘తెలుగు యజ్ఞం’ చేసి, దానిక్కూడా టెందర్లు పిలవచ్చు” అని సలహా ఇవ్వక పోవడంవల్ల ఆయన తెలుగు కి దూరంగా వున్నా, తమిళ తంబీల తొ ప్రెస్టేజీకి పోయి మరీ ‘ప్రాచీన భాష’ హోదా తెచ్చారు! (మరి వచ్చినె కోట్లని యెవరు నంజుకుంటున్నారో ఇప్పటివరకూ దాఖలాల్లేవు!)
అసలు యేమి జరగాలి?
మొదట మన తెలుగు పండితులూ, మీడియా ‘అన్య భాషా పదాల’ మీదున్న అపోహల్ని తొలగించుకోవాలి. మన భాష అనేక పదాల్ని పార్సీ, ఉర్దూ, హిందీ, సంస్కృతం, ఫ్రెంచ్, డచ్చి, ఇంగ్లీషు, లాంటి స్వ/పరభాషల్లోంచే కాకుండా, ఇతర భారతీయ భాషల్లోంచి కూడా స్వీకరించింది! వాటిని అలాగే వాడచ్చు—అని ప్రచారం చెయ్యాలి.
ఉదాహరణకి—రోడ్డు, రైలు, నకలు, అర్జీ, తనఖా, ప్రాంశరీనోటు—ఇలా!
రెండవది, ప్రభుత్వ వ్యవహారాలన్నీ, తెలుగులోనే సాగాలి. తెలుగు లో అందిన అర్జీల మీద తెలుగులోనే దస్త్రం నిర్మించాలి. వుత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరగాలి. కోర్టుల్లో కూడా వాద ప్రతివాదాలూ వచ్చీ రాని ఇంగ్లీషులోనో, సోకాల్డ్ స్పోకెన్ ఇంగ్లీషులోనో కాకుండా తెలుగులోనే జరగాలి. రికార్డులు కూడా తెలుగులోనే నిర్మించాలి.
ఈ కంప్యూటరు యుగంలో, తెలుగు సాఫ్ట్ వేర్ వుండగా ఇది యేమాత్రం అసాధ్యం కాదు. కేవలం సంకల్పం వుండాలంతే!
మరేదో ఇతర భాషా రాష్ట్రానికి వెళ్ళిన వాడికి ‘పురికొస’ కావలసి వస్తే, “ఈ వుడ్ లైక్ టు పర్చేజ్…’దిస్ థింగ్’…..ఆ…’వాట్ యూ కాల్’…..ఆ…..జ్యూట్ రోప్! ఆర్ జ్యూట్ త్రెడ్! నో నో జ్యూట్ ట్వైన్!” అంటే పరవాలేదు గాని, మన వూళ్ళో, మన వీధిలో కొట్టు దగ్గరకి వెళ్ళి, (బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాము కాబట్టి) ఇలా అడగడం హాస్యాస్పదం కాదూ?
ఆలోచించండి!