—పదాలు'
‘చొళ్ళెము’ అనే పదం యెప్పుడైనా విన్నారా? చదివారా? అర్థం యేమిటో తెలుసా?
—స్త్రీలు చుట్టుకొనే ముడి, సిగ, కొప్పు అని!
నౌఖర్లూ, చాకర్లూ అంటారు—మరి నౌఖరు అనే మాట హిందీలోని నౌఖరీ నించి వచ్చింది! దీనికి చాకర్లూ కలిపి, ద్వంద్వ పదం తయారు చేశారు మన పెద్దలు!—ఇంతకీ చాకర్లు అంటే యెవరు? ఇంకెవరు—చాకలి వారు, రజకులు!
‘బంట్రోతు’ అంటే అది ఇంగ్లీషు పదం అనుకుంటారు! కానీ ఇది అచ్చమైన తెలుగు పదం—‘బంటు + రౌతు’—సమాచారాన్ని అందించడానికి గుర్రం మీద వెళ్ళే (రౌతు) బంటు (సిపాయి) అని అర్థం!
దీనికి మరో తెలుగు పదం జోడించి, ‘డవాలు’/’డవాలా’ బంట్రోతు ని చేశారు! పాశ్చాత్య భాషలో ‘డఫాలు’ ని, అది ధరించే వాడిని ‘డఫేదారు’ అనేవారు—హిందీ లో. ఆదే మాటని తెలుగీకరించి డవాల్ అన్నారు! ఇప్పటికీ, రెవెన్యూ శాఖలో కలెక్టర్ల దగ్గరా, తహశీల్దారు ల వద్దా వుండే ఈ బంట్రోతులకే ‘ఫుల్ పవర్స్ ‘!
ఈ బంట్రోతునే ‘బిళ్ళ బంట్రోతు’ అని కూడా అంటారు—డవాల్ మీద అందరికీ కనిపించేలాగ ఓ ఇత్తడి బిళ్ళ తగిలించి వుంటుంది—తన పేరు, వుద్యోగం వగైర వివరాలతో!
అసలు తెలుగులో మూడువంతులకి పైగా సంస్కృత పదాలే కదా? ఆ పదాలని మన విభక్తి ప్రత్యయాలు చేర్చి, తెలుగీకరించుకున్నాము! ఉదాహరణకి ‘రామ:’ = ‘రాముడు’
మరి ఇలాగే అన్యభాషా పదాలెన్నో అన్ని భాషల్లోంచీ తెలుగీకరించబడ్డాయి! రోడ్ = ‘రోడ్డు’, లైట్ = ‘లైటు’; రెయిల్ = ‘రైలు’ ఇలాగ! మరి వీటిని మాట్లాడితే అది తెలుగు కాదంటే యెలాగ?
ఇంకా ‘ప్రాంశరీ నోటు’, ‘నగదు’, ‘నకలు’ ‘దఖలు’ ఇలాంటివెన్నో!
అలాగే మన తెలుగు పదాల్ని ఇంగ్లీషు కూడాస్వీకరించింది కదా—పందికొక్కు = ‘బేండికూట్’—ఇలాగ!
ఇంకా కొత్తపదాలు వాడుకలో ప్రవేశ పెట్టబడ్డాయి—రైల్వే సిగ్నల్ కి మనవాళ్ళు వాడే మాట—సింపుల్ గా ‘రెక్క’ అని! దీనికి—ధూమశకట ఆగమన నిర్గమన నిర్దేశక స్వయంచాలిత సూచిక—అనడం అంత అవసరమా?
మన మీడియా మరీను—మన తెలుగు భాష దినమో, సంవత్సరమో వస్తే, ‘ఐదు నిమిషాలు పూర్తిగా తెలుగులో మాట్లాడండి’ అని మైక్ ముందు పెట్టి, వాళ్ళు కష్టపడి తెలుగులోనే మాట్లాడుతూ మధ్యలో ‘రోడ్డు’ అనో, ‘బస్సు’ అనో అనగానే, మైక్ లాగేసుకుని ‘అదిగో ఇంగ్లీషు…..’ అనేస్తారు!
ఈనాడు వార్తా పత్రిక ఈ విషయం లో కొంత కృషి చేస్తోంది—కానీ, వాళ్ళు ఇంకోరకం తెలుగు ని ప్రవేశ పెడుతున్నారు! ఫైలు = దస్త్రం, కాంట్రాక్టర్ = గుత్తేదారు—ఇలాగ!
‘దస్త్రం' అంటే, ఒక వస్త్రం లో చుట్టి ముడి వేయబడ్డ లెఖ్ఖల పుస్తకాలు! గ్రామం తాలూకు పన్నులూ, ఖర్చులూ అన్నీ వ్రాశి, తాలుకాఫీసు లో ‘జమాబందీ’ కి దస్త్రాలని తీసుకెళ్ళేవారు—కరణాలు, మునసబులూ!
వ్యాపారాలు చేసుకొనేవాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆచారాలని బట్టి ఊగాది రోజునో, దీపావళి రోజునో, యేప్రిల్ ఒకటినో—కొత్త దస్త్రాలు తెరుస్తారు!
మరి ఫైలు కి సరైన పదం? ‘కూర్పు’, లేదా ‘గుప్పెన’—ఫైలింగ్ అంటే కొన్ని కాగితాలని ఓ క్రమ పద్ధతిలో కూర్చడమే కదా? మరి ఒక దారానికి కొన్ని పూసలు ‘గుప్పితే’ (అంటే గుచ్చడం, కూర్చడం) అది ‘గుప్పెన’!
కాంట్రాక్ట్ ని తెలుగులో ‘గుత్త’ అంటారు. గుత్తకు తీసుకున్న వాళ్ళు ‘గుత్తదారులు’! మరి గుత్తేదారులు యెక్కడనించి వచ్చారు?
‘శషభిషలు’ లేకుండ, చక్కని తెలుగు మాట్లాడవచ్చు!
తెలుగు రాని వాళ్ళు ‘వెల్ ‘ అనో, మధ్యలో ‘ఆ….’ అనో అన్నట్టు మనం అనకుండా వుంటే చాలు! ప్రతీదానికి ‘ఐ ఫీల్ గ్రేట్’ అనో, ‘ఐ కాంట్ ఎక్స్ ప్రెస్’ అనో అనకుండా చూసుకుంటే చాలు!
గరికపాటి నరసిం హా రావు కూడా, తన భాషణం ముగించి, ‘తెలుగులోనే మాట్లాడదాం’ అని ముగిస్తారు! కాని, తన భాషణం లో అప్పుడప్పుడు ఇంగ్లీషు పదాలు వాడతారు—మనకి ఇంకా బాగా అర్థమవడానికి!
అలాగే ఎస్ పీ బాల సుబ్రహ్మణ్యం కూడా, తన కర్యక్రమాలని పూర్తిగా తెలుగులోనే జరిపిస్తారు—అప్పుడప్పుడు ఒకటో రెండో ఇంగ్లీషు/హిందీ మాటలతో! ఆయన కూడా, పోటీ (కాంపిటీషన్) కి ‘స్పర్ధ’ ఇలా కొన్ని వాడుతుంటారు!
ఇక మన దూరదర్శన్ లో తెలుగు పండితులూ, కవులూ చక్కటి తెలుగులోనే మాట్లాడడం లేదూ?—ఆవృత్తి మొదలైన మాటలతో!
మనకి కావలసింది ముఖ్యం గా గాఢమైన సంకల్పం!
అంతే!