Tuesday, April 28, 2009

“లుగుతె”

“లుగుతె” షభా! “రుమూసుకున్నినో, డుక్కోప!” “న్నన్నయ్యాచి! ద్దన్నాయ్యాపె!” “మిచేస్తున్నారుయే?” ఇదో కోడ్ తెలుగు భాష! ప్రాక్టీసు చెయ్యండి!

Saturday, April 18, 2009

కొంతమంది

(తె)‘లంగా’(ణా) వాదులు
తొలి విడత పోలింగు ముగిసింది—తెలంగాణాలో హస్తం తిరగబడిందంటున్నారు. అందుకే రాజశేఖర రెడ్డి ‘ప్రాంతీయ విభేదాలని’ రెచ్చగొట్టడానికి పూనుకున్నాడనీ అంటున్నారు! నిజంగా తెలంగాణా ఇస్తే మంచిదా, రాష్ట్రం మూడుగానో, నాలుగ్గానో విడిపోతే మంచిదా—అన్న విషయం పక్కన పెడితే, అసలు గొడవంతా ఈ ‘లంగా’ వాదులతోనే వస్తోంది…..యెప్పుడు వచ్చినా! అంతా సవ్యంగా జరుగుతున్నప్పుడు, ఓ (దుర్)రాజ(కీయ) శేఖర రెడ్డి ప్రవేశిస్తాడు. తెలంగాణా మంత్రులూ, ఎంపీలతో సంతకాలు పెట్టించి, ప్రత్యేక తెలంగాణా కావాలని అధిష్టానానికి పంపిస్తాడు. వాడి వ్యక్తిగత కారణాలతో వేరే కుంపటి పెట్టుకున్న కేసీఆర్ ని రెచ్చగొట్టి, పొత్తు పెట్టుకొని, యెన్నికల్లో గెలిచి, తెప్ప తగలేసి, ‘యేకాభిప్రాయం’…….ఇంకా మాట్లాడితే 6 కోట్ల మంది యేకాభిప్రాయం’ అన్నాడు. ఇప్పుడు మూడు ప్రాంతాలూ ఆరు యెడారులుగా మారతాయని హెచ్చరిస్తున్నాడు! నాయకుల మీద చెప్పులు వేయించిందీ, ముఖ్య మంత్రిని దించడానికి హైదరాబులో మత కలహాలు రేపిందీ యెవరూ—అన్నది ‘వేయి రామ మాడల’ ప్రశ్న! ఓ పక్కన అసలు తెలంగాణా ‘ఉద్యమం’ యేదీ? హోల్ ఆంధ్రాయే కాదు—భారద్దేశం మొత్తంలో—ఇంకా మాట్లాడితే ప్రపంచంలో యే ఉద్యమం నడిచినా, దానికి వెన్నెముక—యువతరం! అంటే విద్యార్ధులతో, మహిళలతో కలుపుకుని! శ్రీలంకలో ఎల్ టీ టీ యీ ఈ రోజు మట్టి కరుస్తోందంటే కారణం—యువత వికర్షితులు అవడంవల్లే! యెందుకు జరుగుతోందిలా? యువతమాట—‘పెద్దవాళ్ళున్నారుగా…..చూసుకోడానికి!’ అని. ఇంకా—నేనూ, నా ర్యాంక్, నా కెరీర్, నా పెళ్ళీ, నా ఇల్లూ, నా పిల్లలూ, భవిష్యత్తూ, వీటన్నింటి తరవాత……..తరవాతే……ఇంకేదైనా! అందుకే రాజ్యమేలుతున్నది—డెభ్భై యేళ్ళూ, ఎనభై యేళ్ళూ దాటిన వాళ్ళూ. “కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు” అన్నట్టు, ఈ లంగా గాళ్ళని ఓ పట్టు పట్టాలంటే కావలసినది……. “పావన నవజీవన బృందావన నిర్మాతలు” కదా!

Tuesday, March 10, 2009

వృద్ధి

’35.00.000’ కోట్లు!
ఆర్ధిక వృద్ధి మందగించిన ‘అభివృద్ధి చెందుతున్న దేశాలకి’ అభివృద్ధి చెందిన దేశాలు అందించవలసిన సాయం (ట)! ఈ దేశాల్లో భవన నిర్మాణ రంగం, గనులు, వస్తూత్పత్తి రంగాల్లో వృద్ధి రేటు పడిపోయిందట! మన దేశం అనుకొన్న 8, 7, పోయి, ఇప్పుడు ఆఖరి త్రైమాసికం లో 3 శాతం కన్నా తక్కువకి పడిపోయినా ఆశ్చర్యం లేదు (ట)! సెన్సెక్స్ ఇంకా 8 వేల పైనే వుంది మరి! అనివార్యాన్ని యెదుర్కోవడానికి మన దేశం చేస్తున్నదేమిటి?

Monday, March 9, 2009

స్కామాయణం-3

మనం చెప్పుకున్న రైతుకీ కార్ఖానాకి మధ్య ఒప్పందాలకి లోబడి ఇచ్చే ఋణాలని ‘బంధిత ఋణాలు’ (టైడ్ అప్) అంటారు. విలేఖరులు వ్రాసినట్టు, రైతుల ఋణ పత్రాల మీద కార్ఖానా అధికారుల సంతకాలు వుండవు. వాళ్ళు తమతో ఒప్పందం చేసుకున్న రైతుల జాబితా బ్యాంకులకి ఇస్తాయి. ఆ జాబితా మాత్రం కార్ఖానాకి చెందిన బాధ్యతగల అధికారి సంతకం చేసి పంపిస్తారు. ఆ జాబితాలో వున్న రైతులకి తాము నేరుగా డబ్బు చెల్లించబోమనీ, బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తామనీ ధృవీకరణకూడా వుంటుంది. కొన్ని బ్యాంకులు, రైతుల సౌలభ్యంకోసం ఖాళీ ఋణ పత్రాలని ఒక వూరిలోని రైతులందరకీ సరిపడా పంపించి, అక్కడే సంతకాలు సేకరించి, తెప్పించుకుంటాయి. బ్యాంకు అధికారుల సమయం వృధా కాకుండా వుంటుంది, పైగా రోజూ పదిమందికో పదిహేనుమందికో కాకుండా, ఆ వూరి రైతులందరికీ ఒక్కరోజులోనే ఋణాలందించడానికి వీలవుతుంది. ఇలా ప్రతీ సంవత్సరం సాగుతూ వుండగా, యెప్పుడో యెవరో ఒక కార్ఖానా ఉద్యోగికో యెవరికో బుద్ధి పుడుతుంది—మనంకూడా వీటిని యెందుకు ఉపయోగించుకోకూడదు? ఆని. యెవరో ఒక ఒప్పందం వున్న, ఋణం అఖ్ఖర్లేని రైతు ఫొటోలూ, పట్టాదారు పాస్ బుక్ జెరాక్సులూ సంపాదించి, ఆ పేరు కూడా బ్యాంకు కి పంపించే జాబితాలో చొప్పించి, ఋణ పత్రాల మీద తానే ఆ పేరుతో సంతకాలో, వేలి ముద్రలో వేసేసి, ఆ ఋణం మాత్రం తానే వాడుకుంటాడు. ఇక పెద్దయెత్తున జరిగిందంటే, కొంతమంది ఇలాంటివి బాగా మరిగారన్నమాట! అందుకే అంటున్నది—యే బ్యాంకైనా కంప్యూటర్ల పేరు చెప్పి సరైన నియంత్రణ లేకుండా, సిబ్బందిని తగ్గించేసి, వ్యాపారాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచేసుకుందాం, లాభాలు అర్జించేద్దాం అనుకుంటే దాన్ని మించిన మూర్ఖత్వం వుండదు! ఇది మన విత్తమంత్రులకీ ముఖ్య మంద్తులకీ బాగుండవచ్చు! కానీ ఆర్ధిక వ్యవస్థకి యేమాత్రం మంచివి కాదు!

Saturday, February 28, 2009

స్కామాయణం-2

ప్రతీ సంవత్సరం, వ్యవసాయాధికారులూ, నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (నాబార్డ్), జిల్లాల్లో లీడ్ బ్యాంకులూ కలిసి, యే పంటకి యెంత పెట్టుబడి అవసరం అవుతుంది, మిగిలిన వ్యయాలెంత అవుతాయి, సార్వాకి యెంత, దాళ్వాకి యెంత—ఇలా లెఖ్ఖలు వేసి, యెకరానికి ఇంత అని నిర్ణయిస్తారు. ఆ ప్రకారం బ్యాంకులు ఋణాలు మంజూరు చేస్తాయి. ఇక ఒక పద్ధతిలో, మామూలు జాగ్రత్తలు తీసుకుంటూ, ఋణాలు పంపిణి చేస్తాయి. ఇలా విడివిడిగా కాకుండా, ఒక కార్ఖానా కి అనుబంధంగా, వారి పంట ఆ కార్ఖానాకే ఇస్తామని, వారు చెల్లించే సొమ్ము బ్యాంకులో వారి ఋణ ఖాతాకి జమ కట్టవలసింది అనీ రైతులు ఒప్పందాలు చేసుకుంటారు. చక్కెర పంటకి చక్కెర కార్మాగారాలూ, పొగాకు కి పొగాకు బోర్డూ—ఇలా అన్నమాట. ఇవి తిరిగి వసూలవడం ఖాయం కాబట్టి, ఈ యేర్పాటు తో బ్యాంకులు ‘కళ్ళు మూసుకుని’ ఋణాలు ఇచ్చేస్తాయి! అంటే, నిజంగా కళ్ళు మూసుకుని కాదు—అంత నిశ్చింతగా అని! ఇలా ఇచ్చినా, తమ మామూలు జాగ్రత్తలు—పట్టాదారు పాస్ పుస్తకాల్లో నమోదు చెయ్యడం, దస్తావేజు పాస్ బుక్ నకలు తీసుకుని అట్టే పెట్టుకోవడం, తాము యే సర్వే నెంబర్లలో యెంత విస్తీర్ణానికి యే పంటకి అప్పు ఇచ్చారో సంబంధిత తహసీల్దారు కార్యాలయానికీ, వ్యవసాయాధికారులకి తెలియ చెయ్యడం—లాంటివి తీసుకుంటాయి! నెలవారీ జరిగే సమావేశాల్లో, లీడ్ బ్యాంకు అధికారులూ, అన్ని బ్యాంకుల మేనేజర్లూ, అధికారులూ, జిల్లా అధికారులతో, కలెక్టరు సమీక్షిస్తూ వుంటారు! వీటిని బట్టే రాష్ట్రంలో యే పంట దిగుబడి యెంత వుంటుంది లాంటి అంచనాలు తయారు చేస్తారు! మరి ఇంత పకడ్బందీగా వ్యవహారం జరుగుతున్నప్పుడు, స్కాములకి ఆస్కారం యెక్కడ? సాధారణంగా, ఒక రైతుకి పంట ఋణం అందించాలంటే, బ్యాంకు ఉద్యోగికి కాగితాలు అన్నీ వున్నాయా లేదా, అన్ని చోట్లా సంతకాలు పెట్టారా లేదా అని సరి చూసుకొని, కంప్యూటరులో ఋణ ఖాతా తెరిచి, అందులోంచి రైతు పొదుపు ఖాతాలోకి డబ్బు జమ చేసి, తహసీల్దారుకి ఇతరులకీ పంపవలసిన నివేదికల్లో వివరాలు పొందు పరచడానికి కనీసం ఇరవై నిమిషాలు పడుతుందనుకుందాం. ఇంకా రైతులు సంతకాలు పెట్టిన ఋణ పత్రాలని ఖాళీలు పూరించడానికి ఇంకో పావు గంట పడుతుంది కానీ, వాటిని తరవాతెప్పుడో నింపుకుంటారు—సీజన్ అయి పోయాక! ఈ లెఖ్ఖన రోజూ యెంతమంది రైతులకి పంట ఋణాలు మంజూరు చెయ్యగలరు? పంట ఋణాల సీజన్ లో బ్యాంకుల దగ్గర వుండే రైతు సమూహాలని యెప్పుడైనా చూశారా?బ్యాంకు చుట్టూ వున్న అన్నిరకాల వ్యాపారాలూ మహజోరుగా సాగుతాయి! ఒక బ్యాంకు శాఖ అక్షరాలా అయిదువేల యేడువందల తొంభై యెనిమిది మందికి పంట ఋణాలు మంజూరు చేసిందంటే—ఒక్కొక్కడికీ కనీసం ఇరవై నిమిషాల చొప్పున యెన్ని వేల గంటలు పడుతుంది? ఇదసలు సాధ్యమేనా? సాధ్యం చేస్తున్నాయి మన బ్యాంకులు! ‘ఔట్ సోర్సింగు’ ద్వారా! మరి ఇక్కడే లొసుగులు వుంటాయి! (మిగతా మరోసారి)

Friday, February 27, 2009

స్కామాయణం

బ్యాంకులకి మన రిజర్వ్ బ్యాంక్ ద్వారా ప్రభుత్వం కొన్ని నిర్దేశాలు చేస్తూ వుంటుంది—బ్యాంకులిచ్చే ఋణాల్లో ఖచ్చితంగా ఇంత శాతం వ్యవసాయానికీ, ఇంత శాతం యెగుమతులకీ, చిన్నతరహా పరిశ్రమలూ, రవాణా, చిల్లర వ్యాపారాలకీ, గృహ , విద్యా, స్వయం ఉపాధి లాంటి ప్రాధాన్యతా రంగాలకీ—ఇలా ఇవ్వాలి! మిగిలినదే తన ఇష్టం వచ్చినట్లు—వ్యక్తిగత ఋణాలూ, వాహన కొనుగోలు ఋణాలూ ఇలాంటి ఋణాలు ఇచ్చుకోవచ్చు! ప్రతీ బ్యాంకూ, లెఖ్ఖల ప్రకారం నిర్దేశిత శాతం (ప్రస్తుతం తమ మొత్తం డిపాజిట్లలో ఒక శాతం) వ్యవసాయ, వ్యవసాయాధారిత ఋణాలు మంజూరు చేస్తూనే వుంటాయి. మరి నగరాల్లో తప్ప ఒక్క గ్రామం లోనూ ఒక్క శాఖా లేని ఐ సీ ఐ సీ ఐ బ్యాంకు లాంటి బ్యాంకులు తమ వ్యవసాయ ఋణాల్లో నిర్దేశిత లక్ష్యాలని యెలా చేరుకొంటున్నాయి? అని మన జాతీయ బ్యాంకుల యాజమాన్యాలు తలలు బద్దలు కొట్టుకున్న రోజులు వున్నాయి! నిజంగా ఇదొక చిన్న ఠస్సా! (ట్రిక్!) నగరాల్లో పెద్ద పెద్ద కోల్డ్ స్టోరేజీలు కట్టించడం—కూరగాయల దగ్గర నించీ, మాంసం, చేపలూ, ఆకు కూరలూ, పువ్వుల వరకూ నిలవ చెయ్యడానికి—వాటికి ఋణాలు ఇవ్వడం! (కొన్ని వందల కోట్లు వీటికి ఇచ్చెయ్యవచ్చు) ఇవి కాకుండా, గ్రామాల్లో ఒక యేజంటునో, యేజన్సీనో నియమించి, ఒక సభ జరిపించి, ఋణ పత్రాలమీద రైతుల సంతకాలు తీసుకొని, అక్కడికక్కడే పంట ఋణాలు పంపిణీ చేసెయ్యడం! (ఒక్క రోజులోనే కొన్ని వందల గ్రామాల్లో ఇంకొన్ని వందల కోట్లు ఇలా ఇచ్చెయ్యవచ్చు!) మామూలుగా బ్యాంకులు గానీ, సహకార బ్యాంకులు గానీ, వ్యవసాయ పరపతి సంఘాలుగానీ, ఇప్పుడు—అంటే ఈ పంటకి ఇచ్చిన ఋణాలని పంట రాగానే తిరిగి చెల్లించమంటాయి. మళ్ళీ రెండో పంటకి అప్పు ఇవ్వాలిగా? అందుకని మీరు ఇవాళ కట్టెయ్యండి, మళ్ళీ రేపు తీసుకోండి! అంటాయి. ఇలా నూరు శాతం వసూళ్ళు చూపించుకొని, నూరు శాతం మళ్ళీ అప్పులిచ్చినట్టు చూపిస్తూ వుంటాయి! ఇక కొత్త ఋణాలంటారా! వ్యవసాయ యోగ్యం కాని భూమి వ్యవసాయ యోగ్యం అయితేనేకదా—కొత్త ఋణాల ప్రసక్తి? (ఇలాంటి కేసులు చాలా తక్కువ.) లేక పోతే భూమి అదే—యజమాని మాత్రమే మారతాడు! అంతే! ఇలాంటి పరిస్థితుల్లోనే ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పంట ఋణాల ‘స్కాము’ల్లాంటివి జరుగుతున్నాయి! (మిగతా మరోసారి)

Thursday, February 26, 2009

బ్యాంక్

దీనికి తెలుగులో మన 'పారిభాషిక భాషా పద కోశం' కూడా సరైన పదం ఇవ్వలేక పోయింది! భాష పుట్టక క్రితమే, బ్యాంకింగ్ జరిగేదట! ఒక చెట్టు బెరడు మీద, అప్పు ఇచ్చిన వాడికి ఓ గుర్తూ, తీసుకున్నవాడికో గుర్తూ, తీసుకున్న మొత్తానికో గుర్తూ, తీర్చవలసిన గడువుకో గుర్తూ, ప్రతిఫలం యేమైనా అనుకుంటే దానికో గుర్తూ—ఇలా గుర్తులు వేసి, దాన్ని నిలువుగా సరిగ్గా సగానికి చీల్చి, ఋణ దాత దగ్గరోటీ, గ్రహీత దగ్గరోటీ పెట్టుకునేవారట—సాక్షికో గుర్తు తో సహా! అదీ బ్యాంకింగుకి ఆది! ఇకపోతే, మన తొలి తెలుగు నవల ‘రాజశేఖర చరిత్రం’ లో గానీ, తొలి తెలుగు నాటకం ‘కన్యాశుల్కం’ లో గానీ బ్యాంకుల ప్రసక్తి రాలేదు! చిలకమర్తివారి గణపతిలో మాత్రం, వాళ్ళ తాత పునహా, సతారాల్లో (పెళ్ళికోసం) సంపాదించిన సొమ్ము ‘నారాయణ కర్ను’ గారి మీద ‘దర్శన హుండి’ వ్రాయించి తెచ్చుకున్నాడు గానీ, నారాయణ కర్ను గారిని బ్యాంకరు అని వ్రాయలేదు! మన తొలి తెలుగు బ్యాంకరు శ్రీ భోగరాజు పట్టాభి శీతారామయ్య గారు సైతం, ఆంధ్రా బ్యాంక్, భారత లక్ష్మీ బ్యాంక్ అనే పెట్టారుగానీ, తెలుగు పదం సూచించలేదు! గౌరవ తెలుగు పండితులెవరైనా, లేదా రీసెర్చ్ స్కాలర్లెవరైనా ఈ విషయం లో పరిశోధిస్తే, వాళ్ళకి డాక్టరేటు రావడమే కాదు—మనం కూడా సంతోషిస్తాం! అవునా? పీ. ఎస్.:- మన తాతల కాలం లో వుంటూ వుండే ‘భోషాణం పెట్టె’ కన్నా పెద్ద బ్యాంకరు యెవరండీ?