కొన్ని నిజాలు
యేమాటకామాటే చెప్పుకోవాలి! పాపం ఇందిరాగాంధీ మనిషి చాలా మంచిదే (గుణమే.....అని నేననలేదండోయ్!).
ఆంధ్ర ప్రదేశ్ గురించి ఆవిడ అభిప్రాయాలు చూడండి......
"వేలాది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ విభిన్న సంస్కృతుల కేంద్రంగా విలసిల్లింది. రాష్ట్రంలో నేడున్న అన్ని ప్రాంతాలు చరిత్రలో చాలాకాలంగా ఒకే గొడుగు కింద ఉన్నాయి. తెలుగు ప్రజలు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దశాబ్దాలుగా పోరాడటానికి ఈ సుదీర్ఘచరిత్రే కారణం కావొచ్చు."
"భాషా ప్రయుక్త రాష్ ట్రాల అంశం జాతీయోద్యమంలో ఓ భాగమనేది వాస్తవం. దీన్ని విస్మరించలేం. ప్రస్తుతం మనుగడలో ఉన్న ప్రతి ప్రాంతం ఒకప్పుడు భాషా ప్రాతిపదికన ఏర్పడినదే. వివిధ రాష్ట్రాల ఏర్పాటులో విస్తృతమైన హేతుబధ్ధత ఉంది. క్షణికావేశంలో ఈ పునాదికి బీటలు పడకుండా చాలా జాగ్రత్తగా వుండాలి."
"సమైక్య రాష్ ట్రానికే నేను కట్టుబడి ఉన్నాను. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయన్నది ఇక్కడ అంశం కాదు. మీరు ఎవరో ఒకరికి పొరుగువారిగానే వ్యవహరించాలి. అనేక అంశాల్లో పరస్పరం పరిష్కరించుకోవాలి. విడిపోవడం ద్వారా ఈ ప్రజలను మనం వదిలించుకున్నామనో...లేదా సమస్య నుంచి తప్పించుకున్నామనో అనుకోవడం చాలా తప్పుడు అభిప్రాయం. అది మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్న నిజం!"
ఇలా నిష్కర్షగా తన అభిప్రాయాన్ని యెందుకు చెప్పదు కాంగీ (సోనియా) పార్టీ?!
1973 లో ప్రత్యేక ఆంధ్రోద్యమం చివరి రోజుల్లోనో, రాష్ ట్రం లో రాష్ట్రపతి పాలన విధించాకో ఆవిడ చెప్పిన పై మాటలు సహజంగా యువకులమైన మాకు యేమాత్రం రుచించలేదు....నచ్చలేదు!
ఇప్పుడు వింటే, యెంతబాగా చెప్పిందో! అనిపిస్తుంది.
ఇప్పటి యువత సంగతీ, ఓ పాతికేళ్ల తరవాత ఇంతే అంటే కాదంటారా?