Friday, August 19, 2011

కేరళలోని......4



......ఆలయాలూ, ఆచారాలూ

"గురువాయూరప్పా! అనువగు తెరువే ఇదియప్పా! దినము దినమునా ఈ యుగమందున తిరునాళ్లేనప్పా! గురువాయూరప్పా....." ఇది ఓ నలభై యేళ్లక్రితం భక్తిరంజనిలోననుకుంటా మన ఆకాశవాణిలో నాకు వినిపించిన పాట. స్వామి అయ్యప్ప కన్నా ముందు, పళని స్వామి కన్నా ముందు, ఈ యాత్ర వుండేదిట. 

అలాంటి గురువాయూరు దర్శించడం ఓ మంచి అనుభూతి! 

ద్వాపర యుగాంతంలో ద్వారక సముద్రంలో మునిగిపోయినప్పుడు, శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని యెలా కాపాడాలా అని అలోచించిన "గురువు" అంటే బృహస్పతి, వాయువుని వేడుకొన్నాడట. వాయువు వొప్పుకొని, శ్రీకృష్ణుడి విగ్రహాన్ని మోసుకొంటూ వచ్చాడట. ఆ విగ్రహాన్ని యెక్కడ పెట్టాలి అనే మీమాంసలో, గురువు వెతుక్కుంటూ దక్షిణాదికి వచ్చి, ఓ కొండమీదున్న శంకరుణ్ణి వేడుకొన్నాడట--నువ్వు కొండ దిగితే, ఇక్కడ కృష్ణుణ్ని పెట్టుకొంటాం--అని. శంకరుడు వొప్పుకోగానే, అక్కడ శ్రీకృష్ణుణ్ని వెలిపించారట! అందుకనే ఆ గుడికి "గురు-వాయు" ఊరప్ప అని పేరు వచ్చిందట. ఆ గుడిని ఖాళీ చేసిన శంకరుడు, కొండ క్రింద "మైమ్మాయూర్" (మహిమ వల్ల యేర్పడ్డ వూరు) కి చేరాడట. గురువాయూరు దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో ఈ శంకరుణ్ని దర్శించుకుంటారు. 

గురువాయూరు పెద్ద దేవస్థానం. కాంప్లెక్స్ చాలా విశాలంగా వుంటుంది. సీజన్లో (దేవుళ్లకి కూడా సీజన్లు వుంటాయి!) ఆవరణ అంతా ఇసకేస్తే రాలనంత మంది భక్తులు వుంటారట. కారు పార్కింగ్ కి వెతుక్కుని, అక్కడ ధోతీ, కండువా లోకి మారి, (పేంట్లూ చొక్కాలూ బనీన్లూ విప్పేసి) గుడి ఆవరణలోకి, అనేక షాపులూ, హోటెళ్లూ వగైరాలు దాటుకుంటూ, వెళ్లి క్యూలో నిలబడాలి. 

అదృష్టమేమిటంటే, ప్రతీరోజూ సాయంత్రం 6 గంటలకి, సీనియర్ సిటిజెన్లకి ఓ ప్రత్యేక క్యూ వుంటుంది. 

మా డ్రైవెర్ కం గైడ్ "సంతోష్" పుణ్యమా అని, మాకు ఈ సంగతి తెలిసింది. తనుకూడా, అధికారులదగ్గర ప్రత్యేక అనుమతి తీసుకొని మరీ మమ్మల్ని ఆలయ ప్రవేశం చేయించాడు ఆ క్యూలో!

....మరోసారి.

కేరళలోని......3



......ఆలయాలూ, ఆచారాలూ

చొట్టాన్నికర--ఇదొక దేవీ ఆలయం. తమిళనాడులోని మూకాంబికలా ప్రఖ్యాతం (ట). 

ఓ ప్రాచీనాలయం వుంది--క్రిందకు దిగి వెళితే. ముందు క్రొత్త ఆలయం వుంటుంది. చక్కగా ఆలయం చుట్టూ చెక్కతో వరసలు యేర్పరిచి, వాటిమీద ప్రమిదల్లో నూనె దీపాలు వెలిగిస్తారు. చీకటిపడే టైముకి అన్ని దీపాలూ వెలిగిపోతాయి--అలా యేర్పాటు చేశారు. ముందు ఓ గణపతి గుడీ, దాని ముందు దీప స్థంభం (ఓ స్థంభానికి అరలు అరలుగా ప్రమిదలు బిగించి, ఓ ఫౌంటేన్ లా దీపాలు వెలిగిస్తారు).

దర్శనానికి టిక్కెట్టు లేదు. పంచె నిబంధన లేదు గానీ, చొక్కా, బనీను విప్పేసి, చేతిమీద వేసుకోవాలి. గర్భగుడిలోపల మాత్రం ఫోటోలు నిషిధ్ధం. 

ఆ ప్రక్కనుంచి నడుచుకుంటూ వెళితే, ప్రాచీన ఆలయం వుంది. అక్కడకూడా పై నిబంధనలే. ప్రత్యేకత యేమిటంటే, మంగళ, శుక్ర వారాల్లో "గురిది" అని జరుగుతుందట. ఘటాలని ధరించి, డప్పులూ వగైరాలతో జరిపిస్తారట. భక్తులకి పూనకాలు వస్తాయట. మానసిక రోగులని సంకెళ్లు వేసి కూడా తీసుకొస్తూంటారట. ఇతర వికలాంగులకి కూడా నయం అయిపోతుందని నమ్మకమట. రాత్రి 9 దాటాక మొదలవుతుంది అన్నారు. మేము వుండలేదు.

Tuesday, August 16, 2011

కేరళలోని......2




......ఆలయాలూ, ఆచారాలూ

(ఇంతకు ముందటి నా టపాలో ఓ చిన్న పొరపాటు దొర్లింది. అప్పటికి మైనరుగా వున్న మహారాజు మహారాణిగారి మేనల్లుడు కాదు. అంతకు ముందటి మహారాజు మేనల్లుడు. యెందుకంటే అప్పట్లో "మాతృస్వామ్యం" అమలులో వుండేది.)

కాలడి--జగద్గురు శంకరాచార్యులు పుట్టిన వూరు. పెరియార్ నది శాఖ ప్రక్కనే వుంది. ఆయన తరువాతివాళ్లలో ఒకరైన ఓ శృంగేరీ పీఠాధిపతి పరిశోధన చేసి, కాలడి లోని శంకరుల తల్లి సమాధిని కనుగొన్నారట. ఆ ప్రక్కనే వున్న ఇంట్లోనే శంకరుని జననం జరిగిందని నిర్థారించి, శంకరుడికి కూడా ఓ గుడి నిర్మాణం జరిగింది. ముందు శారదాంబ గుడి, తరువాత శంకరుని తల్లి సమాధి (అప్పటిలో పాతిన ఓ శిలా దీప స్థంభం ఇప్పటికీ వుంది), గణపతి ఆలయం, శంకరుని ఆలయం వున్నాయి ఆ ఆవరణ లో. దర్శనానికి టిక్కెట్టులేదు. కారు పార్కింగుకి, చెప్పులకి టిక్కెట్లు లేవు. అర్చనకి మాత్రం 10 రూపాయలనుకుంటా టిక్కెట్టు. పంచె, చొక్కా నిబంధన లేదు. ఫోటోలూ వీడియోలూ నిషిధ్ధం. అలా అని అవన్నీ డిపాజిట్ చేసెయ్యమనలేదు. శంకరుని గుడి ముందు మంటపం లోపల చుట్టూ శంకరుని జీవిత ఘట్టాల వర్ణ చిత్రాలు ప్రదర్శించారు. అక్కడ ఓ వీడియో కెమేరా, ఫ్లాష్ లైట్లూ తో హడావిడి కనిపిస్తే, యేదైనా సినిమా షూటింగా అని అడిగాను. కాదు--మఠం వాళ్లు తీయిస్తున్నారు అని చెప్పారు. అదన్నమాట సంగతి.

అలువ (అల్వేయి) లో, పెరియార్ నది ప్రక్కనే ఓ ప్రసిధ్ధ శివాలయం వుంది. మేము వెళ్లేసరికి సమయం మించిపోయింది. బయటనుంచే ఫోటో తీసుకొని వచ్చేశాము.

ప్రత్యేకత యేమిటంటే, ఆలయాలూ, రాజ ప్రాసాదాలూ వగైరాలు చాలా మటుకు నాలుగు వైపులా షెడ్డుల్లా నిర్మించి, పై కప్పుని కలపతోనూ, బంగాళా పెంకుతోనూ నిర్మించారు. కేరళలో వర్షపాతం యెక్కువ, కలప విరివిగా దొరుకుతుంది అనే కారణాలతో అయి వుండొచ్చు. గాలి గోపురాలూ, గర్భ గుడిపైన విమానాలూ వుండవు. మనవాళ్లకి కొంచెం ఆశ్చర్యంగా వుంటుంది.


Sunday, August 14, 2011

కేరళ లోని......



......ఆలయాలూ, ఆచారాలూ

అనుకోకుండానే మొన్న ఓ చిన్న పనిమీద  (ఆ పని విషయం వేరే టపాలో) కేరళ వెళితే, ఆ పని అయ్యాక, యెలాగూ వచ్చాముకదా అని, దేవాలయాలు చుట్టివచ్చాము--ఇతర ప్రదేశాలతోపాటూ.

తిరువనంతపురం లోని అనంత పద్మనాభ స్వామి ఈ మధ్య వార్తల్లోకి యెక్కాడుకదా--లక్ష కోట్లకి పైగా సంపదతో, బాలాజీని మించాడు అంటూ! వెళ్లి చూసి వచ్చాము--గుడినీ, దేవుణ్నీ మాత్రమే. (ఆ నేలమాళిగలూ వగైరా చూడనివ్వడం లేదు)

ఇక్కడ ఆచారం యేమిటంటే, మగవాళ్లు పైన చొక్కా, బనీనూ వగైరా లేకుండా, పెంచె మాత్రమే కట్టుకొని లోపలకి వెళ్లాలి. ఆడవారు చీరలూ, సల్వార్ కమీజు వేసుకోవచ్చుట. మోడరన్ డ్రెస్సులు మాత్రం నిషిధ్ధం.

చరిత్రలోకి వెళితే, అసలు ఈ ఆచారం యెలా యేర్పడింది? అనేదానికి సమాధానం వొక్కటే--జంధ్యం వేసుకొనే అగ్రవర్ణాలవారికి మాత్రమే ఆలయంలోకి ప్రవేశం వుండేది అప్పట్లో! అది స్పష్టంగా కనిపించడానికే ఈ యేర్పాటు.

1930 ల్లో గాంధీ గారు ఓ సభలో వుండగా, ఓ చిన్నపిల్ల ఆయనని అడిగిందట--ఆలయం చుట్టూ వీధుల్లో అందరూ స్వేచ్చగా తిరుగుతున్నారు, దేవుడి పనులు కూడా చేస్తున్నారు, మరి ఆలయంలోకి యెందుకు వెళ్లకూడదు అని ప్రశ్నించిందట. ఆయన అప్పటి ధర్మకర్త అయిన మహారాణివారిని ఆ ప్రశ్న ఆడిగాడట. దానికి ఆవిడ "అనాదిగా వస్తున్న ఆచారం" అని చెప్పిందట. 

అప్పటికి "మైనరు" గా వున్న మహారాజు (మహారాణిగారి మేనల్లుడు) ఆ క్షణంలోనే నిశ్చయం చేసుకొన్నాడట. తరువాత ఆయన మైనారిటీ తీరి, రాజు అవగానే పట్టాభిషేక సభలోనే "సర్వజనులకీ ఆలయ ప్రవేశం" ప్రకటన చేశాడట.

బిడ్డపోయినా.....అన్నట్టు, ఆ ఆచారం మాత్రం కొనసా....గుతోంది. 

పులిని చూసి......అన్నట్టు, ఆ రాష్ట్రంలో మిగతా ఆలయాలవాళ్లు అలాంటి ఆచారాలనే కొనసాగిస్తున్నారు--చిన్నా చితకా ఆలయాలతో సహా! కొన్నింటిలో ధోతీ నియమం లేదు--పేంటు ధరించవచ్చు. చొక్కా, బనీనూ మాత్రం విప్పేసి, చేతిమీద వ్రేళ్లాడేసుకొని, వెళ్లిపోవచ్చు.

ఇంక కెమేరాలూ, సెల్ ఫోనులూ నిషిధ్ధం. ఫోటోలు తీయడం నిషిధ్ధం. కొన్నిచోట్ల గర్భగుడిలో తప్ప, బయట ఫోటోలు తీసుకోవచ్చు. వీడియోలు నిషిధ్ధం! (టెర్రరిజం వంక వీటికి--పురాతన ఆచారాల ముసుగు! అక్కడికి దేవుడి ఫోటో తీస్తే ఆయన మహిమ తగ్గిపోతుందేమో మరి!)

అదీ సంగతి. 

Saturday, July 9, 2011

అబధ్ధాలూ, పచ్చి అబధ్ధాలూ, మరియు గణాంకాలూ

మన ప్రభుత్వ గణాంకాలు

దువ్వూరివారు మొన్న వుండబట్టలేక అనేశాడు--మన ప్రభుత్వ గణాంకాలు సరైన దృశ్యం చూపించడంలేదు అనీ, వాటిని వివిధ రకాలుగా సవరించుకొని అర్థం చేసుకోవలసి వస్తూంది అనీ, వృధ్ధి రేటు, ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా దానికి అతీతం కాదు అనీ! (వెంటనే ప్రభుత్వ 'గణాంకులు ' ఆయనమీద 'వూచల్లా వుబ్బెత్తున ' లేచారు! అది వేరే సంగతి.)

బ్యాంకు వుద్యోగులకి, దశాబ్దాల ట్రేడ్ యూనియన్ పోరాటాల ఫలితంగా, ఆ నాయకుల దూర దృష్టి ఫలితంగా, 'కరువు భత్యాన్ని ' "వినియోగదారుల ధరల సూచీ--సీ పీ ఐ--కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్" ఆథారంగా లెఖ్ఖించడం ప్రవేశపెట్టారు. అంతేకాకుండా, ప్రభుత్వ, యాజమాన్యాల ప్రమేయం లేకుండా, సీ పీ ఐ మీద ఆథారపడి, కరువు భత్యం పెరిగేలా/తగ్గేలా యేర్పాట్లు చేశారు. (ఆ మహానుభావులు యేలోకానవున్నారోగానీ, ఇప్పటిక్కూడా, మా పెన్షన్లమీద దాని ప్రభావం చక్కగా వుంది!) నిజం చెప్పాలంటే, బ్యాంకు వుద్యోగులెప్పుడూ ద్రవ్యోల్బణం గురించి పెద్దగా బాధపడలేదు!

నేను బ్యాంకులో చేరినప్పటికి (1973) సీ పీ ఐ "బేస్" 1960 = 100. అంటే, 1960లో సీ పీ ఐ యెంత వుందో ఆ గణాంకాన్ని ఆథారంగా చేసుకొని, తరువాత సీ పీ ఐ యెంత పెరిగిందో దాన్ని బట్టి, ఆటోమేటిక్ గా, ప్రతీ ఫిబ్రవరి, మే, ఆగస్ట్, నవంబరు నెలల్లో కరువు భత్యాన్ని సవరించేవారు--అది పెరిగినా తగ్గినా. అందుకే, "బ్యాంకు వాళ్ల జీతాలు యెక్కువ!" అని యేడిచేవారు ఇతర వుద్యోగులూ, సామాన్యులూ.

రాను రాను, ఆంధ్రా బ్యాంకు వుద్యోగులచేత 61 రోజుల సమ్మె చేయించిన (కమ్యూనిస్టు పార్టీ సభ్య ట్రేడ్ యూనియన్) నాయకులు--ఆ సమ్మె సఫలం అయితే, కార్మికులకి చాలా మంచిది, విఫలం అయితే, ప్రభుత్వాలకి మంచిది!--ఇందిరాగాంధీ సూచనలమేరకు, అప్పటి రాజకీయ అవసరాల నిమిత్తం--వెన్నుపోటు పొడిచారు! సమ్మె విఫలం అయ్యింది. (చివరగా పార్టీ "క్లోజ్డ్ డోర్" మీటింగులో, మా నాయకుడు కామ్రేడ్ దువ్వూరి కృష్ణ మూర్తి తన చుట్ట నుశి దులిపేస్తూ, "మీరేమి నిర్ణయం తీసుకున్నా నాకు దీనితో సమానం" అని వాక్ అవుట్ చేశారట!). నిజంగా ఆయనెంత గొప్ప నాయకుడంటే, ఆ సమ్మె ఫలితంగా, వుద్యమం ఫలితంగా, వుద్యోగాలని కోల్పోయిన వాళ్లని సైతం, మళ్లీ వుద్యోగాలలో చేరేలా చేసి, ఏ ఒక్క వుద్యోగీ 'వెంట్రుక ' కూడా వూడకుండా, అందరినీ రక్షించారు--1975 మార్చి లోగా!

తరువాత, ట్రేడ్ యూనియన్లు కాంగీ తో కుమ్మక్కయి, అంతకు ముందు వున్న 'సెటిల్ మెంట్లనీ', వ్యవహారాలనీ కాలరాయడం ప్రారంభించాయి. (ఏమర్జెన్సీ పుణ్యమా అని, నాలుగేళ్లకోసారి జరిగే వేజ్ రివిజన్లు వెనకబడ్డాయి. కమూనిస్ట్ పార్టీలు ఎమర్జెన్సీని సమర్థించదమే దీనికి కారణం.) తరువాత, ఓ కొత్త విధానానికి తెరతీశాయి ఆ పార్టీలు. అదే "డీ యే మెర్జర్"! అంటే, 1960 బేస్ గా లెఖ్ఖిస్తున్న సీ పీ ఐ ని, బేస్ 1970 గా మార్చి, అక్కడివరకూ పెరిగిన పాయింట్లని "బేసిక్" లో కలిపెయ్యడం, డీ యే కోసం కొత్త లెఖ్ఖింపు ప్రారంభించడం. ఇప్పటికీ ఆ విధానం కొనసాగుతూనే వుంది.

చెప్పొచ్చేదేమిటంటే, 1960 బేస్ గా వున్న సీ పీ ఐ మీద యెంత పెరుగుదల వుందో, అంతా కరువు భత్యం ఇవ్వాలా వద్దా? మధ్యలో "బేస్" మార్చడం యెందుకు? ఇది సామాన్యులకి అర్థం కాదు!

అలాగే, ద్రవ్యోల్బణం సూచీలని--డబ్ల్యూ పీ ఐ--హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆథారంగా లెఖ్ఖించడం (పరిగణనలోకి తీసుకొనే వస్తువుల్లో నట్లూ, బోల్టులూ వంటివాటి ధరలని పరిగణించడం తప్పు) అనీ, పైగా "బేస్" ని మార్చడం శుధ్ధ పొరపాటు అనీ, ఇప్పుడు ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం "ఒక నెల క్రితం ఇదే తారీఖున" వున్న రేట్లని బేస్ గా గరహించడం పెద్ద బ్లండర్ అనీ--దువ్వూరివారే కాదు, యెవరైనా వొప్పుకోవలసిందే కదా?

ఈ లండాచోరీలు ఇలా వుంటే, వో ప్రక్కన మన దేశ కంపెనీలు, మనదేశంలో పెట్టే పెట్టుబడులు తగ్గిపోతున్నాయట! అవునుకదా? ఆంధ్ర లో తెలంగాణా; ఒరిస్సా కర్ణాటకల్లో పోస్కో; యూపీలో రాహుల్; ప. బెంగాల్లో మమత; గుజరాత్ లో సీ ఎం మీద అనేక కేసులూ, ఆరోపణలూ; ఛత్తీస్గఢ్, వుత్తరాఖండ్ లాంటి, ఈశాన్య రాష్ట్రాల్లాంటి చోట్ల మావిస్టులూ వగైరాలూ; పేట్రేగి పోతుంటే, (కాశ్మీరులోనైతే, 'మ్యూజిక్ షో'లు కూడా జరగట! మ్యూజిక్ షోలకి అనుమతి ఇస్తే, వ్యభిచారానికి యెందుకు ఇవ్వకూడదు? అనె ఫేస్ బుక్ మొత్తం నిండిపోయిందట! ఇంకా అక్కడ సినిమాలు గత మూడేళ్లుగా ప్రదర్శింపబడడంలేదట. సెల్ ఫోన్లవల్ల ఆడపిల్లలు చెడిపోతున్నారట, అందుకని వాటిని 'ఝీలం ' నదిలో పారెయ్యాలట! ఇంకా, ఓ సెకండరీ స్కూల్ లోని ఆడా, మగా పిల్లలందరూ, తమ ప్రథానోపాధ్యాయుల, ఇతర వుపాధ్యాయుల/వుపాధ్యాయినుల పర్యవేక్షణలో పిక్ నిక్ కి వెళ్లినా, అది తప్పట!) యేమి జరుగుతుంది?

ఇలాంటి పరిస్థితుల్లో, దేశంలో యెవరు పెట్టుబడులు పెడతారు? అని మేథావులని పట్టి పీడిస్తున్న ఓ సందేహం!

మీరేమన్నా జవాబు చెప్పగలరా? ప్రయత్నించండి!

2014 వరకూ ఆగాలా? అది కూడా చెప్పండి మరి!!!!!

Friday, July 8, 2011

యూపీయే ప్రభుత్వమూ

కాంగీల వ్యవహారం

రోకలి నానేసి, అది పూర్తిగా కరిగినప్పుడే "సరైన సమయం" అనీ, అప్పుడే "సరైన నిర్ణయం" అనీ జనాలని నమ్మిచడంలో వుద్దండులు కాంగీలు. లేకపోతే, 13 మంది ఎంపీల రాజీనామాలని పరిశీలించడానికి స్పీకరమ్మకి ఆగస్ట్ 1 వరకూ పడుతుందట. అప్పుడు తీరిగ్గా వాటిగురించి "మాట్లాడుతుందట"! గులాం నబీ అంటాడూ, "విస్తృత ప్రజాభిప్రాయం" సేకరించాలట. అన్ని కోట్లూ, అంత సమయం తగలెట్టి, శ్రీకృష్ణ కమిటీ చేసిందేమిటో? పిచ్చి 'దంబరం '--ఆ రెండు పార్టీలూ తమ అభిప్రాయం చెప్పాలి, అప్పటి వరకూ యేమీ చెయ్యలేము ' అంటాడు. ఆ రెండిట్లో ఒకటి తమ పార్టీయేనట! రెండోది తెలుదేశం. వాళ్లు ప్రణబ్ ముఖర్జీకి చెప్పినా, శ్రీ కృష్ణ కమిటీకి చెప్పినా, వాళ్ల ఎంపీలు కూడా రాజీనామా చేసినా, అది స్పష్టమైన అభిప్రాయం కాదట!

ఇంక పెట్టుబడిదారీ పత్రికల్లో, అనేక పరిష్కారాలు సూచించబడుతున్నాయి. అందులో ఒకటి, తెలంగాణా ఇచ్చేసి, హైదరాబాదుని మాత్రం "హాంకాంగ్" తరహాలో స్థానిక ప్రభుత్వం చేతిలోనే వుంచాలట. అప్పుడే సీమాంధ్ర వాళ్లకి నమ్మకం వుంటుందట! హాంకాంగ్ పరిస్థితి వేరు అనీ, అది రెండు దేశాల మధ్య తగాదాకి పరిష్కారం అనీ మరిచిపోతున్నారు! మరి అలా అయితే, మన దేశం లోనే 'చండీగఢ్' వుందికదా? దాన్ని పంజాబ్, హర్యాణా రెండు రాష్ట్రాలకి రాజధానిగా వుంచారు కదా? అదీ ఓ పరిష్కారమే కదా? అసలు సమస్య సృష్టించబడడానికి మూలం యేమిటీ, దాని పరిష్కారం అవసరమా, అయితే అదెలాగ అనేవి వొదిలేసి, యెందుకు విషయాన్ని జటిలం చెయ్యడం?

ఇదివరకు రెండుసార్లు ఇందిరాగాంధీ పరిష్కరించిన విధానం యెలాగూ అందుబాటులోనే వుంది. ఎస్ ఎల్ నరసిమ్హం గారు తమ అస్త్రాన్ని యెప్పుడో పదునుపెట్టి వుంచారు. అందుకనే, కాంగీ ఎంపీలు ముఖాలు వ్రేళ్లాడేసుకొని వెనక్కి వచ్చేశారు. కోదండరాం, కేసీఆర్ ప్రకటించిన వుద్యమ కార్యక్రమమే ఐకాస కార్యక్రమమని ప్రకటించినవాడు, మళ్లీ అన్నిపార్టీల అభిప్రాయం అంటూ కార్యక్రమాన్ని వాయిదా వేశాడు. (కేసీఆర్ యేమీ మాట్లాడడం లేదు--ఇప్పుడు అందరు నేతలూ "ఒకే తాటి" పైకి వచ్చారని ప్రకటించారు కాబట్టి, రేపటి నుంచి ఆ తాటిని ముక్కలు చెయ్యడం మొదలెడతాడు చూడండి!).

అసలు గొడవంతా, నేనే అధిష్టానం అని విర్రవీగిన కేకే, ఇతర సీనియర్లు అధిష్టానం దగ్గర వొకరిమీద వొకరు చెప్పుడుమాటలు చెప్పుకొన్న ఫలితంగా, సీ డబ్ల్యు సీ పదవి వూడగొట్టడంతో వచ్చింది--ఆవేశం కట్టలు తెంచుకోడం!

అయినా, అధిష్టానం లెఖ్ఖలు వాళ్లకున్నాయి మరి!

మరి పరిష్కారం అంటారా? రోకలి నానాలికదా?!

Tuesday, June 28, 2011

తెలంగాణ భాషా........


......."తెలుగు భాష" వేరా?

"తెలుగు భాష" కు అక్షరములెన్నీ? అవి యేవి? (యే ఆరో క్లాసు తెలుగు పరీక్షాపత్రంలోనో ఆ ప్రశ్న వచ్చిందనుకోండి--ఇప్పటి తెలివైన విద్యార్థులు "తెలుగు భాషకు అక్షరములు యేబదియారు (56). అవి 'అ మొదలు ఱ ' వరకూ--అని ఠక్కున చెప్పేస్తారు). 
 
ఓ వెయ్యి సంవత్సరాల క్రితం (అప్పటికి ఆరో క్లాసు లేదనుకోండి), సమాధానం వేరేగా వుండేది. ఓ ఐదువందలేళ్ల క్రితమైతే వేరే సమాధానం వచ్చేది. ఇంక, మూడు వందలా, రెండువందలా, వంద సంవత్సరాల క్రితం కూడా వచ్చిన సమాధానం, ఇప్పటి తెలివైన తెలుగు విద్యార్థులు చెప్పేదేననుకుంటా. యెందుకంటే, మొదట్లో తెలుగు భాషకి "అచ్చులూ, హల్లులూ" అనే విభజన లేదు. భాష అవసరం ఓ వ్యక్తి భావాలని యెదటివాడికి తెలియజెయ్యడానికే కదా? అలా తెలియజెయ్యడం ప్రక్రియలో భాగం, "వ్రాయడం" కదా? అప్పట్లో అంత "స్పష్టత" అవసరం లేకపోవడంతో, అచ్చులే లేవు. 
 
వుదాహరణకి, "బాటసారియొకడు దన యూరినుండి బయలుదేరి, వేరొక జోటికి బయనమైనాడు. దారిలోనొక భయంకరమైనయడవియున్నది. కష్టములకోర్చి యాతడు దానినధిగమింపదలచినాడు....." ఈ కథలో అచ్చుల అవసరం యేమి వుంది? 
 
11వ శతాబ్దం వాడైన నన్నయ, 13వ శతాబ్దం వాడైన తిక్కన, 14వ శతాబ్దం వాడైన యెర్రన, నన్నయ "వాగనుశాసనుడు"గా ప్రవేశపెట్టిన వ్యాకరణాన్నే అనుసరించారు. తరువాతెప్పుడో, "ఇతరుల వస్తువులని దొంగిలించడంలో నిపుణుడు (శ్రేష్టుడు)--అంటే, "పరవస్తు చిన్నయ సూరి" బాల వ్యాకరణం వ్రాసాక, తన పంచతంత్రం వ్రాశాక, తెలుగు భాషకు అక్షరములు యేబదియారు......అని పుట్టింది. ఆయనే అచ్చులూ, హల్లులూ, వుభయాక్షరములూ--అని ప్రవేశపెట్టాడు(ట). అంతక్రితం మన భాష "ఆన్‌ధ్రము". (వుభయాక్షరాలు లేవు.) ఇంకా, "తలకట్టు" స్థానంలో వచ్చే "అకార, ఇకార, ఉకార....." వగైరాలు లిపిలో నిర్దేశించబడ్డాయి. వుదాహరణకి, "క; కి; కు; కృ; కే; కై" ల దాకా. కొ వ్రాయాలంటే, క కి ఎ కారం ఇచ్చి, ప్రక్కన ఉ కారం ఇచ్చేవారు! "కౌ" వ్రాయాలంటే, "కవు" అని వ్రాసేవారు. (ఇప్పటికీ, "మొహం" అంటే, మ కి ఎ కారం ఇచ్చి, ప్రక్కన ఉ కారం ఇస్తాం. "మోసము" అని వ్రాయాలంటే, మ కి ఎ కారం ఇచ్చి, ప్రక్కన ఊ కారం ఇస్తాము. అలాగే, ఇదివరకు "నోటిసు" అని వ్రాయాలంటే, న కి ఎ కారం ఇచ్చి, ప్రక్కన ఊ కారం ఇచ్చేవాళ్లు! కానీ ఇప్పుడు న కి ఓ కారం డైరెక్టుగా ఇచ్చేస్తున్నాము! "కౌలు" అని వ్రాయాలంటే, క కి ఎ కారం ఇచ్చి, ప్రక్కన ఊ కారం ఇచ్చేవారు. ఇప్పుడు క పైన డైరెక్టుగా ఔ కారం ఇచ్చేస్తున్నాము. అవీ భాషా, లిపి పరిణామాలంటే.

దేవులపల్లివారికి ఓ సందేహం వచ్చిందట--"మావి చిగురు తినగానే 'కోవిల ' పలికేనా? కోవిల గొంతు వినగానే, మావి 'చివురు ' తొడిగేనా? యేమో! యేమౌనోగానీ, ఆమని....ఈవని!" అని. బాగానే వుంది.....చెట్టు ముందా? విత్తు ముందా? అనడంలో ఓ వెరయిటీ. ఓ రోజు, కాకినాడ సూర్యకళా మందిరం లో ఆయనకి సన్మానం జరుగుతూంటే, ఓ 'పినాకొ ' ఆయన్ని "కోయిల; కోయెల; కోకిల--ఇలా అన్ని మాటలుండగా, "కోవిల" అని యెందుకు వ్రాశారు? అని ప్రశ్నించాడు, వ్రాతపూర్వకంగా. ఆయన కూడా వ్రాతపూర్వకంగానే జవాబిచ్చారుట--"మీరు మాట్లాడేది తెలుగు, నేను వ్రాసినది 'తెనుగు '!" అని. అదీ తేడా. 
 
అసలు "తెలుగు" యెలా వచ్చింది? "తెనుగు" యెలా వచ్చింది? "మా ఆరువేళ్ల" మేష్టారు శేషాచార్యులుగారు చెప్పినట్టు, "త్రిలింగ--అంటే మూడు లింగాల మధ్య వున్న దేశం, తెలుగు దేశం! వాళ్లది తెలుగు భాష!" "త్రి నగ దేశం--అంటే మూడు కొండల మధ్య వున్న దేశం--అదే "తెనుగు" దేశం!" (ఆ మూడు లింగాలూ, ఆ మూడు నగాలూ మీరే తెలుసుకోండి!)

మరి మధ్యలో, ఈ "తెలంగాణా భాష" యెక్కడనుంచి వచ్చిందీ?

........తరువాయి మరోసారి.