కళా "కారులు"
మా "బ్లూ మౌంటేన్" రాజుని అనేవాళ్లం...."కళాకారులండీమీరు" అని! (ఆయన వ్రాసింది యేదైనా, ఓ ఐదు నిమిషాల తరవాత ఆయనకే చూపిస్తే, "నేనే వ్రాశానా? యేమో....యేమి వ్రాశానో గుర్తు లేదు!" అనేవాడు.
కొపెర్నికస్, గెలీలియో, సోక్రటిస్ లాంటి మేధావులని "పిచ్చోళ్లు" అన్నారట ఆ రోజుల్లో! అని వూరుకోలేదు--శిక్షలు విధించారు(ట).
ఇంతకీ, లలిత కళల్లో ప్రముఖమైనవి నాట్యం, కవిత్వం, తరవాత చిత్రలేఖనం. కొత్తగా కవిత్వం చదివేవాడికి, యే కవిత చదివినా, "అద్భుతం!" అనిపిస్తుంది. కొంత వయసు వచ్చాక, ప్రముఖుల కవితలు చదివినా, "యేమిటో ఈ కవిత్వం!"....ఈమాత్రం నేను వ్రాయలేనా? అనిపిస్తుంది.
ఇక చిత్రలేఖనం! నిజంగా "అద్భుతమైన" కళ! సృష్టికి ప్రతిసృష్టి చేసినట్టు, కనిపించేదాన్ని యథాతథంగానూ, కనిపించనివాటిని వూహించి దానికో ఆకారం యేర్పరచి, అందరినీ "అవి" ఇలాగే వుంటాయి అని నమ్మించడం! అలా మనకి లభించినవే, ఛాయాగ్రహణం లేనిరోజుల్లో వుండే రాజులు, నవాబులు మొదలైనవాళ్ల "చిత్రాలు". అలాగే, రాజా రవివర్మ లాంటి వాళ్ల పుణ్యమా అని, మనం యెప్పుడూ చూడని మన దేవుళ్ల, దేవతల రూపాలూ, అకారాలూ, ఆహార్యాలూ మనకి లభించాయి! అదీ చిత్రలేఖనం అంటే!
ఇంక శతాబ్దాల క్రితం నుంచీ పాశ్చాత్య చిత్రకారులు ప్రపంచ ప్రసిధ్ధి చెందినవాళ్లున్నారు కొంతమంది. మైఖేల్ ఏంజిలో, లియొనార్డో డా వించీ, రెనాయిర్ లాంటివాళ్లు. ఇంక "పాబ్లో పికాసో" అని అసలు పిచ్చోడు ఒకడుండేవాడు. మొదట చెప్పినవాళ్ల "పెయింటింగులు" చూసి, వాటిలో--మన వేదాలూ, సంస్కృతం ల లాగ, యెవరికి తోచిన అర్థం వాళ్లు చెప్పడం, కనపడని విషయాలని కూడా వూహించడం, వాటిమీద రీసెర్చ్ చేసి డాక్టరేట్లు తెచ్చుకోవడం, "ఆర్ట్ క్రిటిక్స్" అనబడేవాళ్లు ఇలా చేస్తూ, వాటి "ధరలని" విపరీతంగా పెంచడం, డబ్బున్న పిచ్చోళ్లు వాటిని కొనుక్కోవడం.....అదో ప్రపంచ వ్యాప్త వెర్రి!
మొన్నీమధ్య డా వించీ "మొనాలిసా" మీద రీసెర్చ్ చేసి, ఆయన తన మగ నౌఖరుకి ఆడవేషం వేసి, ఆ బొమ్మ గీశాడు అని తేల్చారట! ఇంక, ఓ రచయిత, "డా వించీ కోడ్" అనే తన నవలలో, ఆయన పెయింటింగులకి అర్థం చెపుతూ, క్రిస్టియానిటీకి సంబంధించిన రహస్యాలనేవో బయటపెట్టేశాడు అని ఆ పుస్తకం బ్యాన్ చేశారు కొన్ని దేశాల్లో!
పికాసో గురించి చెప్పాలంటే, మా "బ్లూ మౌంటేన్" రాజు లాంటివాడే! వాడేమి గీశాడో వాడికే కాదు, ప్రపంచంలో యెవరికైనా అర్థం అయితే వొట్టు! పైగా దానికి మోడర్న్ ఆర్ట్ అని ఓ పేరు! అదో ప్రత్యేకమైన "స్కూల్" అట!
అదే స్కూల్ లో బయలుదేరాడట మన దేశం లో ఒకాయన--ఎం ఎఫ్ హుస్సేన్ అని! బుడుగు బొమ్మలు వేసి, క్రింద "ఫది యెగురే పఛ్ఛులు"; "చీకట్లో వెళుతున్న రైలు" ఇలా వాటి పేర్లు వ్రాసినట్టు, యేవో పిచ్చి బొమ్మలు గీకేసి, క్రింద పేర్లు వ్రాయడంతో వచ్చింది గొడవంతా! ఆయనకి ఆడ పిచ్చి అనికూడా అంటారు ఆయన చిత్రాలు చూసినవాళ్లు. సరే! మనదేశంలో, కావలసినంత వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేఛా వున్నాయి. అలా అని, నగ్నంగా వున్న స్త్రీల బొమ్మలు వేసేసి, వాటి క్రింద "సరస్వతీ దేవి", "భారత మాత" లాంటి పేర్లు వ్రాసెయ్యడమేనా? పోనీ ఆ చిత్రాలకీ, మన వూహల్లో వున్న ఆ దేవీ దేవతలకీ యేమైనా పోలికలు వున్నాయా? అందుకే ఆయన్ని దేశం నుంచి తన్ని తగిలేశారు!
మొన్నీమధ్య ఆయన పై లోకాలకి వెళ్లిపోయాక, ఇన్నాళ్లూ మాట్లాడని సో కాల్డ్ "ఆర్ట్ లవర్స్ ఆఫ్ ఇండియా", వ్యాసాలమీద వ్యాసాలు వ్రాసేస్తున్నారు.....భారతదేశాన్నుంచి ఆయన్ని వెళ్లగొట్టడం పాపమనీ, హత్యచేస్తామని బెదిరించారు....ఇంకిప్పుడు యెలా హత్య చేస్తారు? అనీ....ఇలా వ్రాసేస్తున్నారు....తమ "కళాభిమానాన్ని" చాటుకుంటూ!
అలాంటి కళా"కారుడు" మన దేశం లో పుట్టడమే మన దౌర్భాగ్యం!
కళా"కారుల" అభిమానులూ.....ముర్దాబాద్!