Wednesday, February 26, 2014

ఆత్మలూ..............--2


.....సాక్షాత్కారం

తరువాత...........

తూర్పు వైపుగా తిరిగి, బాసింపట్టు వేసుకొని కూర్చోవాలి. ఇదేదో చాదస్తం కాదు. యే వరండాలోనో కూర్చున్నా, పడగ్గదిలోనే, మంచం మీదే కూర్చున్నా, చాపమీద కూర్చున్నా, తలుపులు తెరిచి వుంటే, సూర్యోదయం తో వచ్చే వెలుగు కనిపిస్తుందని. పద్మాసనం కోసం కూడా కష్టపడఖ్ఖర్లేదు. ప్రాణాయామం ప్రారంభించాలి. భయపడకండి. ఇక్కడ హిప్నాటిజం, శ్వాసమీద ధ్యాస ఉపయోగిస్తాయి. 

దీర్ఘంగా శ్వాస తీసుకొంటూ, పూర్తయ్యాక వీలైనంతసేపు ఊపిరి బిగబట్టి (కుంభకం అంటారు), తీసుకొనే సమయానికి రెట్టింపు సమయం లో ఊపిరి వదలాలి (రేచకం అంటారు). ఈ లెఖ్ఖలు పెద్ద ముఖ్యం కాదు. క్రమంగా రెట్టింపు కన్నా యెక్కువ సమయం పట్టడం మీరే గమనిస్తారు. ఇలా యేకాగ్రంగా జరుగుతున్నప్పుడు, దృష్టిని భ్రూమధ్యం లో (కనుబొమల మధ్య--బొట్టుపెట్టుకొనే చోట) కేంద్రీకరించడానికి ప్రయత్నించండి. ఇది సాధించడానికి కూడా పెద్ద కష్టపడఖ్ఖర్లేదు. ముందుగానే యే దృశ్యం కనబడినా భయపడను అని నిశ్చయం చేసుకోండి. (యెందుకో తరువాత తెలుస్తుంది). 

ఈ ప్రయత్నం కొంత ఫలించేటప్పటికి, కళ్లముందు ఓ పెద్ద సర్పం (అనకొండ సైజులో వుండొచ్చు, వివిధ సైజుల్లో తోచవచ్చు సాధించేవాళ్లని బట్టి) చుట్టలు విప్పుకోవడం కనిపిస్తుంది. కొన్ని ముందుకీ, కొన్ని వెనక్కీ తిరుగుతూ, తలా తోకా కనాపడకుండా, నల్లటి చుట్టలు, తెల్లటి మచ్చలూ, గీతలతో అలా వదులవుతూనే వుంటాయి. ఇంకా యేకాగ్రతతో కొనసాగించండి--భ్రూమధ్యం నుంచి దృష్టి మరల్చకుండా.   

హటాత్తుగా ఓ పెద్ద పడగ సాక్షాత్కరిస్తుంది--యెర్రటి కళ్లు మీ కళ్ళలోకి ఫోకస్ అవుతూ, బుసలు కొడుతూ, ద్విజిహ్వ మీ భ్రూమధ్యాన్ని స్పృశిస్తూ, చెలరేగిపోతుంది. అదే కుండలిని. (భయపడకూడదు అని ముందే నిశ్చయించుకోకపోతే, ఇక్కడ మెలకువ వచ్చేస్తుంది. అయినా ఫర్వాలేదు. ఇంకా సూర్యోదయం కాకుండా వుంటే మళ్లీ ప్రయత్నించవచ్చు. లేదా మర్నాడు ప్రయత్నించవచ్చు.)

అది అన్ని చక్రాలనీ మేల్కొల్పిందా, మొదలైన సందేహాలు అనవసరం. ఆవన్నీ పూర్తయ్యాకే ఆ స్టేజి కి వస్తుంది.  ఇంక సహస్రారాన్ని చేరడమే తరువాయి. అప్పటికి చాలా సేపటి నుంచే మీశ్వాస రెగ్యులేట్ అయి వుంటుంది కాబట్టి, అది పెద్ద కష్టం కాదు. కాబట్టి, మొదటిసారే అది సాధ్యం కాకపోయినా, క్రమ సాధనతో అది సుసాధ్యమే. నిర్భయంగా ఆ సర్పం కళ్లలోకి చూస్తూ, ఆ జిహ్వల స్పర్శని ఆస్వాదిస్తూ, భ్రూమధ్యాన్ని దర్శిస్తూ వుండగా............

హటాత్తుగా ఓ పెద్ద వెలుగు--మామూలు కళ్లతో యేమాత్రం చూడలేని వెలుగు--మనకళ్లు యెప్పుడూ చీకటీ, నలుపూ చూడనేలేదన్నట్టు అనిపించే వెలుగు--మధ్యమధ్య లో ఇంద్రధనుస్సు రంగులతో యేర్పడుతున్నట్టనిపించే పలుచని నీడలతో--కనిపిస్తుంది. ఆ అనుభవం వర్ణనాతీతం. అదే "గాయత్రి." యజ్ఞోపవీత ధారులైతే గాయత్రీ మంత్రాన్ని మనసులోనే జపించండి. ఇతరులు ఇష్టదేవతా ప్రార్థన చేసుకోండి. కేవలం తలుచుకున్నా చాలు........అప్పుడు అవుతుంది ఆత్మ సాక్షాత్కారం!

యెలా?

(మరోసారి)

Tuesday, February 25, 2014

ఆత్మలూ.....


............సాక్షాత్కారం

12-08-2010 న వేరెవరిదో బ్లాగ్ లో నేను వ్రాసిన కామెంట్ మీద, TEJA-M అనే ఆయన నన్ను మెయిల్ ద్వారా 31-08-2013 న సంప్రదించారు. ఆయన సందేహాలు ఆయన మాటల్లోనే--".......ఆత్మ సాక్షాత్కారం పొందాలన్నదే నా లక్ష్యం. నేను ప్రస్తుతం సద్గురువు అన్వేషణలో వున్నాను............1. మీకు ఆత్మ సాక్షాత్కారం కలిగిందా? 2. నాకు ఈ విషయంలో (ఆత్మ సాక్షాత్కారం) ఏమైనా సహాయం చేయగలరా?......." 

అప్పటినుంచీ, అనేక కారణాలవల్ల, సమాధానం వ్రాయాలని వున్నా, వీలుకాలేదు. ఆయనకి వ్యక్తిగతంగా మెయిల్ లో సమాధానం ఇచ్చేకన్నా, ఓ టపా వ్రాస్తే అందరూ చూస్తారు కదా అని అలోచన రావడంతో, ఆగి ఆగి, ఇప్పటికి వీలు చిక్కింది.

ముందుగా కొన్ని విషయాలు స్పష్టం చెయ్య్దలుచుకున్నాను. 

1. ఆత్మ సాక్షాత్కారం గురించి చెప్పే కబుర్లు అన్నీ వఠ్ఠి ట్రాష్. 
2. కుండలిని ని జాగృతం చెయ్యడానికి సాధన అవసరం--అంటే అదేదో ఘోరమైనా తపస్సు అని భయపడవలసిన అవసరం లేదు.
3. యోగ సాధన, యోగం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం, పిరమిడ్ ధ్యానం లాంటి వాటి గురించి గాభరా పడనక్కర్లేదు.
4. సద్గురువులు వేరే యెక్కడో వుండరు. మీ తండ్రో, అన్నదమ్ములో, స్నేహితులో, కొలీగో కావచ్చు. కాషాయ బట్టలూ, గడ్డాలూ, మీసాలూ, దండ కమండలలూ చూసి మోసపోవద్దు.
5. పత్రికలలో వచ్చే కాలక్షేపం ఆధ్యాత్మిక రాతలు అసలు నమ్మద్దు. పట్టించుకోవద్దు.

నేను 1992 లో హైదరాబాదు లోని ప్రఖ్యాత హిప్నాటిస్ట్ డాక్టర్ నగేష్ దగ్గర 'సెల్ఫ్ హిప్నాటిజం' నేర్చుకొన్నాను. అది చాలా దోహదం చేసింది. ఇతరులని కూడా హిప్నటైజ్ చెయ్యగల సామర్ధ్యం స్వయం సాధన ద్వారా నేర్చుకొన్నాను. నా పిల్లలకీ, కొలీగ్స్ కీ కొన్ని చిన్న చిన్న సమస్యలని అధిగమించడానికి సహాయం చేశాను.

మరి ఈ సెల్ఫ్ హిప్నాటిజం అంటే యేమిటి? అంటే, మనని మనం హిప్నాటిక్ ట్రాన్స్   అనే ఓ నిద్ర లాంటి స్థితిలోకి తీసుకెళ్లి, యేకాగ్రతతనీ, టెన్షన్ లకి  దూరంగా మానసిక ప్రశాంతతనీ పొందడానికి వీలవుతుంది. ఆ సమయం లో మనకి మనం ఇచ్చుకొనే సూచనలు, తరువాత మనమే ఆచరణలో పెట్టడానికి దోహదం అవుతుంది. ముఖ్యంగా మంచి నిద్ర పడుతుంది, యేకాగ్రత్త పెరుగుతుంది.

దీనికీ, కుండలినికీ సంబంధం వుందా అంటే వుంది, లేదు అంటే లేదు. 

సరే........మనం చెయ్యవలసింది........ఉదయం సూర్యోదయానికి కనీసం ఓ గంట ముందు నిద్రలేచి, కాల కృత్యాలు తీర్చుకొని, సిధ్ధం కావడం. అంటే సుమారు 4-30 కి లేస్తే, 5-00 కల్లా సిధ్ధం కావచ్చు. ఇదేదో పవిత్రతకోసం కాదు. అవశిష్టాలవల్ల అంతరాయం కలగకుండా. 

ఇలా లేవడం అలవాటైనవాళ్లకి పెద్ద విషయం కాదు. దీనికి సెల్ఫ్ హిప్నాటిజం లో రాత్రి నిద్రపోయే ముందే సూచన ఇచ్చుకోవచ్చు. అలవాటులేనివాళ్లు కొంచెం కష్టపడక తప్పదు మరి. 

తరువాత...........

(మరోసారి)

Wednesday, January 15, 2014

పంచాంగాలూ......ప్రమాణాలూ



........అంత అవసరమా?

మళ్లీ 'సంక్రాంతి' యేరోజు? అంటూ పెద్ద పెద్ద చర్చలు.

ఓ టీవీ యాంకరమ్మ--"......సాయంత్రం తర్పణాలు వదలరు కాబట్టి......." అంటూ సాగదీత! (సంక్రమణం సందర్భంగా తర్పణాలా? తర్పణాలకోసం సంక్రమణమా?)

పితృదేవతలకి ఒక రోజు అంటే, మనకి ఓ సంవత్సరం. పూర్తిగా మనకి ఓ రోజు అంటే వాళ్లకి ఓ పదిహేను గంటలో యెంతో అవుతుంది. (అదే దివ్య సంవత్సరాల లెఖ్ఖ అయితే, కొన్ని సెకన్లో, మైక్రో సెకన్లో అవుతుందేమో.) మరి తర్పణాలు కొంచెం ముందో, తరవాతో వదిలితే, నష్టమా?

కేలండర్లూ, పంచాంగాలూ, ఆంగ్ల సంవత్సరాదికీ, తెలుగు సంవత్సరాదికీ చాలారోజులు ముందుగానే తయారు చేస్తారు. (ఆ చేసినవాళ్లందరికీ లెఖ్ఖలు రావేమో?)

తీరా పండగ వచ్చేముందు ఆ తేదీనో తిథినో పెద్ద చర్చనీయాంశం చేసి, ప్రభుత్వాలని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి, ఉద్యోగుల సెలవలు మార్పించడానికి ప్రయత్నించడం అవసరమా?

ఇదివరకే వ్రాశాను. స్మార్తులు చాంద్ర మానమైనా, సూర్యమానమైనా, తిథి యేరోజు (రాత్రైనా) తగిలితే, ఆ తిథి ప్రకారం జరిపిస్తారు. అదే వైష్ణవులు, తిథి మిగులు యేరోజు ఐతే అది పాటిస్తారు. (ఒక్కోసారి ఆ రోజుకి తరవాత తిథి వచ్చేసినా, ఆ రోజే చేస్తారు).

యెవరికి తోచినట్టు వారు పాటించుకొంటే పోలా? సెలవలు మార్పించడాలు, గంటల తరబడి చర్చలూ, వాటికి ప్రమాణాలు వెతకడం యెందుకు?

(యేమైనా అంటే నేను బ్రాహ్మణ్యాన్ని విడదీస్తున్నాను అంటారు. వేరే యెవరో విడదీయాలా?)

Thursday, January 31, 2013

అజ్ఞానులూ...........



..........సుజ్ఞానులూ

ఆమధ్య మన నికమ్మా జగన్మోహన్ గారు "ఎఫ్ డీ ఐ ల్లో విదేశీ పెట్టుబడులని అజ్ఞానులు మాత్రమే విమర్శిస్తున్నారు" అంటూ సెటైర్ వేశారు.

మొన్నేమో, హైటెక్ బాగ్లివలియా "డీజెల్ ధరలు అలా పెంచుతూ వుండడమే మంచిది. దానివల్ల జనాలు డబ్బులన్నీ దానికే ఖర్చు చెయ్యడంవల్ల, మిగిలిన ఖర్చులకి డబ్బుల్లేక, ద్రవ్యోల్బణం దిగి వస్తుంది" అన్నాడు.

తరవాత, నషీలా భిండే "నెల అంటే 30 రోజులు కాదు, వారం అంటే 7 రోజులు కాదు, రోజు అంటే 24 గంటలు కాదు" అంటూ కాల మానాన్ని పునర్నిర్వచించారు.

ఇంకో బాకో గారు, "........ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితం యెప్పుడొస్తుందో మాత్రం చెప్పలేను!" అన్నాడు. (ఇదివరకు పిచ్చిదంబరం ఇలాగే ".....ప్రక్రియ మొదలుపెడుతున్నాం....." అని చెప్పి తన కొంపమీదికీ, ఇతర కొంపలమీదికీ ఒకేసారి తెచ్చాడు.)

పిల్లకాకి సాహుల్ "అధికారాన్ని విషంగా భావించింది మా అమ్మ. అలాకాకుండా అధికారాన్ని ఆస్వాదిస్తూ దాన్ని విషంగా భావించాలి" అనో ఇంకేదో, మన జానారెడ్డికన్నా అయోమయం కలిగించేట్టు మాట్లాడాడు.

ఇవన్నీ చూస్తుంటే, "ఆహా! మన కేంద్రంలో వున్నవాళ్లందరూ యెంత 'సుజ్ఞానులో కదా', వాళ్లు యెక్కడ చదువుకున్నారో చెపితే మనవాళ్లనికూడా అక్కడ చదివిద్దుం కదా!"  అనుకుంటాము మనం.

వీళ్లందరూ ఈ యేడాదిలోనో, మళ్లీ యేడో మళ్లీ వచ్చి మన వోట్లు అడుగుతారట! (అన్నట్టు యేడాది అంటే 12 నెలలే కానఖ్ఖరలేదు కదా? కొన్ని నెలలయినా కావచ్చు, కొన్ని సంవత్సరాలైనా కావచ్చు.)

మరి జాగ్రత్త సుమా!


Monday, December 31, 2012

తెలుగుని........! - 3



తెలుగులోనే మాట్లాడదాం....

రెండోరోజు పొద్దున్న "నష్ట నివారణ" చర్యగాననుకుంటా--ఓలేటి పార్వతీశం గారిచేత ఒకళ్లిద్దరిని అడిగించి, యేర్పాట్లు చాలా బాగున్నాయి, మాకు యే కష్టం తోచకుండా "పిల్లలు" (స్వయం సేవకులు) మంచినీళ్లూ భోజనాల దగ్గరనుంచీ చక్కగా చూసుకుంటున్నారు--అంటూ చెప్పించారు. (మర్నాడు పేపర్లలో వచ్చింది--గట్టి బందోబస్తు యేర్పాటు చేసి, టోకెన్లు జారీ చేసి, అవి వున్నవాళ్లకే భోజనాలూ వగైరా అందించారని! మరి ముందే ఆ తెలివి యెందుకు లేకపోయిందో?)

ఇంకా "ప్రథాన వేదిక" కీ, దానిమీద రా నా ల తొంబకీ ఇచ్చిన ప్రాథాన్యం మిగిలిన వేదికలకి ఇవ్వలేదు అని తెలుస్తూనే వుంది. (వారు కొన్ని ప్రసారం చేశారేమో గానీ కరెంటు కోత పుణ్యమా అని కొన్ని నేను చూడలేకపోయీ వుండొచ్చు అనుకున్నాను).

సంతోషం కలిగించిన విషయం యేమిటంటే, మహామహుడు నేరెళ్ల వేణుమాధవ్, మొత్తం సమయం తానే తినెయ్యకుండా, ఆయన శిష్యులచేత ప్రదర్శన ఇప్పించడం!

అవధాన వేదిక మీద యేమి జరిగిందో, తెలీదు. సినీకళాకారుల ప్రదర్శనా, వాళ్లకి సన్మానాలూ బాగానే జరిగాయి అని పేపర్లో వచ్చింది. 

అనేకమంది "ఇవి గందరగోళ మహాసభలు" అనీ, ఆహ్వానితులకి ఆదరణలేదు అనీ, యెందుకు పిలిచారో, యెక్కడికి వెళ్లాలో, యెవరిని కలవాలో, పత్రాల సమర్పణ యెవరు యెక్కడ యెప్పుడు చెయ్యాలో తెలీదనీ, బోళ్లు దూరాల్లో వున్న ఇతర చోట్లకికూడా రవాణా సౌకర్యం యేర్పాటు చెయ్యలేదు అనీ, వసతి గురించి అంతా వట్టి మాటేననీ వాపోయారట--అనేకమంది ముఖ్యులు కూడా.

ఇంక మంత్రి పార్థసారథి, వంటకాలు వాసన వస్తున్నాయి అని ఫిర్యాదు వస్తే, రుచి చూసి, "సంబంధిత గుత్తేదారు మీద చర్య తీసుకుంటాం, తప్పులు తేలితే నగదు చెల్లింపులో కోత విధిస్తాము" అన్నారట. శాసన సభ్యుడు మల్లాది విష్ణు అయితే, తినలేక, పళ్లాన్ని విసిరేసి వూరుకున్నారట. కొంతమంది ప్రముఖులు, రాత్రి మిగిలిన చద్దన్నాన్ని పులిహోర చేసి పెట్టేస్తున్నారు అని బాధపడ్డారట! 

.........ఇంకొంత ఇంకోసారి.

Friday, December 28, 2012

తెలుగుని........! - 2



తెలుగులోనే మాట్లాడదాం....

ప్ర తె మ లు మొదలయ్యాయి. 

కార్య నిర్వాహకుల కష్టం యేమిటో తెలిసింది. అదెంత వృధా అయిందో కూడా తెలిసింది. 

మధ్యాహ్నం 12.00 గంటలకి మొదలవుతాయన్నారు. టీవీలో యెక్కడా అలికిడిలేదు.  విసుగొచ్చి కట్టేసి, మళ్లీ నాలుగింటికి పెడితే, మన దూర దర్శన్--సప్తగిరిలో కి కు రె రాసుకొచ్చిన ఉపన్యాసం చదువుతున్నాడు. ఆయన మాటలకీ, పెదాల కదలికకి సంబంధం లేదేమిటా అనుకుంటుంటే, అది ఇంకెవరి గొంతో అని తెలిసింది! 

అప్పటికే తెలుగుతల్లి విగ్రహానికి దండవేసి, నివాళులు అర్పించేసి, అదేదో యాత్రని జెండావూపి ప్రారంభించేశారనీ, వార్తల్లో దృశ్యాలు చూపించారు తరవాత.

ఇంక దేశాధ్యక్షులవారి ఉపన్యాసం--బెంగాలీ లోనో, ఇంగ్లీషులోనో వ్రాసిస్తే, చాలా కష్టం మీద సహస్రాబ్దాల, శతాబ్దాల తెలుగు చరిత్రని వల్లెవేయించారు.

తరవాత గవర్నరుగారు. పూర్తిగా తెలుగులోనే, తడువుకుంటూ సాగింది......చాంగుబళా అంటూ.

రాష్ట్రపతిగారు అదేదో కట్టబోయే సమావేశమందిరానికి మీటనొక్కి శంఖుస్థాపన చేశారు. (తీరా ఆ ఫలకం ఇంగ్లీషులోనే వుంది!)

తరవాత ప్రముఖులకి "సత్కారాలు"--అధ్యక్షులవారి చేతులమీదుగా--"అకారాదిగా పిలుస్తాను" అంటూ అక్కినేనిని పిలిచారు. తరవాత మాత్రం అకారాది పాటించలేదు!

అప్పటిదాకా వేలాదిమంది భోజనాలు చెయ్యకుండా వుండిపోయినట్టున్నారు. నిర్వాహకులేమో, అయ్యో......చెప్పినట్టు తెలుగురుచులన్నీ వండేశాముకాదు....వృధా అయిపోయేవి.....అని ఆనందిస్తున్నట్టున్నారు. తీరా ఒక్కసారి అందరూ భోజనాలకి వెళితే, రకరకాల వంటకాలు కాదుకదా, అసలు అన్నమే లేదట చాలా మందికి!

మళ్లీ సాయంత్రం యెప్పుడో సప్తగిరివారు ప్రత్యక్ష ప్రసారం పెట్టారు. స్త్రీవాద రచయిత్రి అనూరాధ కవిత దగ్గరనుంచి చూశాను. 

తరవాత ఇంకో ఛానెల్లో అనుకుంటా, గజల్ శ్రీనివాస్, తనకి 7 నిమిషాలే సమయం ఇచ్చారు అంటూ రెండో మూడో గజల్స్ పాడాడు--సహజంగానే అతనికి యెవరూ సాటిలేరు అనిపించుకున్నాడు. 

తరవాత, సాహితీ వేదికపై, "త్రిభువ విజయం"--మహామహుడు బేతవోలు రామబ్రహ్మం "ఇంద్రుడు"గా, ప్రముఖులందరూ "కవులు"గా--"ఇంద్రుణ్ని పొగడద్దు. 3 నిమిషాల్లో ఒక్కొక్కరూ ముగించండి" అనడంతో అలరించింది. ఓక్క శ్రీనాధుడు--"నాకు సీసాలంటే ఇష్టమని, ఇంద్రుడు అందరికీ కాళ్లదగ్గర సీసాలు పెట్టించారు" అనడం, అక్కణ్నించీ సరసోక్తులన్నీ "సురాపానాన్ని" తలపిస్తూ సాగడం కాస్త వెగటు పుట్టించింది. 

.........ఇంకొంత ఇంకోసారి.

Tuesday, December 25, 2012

తెలుగుని “వుధ్ధరించొద్దు”!



తెలుగులోనే మాట్లాడదాం....

ప్ర తె మ ల సందర్భంగా అనేకమంది ఒకటే గోల—తెలుగుని వుధ్ధరించండి—అంటూ!

అసలు వుధ్ధరించడం యెందుకు? వున్నచోట వుండనిస్తే నష్టమా?

నిర్వాహకులు “ఇన్నికోట్లడిగాం, ఇన్నే ఇచ్చారు, మరిన్ని ఇస్తే ఇంకా బాగుంటుంది” ఇలా అంటున్నారు.

ఆ పేరుతో గత నెలరోజులుగా మండలాల్లోనూ, జిల్లాల్లోనూ, పట్టణాల్లోనూ, “తెలుగు భాషా—వర్థిల్లాలి, తెలుగు తల్లీ—జిందాబాద్” అంటూ ర్యాలీలూ అవీ చేసేసి, గొంతులు చించుకున్నారు.

తెలుగు సంస్కృతి వుట్టిపడేలా, హరిదాసుల వేషాలు వేయించీ, గంగిరెద్దుల వాళ్లా, కొమ్మదాసరులా, పిట్టలదొరలా వేషాలు వేయించీ, ముగ్గులు వేయించీ, గొబ్బిళ్లు పెట్టించీ, వంటలపోటీలు పెట్టించీ, బహుమతులిచ్చేసీ, యెప్పుడూ పట్టించుకోని రచయితలకీ, కవులకీ, కళాకారులకీ శాలువాలు కప్పేసీ, కేటాయింపులని “మమ” అనిపించేశారు.

ఆయనెవరో అన్నట్టు, “కాళ్ల చుట్టూ నేలని జీరాడే పంచెకట్టే” తెలుగుదనం అంటే, మరి తెలుగు గోచీపాతరాయుళ్లూ, అడ్డపంచెలవాళ్లూ తెలుగు వాళ్లు కాదేమో! కాయకష్టం చేసే వాడినుంచికాకుండా, పనీపాటాలేనివాడి నుంచి “తెలుగుదనాన్ని” నేర్చుకోవలసిరావడం అవమానం కాదా? అని ఆయన అడగడం సబబే అనిపిస్తుంది.   

ఇంక తిరపతిలో క్లైమాక్సే మిగిలింది.

ఇంక, ఈనాడు వాడైతే జనాల తలలకి రోకలి చుట్టేస్తున్నాడు.

ఇదివరకు యేమాత్రం కొరుకుడుపడని తెలుగు అనువాదపదాలని ప్రవేశపెట్టి, అధికారికంగా తెలుగు ని వృధ్ధిలోకి రాకుండా శాయశక్తులా పాటుపడ్డారు మన ప్రభుత్వం వారు. ఇప్పుడా కృషిని  ఈనాడు నెత్తికెత్తుకున్నట్టుంది.

హోం మంత్రి కి “అంతర్గత భద్రత మంత్రి” (గృహ మంత్రి అంటే నష్టమా?) అనీ, పబ్లిక్ సర్వీస్ కమీషన్—పీ ఎస్ సీ కి “ప్రజా సేవా సంఘం—ప్ర సే సం” (ఇది యేవిధమైన ప్రజాసేవా చేసే సంస్థ కాదు కదా?) అనీ, ఇంకా కొన్ని చిత్ర విచిత్రమైన మాటలని ప్రవేశపెట్టేస్తున్నారు. పోనీ, దాంతో సరిపెడుతున్నారా అంటే…….యెక్కడో జపాన్ లోని పార్టీలపేర్లని—డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ జపాన్ ని “జపాన్ జనస్వామ్య పక్షం—జ జ ప” అనీ, జపాన్ రెస్టొరేషన్ పార్టీ ని “జపాన్ పునరుధ్ధరణ పక్షం—జ పు ప” అనీ……ఇలా మొదలెట్టారు! ఇవన్నీ అంత అవసరమా?

కోర్టు ని “కోట్రు” అనీ, రోడ్డు ని “రోడ్రు” అని……ఇలా వ్యవహరించే మన తెలుగు సామాన్యులకి, “సర్వోన్నతన్యాయ స్థానం”, “రహదారి” (అసలు రహదారి అంటే, ఇంగ్లీషులో “థరో ఫేర్”. మరీ రోడ్డు అనకూడదు అనుకుంటే, బాట అంటే సరిపోతుంది!) అనీ వ్యవహరించమంటే భాషని వుధ్ధరించినట్టా?

“క్రిస్మస్" ని కూడా “కిసిమిశ్” అని తెలుగులో అనుకోవాలా? (కన్యాశుల్కంలో గురజాడ ఓపాత్ర చేత “కిసిమీశ్శెలవులు” అనిపించాడుమరి!) 

………ఇంకొంత మరోసారి.