Saturday, January 21, 2017

"Something basically wrong....."--2


"జీవ హింసానందోన్మాదం....."

తూర్పు గోదావరి "ప్రభల" తీర్థాలనీ, కోటప్ప కొండ "ప్రభల" నీ కూడా, కోడి పందాల తో కలిపి మాట్లాడుతున్నారు కొందరు మూర్ఖులు!

దేవరగట్టు కర్రల యుధ్ధాలని కూడా వాళ్ల సంప్రదాయం అంటున్నారు, ఒప్పుకుందామా? అంటున్నారు కొంతమంది.

పురాతన రోమన్ సామ్రాజ్యం లో, ఆకలితో ఉన్న సింహాలకీ, బానిసలకీ యుధ్ధం ఏర్పాటు చేసి, కొన్ని వేలమంది ఆనందించేవారట!

మన పురాణాల ప్రకారం, అనేక యాగాలు చేసి, పశువులని వధించినవాళ్లు నరకానికి పోయి, ఇనుప కొమ్ములూ, గిట్టలూ ఉన్న అవే జంతువులచే హింసింపబడినట్టు వ్రాశారు!

కొంచెం వెరైటీగా, "కట్టు జల్లి" పేరుతో, స్టేడియాల్లో మధ్యన జనాలని నిలబెట్టి, అన్ని ప్రక్కలనుంచీ కొన్ని వేల ఆబోతులనీ, దున్నలనీ రెచ్చగొట్టి వాళ్లమీదకి వదిలేస్తే, చూసేవాళ్లకి వినోదమే వినోదం! 

జల్లికట్టు జంతువులని పట్టుకోడానికి సాహసించే లాంటి వాళ్ల దగ్గరనుంచి డబ్బు వసూలు చెయ్యచ్చు.....మధ్యలో నిలబడే ఛాన్స్ ఇచ్చినందుకు! చూడ్డానికి వచ్చే వాళ్ల దగ్గరనుంచి, ఇంకా ఎక్కువ డబ్బు వసూలు చేసుకోవచ్చు!

అలాగే, కత్తులు కట్టిన కోళ్లతోటీ......!

ఏమంటారు? 

అవి సంప్రదాయాలు కాదంటారా?! యెవరో ఒకరు ప్రారంభించకపోతే, సంప్రదాయాలు ఎలా ఏర్పడతాయి? 

కమ్మీనిష్టులు ముగ్గుల పోటీలు నిర్వహించడం యెప్పుడో ప్రారంభించి, సంప్రదాయాన్ని నెలకొల్పలేదూ?

ఆలోచించండి!


Friday, January 20, 2017

"Something basically wrong....."


......తప్పుడు లేదా తేడా గాళ్లు.

"మాబ్" సైకాలజీ లో ఎందరు పరిశోధన చేసి డాక్టరేట్లు తెచ్చుకున్నా, ఇంకా చాలా మిగిలే ఉంటుంది పరిశోధించడానికి--మన దేశం లో! 

"జల్లి కట్టు" కీ, సినిమా నటులకీ ఏమిటి సంబంధం? ఒకళ్లో, ఇద్దరో "పెటా" లో సభ్యులు కాబట్టి, జల్లికట్టు నిషేధించడానికి మద్దతు ఇచ్చారు. అంతే! రాబందులు ఊరుకోవుగా? మిగిలిన నటులనీ అందరినీ వాళ్ల అభిప్రాయం అడగడం, వాళ్లు చచ్చినట్టు, "వ్యతిరేకిస్తున్నాము" అని చెప్పడం! దాంతో, జనాలందరూ మేమూ వ్యతిరేకం అంటూ ఆందోళనలు చెయ్యడం!.....విద్యార్థులతో సహా!

ఆవిడ అవినీతికి పాల్పడింది అంటే.....
పదవి నుంచి దిగిపోయింది అంటే.....
కేసుని బదిలీ చేస్తారు అంటే.....
ఆవిడ ఆరోగ్యం బాగాలేదు అంటే....

.....ఇలా ఏది అన్నా, వెంటనే వీధుల్లోకి వచ్చి, ఒళ్లంతా పెట్రోలు పోసుకొని, తగలబెట్టేసుకుంటాము అంటారు.....కొందరు తగలబడతారు, ఇంకొందరిని తగలబెడతారు!

నీళ్లని విడుదల చెయ్యాలి....అన్నా అంతే!

మరి......వీళ్లు "తేడా" కాదూ?

అలాగే....కోడి పందాలు!

సంస్కృతికీ, వీటికీ సంబంధం ఏమిటి? ఏమైనా అంటే, పల్నాటి యుధ్ధాలూ, నాయకురాలు నాగమ్మ నుంచీ వస్తున్నాయి.....అని వాదనలూ!

వాటి వల్ల యుధ్ధాలే జరిగాయి! శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయి. అనేక అనర్థాలు జరుగుతున్నాయి. వాటి ప్రక్కన అనేక అవినీతి పనులు జరుగుతున్నాయి. అందుకనే వాటిని నిషేధించడం!

పైగా, ఏ పాపమూ ఎరుగని జంతువులని, మన వినోదం కోసం బాధపెట్టడం, చంపడం......!

మరి, అది కొనసాగాలి అంటున్నారంటే, వాళ్లు "తేడా" కాదా?

(మిగతా.......మరోసారి)

Tuesday, July 5, 2016

నా దారి నాది.....

"హిపోక్రసీ"

"నాకు రాజకీయాలంటే ఇష్టమే.....కానీ, ఆ రొచ్చు లోకి దిగి, బురద అంటించుకోవడం ఇష్టం వుండదు."

"మెజారిటీ ప్రజలు యెన్నుకున్న ప్రభుత్వం వ్యవస్థని భ్రష్టు పట్టిస్తోంది! నిజానికి మెజారిటీ ప్రజలు ఇప్పుడు చింతిస్తున్నారు. త్వరలో ప్రభుత్వానికి బుధ్ధి చెపుతారు.".....అంటాను.

మొన్న....."ఒకడెవడో.....ఒకణ్ని 'న్యాయపూరిత హత్యకి' గురిచేశారు, వాడికి సానుభూతిగా నా అనుచరులు పదిమందితో నిరసన ప్రకటిస్తాను" అని చెప్పి, దేశ ద్రోహ ఉపన్యాసాలు ఇస్తే, ఆ 'చిన్నారిని' అనవసరంగా అరెస్టు చేసి, బాధ పెట్టేస్తున్నారు".....అన్నాను.

ఇప్పుడు....."బెజవాడలో, పురాతన దేవాలయాలు కూల్చేస్తున్నారు....దానికి కారణం ఇక్కడి ప్రభుత్వం.....వారితో చేరిన జాతీయ పార్టీ చచ్చుబడిపోయింది.....దీనంతటికీ కారణం, ప్రథాన మంత్రి......అసలు వాళ్లకి 'ప్రార్థనాలయాలు కూల్చడం ఓ హాబీ'.......త్వరలో వాడికి బుధ్ధి రావాలి".....అంటాను.

"పురాతన దేవాలయాలు కేవలం కొండలమీదా, నదులప్రక్కనీ కట్టారు గానీ, రోడ్డు ప్రక్కనీ, కాలవ గట్లమీదా కట్టలేదు".....అంటే, ఛస్తే ఒప్పుకోను!

"అసలు 'పురాతనం' అంటే, ఓ వందేళ్లో, అంతకు పైగానో అనొచ్చేమో గానీ, ఓ ముఫ్ఫై, నలభై యేళ్ల క్రితం లేనివి కూడా పురతనమే".......అంటాను.

"అక్కడ, హిందూ దేవాలయాలు కూల్చేస్తున్నారు.....(అక్కడ లేని) మహమ్మదీయ, క్రైస్తవ ప్రార్థనాలయాలని కూల్చే దమ్ముందా మీకు?"........అని ప్రశ్నిస్తాను!

పెద్ద కోర్టులు కూడా, "రోడ్ల మధ్యలో పెట్టిన శిలావిగ్రహాలని, గుళ్లనీ తొలగించాలి అని తీర్పు ఇచ్చినా, వాటిని రా నా లు పట్టించుకోవద్దు"......అని సలహా ఇస్తాను!

పందొమ్మిదో శతాబ్దం చివరలోనూ, ఇరవయ్యో శతాబ్దం చివరలోనూ ప్రచురింపబడ్డ ఫోటోల్లో కూడా, ఆ కాలవ గట్లలో యే దేవాలయాలూ లేవు అని చరిత్ర నిరూపిస్తున్నా,......."అవన్నీ పురాతన దేవాలయాలే" అని ఘంటాపథంగా చెపుతాను.

తిన్నగా వేస్తున్న రోడ్డుకి ఏ 'శాలో' అడ్డం వస్తే, "దాన్ని వదిలేసి, (రోడ్డు వంకర తిరిగినా) రెండో ప్రక్కన ఉన్న ఇళ్లని కూలగొట్టొచ్చు కదా?".......అని ప్రశ్నిస్తాను. "అవన్నీ మీ పార్టీ వాళ్లవి కాబట్టి కూలగొట్టరు".....అని ఆరోపిస్తాను.

ఎప్పుడో.....మూణ్ణెల్లకో, ఆర్నెల్లకో వచ్చే ఇలాంటి అవకాశాలని వదులుకోలేను కదా? అయినా నేను "రాజకీయ రొచ్చు అంటించుకున్నాను" అంటే ఎలా?

అయినా.....నాకెందుకులెండి......రాజకీయాలు...... ఏదో.....భ్రష్టు పడి పోతున్న వ్యవస్థ ని చూసి, బాధ తట్టుకోలేక, ఏదో వ్రాస్తాను.

పట్టించుకునే వాడెవడు లెండి??!!

Wednesday, August 12, 2015

దాన ధర్మాలు....

"అన్ని దానములలోకెల్ల....అన్నదానము గొప్ప"!

అవునండీ.....ఇది పెద్దలు చెప్పిన మాట. 

మరి ఓ తెల్లవాడన్నాట్ట....."చేపలు వండి వడ్డించడం కాదు--చేపలు పట్టుకోవడం నేర్పించు"....అని!

మరి యేది కరెక్టు? అంటే రెండూ కరెక్టే!

ఆకలితో వున్నవాడికి "అన్నదానం" చెయ్యాలి. అంతేగాని భూమి దున్నడం దగ్గర్నించీ నేర్పించడం మొదలెడితే, యెప్పటికి వాడి ఆకలి తీరేట్టు?

మరి, మూడుపూటలా వండి వడ్డించేసి, వాడికి ఆకలే తెలియకుండా ఛేస్తామంటే? అది అపాత్ర దానం. వాళ్లకి వళ్లు వంగేలాగ చెయ్యాలి.

అన్నదానం అంటే.....రంతిదేవుడూ, శిబి చక్రవర్తీ లాంటివాళ్లు చేసినవి! అంతేగానీ, ఇవాళ జరుగుతున్న నిత్యాన్నదానాలూ, నిరతాన్నదానాలూ వగైరాలు కాదు.

ఇదివరకు యేదైనా ఉత్సవాలో యేవో జరిగినప్పుడు, చివర్లో ఓరోజు పేదలకి అన్నదానం లేదా సంతర్పణ అని నిర్వహించేవారు. వచ్చినవాళ్లకి లేదనకుండా వడ్డించేవారు. 

ఇప్పుడో? ఆఖర్లో అన్నసమారాధన! భక్తుల అన్నప్రసాద స్వీకరణ!

ముందుగా ఆ చుట్టుప్రక్కలవాళ్లందరి దగ్గరా చందాలు దండడం, కిరాణా వాళ్ల దగ్గరా, బియ్యం కొట్ల వాళ్లదగ్గరా సరుకులూ, బియ్యం, కూరగాయల కొట్ల దగ్గర కూరలూ అన్నీ దండుకోవడం. ఆ రోజున ఇలా చందాలూ అవీ ఇచ్చినవాళ్లందరూ కుటుంబాలతో సహా వచ్చి మేసేసి వెళ్లడం!

ఇవీ ప్రస్తుత అన్నదానాలు. 

మొన్న ఒకాయన "అసలు ఊళ్లో కూలీలు దొరకడం లేదండీ" అని వాపోతుంటే, ఇంకొకాయన, "వారం లో యేడు రోజులూ ఫలానా వారం ఫలానా గుళ్లో, ఇంకో రోజు ఇంకో గుళ్లో.....ఇలా అన్నదానాలు చేస్తుంటే, కూలి డబ్బుల అవసరం యెవరికుందండీ"? అన్నాడు.

నిజంగా అంత ఆశ్చర్యకరంగానే వున్నట్టుంది పరిస్థితి!

యేంచేద్దాం?! పోనీయండి.

Wednesday, August 5, 2015

పత్రికలూ....కధనాలూ...

"జనం కంట...ఉల్లి మంట"

మొన్ననే నా "శాకాంబరాలూ....." టపాలో వ్రాశాను పేపర్లో కథనాల గురించి. 

ఇదిగో.....నిన్న (04-08-15) మా జిల్లా ఈనాడులో పై శీర్షికతో కథనం ప్రత్యక్షం!

దీంట్లో విచిత్రాలు గమనించండి.....!

".....కారణం మహారాష్ట్రలో కురిసిన వడగళ్ల వాన కారణంగా పంట చాలావరకూ దెబ్బతినడమే....." (వడగళ్ల వల్ల భూమిలో వుండే ఉల్లికి నష్టం వస్తుందా? వరదలైతే, నీళ్లు నిలబడిపోయి, పాయలు కుళ్లిపోతాయనుకోవచ్చు! పోనీ కోశాక అయినా విపరీత వర్షాలు వస్తే, సరుకు తడిసిపోయి పాడయిందనొచ్చు!)

"....ఈ వారం లో మరింత పెరిగే అవకాశాలున్నాయి అని వ్యాపార వర్గాలు అంటున్నాయి....."

"....హుబ్లీ, బెంగళూరు ప్రాంత ఉల్లి....తయారు కాలేదు....ఇంకా 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది...."

(బెంగుళూరు "నగరం" ఉల్లిపంటకి ప్రసిధ్ధి అని వీరి కథనం. ఇప్పటికే ప్రతి రోజూ వర్షాలు కురుస్తున్నాయి కర్ణాటక అంతా. వచ్చే రెండు నెలలూ విపరీత వర్షాలు కురుస్తాయి! మరి అప్పటికి ఉల్లి పంట పూర్తిగా యెలా తయారు అవుతుందో?)

ఇంకా విచిత్రం--వీడెవడో కాంగ్రెస్ అభిమాని అయ్యుంటాడు-- 

"......ఏడేళ్ల కాలంగా ఉల్లి ధరను పరిశీలిస్తే, కిలో రూ. 6 ల నుంచి రూ. 7 ల మధ్యే వుండేది. అనంతరం ఏడాది కాలం లో ఇంతవరకు రూ. 12 లు తగ్గిన సందర్భం లేదు."

(వీడి "పరిశీలన" కి ఆధారాలేమిటో? గత యేడేళ్లుగా ఉల్లిపాయల మీద వచ్చిన కార్టూన్లు పరిశీలించినా, ఓ నాలుగేళ్ల క్రితం కిలో 120 దాకా యెగబడిందనీ, కేజ్రీవాల్ నెగ్గే ముందు కూడా 70 నుంచి 80 ఢిల్లీలోనే అమ్మిందనీ, గత సంవత్సరం, ముందు చూపుతో గవర్నమెంట్ దిగుమతులు చేసుకోబట్టి, కిలో 10 నుంచి 12 కే కట్టుబడి వుంది అనీ, పాత పేపర్లు తిరగేసినా స్పష్టం అయ్యేది వాడికి!)

ఇలాంటివండీ మన పేపర్ల పరిశీలనాత్మక కథనాలు!

Saturday, August 1, 2015

జాతీయ దుబారా....

"శాకాంబరాలు....."

జూన్ లో కాస్త వర్షాలు పడగానే, ఆకు కూరలూ, కాయగూరలూ కాస్త విరివిగా వచ్చి, రేట్లు తగ్గడం మొదలెడతాయి. ద్రవ్యోల్బణం తగ్గుతోంది అని సంతోషిస్తారు ప్రజలూ, ప్రభుత్వాలూ. 

వాటితోపాటే, అంచనాలు మొదలెడతారు పత్రికలవాళ్లు.....ఫలానాచోట ఉల్లిపంట తగ్గిపోయింది, ఇంకోచోట టమాటా పంట నాశనం అయ్యింది, వాటికి కొరత యేర్పడే అవకాశం, ధరలు పెరిగే అవకాశం......అంటూ రోజుకో కథనం వ్రాసేస్తారు. 

దాంతో, మళ్లీ కూరగాయల ధరలు పెరిగిపోతాయి. 

అలా జూలై గడిచేసరికి మొదలవుతాయి దేవుళ్లకీ, అమ్మవార్లకీ "శాకాంబర" అలంకారాలు! కనక దుర్గతో మొదలెట్టి, పుంతలోముసలమ్మలవరకూ ....... ఒక్కోళ్లకీ 200 కేజీలనుంచి 5 టన్నులవరకూ! పేపరు తెరిస్తే, అన్ని గుళ్లలోనూ ఆ అలంకారాల ఫోటోలే! ఇన్ని కేజీలూ, అన్ని టన్నులూ అని కథనాలే!

భీమవరం లో మావుళ్లమ్మకి మొన్న 5 టన్నులతో అలంకరించారు! ఇంకో విశేషం......వాటిలో కొన్ని వందలకేజీలు ఉల్లిపాయలు వుండడం!

ఓ ప్రక్క బజార్లో ఉల్లిపాయలు కేజీ 60 రూపాయలకి తక్కువ కాకుండా అమ్ముతుంటే, పేపర్లు కేజీ 40 అని వ్రాస్తే, ప్రభుత్వం 20 కే రైతుబజార్లలో అందిస్తాం అంటూ, ఫలానా జిల్లాకి 200 టన్నులు పంపించాం, ఇంకో జిల్లాకి 100 టన్నులు పంపించాం, యెక్కడా కొరత రానివ్వం--ధరలు పెరగనివ్వం--అంటూ మంత్రుల ప్రకటనలూ!

ఇంకో విచిత్రం యేమిటంటే......ఆ అలంకారాలకి ఆధ్వర్యం వహించేది...... కూరగాయల వర్తక సంఘాలే! (బజార్లో కేజీ కి ఒక్క రూపాయి కూడా తగ్గించరు గానీ, భక్తిపేరుతో టన్నులు "ఉచితంగా" తగలేస్తారు! దీంట్లో యేమైనా కుట్ర కోణం వుందేమో యెవరైనా పరిశోధిస్తే బాగుండును!)

ఇంక దీన్ని అరికట్టే మార్గం......? 

సామాన్య జనం తరఫున ఆ గుడుల ధర్మకర్తలూ, పూజార్లూ, అర్చకులకి నా విజ్ఞప్తి...... "సోదరులారా! అలా అలంకరించడం మా వల్లకాదు అని ప్రకటించండి. ఇంకా, అడ్డమైనవాళ్లూ, ఈ అలంకారం పేరుతో, కొన్ని గంటలపాటు, ఆ విగ్రహాల పీఠాలనీ, గర్భ గుడినీ ఇష్టం వచ్చినట్టు తొక్కడం ఆ దేవీ దేవతలని అపవిత్రం చెయ్యడమే" అని ప్రకటించండి. 

అప్పుడైనా ఈ వేలం వెర్రి కాస్త తగ్గి, సామాన్యులకి మేలు జరుగుతుందేమో......!

ఆలోచించండి.....

Friday, March 27, 2015

శ్రీరామ నవమి......



శ్రీరాముడూ, సీతాదేవీ.....తలంబ్రాలూ.....-3

ఇంతకీ "ఒంటిమిట్ట"లో సీతారామ కళ్యాణం శ్రీరామ నవమి నాడు కాదండోయ్! ఇవాళే అంకురారోపణ జరిగింది. రేపు ధ్వజారోహణం! పట్టువస్త్రాలు ఇవాళిచ్చేస్తే, వచ్చే "పౌర్ణమి నాడు" జరిగే కళ్యాణం లో వాటిని వుపయోగిస్తారట!!!

సరే.....ఇవన్నీ ఇలా వున్నా, మధ్యలో "పిడకలవేట" లా ఈ "తలంబ్రాల" గోలేమిటీ? దానికి "పరాకాష్టేమిటీ"? ....అంటే......

గత కొన్నేళ్లుగా, కళ్యాణం అయ్యాక తలంబ్రాలు "చిన్న పొట్లాల్లో" భక్తులకి అందిస్తున్నారు అని చెప్పుకున్నాం కదా? క్రితం యేడాది...."ఓ నెల ముందుగానే".....2 క్వింటాళ్ల (200 కిలోల) బియ్యాన్ని పొట్లాల్లో నింపేసి, "తలంబ్రాలు" సిధ్ధం చేసేశారు! ఇదో పరాకాష్ట.

అలాగే, కొన్నేళ్లుగా, తూర్పు గోదావరి జిల్లాలోని ఓ గ్రామం నుంచి...."కో(గో)టి తలంబ్రాలు" పేరుతో, కోటి ధాన్యం గింజలని, కొన్ని రోజులపాటు, కొన్ని వందలమంది, "గోళ్లతో" ఒలిచి, వాటిని కాలినడకన తీసుకెళ్లి, భద్రాచలం గుళ్లో అందిస్తున్నారు! (నిజంగా వాటిని యేం చేస్తున్నారో యెవరికీ తెలీదు.)

ఈ మధ్య ఆ గ్రామం లో ఓ మంచి ముహూర్తం పెట్టించి, పొలం "దున్నడం" మొదలెట్టి, మళ్లీ మంచి ముహూర్తం చూసి, "విత్తనాలు" జల్లి......అలా......చివరికి కాలినడకన.....మామూలే! ఇదో పరాకాష్ట!

ఈసారి, ఓ రెండు వారాలముందే, ఓ మూడు తట్టల్లో, 30 లక్షల గింజల్ని తీసుకెళ్లి అందించేశారు. మిగిలినవి ఇవాళ అక్కడకి చేరి వుంటాయి. ఇంకో విశేషం యేమిటంటే.....ఇంకొన్ని గింజల్ని "ఒంటిమిట్ట" కూడా పంపిస్తున్నారట!

వాళ్లని చూసి, ప గో జి వాళ్లు కూడా కొంతమంది మొదలెట్టారు!

ఇంకా, ఈ మధ్య భీమవరం లొ వుండే బెల్లంకొండ బిందుమాధవ రావు, ఆయన భార్య, బియ్యం గింజలు "ఒక్కోదాని" మీదా శ్రీరామ అని రంగు రంగుల్లో వ్రాసి, మళ్లీ వాటిని శ్రీరామ అనే "ఆకారం" లో పేర్చి, అందించి వచ్చారు. రెండు తట్టలు ఫోటో వేశారు పేపర్లో.....అంటే, ఓ 20 లక్షల గింజలు వుండొచ్చు! ఇదింకో పరాకాష్ట!

అసలు, "క్షుద్రమైన" గోళ్లతో వడ్లు ఒలిస్తే వచ్చే బియ్యం గింజలు "అతి పవిత్రం" యెలా అవుతాయో?

పైగా, భత్తులకి పొట్లాల్లో అందించే "తలంబ్రాలు" యెలా సద్వినియోగం అవుతున్నాయో యెవరికైనా తెలుసా? (ఇంకా కళ్యాణం మొదలెట్టక ముందే పొట్లాలు అందించేస్తారట!). వాటిని ఇళ్లకి తీసుకెళ్లి, పూజామందిరాల్లో పెట్టుకొని, ఓ యేడాదిపాటు పూజించే వాళ్లని కూడా వేళ్లమీద లెఖ్ఖపెట్టచ్చేమో!

మరి, "ఆహార ధాన్యాల వృధా" గురించి యెవరైనా ఆలోచిస్తున్నారా? "యె పి వా ఆ" అని నిర్లిప్తం గా వూరుకుంటున్నారా?

నిజమైన శ్రీరామ భక్తులందరినీ, "ఇవాళ" (సూర్యోదయాత్పూర్వమే అష్టమి వెళ్లిపోయింది. ఇవాళే నవమి!) తన "పుట్టినరోజు" సందర్భంగా, ఆయనే చల్లగా చూస్త్రాడు!

(ఇప్పటికి సమాప్తం)