Showing posts with label Sacred; Gods; Worship; foolish rituals. Show all posts
Showing posts with label Sacred; Gods; Worship; foolish rituals. Show all posts

Monday, November 14, 2011

వుత్సవాలు.....3



......వైభవంగా

.......జరుగుతున్నాయి--రాష్ట్రమంతటా. 

మా చిన్నతనంలో, మా మేష్టార్లు చెప్పేవారు--"జాతీయ దుబారా" (నేషనల్ వేస్ట్); "నేరమయ దుబారా" (క్రిమినల్ వేస్ట్)--ల గురించి. 

పగటిపూట ఎలెక్ ట్రిక్ లైటు వెలిగించినా, యెవరూ లేనిచోట ఫాన్ తిరుగుతున్నా--అవి "అలాంటి వేస్ట్"లు అని.

మనం ప్లగ్ పాయింట్ల స్విచ్చులు కట్టేసినా, టీవీలూ వగైరా "స్టాండ్ బై"లో పెట్టినా, యెంతో కొంత కరెంటు "కాలుతుంది" అనీ, వుత్తమ విధానం ఆ ప్లగ్ పిన్స్ ని తొలగించడమేననీ శాస్త్రఙ్ఞులు చెపుతున్నారు. 

మన ఎస్పీ బాలు కూడా చెపుతున్నాడు!

మనందరం ఇంత "జాగ్రత్తగా" కరెంటు వాడుకుంటూంటే.......

అనేక "గుళ్ల"లో, "దేవాలయాల"లో, "పందిళ్ల"లో, ఇవేకాకుండా పర్యాటక స్థలాల్లో, పుట్టినరోజు, సమర్త లాంటి ప్రైవేటు ఫంక్షన్లలో--ఇలా ప్రతీ చోటా "సీరియల్ లైట్లు" దండలు దండలుగా వెలిగించడం, పేపర్లలో "వైభవంగా...." అంటూ వార్తలు రావడం (వ్రాయించుకోవడం) లాంటివి జరుగుతున్నాయి.....ప్రతీరోజూ చూస్తున్నాం.

మరి, వీటన్నింటికీ అయ్యే "కరెంటు ఖర్చు" యెవరిస్తున్నారు? యెవరిచ్చినా, అదంత అవసరమా? 

కరెంటు దీపాల్లేనిరోజుల్లో, గుళ్లెక్కడున్నాయో ప్రజలకి తెలియదా? వాళ్లు పూజలూ, వ్రతాలూ, అభిషేకాలూ చేసుకోలేదా? 

ఇదంతా యెవడబ్బ సొమ్ము?

భక్తి పేరుతో, ఆ "లైటింగు"వాళ్లు బాగుపడడానికి (వృధ్ధిరేటులో వాళ్లూ భాగమేకదా!), "జాతీయ దుబారా" కోసం, కాక ఇవేమిటి? (వాళ్లూ బ్రతకాలిగా?!).

అందుకే.......భక్తి వ్యాపారులూ జిందాబాద్!

Sunday, November 13, 2011

వుత్సవాలు.....2




......వైభవంగా

.......జరుగుతున్నాయి-- రాష్ట్రమంతటా. 

కొన్ని కొత్త కొత్త వుత్సవాలూ, పూజలూ, నోములూ వగైరాలగురించి మొదటిసారి వింటున్నాము.

వాటిలో ఒకటి--వివాహమైన మొదటియేడాది వచ్చే కార్తీక పౌర్ణమికి--11అరటిపళ్లున్న హస్తాన్ని, బూడిదగుమ్మడి పువ్వు, పిందె, సూరే గుమ్మడి కాయ, పసుపు మొక్క, కంద మొక్క, చెట్టునుంచి చేతితో (క్రిందపడకుండా) అందుకున్న కొబ్బరికాయల గెల--శివాలయంలో నైవేద్యంగా నివేదిస్తే శుభాలు సమకూరతాయని--"పదకొండు కాయలున్న అరటిపళ్ల హస్తానికి" గిరాకీ పెరిగి, ఒక్కోటీ రూ.150/- కి అమ్మారట!

వేదమంత్రోశ్చ/శ్చారణ అని వ్రాస్తున్నారు! అది వుచ్చారణ అని వ్రాయాలి. పునశ్చరణ అన్నట్టు కాదు. 

మనకి అర్చకులూ, పూజారులూ, పండితులూ తెలుసు. కానీ ఈ మధ్య కొత్తరకం పండితులు పుట్టుకొచ్చారు--వేదపండితులు, దీపాలంకరణ సేవా పండితులు, అభిషేక పండితులు....ఇలా! 

వేదాలు చదవడానికీ, ఆశీర్వచన పనసలు చెప్పడానికీ వేదాల్లో పాండిత్యం అఖ్ఖర్లేదు. అయినా, వాళ్లకి ఇంకో మాటలేక, వేదపండితులు అని వ్యవహారంలోకి వచ్చింది. సరే. మరి అభిషేక పండితులూ, దీపాలంకరణ పండితులూ యెవరు? పేపర్లవాళ్లు ఇస్తున్నారా ఆ బిరుదులు? ఇంకెవరైనా అలా వ్రాయిస్తున్నారా?

దీపాలంకరణ అంటే గుర్తొచ్చింది. ఇదివరకు గృహస్థులు ప్రతీరోజూ దీపారాధన చేశాక మాత్రమే భోజనం చేసేవారు. అలా సంవత్సరంలో యే కొన్ని రోజులైనా, యే అస్వస్థత లేదా ఇతరకారణాలవల్లనో దీపం పెట్టలేకపోయి వుంటే, దానికి ప్రత్యామ్నాయంగా కార్తీక పూర్ణిమరోజున శివాలయంలో "ఒక దీపం" వెలిగిస్తే సరిపోతుందనేవారు. 

ఇప్పుడు యెవరూ ప్రతీరోజూ దీపాలు వెలిగించడంలేదు కాబట్టి, "పండితులు" ఆ రోజున 365 దీపాలు వెలిగించమంటున్నారట! బాగుంది. మరి "సహస్ర" దీపాలమాటేమిటి? అలా అందరూ యెగబడి ఒక్కోళ్లూ 365 చొప్పున పెట్టుకొంటూ పోతే, సహస్ర యేమి ఖర్మ.....లక్షల్లో పెట్టినా చాలవు!

పైగా, ఇది వరకు కిరాణా షాపుల్లో నూనెలు తూచడానికి ఓ పళ్లెం లంటిది కాటాలో పెట్టుకొని, అందులో మన సీసానో, డబ్బానో వుంచి, పడికట్టి, వాళ్ల డొక్కులతో నూనె పోసేవారు. ఆ సమయంలో కొంతనూనె ఆ ట్రేలో పడేది. కొట్టు కట్టేసేప్పుడు ఆ ట్రేలో పడిన అన్నిరకాల నూనెల మిశ్రమాన్ని వేరే డబ్బాలోపోసి, నిల్వ చేసేవారు. దాన్ని దీపావళికి "దీపాల నూనె" పేరుతో చవగ్గా ఇచ్చేవారు. 

ప్రమిదలో దీపం పెట్టాలంటే ఆముదం వుపయోగించాలి. ఆ పొగ, కళ్లకి మంచిది. వాసన కూడా ఆరోగ్యం. మిగిలిన యే నూనె అయినా, కళ్లు మండుతాయి. పొల్యూషన్ పెరుగుతుంది!

ఇంకా, మనదేశం వార్షిక వంటనూనెల దిగుమతి బిల్లు కొన్ని వందలకోట్ల లో వుంటోంది! నూనెలని దుబారా చేస్తే పుణ్యం వచ్చేస్తుందా?

ప్రమాదాల సంగతి సరేసరి. మొన్న మావూళ్లో ఓ గుళ్లో, సహస్ర దీపాలకోసం ప్రమిదల్లో నూనెపోస్తూంటే, అక్కడే ఆడుకొంటున్నపిల్లలు పొరపాటున నూనె వంపేశారు. మైకులో "నూనె వలికింది....జాగ్రత్త" అని హెచ్చరిక చేస్తున్నా, ఒకావిడయెవరో జర్రున జారి, ప్రక్కామెమీద పడడం, పేకమేడలో పేకల్లా ఒకళ్లమీద వొకళ్లు పడిపోయడం జరిగిపోయాయి. అదృష్టవశాత్తు పెద్ద దెబ్బలూ, ఫ్రాక్చర్లూ జరగలేదెవరికీ!

టీవీలో విశాఖపట్నంలో అనుకుంటా ఒకావిడ చీర అంటుకోవడం, ఆవిడ కెవ్వు కెవ్వుమని అరుస్తూ వుండడం, చుట్టుప్రక్కల ఆడవాళ్లు దూరంగా పారిపోతూంటే, కొందరు చీర విప్పెయ్యమనీ, కొందరు క్రిందపడి దొర్లమనీ సలహాలిస్తూండడం చూశాము!

ఇవన్నీ అంత అవసరమా?


Wednesday, November 9, 2011

వుత్సవాలు.....



......వైభవంగా

మన పండగల సంఖ్య పెరిగిపోతోంది. 

కార్తీక మాసంలో ప్రతీరోజూ "అతి పవిత్రమైనదే"నట. 

ఇంక "మాసములలో నేను మార్గశిరమును" అన్నాట్టెవడో! అందుకని, మార్గశిరమాసంలో "అన్నీ" పవిత్ర దినాలేనట. 

మరి పుష్య మాసంలో, ధాన్య్హ లక్ష్మి ఇంటికి వస్తుంది కాబట్టి, అన్నీ పవిత్ర దినాలే. పశుపూజలతో సహా, ఆయుధ పూజలతో సహా! బాగుంది. 

రాబోయే రోజుల్లో, అన్ని మాసాల్లోనూ, అన్ని రోజులూ, వివిధ కులాలవాళ్లకీ, మతాలవాళ్లకీ "పవిత్రమైనవే" అవుతాయి. యెటొచ్చీ, ఆ పవిత్రతకి అర్థాలు మరిపోతాయి. అంతే. 

నేను పుట్టి బుధ్ధెరిగాక, గత యాభై యేళ్లలోనూ వినని......అంతెందుకూ......గత సంవత్సరం కూడా వినని....కొన్ని క్రొత్త క్రొత్త కథనాలు వింటున్నాము! 

దీపావళీ, నరక చతుర్దశీ మన చిన్నప్పణ్నించీ వింటున్నవే. 

వుత్తరదేశ వ్యాపారుల పుణ్యమాని, "ధన్ తేరాస్" (ధన త్రయోదశి) పుట్టుకొచ్చింది. ఓకే! 

ఓ ప్రబుధ్ధుడు దానికి యెక్కడనుంచి  క్రొత్తగా "లింకు" పెట్టుకొచ్చాడో చూడండి! "ధన్" అంటే  "ధన్వంతరి"ట. ఆయన పుట్టినరోజట అది. సరే. 

ఆయన "వైద్యం"లో యెన్నెన్నో ప్రయోగాలు చేసి, 'కొత్త కొత్త మందులు కనిపెట్టాడట, కట్టాడట '. బాగుంది. 

వాటిల్లో "సువర్ణ భస్మం" ఒకటిట. అందుకని, ఆ రోజున అందరూ యెంతో కొంత "స్వర్ణాన్ని" కొనాలట! 

(ఇంకా నయం.....వెంటనే దాన్ని భస్మం చెయ్యాలని ఇప్పటివరకూ చెప్పలేదు. ముందు ముందు అదీ చెప్తారేమో.....మూఢ జనులు ఆపనీ చేసి, మళ్లీ మళ్లీ బంగారం కొంటూనే వుంటారేమో! వాళ్ల వ్యాపారాలు ఇంకా వృద్ధి చెందుతాయేమో!) 

ఇంతకు ముందు "విష్ణుచిత్తుడికి ఓ పాప దొరికితే, ఆమెకి 'సూడి కుడుత్త నాచ్చియార్ ' అని పేరు పెట్టుకున్నాడు" అని రాసిన పెద్దమనిషే......ఈ కథనం కూడా వ్రాసింది! బాగానే వుంది. తెలుగు పాఠకులు వీపీలు (వట్టి పిచ్చాళ్లు)! 

ఇంకో క్రొత్త కథనం పుట్టుకొచ్చింది....నరకాసురుడు భూమి పుత్రుడు కాబట్టి, "దళితు"డట. వాణ్ని "ఆర్యులు" ఓ విలన్‌గా చిత్రీకరించి, కృష్ణుడి విజయంగా (ఆయన బీసీ!) ఈ పండగని ప్రవేశపెట్టారట! అందుకని, ద్రవిడుడైన నరకుణ్ని దేవుడిగా పూజిస్తారట! 

(ఇది వ్రాసిన మేతావులు కమ్మీనిస్టులని కొంతమంది చెవులు కొరుక్కొంటున్నారు....నిజానిజాలు పైవాడికే తెలియాలి!). 

ఓ యాభై యేళ్ల క్రితమే, తమిళనాడు (ద్రావిడ ప్రదేశ్ అంటే వొప్పుకొంటారా?) లో "పెరియార్ రామస్వామి నాయకర్" అనే పెద్దాయన, "ఆర్యులకి" వ్యతిరేకంగా పెద్ద వుద్యమాన్ని నిర్వహించాడు. ఆ చెట్టు కొమ్మలే నేటి ద్రావిడ పార్టీలు.....ద్రవిడ కజగం; ద్రవిడ మున్నేట్ర; అన్నా ద్రవిడ....ఇలా! 

ఇంతకీ ఆయన చేసిందేమిటి? అంత గులగావుంటే, రావణుణ్ని పూజించుకోవచ్చుకదా? వూఁహూఁ! రాముణ్ని చెప్పులదండలేసి, పెంట విసురుతూ, చెప్పులతో కొడుతూ, "వూరేగించాడు"! 

చూస్తూంటే ఇలాంటి "వుద్యమాలు" తెలుగునాడు లో కూడా విజృంభిస్తాయేమో! 

నందో రాజా భవిష్యతి కదా?

......మరోసారి.