హేతువాదులు—4శ్రీ యెక్కిరాల వేద వ్యాస్--అంతటి మేధావి—‘యుగాంతం’ వ్రాసి, 1999 డిసెంబరు 31న ‘కలియుగాంతం’ అయిపోతుందని చెప్పి—నవ్వులపాలయ్యాడు!
ఇంకొంతమంది వున్నారు—‘కోతి నుంచి మానవుడు పుట్టాట్ట! మీరు (అంటే మనుషులు) యెవరైనా, యెప్పుడైనా, ఇప్పటివరకూ ఒక్క కోతైనా మనిషిగా మారడం చూశారా?’—ఇలాంటి విమర్శలు చేస్తూ వుంటారు!
డార్విన్ చెప్పిన ‘జీవపరిణామ సిద్ధాంతం’ కొన్ని కోట్ల సంవత్సరాలుగా జరుగుతూ వచ్చిన నిజమనీ, యేక కణజీవి నించీ పరిణామం మొదలయ్యింది అనీ వీళ్ళని యెవరు నమ్మించగలరు!
అబ్రహాం టి కోవూర్ అని ఒక డాక్టరు—40 యేళ్ళ క్రితం ఓ బ్యాంకులో ఒక లక్ష డిపాజిట్ చేసి, బహిరంగ సవాలు విసిరారు—యెవరైనా సరే, యేవైనా సరే మహిమలు మా ముందు చూపిస్తే, ఆ లక్ష వెంటనే బహుమతిగా ఇచ్చేస్తాను—అని!
వూరారా ప్రదర్శనలు ఇస్తూ, ‘మహిమలు’ అని అప్పటికి చెప్పుకొనే—విభూతి ప్రసాదించడం, పువ్వులు సృష్టించి ఇవ్వడం, వుంగరాలూ, గొలుసులూ తెప్పించి ఇవ్వడం, ఆత్మలింగం కడుపులోంచి నోట్లోకి తెప్పించి ఇవ్వడం, నాడి కొట్టుకోకుండా ఆపెయ్యడం, భజన చేస్తూ వుంటే దేవుడు కనిపించాడని చెప్పడం, దెయ్యాలూ, భూతాలూ, శకునాలూ—ఇలాంటి వాటి గురించి వివరించి, చేసి చూపించేవారు!
మరి ఇప్పటివరకూ యెవరూ ఆ బహుమతి సొమ్ముని చేజిక్కించుకోలేకపోయారు! ఇంకెక్కడి మహిమలు?
విజయవాడాలోనైతే, ప్రత్యక్షం గా ఓ పాతిక మంది చేత ‘కోకా కోలా—కోకా కోలా’ అంటూ భజన చేయించి, తెల్లవారుఝామయ్యేసరికి అందరూ ఒక రకమైన పూనకం తో వూగుతున్నట్టు వుండగా—వారిని ప్రశ్నిస్తే, ‘నాకు రాముడు కనిపించాడు’ అని కొందరూ, ‘వెంకటేశ్వరడు కనిపించాడు’ అని కొందరూ, ‘సాయి బాబా కనిపించాడు’ అని కొందరూ—ఇలా వాళ్ళకి నచ్చిన దైవాలందరూ తలొకళ్ళూ చెపితే, మేము స్థబ్దం గా విని, తరవాత హాయిగా నవ్వుకున్నాము!
దాదాపు అదే రోజుల్లో డాక్తర్ సమరం ‘మూఢనమ్మకాలు—అసలు నిజాలు’ అనో, ఇంకేదో అలాంటి అర్థం వచ్చే పేరుతో పుస్తకం వ్రాశారు! ఇంకా రోగాలూ, చికిత్సలూ, పథ్యాలూ—ఇలాంటివాటి మీద కూడా పుస్తకాలు వ్రాశారు!
ఇక స్త్రీవాద, హేతువాద రచయిత్రి ముప్పాళ్ళ రంగనాయకమ్మ యేకం గా ‘రామాయణ విష వృక్షం’ వ్రాసి, రామాయణం లో ఒక్క శ్లోకం కూడా హేతువాదానికి నిలబడదు అని నిరూపించింది!
ఈ తరం వాళ్ళకి ఇవేవీ తెలియవు! ఆ పుస్తకాలు కూడా ఇప్పుడు దొరకడం లేదు!
కనీసం ఆ రోజుల్లో ఆ పుస్తకాల ద్వారా ‘మూర్ఖత్వం’ మరింత ప్రబలకుండా తగ్గింది!
ఇప్పుడో! ఇంకా, ఇంకా, ఇంకా—ఇంతింతై, వటుడింతై—అన్నట్టు పెరుగుతోంది!
పెంచుతున్నవారుకూడా—మొహమాటం లేకుండా చెపుతున్నాను—ఓ 30 శాతం మూర్ఖత్వాన్ని బ్రాహ్మణులూ, ఇంకో 30 శాతాన్ని—సినిమావాళ్ళూ, ఇంకో 30 శాతన్ని ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళూ, ఇంకో 5 శాతాన్ని పత్రికలవాళ్ళూ, మిగిలిన 5 శాతాన్ని ఇతరులూ—పెంచుతున్నారు!
మరి ఇంకో ‘కోవూర్’ యెవరైనా, ఇంకో సమరం యెవరైనా, ఇంకో రంగనాయకమ్మ యెవరైనా బయలుదేరితే బాగుండును!
కదా!