Tuesday, March 10, 2009

వృద్ధి

’35.00.000’ కోట్లు!
ఆర్ధిక వృద్ధి మందగించిన ‘అభివృద్ధి చెందుతున్న దేశాలకి’ అభివృద్ధి చెందిన దేశాలు అందించవలసిన సాయం (ట)! ఈ దేశాల్లో భవన నిర్మాణ రంగం, గనులు, వస్తూత్పత్తి రంగాల్లో వృద్ధి రేటు పడిపోయిందట! మన దేశం అనుకొన్న 8, 7, పోయి, ఇప్పుడు ఆఖరి త్రైమాసికం లో 3 శాతం కన్నా తక్కువకి పడిపోయినా ఆశ్చర్యం లేదు (ట)! సెన్సెక్స్ ఇంకా 8 వేల పైనే వుంది మరి! అనివార్యాన్ని యెదుర్కోవడానికి మన దేశం చేస్తున్నదేమిటి?

Monday, March 9, 2009

స్కామాయణం-3

మనం చెప్పుకున్న రైతుకీ కార్ఖానాకి మధ్య ఒప్పందాలకి లోబడి ఇచ్చే ఋణాలని ‘బంధిత ఋణాలు’ (టైడ్ అప్) అంటారు. విలేఖరులు వ్రాసినట్టు, రైతుల ఋణ పత్రాల మీద కార్ఖానా అధికారుల సంతకాలు వుండవు. వాళ్ళు తమతో ఒప్పందం చేసుకున్న రైతుల జాబితా బ్యాంకులకి ఇస్తాయి. ఆ జాబితా మాత్రం కార్ఖానాకి చెందిన బాధ్యతగల అధికారి సంతకం చేసి పంపిస్తారు. ఆ జాబితాలో వున్న రైతులకి తాము నేరుగా డబ్బు చెల్లించబోమనీ, బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తామనీ ధృవీకరణకూడా వుంటుంది. కొన్ని బ్యాంకులు, రైతుల సౌలభ్యంకోసం ఖాళీ ఋణ పత్రాలని ఒక వూరిలోని రైతులందరకీ సరిపడా పంపించి, అక్కడే సంతకాలు సేకరించి, తెప్పించుకుంటాయి. బ్యాంకు అధికారుల సమయం వృధా కాకుండా వుంటుంది, పైగా రోజూ పదిమందికో పదిహేనుమందికో కాకుండా, ఆ వూరి రైతులందరికీ ఒక్కరోజులోనే ఋణాలందించడానికి వీలవుతుంది. ఇలా ప్రతీ సంవత్సరం సాగుతూ వుండగా, యెప్పుడో యెవరో ఒక కార్ఖానా ఉద్యోగికో యెవరికో బుద్ధి పుడుతుంది—మనంకూడా వీటిని యెందుకు ఉపయోగించుకోకూడదు? ఆని. యెవరో ఒక ఒప్పందం వున్న, ఋణం అఖ్ఖర్లేని రైతు ఫొటోలూ, పట్టాదారు పాస్ బుక్ జెరాక్సులూ సంపాదించి, ఆ పేరు కూడా బ్యాంకు కి పంపించే జాబితాలో చొప్పించి, ఋణ పత్రాల మీద తానే ఆ పేరుతో సంతకాలో, వేలి ముద్రలో వేసేసి, ఆ ఋణం మాత్రం తానే వాడుకుంటాడు. ఇక పెద్దయెత్తున జరిగిందంటే, కొంతమంది ఇలాంటివి బాగా మరిగారన్నమాట! అందుకే అంటున్నది—యే బ్యాంకైనా కంప్యూటర్ల పేరు చెప్పి సరైన నియంత్రణ లేకుండా, సిబ్బందిని తగ్గించేసి, వ్యాపారాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచేసుకుందాం, లాభాలు అర్జించేద్దాం అనుకుంటే దాన్ని మించిన మూర్ఖత్వం వుండదు! ఇది మన విత్తమంత్రులకీ ముఖ్య మంద్తులకీ బాగుండవచ్చు! కానీ ఆర్ధిక వ్యవస్థకి యేమాత్రం మంచివి కాదు!