Monday, September 27, 2010

పురాతత్వ వెర్రీ

వారసత్వ సంపదలు

బ్రిటిష్ వారికన్నా ముందు, డచ్చివారు తమ వ్యాపారాన్ని ప గో జి, నరసాపురం కేంద్రం గా సాగించేవారు.

వ్యాపార రీత్యా వూళ్లు తిరుగుతూ, విశ్రాంతి కోసం రెస్ట్ హౌస్ లూ, ట్రావెలర్స్ బంగళాలూ, రహాదారి బంగళాలూ నిర్మించుకున్నారు. 

నరసాపురం లో ట్రవెలర్స్ బంగళా/రెస్ట్ హౌస్ సబ్ కలెక్టర్ ఆఫీసు యెదురుగా ఓ ఐదెకరాల్లో వుండేది. ప్రభుత్వం వారు దాన్ని 8 మూలలా ఆక్రమించి, ఎం డీ వో ఆఫీసూ, మునిసిపల్ ఆఫీసూ, ఫైర్ స్టేషనూ, ఓ హై స్కూల్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఇప్పుడు మళ్లీ కొత్త మునిసిపల్ ఆఫీసూ--ఇలా నిర్మించేశారు. అసలు బంగళా వుందో లేదో, బయటికి కనపడడం లేదు. అందులో వుండే రక రకాల ఫల, ఇతర వృక్షాలూ, గుర్రాల పచ్చికా వగైరా యెప్పుడో దాదాపు నాశనం అయిపోయాయి.

గవర్నరు దగ్గరనించీ, యెవరు వచ్చినా ఆ రెస్ట్ హౌస్ లోనే బసచేసేవారు!

అలాగే, వీరవాసరం గ్రామం లో ఓ విశ్రాంతి భవనం నిర్మించారు. ప్రత్యేకం గా చుట్టూ గుర్రపు శాలా, మధ్యలో విశ్రాంతి గదులూ నిర్మించారు. ఈ భవనాన్ని కొన్నాళ్లు పాఠశాలలకోసం వుపయోగించారట. తరవాత పై (పెంకుల) కప్పు పాడైపోవడం తో మరమ్మతులు చేయించి, కొన్నాళ్లు సాగించారట. మళ్లీ కొద్ది రోజులకే ఆ కప్పు పాడైపోవడం తో ఇప్పుడు ఆ వంకతో భవనాన్ని పూర్తిగా తొలగించడానికి ప్రయత్నిస్తున్నారట! స్థానికులు దీన్ని వ్యతిరేకిస్తున్నారట.

నిజానికి "హెరిటేజ్" భవనాలు అంటే ఇలాంటివి! అంతేకానీ, యేలూరులో యెక్కడో బయటపడిన ఆంగ్లేయుల సమాధులూ, ఇంకెక్కడో తురకల సమాధులూ ఇలాంటివి కాదు కదా? మన ప్రభుత్వం, పురావస్తు శాఖా, గీతా రెడ్డీ ఇలాంటివాటిని పరిరక్షిస్తే బాగుండును. 

వాటిలో యేమి శిల్పకళ, లేదా యేమి ప్రత్యేకత వుందని కుతుబ్ షాహీ సమాధుల్ని పరిరక్షించడం?

ఇంకో ప్రక్క, బ్రిటీష్ వాళ్ల కాలానివీ, తరవాతవీ రాగీ, ఇత్తడి నాణాలని యెక్కువ ధరలకి కొంటున్నారట!

వాటి పురాతన విలువలకోసం కాదు--వాటిలో పంచలోహాలూ వుంటాయనీ, పూజలూ, ప్రతిష్టలూ, భూమిపూజలూ వంటి వాటిలో వీటిని వుపయోగించడం శ్రేయస్కరమనీ--యెంత ధరకైనా కొనేస్తున్నారట!

ఓ నలభై యేళ్ల క్రితం భారత ప్రభుత్వం పూర్తి రాగి తో 20 పైసల నాణాలని విడుదల చేస్తే, అలాంటివి ఓ ఇరవయ్యో యెన్నో కరిగించి, చేతికి రాగి కడియాలు చేయించేసుకునేవారు! అప్పట్లో అలా రాగి కడియాలు ఓ చేతికి ధరించడం వల్ల ఆరోగ్యానికి మంచిది అని విద్యార్థులతో సహా అందరూ చేయించుకొని, ధరించేవారు--అదో ప్రథ ఆ రోజుల్లో!

ఒకో కాలానికీ ఒకో వెర్రి మరి!

Saturday, September 25, 2010

ప్రజావినోదం

ఆహ్లాదం

ఆ మధ్య, రాష్ట్రం లో ప్రతిరోజూ తిరిగే 20 వేల బస్సుల్లో, "ఎల్సీడీ" టీవీలు పెట్టేసి, రోజంతా వినోద కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలని ఆర్టీసీ వారు నిర్ణయించారన్నారు.

ఇంతకు ముందు, వొల్వో, సూపర్ లగ్జరీ బస్సుల్లో మామూలు టీవీలని పెట్టి, మళ్లీ అవతల పారేశారట. 

ఇంకా అంతకు ముందు, టీవీలూ, వీసీఆర్లూ కూడా అలాగే పారేశారు. 

ఇప్పుడు, ఓ ప్రైవేటు సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చి, ఆ సంస్థే తిరిగి ఆర్టీసీకి ప్రతీ బస్సుకీ, నెలకీ 225 రూపాయలు చెల్లిస్తుందట! యెంతబాగుందో పథకం! ప్రజావినోదం, ప్రభుత్వాదాయం!

కొసమెరుపేమిటంటే, పల్లెవెలుగు బస్సుల్లో, పల్లె ప్రజలకు అనుగుణమైన (పాడి పెంటలు, పెంట చీమలు, పశువూ-పేడా, పందుల పెంపకం లాంటివేమో మరి) కార్యక్రమాల్నే ప్రసారం చేస్తారట!

ఆర్టీసీ లాభల బాటలో నడచుగాక!

మొన్న (22-09-2010) మా జడ్పీ చైర్మన్ మేకా శేషుబాబు యెందుకో ఊపొచ్చి, ఓ ప్రకటన విదుదల చేశాడు.

జడ్పీ కార్యాలయం లో మహాత్మా గాంధీ, బీ ఆర్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సర్ ఆర్థర్ కాటన్, ఆల్లూరి సీతారామరాజు, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, మదర్ థెరిస్సా, వై యెస్ రాజశేఖర్రెడ్డి వంటి నాయకుల నిలువెత్తు విగ్రహాలని నెలకొల్పుతారట.

ఇలాంటి మహనీయుల వర్థంతి, జయంతి కార్యక్రమాలని కార్యాలయం లోనే నిర్వహిస్తారట.

ఆ కార్యాలయ ప్రాంగణాన్ని వై యెస్ రాజశేఖర్రెడ్డి పార్కుగా అభివృధ్ధిపరచి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తారట. (మ్యూజికల్ డాన్సింగ్ ఫౌంటెయిన్ల సంగతెందుకు మరచిపోయారో--యెక్కడా చూడలేదో, యెవరూ చెప్పలేదో మరి)

పార్కింగ్ కి కూడా ప్రత్యేక స్థలం కేటాయిస్తారట.

ఇన్ని చెప్పినాయన, వీటికి నిధులెవరిస్తారన్నది చెప్పలేదు. (అయినా--తనది కాదు కాబట్టి, ప్రజలందరూ తాటి పట్టిలమీద యెదురు దేక్కుంటూ కాశీదాకా పొమ్మంటాడు--వాడిదేం పోయిందీ?)

అసలు ఇలాంటి ప్రకటన ఇప్పుడెందుకు చేశాడు? అని కొంతమంది ముక్కుమీద వేళ్లు కూడా వేసుకుంటున్నారు!

Wednesday, September 22, 2010

చవితి అయ్యింది.

నిమజ్జనాలు 

...........మొదలయ్యాయి.

ఓ యాభయ్యేళ్ల క్రితం ఈ నిమజ్జనాల వెర్రి వుండేది కాదు. జనాలు డబ్బుతో అంత వొళ్లు వాచీ లేరు.

చవితికి పెద్ద ఖర్చల్లా, వినాయకుడి బొమ్మ కొనడమే.

కుండలు చేసే కుమ్మరులే, చెక్క అచ్చులమధ్య మట్టితో వినాయకుడి బొమ్మ చేసి, ఆవఁ లో కాల్చి, వాటికి నీటి రంగులు వేసి, బజార్లో అమ్మేవారు. నాకు తెలిసినప్పటినించీ ఓ పెద్ద సైజు బొమ్మ ఖరీదు ఆరణాలు. చిన్న సైజు పావలా. 

(రెండే సైజులు--చిన్న సైజు అంటే ఆరంగుళాలు యెత్తు--చిన్న గుండ్రటి పీఠం మీద ముందుభాగం చక్కగా చెక్కి వుండేది--వెనక వైపు యేమీ వుండేది కాదు. పెద్దసైజు 9 అంగుళాల యెత్తు, నలుచదరం పీఠం పై కూచొన్నట్టు, వెనుక వైపు కూడా వినాయకుడి వీపూ, జుట్టూ అన్నీ వుండేవి.)

పూజా అవీ అయిపోయాక, మర్నాడు పత్రీ వగైరా కాలవలో కలిపేసి, బొమ్మని సిం హద్వారం పైన వుండే గూడుబల్ల మీద చేర్చేవారు. అలా ప్రతి యేటివీ ఓ యేడెనిమిది బొమ్మలు వుంటుండేవి ప్రతీ యింట్లో--పగిలినవి పోగా.

యే సంవత్సరమైనా బొమ్మ కొనడానికి తాహతు సరిపోకపోతే, క్రితం యేడాది బొమ్మని దింపి, దానికే పూజ చేసేవారు.

చైనా యుధ్ధం టైములోననుకుంటా, ఒకేసారి బొమ్మ రేటు రెండురూపాయలకి పెరిగిపోతే, ఓ రెండు సంవత్సరాలు మేము కూడా పాత బొమ్మకే పూజలు చేసుకొని, మళ్లీ గొడుగు బల్ల యెక్కించేశాము.

అప్పటికే, ఆ ఆరణాలు పెట్టి కూడా బొమ్మ కొనుక్కోలేనివాళ్లు, ముఖ్యం గా బ్రాహ్మణులు (అప్పట్లో బ్రాహ్మణులే ఈ పూజ చేసుకొనేవారు ఇంట్లో--సామూహికం గా వూరికో చోట పందిరిలో చేశేవారు) 'మట్టి బొమ్మే శ్రేష్ఠం' అంటూ కాలవలోని రేగడి మట్టితో తమకు వచ్చిన ఆకారం లో బొమ్మని చేసి, పూజ చేసుకొనేవారు. వాళ్లే, మరునాడు, 'మట్టి మట్టిలో కలవాల్సిందే' అంటూ ఆ బొమ్మల్ని మళ్లీ కాలవలో పారేసేవారు. 

అలా మొదలయ్యాయన్నమాట ఈ నిమజ్జనాలు.

ఇక, మా యేలూరు బిర్లా భవన్ ప్రాంతం లోని వినాయకుణ్ణి, 19-09-2010 న 800 కేజీల కూరగాయలతో, శాకాంబరుణ్ణి చేశారట.

(ఆహార ద్రవ్యోల్బణం ఇప్పట్లో దిగి వస్తుందని ఆశలు పెట్టుకోనఖ్ఖర్లేదన్నమాట)

ఇక, రాష్ట్రం లో సోమవారం 20-09-2010 నాటి నిమజ్జనం స్కోరు 11 మంది మృతీ, నలుగురు గల్లంతూ!

ప్రకాశం జిల్లా, కొత్తపట్నం వద్ద 25 మంది, మునిగి కొట్టుకుపోతే, మత్స్యకారులు రక్షించారు.

యేర్పాట్లని బట్టి చూస్తే, ఈ సారి హైదరాబాదు డకౌట్ అవుతుందని ఆశిద్దాం.

20-09-2010 నే రైల్వేల స్కోరు--మధ్య ప్రదేశ్ లో 23 మంది మృతీ, 51 మందికి తీవ్రగాయలూ.

Sunday, September 19, 2010

లౌకికత.....?!

నరసాపురం

మా "నరసాపురం" కి యెంతో చరిత్ర వుంది.  

కనీసం 300 సంవత్సరాలుగా చరిత్ర రికార్డుల్లో వుంది. అంతర్వేది లక్ష్మీ నరసిం హ స్వామి ఆలయానికి ముఖద్వారం గా యేర్పడిన ఈ గ్రామానికి "నరసాపురం" అని పేరు పెట్టారు.

ఇంకా అంతకు ముందే "ఆదికేశవ" యెంబెరుమన్నారు స్వామి కోవెల నిర్మాణం జరిగింది అంటారు.

అప్పటినించీ డచ్చివారి పరిపాలన్లో వుందీ పట్టణం. 

ప్రక్కనే వున్న, కొన్ని వందలయేళ్ల పాటు సంస్థానం గా వున్న మొగలితుఱ్ఱు రాజుల కాలం నించీ నరసాపురం అనే పేరు. సంబంధిత రికార్డులన్నిటిలో అలానే వుంటుంది.

"ఈనాడు" (ప గో జి) వాడు మాత్రం, ఈ వూరుపేరు "నౌషాపూర్" అనీ, తొమ్మిది దర్గాలు వుండడం వల్ల ఈ పేరు వచ్చిందని చరిత్ర చెపుతోందనీ, చరిత్రకారులు చెపుతున్నారు అనీ ఓ రెండేళ్ల క్రితం నించీ వ్రాయడం మొదలెట్టాడు. 

1795 కి పూర్వం ఈ వూరు వచ్చిన "హజరత్ సయ్యద్ ఇబ్రహీం మస్తాన్ షాజేమియా" అనే ఆయన పేరుతో 1796 లో "మస్తాన్ బాబా" దర్గా ని నిర్మించారు. ఈయన "షియా" మహాత్ముడు. ఇప్పటికీ, హిందువులే యెక్కువగా ఈ దర్గాని దర్శించి, తియ్య బూందీ నైవేద్యం గా పెడతారు--అదే ప్రసాదం గా తీసుకుంటారు. సున్నీలు యెవరూ ఈ దర్గాకి వెళ్లరు.

ఓ 250 సంవత్సరాల క్రితం, ఈ దర్గాకి దగ్గరలోనే, చేపల మసీదు నిర్మించారు. (మసీదు ముందు ఓ చిన్న చెరువు యేర్పరచి--ఓ స్విమ్మింగ్ పూల్ లా వుండేదది--అందులో రక రకాల, సైజుల చేపల్ని పెంచడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. మా చిన్నప్పుడు అటు వెళ్లినప్పుడల్లా, కాసేపు ఆ చేపలని చూసి ఆనందించడం మాకలవాటు). అది కూడా షియాల ప్రార్థనా స్థలమే. ఇప్పుడు పాత మసీదు శిధిలమవడం తో కొత్తగా కట్టారట--మరి చేపలు వున్నయో లేదో!

సున్నీలకి పాత బజారులో పెద్ద మసీదు వుంది. భక్తులు రోజూ అక్కడ ప్రార్థనలు చేస్తూ వుంటారు--ముఖ్యం గా రంజాను మాసం లో.

ఇక పండగ రోజున, మిషన్ హైస్కూలు ప్రక్కన వున్న "గోరీల దొడ్డి-కమ్-మసీదు" (గోడ మాత్రమే) లో ప్రార్థనలు చేసేవారు సున్నీలు. (ఇప్పుడు పేపర్లలో ఫోటోలు రావడం లేదు--అక్కడ ప్రార్థనలు మానేసి, గోరీల కోసమే వాడుతున్నారేమో--ఈ సారి నా సున్నీ మహమ్మదీయ స్నేహితులని యెవరినైనా అడగాలి మరచిపోకుండా!)

ఆ తరవాతెప్పుడో వచ్చిన చుట్టుప్రక్కల దర్గాలని కూడా కలుపుకొని, (ఇందులో కొన్ని ఇప్పుడు లేవు) నవదర్గాల పురం కాబట్టి, నౌషాపూర్ అని వ్రాయడం యేమైనా బాగుందా?    

మతసామరస్యం, సర్వమత సమానత్వం పేరుతో అధారాల్లేకుండా ఇలాంటి చరిత్రని ప్రచారం చెయ్యడం యెందుకు? (అడిగేవాడు లేడుకాబట్టి--చాలామంది అసలు పట్టించుకోవడమే లేదు--కొన్నేళ్ల తరవాత, ఈ రాతల్నే చారిత్రకాధారాలు అనే ఛాన్సు వుంది మరి!)

(అయినా, ఈ "ముస్లిం సోదరులు" అనేజాతి తెలుగు మీడియా సృష్ఠే యేమో--ఇంగ్లీషు పేపర్లలో, మ్యాగజైన్లలో యెక్కడా ముస్లిం అనేమాటకి తోకగా "బ్రెద్రెన్" అని వాడుతున్నట్టు లేదు.)

.....కోవెలగురించీ, మిగిలినవీ మరోసారి.