Saturday, January 31, 2009

వేలం వెఱ్ఱి

వేలం వెఱ్ఱి
…….అంటే యేమిటో తెలుసా? నాకూ తెలీదు! మన బీర్బల్ గారిని అడుగుదాం రండి! కట్ చేస్తే……….! మారు వేషం లో, పాదుషా అక్బర్, మంత్రి బీర్బల్ పట్టణంలో పర్యటిస్తుండగా, పాదుషా వారికి సందేహం వచ్చిందట—ఒక మసీదు ముందు నించి వెళుతుండగా—“బీర్బల్! అసలు వేలం వెఱ్ఱి అంటే యేమిటీ?” అని! “అదోరకం వెఱ్ఱి జహా ్‌పనా!” అన్నాడట బీర్బల్! అంతలో, మసీదు వైపు ముఖం పెట్టుకుని పడుకొన్న గాడిద ఒకటి కనిపించిందట వారికి. వెంటనే బీర్బల్ దాని దగ్గరకి వెళ్ళి, దాని చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి, దాని తోక లోంచి ఓ వెంట్రుకని పీకి, నెత్తి మీద వేసుకున్నాడట. పాదుషావారు అడిగితే, “జహాపనా! ఈ గాడిద చాలా పుణ్యాత్మురాలు! అందుకనే మసీదు వైపు—అంటే మన మక్కా వైపు ముఖం పెట్టుకొని నిద్రిస్తోంది! దీని చుట్టూ ప్రదక్షిణలు చేసి, దాని వెంట్రుకొకటి తల మీద వేసుకొంటే, మనకి దాని పుణ్యంలో సగం అయినా వస్తుంది!” అన్నాడట. వెంటనే పాదుషా వారు ఆచరించారు! అది చూసిన సామాన్య ప్రజలందరూ ఆచరించారు! సాయంత్రానికల్లా ఈ వార్త దావానలంలా వ్యాపించి, చుట్టుపక్కల ఊళ్ళలోని ప్రజలూ వచ్చి ఆచరించారు! వెరశి—ఆ గాడిద బొచ్చు లేకుండ, ఉత్తి చర్మంతో మరణించింది! ఆ రాత్రి వార్త తెచ్చిన భటుణ్ణి పంపించి, అక్బర్ తో అన్నాడట బీర్బల్—“జహాపనా! వేలం వెఱ్ఱి అంటే యేమిటో తెలిసిందా?” అని! పగలబడి నవ్వడం అక్బర్ వంతు—మన వంతు! అదీ! గమ్మత్తు! మన ముస్లిం సోదరులేమైనా అంటారా?

Monday, January 26, 2009

మరో గమ్మత్తు

మరో గమ్మత్తు
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని, పార్వతీపురం మొదలైన అటవీ ప్రాంతాల్లో, గుమ్మలక్ష్మీపురం అనే అడివి పల్లెలో, ఓ బ్యాంకు శాఖలో ఓ దృశ్యం! బ్యాంకు అధికారి యెదురుగా నించున్న ఓ గిరిజనుడు—పొదుపు ఖాతా, తరవాత ఋణ ఖాతా తెరవాలి. వారి మధ్య సంభాషణ! నీ పేరు? సుక్కడండి! మీ తండ్రిపేరు? మంగడండి! పుట్టిన రోజు? యెరుకనేదండి! యెలాగో తిప్పలుపడి, పని అయిందనిపించాడు బ్యాంకు అధికారి! ‘నెక్స్ట్!’ అన్నాడు. బ్యాంకు జవాను, తరవాత గిరిజనుణ్ణి ముందుకు తోశాడు. నీ పేరు? సుక్కడండి! తండ్రిపేరు? మంగడండి! అదేమిటి? ఇందాక వచ్చిన వాడి పేరూ సుక్కడే, తండ్రి పేరూ మంగడే కదా? ఆడు మా అన్నేనండి! మరి యెవరెవరో యెలా తెలుస్తుంది? ఫోటోలున్నాయి కదండి? సరేలే! ఫొటొల్నీ, మీ వ్రేలి ముద్రల్నీ గుర్తు పట్టగలిగితే, హాయిగా పట్నంలోనే వుండేవాణ్ణి! నాకీ ఖర్మ యెందుకు! సరేలే! మీ తాత పేరు? బుడ్డడండి! బ్రతికించావు! మరి పుట్టిన తేదీ? అల్లప్పుడు, లచ్చడుని పులి ముక్కు గీరేసినాది సూడు, ఆ రొజునండి! అది నాకెలా తెలుస్తుంది? అదేనండి! మా మావకి సలిజొరం ఒచ్చీసి, మా నాన పట్నం తోల్క పోతాంటే, మాయమ్మ ‘నువ్వెల్లద్దయ్యా! బిడ్డ పుట్టబోతంది’ అని సెప్పిందట సూడు! అదే రోజు! హారి భగవంతుడా! సరే! నెక్స్ట్! నీ పేరు? శుక్కడండి! తండ్రిపేరు? మంగడండి! హరినీ! నువ్వూ ఇంతకుముందు వాళ్ళ తమ్ముడివేనా? కాదండి! మరి! (జుట్టు పీక్కోవడమే తరవాయి) పోనీ, మీ తాత పేరు? సొక్కడండి! ఆ్! సుక్కడా? కాదండి! సొక్కడు! హమ్మయ్య! బ్రతికించావు! ఇలా ఓ నెలలో ఓ రెండు మూడు వందలమందికి ఖాతాలు పెట్టడానికి బ్యాంకు వాళ్ళ తాతలు దిగి వచ్చేవారు! ఇంతకీ గమ్మత్తు యేమిటంటారా? ఆ గిరిజనుల అచారం ప్రకారం, సోమ వారం పుట్టిన వాడికి—సొక్కడు; మంగళవారం పుట్టిన వాడికి—మంగడు; బుధవారం పుట్టిన వాడికి—బుడ్డడు; లక్ష్మివారం పుట్టిన వాడికి—లచ్చడు; శుక్రవారం పుట్టిన వాడికి—సుక్కడు; శనివారం పుట్టిన వాడికి—శంకడు; ఆదివారం పుట్టిన వాడికి—అబ్బడు అనే పేర్లు పెడతారు! మరందుకే-----------!