Saturday, May 15, 2010

'......క్షమించని

కులాల ప్రసక్తి'

రెండో రంగం :

మెట్లెక్కి బ్యాంకులోకి వస్తున్నాడో రైతు--దాదాపు 50 యేళ్ళు వుంటాయి, అడ్డపంచి పైకి మడిచి కట్టి, తలకి గుడ్డ చుట్టి, తెల్లచొక్కామీద బురద మరకలతో!

బ్యాంకు జవాను--'దించు! దించయ్యా పంచెని!' అన్నాడు. కంగారుగా పంచెని దించేశాడు రైతు. 'తలగుడ్డ తియ్యి! బ్యాంకులోకి వచ్చినా మర్యాద తెలియదు!' అనగానే, తలగుడ్డ తీసి చంకలో ఇరికించాడు ఆ రైతు. 

ఫీల్డాఫీసరు యెదురుగా నించొని, 'సార్! మా పంట ఋణాలు చెల్లించేసి పదిహేనురోజులు పైన అయ్యింది. మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. దుక్కి దున్ని సిధ్ధం చేశాము. విత్తనాలకి డబ్బు కావాలి. ఇన్నాళ్ళూ కొత్త మేనేజరు రావాలని ఋణాలు ఇవ్వలేదు. ఇప్పుడైనా........' అంటూంటే--

ఫీల్డాఫీసరు, 'ఇవాళ సోమవారం! ఇవాళెవరు రమ్మన్నారు నిన్ను?' అన్నాడు.

'కొత్త మేనేజరు సోమవారం వస్తాడంటే......'

'అవునయ్యా! అన్నాడు. కానీ ఈ ముష్టి వూరుకి యెవరు వస్తారు? జోనల్ ఆఫీసు లో రిపోర్టు చేసి, అక్కణ్ణించే ఇంకోవూరుకి మార్పించుకొని వెళ్ళిపోయాడు ఆయన! మళ్ళీ ఇంకొకర్ని వెయ్యాలి, ఆయన రావాలి.......చూద్దాం.....మళ్ళీ వచ్చే మంగళవారం రండి.' అనేశాడు.

(నేను ఆ బ్రాంచిలో చేరి రెండురోజులే అయ్యింది. తరవాత తెలిసింది ఆ రైతు ఓ 50 యెకరాలకి ఆసామీ అని! ఆ జిల్లాలో 50 యెకరాలంటే, కృష్ణా గోదావరి జిల్లాల్లో 5 యెకరాలకి సమానం! అయినా, పెద్ద రైతే కదా? వాళ్ళ వూరు బ్యాంకు వున్న వూరు నించి ఓ 15 కిలోలు వుంటుందిట. ఆ రోజు ఆయన ఇంకెవరిదో మోటార్ సైకిల్ మీద  లిఫ్ట్ అడిగి, బ్యాంకుకి వస్తూంటే, ఓ లారీ వీళ్ళమీద రోడ్డు గుంటల్లో వున్న బురద వర్షపునీరు చిమ్మేసి, వెళ్ళిపోయిందట!)

మరో పదిహేనురోజులకి కూడా కొత్త మేనేజరు రాలేదు. రైతులు వాళ్ళ పాట్లు వాళ్ళు పడ్డారు.

ఈ రంగం లో బ్యాంకు జవానూ, ఫీల్డాఫీసరూ ఇద్దరూ దళితులు. ఆ రైతు అగ్రవర్ణం వాడు.

మరెందుకలగ?

--మిగతా మరోసారి

Friday, May 14, 2010

'.....క్షమించని

కులాల ప్రసక్తి'

రెండు రంగాలు (సీన్లు) వ్రాస్తాను. చదివి, జవాబు చెప్పండి.

మొదటి రంగం :

ఓ హైవే--అక్కణ్ణించి ఇంకో దారి చీలుతుంది. అక్కడికి ఆ వూరు బస్ స్టాండ్ కొంచెం దూరం. యెటు వెళ్ళే బస్సులైనా, ఆ సెంటర్ లో ఆగుతాయి. ఆ సెంటర్ లో ఓ హోటెల్. స్లాబ్ బిల్డింగులో నీట్ గా వుంటుంది. టిఫిన్లు కూడా చాలా బాగుంటాయి. ఓ పక్కా, మధ్యనీ నాలుగేసి కుర్చీలు వుండే టేబుళ్ళు. ఇంకో పక్క, ఆరు కుర్చీలు వుండే టేబుళ్ళు. ఉదయం 6 నించీ, 11 దాకా యే టేబులూ ఖాళీ వుండదు.

ఆ సెంటర్ లోనే అనేక పాక హోటళ్ళు వున్నాయి--వాటిలోనూ ఖాళీ వుండదు ఆ సమయం లో.

ఆ వూళ్ళో ముందు రోజు రాత్రి ఓ శుభకార్యానికి వచ్చాడొకాయన. తెల్ల ఫేంటూ, తెల్ల షర్టూ టక్ చేసుకొని, చలవ కళ్ళజోడు పెట్టుకొని, టిప్ టాప్ గా వున్నాడు. తన ఆఫీసుకి ఆలస్యం అయిపోతుందేమో అని, టిఫిన్ చెయ్యకుండా బయల్దేరి వచ్చేశాడు. 

ఈ హోటల్లో నలుగురు కూర్చొనే టేబులు దగ్గర, యెడం వైపు కుర్చీలో కూర్చున్నాడు. కుడివైపు కుర్చీ గోడ దగ్గరగా వుంది. అది ఖాళీ. టిఫిన్ ఆర్డరు ఇచ్చాడు. సర్వర్ తేగానే, శుభ్రం గా చేతులు కడుక్కుని, తినడం ప్రారంభించాడు.

హోటెల్ యెదురుగా ఓ లారీ ఆగింది. అందులోని క్లీనర్, పాపం ఆకలితో నకనకలాడుతున్నాడు. డ్రైవర్ ని బతిమాలి, ఓ ఐదు నిమిషాల్లో వచ్చేస్తానన్నా అని, క్రిందికి దిగాడు. 

అతని వాలకం మామూలే--చొక్కా అంతా ఆయిల్ మరకలూ, చేతుల్నిండా నల్లగా గ్రీజు మరకలూ!

హోటల్లోకి వచ్చేసరికి, మన నీటుగాడి ప్రక్కన గోడదగ్గర వున్న సీటొక్కటే ఖాళీ వుంది!

సంశయిస్తూనే, 'కొంచెం జరుగుతారా?' అన్నాడు. నీటుగాడు విననట్టే నటిస్తూ, టిఫిన్ లాగించేస్తున్నాడు. 

ఇతను, అటుగా వస్తున్న సర్వర్ని దీనం గా వేడుకొన్నట్ట్లు చూశాడు. ఆ సర్వర్, 'కొంచెం జరగండి సార్!' అన్నాడు. 

జరగకపోగా, అయిష్టంగానే లేచి, గోడదగ్గర సీటుకి ఇతనికి దారిచ్చి, మళ్ళీ తన కుర్చీలో బాగా యెడం వైపు జరిగి తన టిఫిన్ 'మమ ' అనిపించి, సర్వర్ తో 'కాఫీ కేన్సిల్ ' అని చెప్పేసి, బయటికి వచ్చేశాడు బిల్లు చెల్లించి!

ఇక్కడ అసలు విషయం యేమిటంటే, ఆ నీటుగాడు ఓ దళితుడు. క్లీనర్ ఓ అగ్ర వర్ణం వాడు!

మరి యెందుకలగ?

ఇంకో రంగం మరోసారి.