Thursday, April 29, 2010

.....క్షమించని

కులాల ప్రసక్తి

రాజుల కాలం లో, సామ్రాజ్య విస్తరణ కాంక్షతో యుధ్ధాలు చేసేవారు. దానికోసం సైన్యాన్ని తర్ఫీదు ఇచ్చి, బలాన్నీ, ఆయుధాలనీ పెంచుకొనేవారు. 

యుధ్ధాల్లో దళాలకి అధిపతుల్ని నియమించేవారు--వారికి నాయుడు, రాయుడు, లాంటి పదవులిచ్చేవారు. రాజు క్షత్రియుడైతే, సాధారణం గా క్షత్రియులే సైన్యాధిపతిగా నియమింపబడేవారు. రాజు రెడ్డి అయితే, రెడ్డినే సైన్యాధిపతిని చేసేవారు. 

దళాధిపతులు చూపించిన పౌరుషాన్ని మెచ్చుకొని, వారికి కొంత భూమిని ఇచ్చేవాడు రాజు. ఆ భూముల్లో వ్యవసాయం చేయించుకొంటూ, కోటకి కూడా 'కాపు' గా వుండేవారు. వీళ్ళే ప్రాంతాలని బట్టి, కాపు కులం, వెలమ కులం--ఇలా యేర్పడ్డారు. ఇలాంటి వంశాలవాళ్ళే--వీరమాచనేని (వీరమాచయనాయని), ఘట్టమనేని, త్రిపురనేని, పర్వతనేని, రాయని, సర్వారాయని--ఇలాంటి ఇంటిపేర్లు వున్నవాళ్ళు. (వీళ్ళలో ప్రస్తుతం కొన్ని ఇంటిపేర్లవారు 'కమ్మ' లేదా 'చౌదరి' కులం గా వ్యవహరించబడుతున్నారు.)

ఇతరకులాలలోని వాళ్ళు, కొంత సంపాదించుకొని, స్వయం గా భూవసతిని యేర్పాటు చేసుకొని, ముఖ్య వృత్తి వ్యవసాయం, పాడి గా గలవాళ్ళు 'కమ్మ' కులం గా యేర్పడ్డారు. ఉత్తరభారతం లోని 'చౌధురీ' ల నించి 'చౌదరి' నామాన్ని స్వీకరించారు. వీళ్ళ ముఖ్య లక్షణం యేమిటంటే, బంజరు భూముల్ని కూడా తమ శ్రమ శక్తి తో బంగారు పండే భూములుగా మార్చడం! పాడి ని వృధ్ధి చేసుకోవడం. (ఈ కులం వాళ్ళు లేకపోతే, ఆంధ్ర ప్రదేశ్ లో యే ప్రాంతం లోనూ వ్యవసాయం ఇప్పుడున్న స్థితిలో వుండేదికాదు అంటే అతిశయోక్తి కాదు!)

(మా మేష్టారు తన తిట్టులో వుపయోగించిన 'దొమ్మరి, దూదేకుల, కమ్మరి, కుమ్మరి, మేదరి, మాల, మాదిగ, సాలి, కంసాలి, యెట్టి, యానాది, ఈడిగ, పాకీ' ఇలా సమస్థ కులాలవాళ్ళూ సైన్యం లో వుండి, వాళ్ళ వాళ్ళ వృత్తులు చెయ్యకపోతే, ఆ సైన్యాలు అంతంత సంఖ్యల్లో మనుగడ సాగించగలిగేవా?)

యుధ్ధాలు లేని శాంతి సమయం లో ఈ కులాలవాళ్ళందరికీ తగ్గ వుపాధి--ఆయుధాలు తయారు చెయ్యడమో, రాళ్ళూ వగైరా మోయించి గుళ్ళు కట్టించడమో, కళలని అభివృధ్ధి చెయ్యడమో--ఇలాంటివి చేసి, వాళ్ళకి వుపాధికి లోటులేకుండా చూసుకునేవారు.

సాహిత్యాన్నీ, ఇతర కళలనీ పోషించి, వాళ్ళకి కూడా అగ్రహారాలు ఇచ్చేవారు.

--మిగతా మరోసారి

Tuesday, April 13, 2010

చలన చిత్రాలు

'.....సిత్రాలు'

దాదాపు ఓ నలభై యేళ్ళ క్రితం, మన కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ 'కాలం మారింది' అనే ఓ సందేశాత్మక చిత్రానికి దర్శకత్వం వహించాడు. 

దాన్ని నిన్ననే (13-04-2010) ఈటీవీ వారు ప్రసారం చెయ్యడంతో మళ్ళీ చూశాను.

గాంధీ, నెహ్రూలకి కూడా 'విగ్రహాలు' పెట్టొద్దు--వారి బాటని అనుసరించడమే వారికి మనం ఇచ్చే నివాళి అని అర్ధం వచ్చేలా, హీరో (శోభన్ బాబు) చేత పాట పాడించారు!

నిజం గా అలాంటి చిత్రం చెయ్యడం తో ఆయన జీవితం ధన్యమయినట్టే! (ఆ సినిమాకి డబ్బులు రాలేదనుకోండి--అది వేరే విషయం)

అలాంటి సినిమాలు మరిన్ని తీస్తే, ఇప్పుడు కోట్లు వసూలు చెయ్యచ్చు.

యెందుకొచ్చిన శంకరాభరణాలూ, సాగర సంగమాలూ, సిరి వెన్నెలలూ!

'.....తపస్వి' గారూ! ప్రయత్నిస్తారా?

Friday, April 2, 2010

ఆ దేవుడు కూడా క్షమించని.......

కులాల ప్రసక్తి


త్రేతాయుగం లో జరిగినట్టు చెప్పబడుతున్న రామాయణం లో జాతుల ప్రసక్తి వుంది గాని, కులాల ప్రసక్తి అంతగా లేదు.

ముఖ్యం గా 'దైత్య ' (రాక్షస) జాతిని నిర్మూలించడానికే రామావతారం వచ్చింది.

(ఓ ముఫ్ఫయ్యేళ్ళక్రితం, ద్రవిడ కజగం స్థాపకుడు, పెరియార్ ఈ వీ రామస్వామి నాయకర్--రావణలీల జరిపించి, రాముణ్ణి వాహనం పై చెప్పులతోనూ, రాళ్ళతోను కొట్టిస్తూ, మదరాసు వీధుల్లో వూరేగించేవాడు! అప్పట్లో నిరసనలు లేవు. దేశవ్యాప్త నిరసనలు అసలే లేవు!)

ఆ కాలం లో బ్రాహ్మణులు పురోహితులుగా, యఙ్ఞాది కర్మలు చేయించేవాళ్ళుగా, చదువు చెప్పేవాళ్ళుగా, ప్రజల మంచికోసం ముహూర్తాలూ అవీ పెట్టేవాళ్ళుగానే వుండేవారు.

క్షత్రియులు, రాజ్య పాలన చేసేవారు. సైన్యం లో ముఖ్య పదవులు అధిష్టించేవారు.

వైశ్యులు వాణిజ్యం చేసి, వణిక్ ప్రముఖులుగానే వుండేవారు.

శూద్రులు పొలాల్లో పంటలు పండించడం చేసేవారు, యాదవులు పశుపోషణ చేసేవారు, మిగిలిన కులాలవాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తులు చేసుకునే వారనే అనుకోవాలి.

గుహుడు, శబరి వంటివాళ్ళు ఆయనని దైవం గానే కొలిచారు!

ఆ యుగాంతానికి కొంచెం ముందు, 'శంబూక వథ ' జరిగింది. ఆ పంచముడు తపస్సు చేస్తున్నాడని కొందరు రాముడికి ఫిర్యాదు చెయ్యగానే, ససైన్యం గా వెళ్ళి, 'నీవు నీ ధర్మాన్ని అతిక్రమించావు. అందుకని నిన్ను వధించక తప్పడం లేదు.' అన్నాడంటారు.

(ఇది 'వాల్మీకం' లో వుంది అని కొంతమంది, లేదు ప్రక్షిప్తం అని కొంతమంది అంటారు.)

ద్వాపర యుగానికి వచ్చేసరికి, కుల వ్యవస్థ బలపడింది. క్షత్రియులే కాకుండా, యాదవులు, నాగులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు--మొదలైన వాళ్ళు కూడా రాజ్యపాలన సాగించారు.

సైన్యం లో అన్ని కులాలవాళ్ళూ వుండి, వాళ్ళ వృత్తుల్ని కొనసాగించేవారు!

ఇక కలియుగం లో, మనకి తెలిసిన చరిత్ర ప్రకారం దండయాత్ర చేసి, ఢిల్లీ సిం హాసనాన్ని ఆక్రమించుకున్న షేర్ షా సూరీ కాలం లో, మొదటిసారి 'శిస్తు వసూళ్ళ ' వ్యవస్థని ప్రవేశపెట్టి ఆర్థిక వ్యవస్థని క్రమబధ్ధీకరించాడు.

ఆ క్రమం లో, సామంత రాజులకి ఆ అధికారాలు దఖలు పడి, వాళ్ళు వసూలు చేసిన దాంట్లో పెద్ద మొత్తాలని ఢిల్లీ నవాబుకి చెల్లించేవారు.

రాజులు లేని వ్యవసాయ ప్రాంతాలూ, అరణ్య ప్రాంతాలూ, కొండ ప్రాంతాలకి సంబంధించి, అక్కడ వారసత్వం గా కొంత భూవసతి కలిగిన వాళ్ళు ఆ ప్రాంతాలపై తమకి వసూళ్ళ అధికారాన్ని ఇమ్మని నవాబుకి మహజరు సమర్పిస్తే, సరేనని ఆ ప్రాంతానికి అతణ్ణి అధికారిగా నియమించేవారు.

అలావచ్చినవే 'చౌధురి ' మొదలైన పదవులు. (చతుర్థ హారి--అంటే వసూలు చేసిన దాంట్లో నాలుగో వంతు హరించి, మూడు వంతులు నవాబుకి చెల్లించేవారు--అదే కాలక్రమం లో చౌధరి గా మారిందంటారు. ఇంగ్లీషువాళ్ళు కడప వర్ణక్రమం లో వుపయోగించినట్టు వ్రాయడం వల్ల, అది చౌధురి అయ్యింది!)

అదుగో--అక్కడ పడింది జమీందారీ, ఇనాందారీ, మొఖాసాదారీ, శిరస్థదారీ మొదలైన వ్యవస్థలకి.

స్వర్ణ యుగం గా పేరుపడ్డ గుప్తుల కాలం వచ్చేసరికి, ఆర్థిక వ్యవస్థ మరింత పకడ్బందీ గా నడిచి, అందరూ సుఖ సంతోషాలతో జీవించేవారు--పాలన బాగుండడం వల్ల. ఇందుకు ముఖ్య కారణం 'కౌటిల్యుడు '.

మొఘలాయి పాలన వచ్చేసరికి, ఆర్థిక వ్యవస్థ చక్కగా నడిచేది--కాని ఈ జమీందారులూ వాళ్ళూ చాలా బల పడ్డారు--నవాబు వాళ్ళకి పూర్తిగా మద్దతు ఇస్తూండటం తో.

(గోల్కొండ నవాబు క్రింద పని చేసిన అక్కన్న, మాదన్న లు అలాంటివారే. అందులో అక్కన్ననే తానీషా అనేవారు. ప్రజల అఙ్ఞానాన్ని డబ్బులుచేసుకోవడం కోసం, క్యామెడీ కోసం తొట్టి గ్యాంగుకి పాత్రలు కల్పించడానికి, శ్రీ రామ దాసు సినిమాలో చరిత్రనీ, వాస్తవాన్నీ వక్రీకరించారు!)

(అప్పుడే తిట్టడం మొదలెట్టెయ్యకండి--ఇంకా చదవండి! మళ్ళీ వ్రాస్తాగా!)

Thursday, April 1, 2010

ఆ దేవుడు కూడా క్షమించని.........

"రిజర్వేష కావేషాలు"

ఈ మధ్య అదేదో సినిమాలో హీరోనే కాకుండా ఐదారు పాత్రలు 'పింజారీ' అనే మాటని వాడాయట. 

'అదిగో! మా కులం పేరెత్తారు. ఆ సినిమా వాళ్ళు క్షమాపణలు చెప్పాలి--లేకపోతే సినిమా ఆడనివ్వం!' అన్నారట ఓ కులం వాళ్ళు.

పూర్వం 'థగ్గులూ' 'పిండారీలూ' మొదలైన జాతులవాళ్ళు వుండేవారట.  వీళ్ళు దేశద్రిమ్మరులు. వీళ్ళ ముఖ్య వృత్తి 'దోపిడీలు, దొంగతనాలు, హత్యలు'.  వీళ్ళకీ, చెంఘిజ్ ఖాన్ కీ భయపడే (చెంఘిజ్ ఖాన్ వీళ్ళ జాతివాడేమో నాకు తెలియదు) ఈ నాడు ప్రపంచవింతల్లో ఒకటైన చైనా మహా కుడ్యాన్ని నిర్మించారు అప్పటి పాలకులు. అంతేకాదు--అఫ్ఘనీస్థాన్, బెలూచీస్థాన్, పాకిస్థాన్, ఉత్తర భారతం లలో బలమైన కోటలు పాలకులు కట్టించుకున్నది కూడా వీళ్ళకి భయపడే!

థగ్గులని ఇంగ్లీషువాళ్ళు స్వీకరించి, 'థగ్' అనేమాటని వాళ్ళ భాషలో ప్రవేశపెట్టుకున్నారు.  మనవాళ్ళు పిండారీలని 'పింజారీలు' గా స్వీకరించారు.

ఈ మాటకీ, 'పొడుగు పింజ' పొట్టి పింజ' 'దూది పింజ' లకీ సంబంధం అంటగట్టి, దాన్ని ఓ కులానికి అన్వయించిన మేథావి యెవరో--వాడికి శిరసు వంచి పాదాభివందనం చెయ్యడం కాదు--తోలు వొలవాలి!

ఇక రిజర్వేషాల విషయానికొస్తే.........."సమాజం లో 'అణగారిన వర్గాలకి' (అణగద్రొక్కబడ్డకాదు--గమనించండి) కొంత వెసులుబాటు కల్పించి, నిర్ణీత సమయం లో వాళ్ళని పై వర్గాలతో సమం చెయ్యడం" అనే వుదాత్త ఆశయం తో మన పెద్దలు రాజ్యంగం ద్వారా కల్పించిన రక్షణ కవచాలు అవి.

ఈ ఆశయం కోసం, కొన్ని కులాలనీ, వర్గాలనీ గుర్తించింది ప్రభుత్వం.

అసలు కులాలు యెలా యేర్పడ్డాయి?

మనిషి అవలంబించే వృత్తుల్ని, వంశ పారంపర్యంగా కొనసాగించడం తో, అవి కులాలుగా స్థిర పడ్డాయి. 

మనువు చెప్పాడు, విష్ణువు ముఖం లోంచి ఓ కులం, భుజాల్లోంచి ఓ కులం, పొట్టలోంచి ఓ కులం, తొడల్లోంచి మరిన్ని కులాల వాళ్ళూ పుట్టారు--ఇవన్నీ 'ట్రాష్'!--"ప్రక్షిప్తాలు"--అంటే "ఇన్సర్టెడ్"!

శతాబ్దాలుగా ఈ కుల వ్యవస్థ మన దేశం లో వ్రేళ్ళూనుకోడానికి, 'ముందుబడిన కులాలతో' సమానం గా 'వెనుకబడ్డ కులాలకీ' బాధ్యత వుంది!

(అప్పుడే తిట్టడం మొదలెట్టెయ్యకండి--ఇంకా చదవండి! మళ్ళీ వ్రాస్తాగా!)