Wednesday, March 30, 2011

మన తెలుగు



అంచనాలు

మన తెలుగులో అంచనాలకి కొన్ని మాటలున్నాయి--సుమారు; దాదాపు; రమారమి; ఇంచుమించు; బహుశా; బదా బదలుగా--ఇలా!

ఇవన్నీ "దాదాపు" ఒకే అర్థాన్ని సూచిస్తున్నా, చిన్న చిన్న తేడాలు వున్నాయి.

సుమారు--అంటే కొంత % అటో ఇటో వుండొచ్చు అని.

దాదాపు--అంటే, దగ్గర దగ్గర అంత వుండొచ్చు (అంత కంటే యెక్కువ యెట్టి పరిస్థితుల్లోనూ కాదు) అని.

రమారమి--అంటే, కొంచెం ఇటూ అటూగా అని.

ఇంచుమించు--అంటే, ఓ అంగుళం యెక్కువే వుండచ్చు అని.

బహుశా--అంటే, అనేక విధాలుగా చూసినా అని.

బదాబదలుగా--అంటే, దేనికి దాన్ని విడదీసి చూసినా అని.

ఇంకా ఇలాంటివి మీకు తోస్తే చెప్పండి.

ఇంతకీ మన "ఈనాడు" వారు ఈ మాటలని విచక్షణా రహితంగా వాడేస్తున్నారు!

అదీ సంగతి!

ఇవాళ "ఈనాడు" లో ఓ చిన్న వార్త--"....షాంపూకు మహేష్ ప్రచారం" అని!

భలే తెలుగు కదూ!

Monday, March 28, 2011

సూ ఋ సంస్థలు - 12



బంగ్లా ప్రయోగం 

మనం నెత్తికెత్తుకున్న సూ ఋ సంస్థల పితామహుడు మహమ్మద్ యూనస్, నోబెల్ అందుకునేంత యేమీ చెయ్యలేదు అని నేనంటే, చాలా మంది వొప్పుకోలేదు!

ఇప్పుడు, బంగ్లా ప్రభుత్వం ఆయన్ని గ్రామీణ బ్యాంకు నించి తొలగించి, ఆయన మీద దర్యాప్తులు మొదలుపెడితే, అందువల్ల "తాము ఇబ్బందులకు గురయ్యాము" అనీ, ఈ విషయంలో బంగ్లా ప్రభుత్వం "రాజీ" పడాలనీ, అమెరికా వొత్తిడి తెస్తోందట!

మొన్న మొన్నటిదాకా, మా సూ ఋ సంస్థలు ఇండియాలోలా కాదు--అక్కడ తగిన చట్టాలు చెయ్యాలి అంటూ వూదరగొడుతూనే వున్నాడు ఆయన. ఇప్పుడు మరి ఇదేమిటో?

అమెరికాకి నొప్పి యెందుకో? కాలమే చెప్పాలి. 

Friday, March 18, 2011

సిగ్గులేని సోనియా



'నికమ్మా' ప్రథాని

చాలా విషయాల్లో చూస్తున్నాముకదా—భారతీయులకి యేదైనా “అప్రాచ్యుడు” చెపితేనే నిజమని నమ్ముతారు!

అప్పుడు, గత లోక్ సభలో విశ్వాస తీర్మానం సందర్భంగా డబ్బు మూటలు చేతులు మారాయని మన మీడియా వీడియోలతో నిరూపించినా, ఆదికేశవులు నాయుడు, మంద జగన్నాథం లాంటివాళ్లు యెదురుగుండా కనిపిస్తున్నా, మళ్లీ యూపీయేకే పట్టం కట్టారు.

ఇప్పుడేమో, వికీలీక్స్ అనే అప్రాచ్యుడు చెపితే—అదుగో చూశారా—అదే నిజం అంటున్నారు.

పైగా, అధికారాంధులు అతి తెలివిగా, పాత లోక్ సభలో జరిగినవాటికి కొత్త లోక్ సభ “జవాబుదారీ కాదు” అనీ, “అది మరిచిపోయిన” వ్యవహారం అనీ, కిశోర్ చంద్ర దేవ్ కమిటీ “ఇంకా దర్యాప్తు జరగాలని” చెప్పినా, ఆ రిపోర్టు తో ఆ వ్యవహారం ముగిసింది అనీ, దానిమీద “ఏక్షన్” కూడా తీసుకొని, ముగ్గురి మీద “అవినీతి నిరోధక” కేసులు పెట్టేసి, చేతులు దులుపుకున్నామనీ, డబాయిస్తున్నారు!

(అసలు ఆ వెధవలని పోలీసు కస్టడీ కి ఇచ్చి వాళ్లు “తమ పధ్ధతిలో” వాళ్లని ప్రశ్నించి వుంటే, వాళ్లు “యెవరి తరఫున” డబ్బులు ఇచ్చారో బయటపడి వుండేది కాదా? అప్పుడు “వాళ్ళ మీద” పెట్టవలసిన కేసులు పెడితే సరిపోనుకదా? బాస్ ఆఙ్ఞ ప్రకారం హత్యలూ, దోపిడీలూ వాడి అనుచరులు చేసినా, బాస్ దే కదా నేరం?)

తరవాత జరిగిన యెన్నికల్లో తమ కూటమికి యెక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి, ఆ అరోపణలని జనం యెవరూ నమ్మలేదని నిరూపితం అయిపోయిందట! జనం నమ్మినా, నమ్మకపోయినా నేరం నేరమే! అవున కాదా?

మన "నికమ్మా" అయితే, “అశ్వథ్థామ హతః” లెవెల్లో, “నేను యెవరినీ కొనలేదు, యెవరినీ కొనమని చెప్పలేదు, నాకు డబ్బుల వ్యవహారం తో సంబంధం లేదు” అని ఘోషిస్తున్నాడు—ఢంకా బజాయించి మరీ!

అవినీతి “బురద” అయితే, ఈ లోక్ సభలూ, ప్రథానీ వగైరాలూ, ఎంపీలూ, ఎమ్మెల్యేలూ—అంతెంతుకు—ప్రతీ రాజకీయ నాయకుడూ, ప్రభుత్వాధికారీ—అందరూ "తామరాకులే" అని నమ్మెయ్యాలి జనం! గాలీ వానా ఒకేసారి వస్తే అసలు కథే వుండదుకదా!

యెంత బాగుందో మన ప్రజాస్వామ్యం!

జనం చెప్పులు తీసి యెప్పుడు చేతులతో పట్టుకుంటారో—వోట్లు అడగడానికి వస్తే “మచ్చపడ్డ” వెధవలకి యెలాంటి సత్కారాలు చేస్తారోనని—వేచి చూస్తున్నాను.

కొసమెరుపు : టేంక్ బండ్ నాశనమైనా, పార్లమెంటు దద్దరిల్లుతున్నా, ఇప్పుడు "సెజ్ లు రద్దు చెయ్యడానికి నిబంధనలు అడ్డు వస్తాయా?" అని ఆలోచిస్తున్నాడట మన ముఖ్యమంత్రి! (జగన్ మీద పిడకలవేటలో ప్రసిధ్ధుడు కదా మరి!)

సర్వేజనా సుఖినో భవంతు!

Tuesday, March 15, 2011

అంథేర్ నగరీ



అన్‌భుజ్ ప్రజా

రాజకీయ నిరసనలు తెలపడం ప్రజాస్వామ్యంలో తప్పులేదు! అంటాడు కోదండరామ్.

మరేం ఫర్వాలేదు—పడగొట్టినవాటితోపాటు, కొమరం భీం, సర్వాయి పాపడు, నాయకురాలు నాగమ్మ, కడెం అప్పన్న లాంటి వాళ్ల విగ్రహాలు కూడా పెట్టేస్తాం—అంటాడింకొకడు.

వుద్యమకారులు మారణాయుధాలు ధరించి వచ్చారనడం తప్పు—అంటాడొకడు.

రెండు నెలలు ముందుగానే ప్లాను వేశాం—యెలాగైనసరే ‘ఆ విగ్రహాలు ‘ కూలగొట్టాలని!—అంటాడింకొకడు.

గొలుసులూ, రాడ్లూ, హుక్కులూ అన్నీ ముందే తెచ్చుకొన్నారు—అని వొప్పుకుంటాడింకొకడు.

350 చెక్ పోస్టులు పెట్టి యెవరూ రాకుండా చేసినా, పదిలక్షలమందీ వచ్చేశారని ఆనందిస్తాడింకొకడు.

బీజేపీ వాళ్లు పూనుకున్నారు—తెరాస వాళ్లెవరూ లేరు అంటాడింకొకడు.

విద్యార్థులనీ, ఆ వెనక్కాల లాయర్లనీ చూసి కడుపునిండిపోయింది అంటాడింకొకడు.

రొచ్చుగుంట యేర్పడబోతోంది—కేసీఆర్, కోదండరాం యేర్పాటు చేస్తారట—చేపలు పట్టేద్దాం అని బీజేపీ వాళ్లు యెప్పుడో సిధ్ధమయ్యారు అంటాడు ఇంకొకడు.

కాంగ్రెస్ వాడు లోపాయకారీగా వీళ్లని అక్కడికి చేరుకోనిచ్చాడు అంటాడు ఇంకొకడు.

కేకే, యాష్కీ లకి భలే దేహశుధ్ధి చేసేశారు, ఇంకెవరూ దొరకలేదు అని అనందంతో వాపోతాడింకొకడు.

తి సు రా రె, లగడపాటి వగైరాలు, బొచ్చెలూ, రఘువీరలూ యేమంటున్నరో తెలీదు. 4 మిలియన్ మార్చ్ యేమైనా ప్లాన్ చేసి, హైదరాబాద్ టేంక్ బండ్ నేకాకుండా, మిగతా కూడా సర్వనాశనం చేద్దామని ఆలోచిస్తున్నారేమో తెలియదు.

అసలు కేసీఆర్ కి అసెంబ్లీ, సచివాలయాలనీ, కేటీఆర్ కి టేంక్ బండ్, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం వగైరాలనీ, కవితకి గోల్కొండకోట, కుతుబ్షాహీ సమాధులు, స్థానిక హోటళ్లూ, కోదండరాం కి యూనివర్సిటీలూ, కాలేజీలూ, లాయర్లకి కోర్టులూ—ఇలా రాసిచ్చేస్తే యే గొడవా వుండకపోనుకదా అంటాడింకో అమాయకుడు.

ఇలా యెన్నాళ్లు, పదండి సోనియా దగ్గరకి—అంటాడింకొకడు.

గన్ లోడ్ చేసి పెట్టాను—పైనుంచి పేల్చమని ఆర్డరు రావడమే తరవాయి—అంటాడు గవర్నరు.

మరేం ఫర్వాలేదు, మరోసారి అఖిలపక్షం అయ్యాక, యేకాభిప్రాయం వచ్చాక, అప్పుడు శ్రీకృష్ణ కమిటీ మీద నిర్ణయం చెయ్యచ్చు అని చిదంబరం.

విగ్రహాలు నిషేధించాలి, టేంక్ బండ్ తో పాటు అన్ని విగ్రహాలూ పడగొట్టేసి, హైదరాబాదుతోపాటు అన్ని చోట్లా, అన్ని విగ్రహాలనీ పడగొట్టెయ్యండి—తరవాత యెవరెవరికి యేయే రాష్ట్రం కావాలో పంచిపెట్టడానికి ఆలోచించచ్చు అని కొంతమందీ.

పోలీసులు చక్కటి ‘సమన్వయం’ పాటించారు, ఆందోళనకారులు చక్కటి ‘సం యమనం’ పాటించారు అని వొకడూ.

అరెస్టు చేసిన వాళ్లమీద క్రిమినల్ కేసులు పెట్టేస్తున్నారు—ఇదేమి ప్రజాస్వామ్యం? అని ఇంకోడూ.

ఇలా ఇలా అనేక గొంతులు వినిపిస్తున్నాయి నిద్ర లేచేటప్పటికి.

నేను ప్రస్తుతం వున్న ప్రదేశం లో ప్రజలు—హైదరాబాద్ నించి వచ్చారా? ఎన్‌టీఆర్ వుండేవాడుటకదా అక్కడ? స్వీట్లు యెక్కువ తింటారటకదా అక్కడ? బిరియానీ బాగుంటుందటకదా?—ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు తప్పితే, “తెలంగాణా, కేసీఆర్, కిరణ్ కుమార్"—లాంటి మాటలే వీళ్లకి తెలియదు!

సముద్రంలో కాకిరెట్ట మన ఆంధ్ర! దాన్ని యెన్ని ముక్కలు చేస్తే యెలావుంటుందో వూహించుకోండి.

సజీవ ముఖ చిత్రం చూడండి! తరవాత ఆలోచిద్దాం!