Sunday, January 31, 2010

వార్తల


దమాకా


'............ఇప్పుడు మా కేటీవీ న్యూస్ దమాకా ఎట్ 9-00 పీ. ఎం. కి స్వాగతం! గుంటూరు నించి మా ప్రతినిధి అక్కడ కొంపలు అంటుకున్నాయో లేదో తెలియచేస్తామంటున్నారు...ఓవర్ టూ గుంటూరు!  


......ఆఁ! చెప్పండి! ఇప్పుడు అక్కడి పరిస్థితి యెలా వుంది? యేమైనా పురోగతి వుందా....పోలీసులు యేమంటున్నారు......భుజంగం?'  


భుజంగం విజువల్, రెండు క్షణాల 'స్ట్రేటజిక్' సైలెన్స్ తరవాత, '............అన్ని రకాల ప్రయత్నాలూ జరుగుతున్నాయి....అయితే....ఈ కిడ్నాప్ యేదైతే వుందో, దానికి కారణమైన కార్లు యెక్కడనించి బయల్దేరాయి, పోలీసులకి యెక్కడ దొరికాయి అనే విషయం మీదే గత రెండు రోజుల్నించీ దృష్టి కేంద్రీకరించారు...అయితే...ఇంతవరకూ వాళ్ళేమీ సమచారం మనకి అందించలేదు....అయితే, మనం తెలుసుకున్నది.....ఆ కార్లు విజయవాడలో బయల్దేరాయని, గుంటూరు కి ముందు మంగళగిరి దాటాక ఆ కార్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారనీ చెప్పగలం...భద్రకాళి!....  


'.........సరే, సరే, అసలు పోలీసులు యెవర్నైనా అనుమానిస్తున్నారా? యెవర్నైనా అరెస్ట్ చేశారా? ఇంకా విశేషాలేమిటి.....భుజంగం?'  


మళ్ళీ ....విజువల్, సైలెన్స్ '.....ఇంతవరకూ ఈ కేసులో పోలీసులు అనుమానం తో కిడ్నాప్ అయిన అమ్మాయి తల్లిదండ్రుల్నీ, చుట్టుపక్కలవాళ్ళనీ, వాళ్ళ స్కూలు టీచర్లనీ ప్రశ్నించారు కానీ ఇంతవరకూ యెవర్నీ అరెస్ట్ చెయ్యలేదు...అయితే...కత్తిపోట్లు తిన్న డ్రైవర్ ని ప్రశ్నిద్దామనుకుంటుండగానే ఆయన వైకుంఠ యాత్రకి వెళ్ళిపోయాడు....కానీ...తాజాగా...దుండగుల్నించి తప్పించుకున్న ఆ అమ్మాయి అన్న హస్తమేమైనా వుందా అనే కోణం లో కూడా పరిశోధన ప్రారంభించారు పోలీసులు....భద్రకాళి!'  


'...సరే, సరే, ఈ పక్కన విజయవాడ నించి నాగభూషణం లైన్లో వున్నారు...చెప్పండీ...ఇలాంటి కిడ్నాప్ లు జరగకుండా యేమైనా ముందుజాగ్రత్త చర్యలూ, ప్రత్యామ్నాయ యేర్పాట్లూ చేశారా మన పోలీసులు............నాగా!'  


మళ్ళీ విజువల్, సైలెన్స్ '........అసలు 1929 నించీ చూసుకుంటే విజయవాడ గ్రామం లో, 1944 వరకూ ఒక్క కిడ్నాప్ కూడా జరిగిన దాఖలాల్లేవంటున్నారు మన ఎస్పీ భయంకర్....భద్ర....!'  


'ఇప్పుడో షాట్కమర్షియల్ బ్రేక్చూస్తూనేవుండండికేటీవీ!'  


పాడుతా తీయగాలో బాలు పక్కన కూర్చొన్న పెద్దాయనలాంటి ఒకాయన, '...వార్తలు చూడడం ముఖ్యమే కానీ.....ఇలాంటి వార్తలేమి చూస్తావురా....వీపీ! ఇంకచాలు...........నిద్దరో!' అని మందలించాడు ఆ బ్రేక్ లో!  


ఉలిక్కిపడి, టీవీ కట్టేసి........రుమూసుకుని 'నో'......!  


అదండీ సంగతి!

Thursday, January 14, 2010

మన తెలుగు


పండగలు


బాగుంది కదూ!  


మన సంస్కృతీ సాంప్రదాయలకల్లా మూలం--ముగ్గులూ, గొబ్బెమ్మలూ, గంగిరెద్దులూ, హరిదాసులూ, భోగిమంటలూ, గాలిపటాలూ, కోడిపందాలూ--ఇవే(ట)!  


(పై అన్నిటికీ పురాణాల్లోనో, సైన్సుపరంగానో యేదో ఒక కారణం చెప్పగలుగుతున్నారు అందరూ--ఒక్క గాలిపటాలకి తప్ప! మరి బలరామ కృష్ణులూ, కౌరవ పాండవులూ, రామ లక్ష్మణ భరత శతృఘ్నులు కూడా గాలిపటాలు యెగరేశారు అని యెక్కడా దాఖలాలు లేవు! బాల చంద్రుడుకూడా బొంగరాల ఆట ఆడాడుగానీ, పతంగులు యెగరెయ్యలేదు! యెందుకో?)  


పల్లెల్లో--పాపం రైతులు తమ రబీ పంటకి నీళ్ళందక, సగంచేను యెండిపోతుంటే, యే మురిక్కాలవకి అడ్డుకట్టకట్టి నీళ్ళు పెట్టుకుందామా అని వాటికి శ్రమిస్తూనే వున్నారు!  


రేషను కొట్లముందూ, గ్యాస్ కంపెనీలముందూ పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తూనే వున్నాయి! యెక్కడా ముగ్గులూ, గొబ్బిళ్ళూ మొదలైనవి కనపడటం లేదు!  


మామూలు రోజుకీ, పండగ రోజుకీ--యే ఒకళ్ళిద్దరు బలిసినవాళ్ళకో తప్ప--తేడా యేమీ తెలియడం లేదు!  


మరి, పెద్ద పల్లెటూళ్ళలో--కోడి పందాలూ, పక్కనే చీకులూ, బెల్టు దుకాణాలూ బాగానే దర్శనం ఇస్తున్నాయి--పోలీసులకి అధికారులచేత 'చూసీ చూడనట్టు ' పొండి--అని అదేశాలు ఇప్పించి, యధేచ్చగా పోటీలు పడుతున్న ఒకళ్ళో ఇద్దరో నాయకులతోపాటు అనేక మంది చోటా మోటా రాజకీయులూ, వాళ్ళ అనుచరులతోపాటు!  


పట్టణాల్లో, ముగ్గుల పోటీలూ, గొబ్బెమ్మల పోటీలూ, పతంగుల పోటీలూ, వంటల పోటీలూ, భక్తిపాటల, డాన్సుల పోటీలూ, టీవీల్లో రకరకాల 'షో'లని చూసి, అనుకరణలూ--ఇవీ జరుగుతున్నవి!  


నగరాల్లో అయితే, పూర్తిగా రాజకీయులు--తెలంగాణా హరిదాసుల్నీ, సర్కారు గంగిరెద్దుల్నీ, నిరసన డాన్సులూ అవీ--ఇవీ దృశ్యాలు!  


సెక్రటేరియట్ లో తక్కువక్లాసు వుద్యోగినులకి ముగ్గుల పోటీలు నిర్వహించారు!  


ఇక మన సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా యేమీ తక్కువ తినలేదు! శాయ శక్తులా ప్రత్నిస్తున్నాయి--మన సంస్కృతీ సాంప్రదాయాల్ని కాపాడటానికి!  


వచ్చే యేడాది అవి తమ కార్యాలయాల్ని ఆవుపేడతో అలికించి, ముగ్గులు పెట్టించి, గొబ్బెళ్ళు తట్టించి, పొంగళ్ళు పెట్టించి, ఆటపాటల్తో కార్యాలయాల్లోనే గడపమంటాయేమో తమ వుద్యోగుల్ని!  


(అలా అన్ని కార్యాలయాలూ చేస్తే, ఈ రైళ్ళలోనూ, బస్సులలోనూ రద్దీ తగ్గి, టిక్కెట్ చార్జీ దోపిడీలూ ఇవీ వుండకపోను!)  


ఇక వార్తల్లో, '.............ప్రజలందరూ సాంప్రదాయ బధ్ధం గా...........వగైరాలతో.........విశేష పూజలతో...........సాంస్కృత కార్యక్రమాలతో.......ఆనందం గా జరుపుకొన్నారు! ...........నాయకులు.........కూడా అందోత్సాహాలతో..........జరిపించారు!' ఇవీ 'స్టాండర్డ్' వాక్యాలు--ప్రతీ పండగకీ!  


ఇక యాంకర్లు మూడు రోజుల ముందునుంచీ, నాలుగురోజుల తరవాతదాకా, 'మీకు మా...........శుభాకాంక్షలు!' అంటారు ప్రతీ కార్యక్రమంలోనూ!  


తెలుగు సాంప్రదాయవాదులూ--మీకు జోహార్లు!



Monday, January 4, 2010

పోరాటం


ఒంటిచేత్తో!


చీకటిని తిట్టుకొంటూ కూర్చోవడం కన్నా యెంతచిన్నదైనా ఓ దీపాన్ని వెలిగించడం మంచిది అని నమ్మేవాణ్ణి!  


ఇక, అగ్గిపుల్ల గీసేవాళ్ళు చాలామంది వుంటారు--కానీ, దీపం కొడిగట్టకుండా అప్పుడప్పుడూ కాస్త చముఱు పోసేవాళ్ళూ, వత్తి పూర్తిగా కాలిపోతుంటే మరో వత్తి పేని దీపం కుంది లో వుంచేవాళ్ళూ కావాలి!  


మీరు అందులో ఒకరవుతారని ఆశించవచ్చా?

Saturday, January 2, 2010

మొరాయించిన డెస్క్ టాప్



'కుప్పకూలింది'  


20-12-2009 న నా తెలుగురాడికల్ లో టపా పబ్లిష్ చేశాక, టీవీలో వార్తలు చూస్తూ, సరదాగా 'సోలిటైర్' ఆడుతుండగా, హఠాత్తుగా నా సిస్టం (డెస్క్ టాప్) పూర్తిగా 'క్రాష్' అయిపోయింది!  


యెంత ప్రయత్నించినా మళ్ళీ బూట్ అవలేదు! ఇంకేం చెయ్యను!  


నేనుకూడా నిన్ననే వెళ్ళి (మార్గదర్శిలో చేరకుండానే) ఓ లాప్ టాప్ కొనుక్కున్నాను! మళ్ళీ ఆంతర్యాల లోకం లోకి జృంభిస్తున్నాను.  


ఇన్నాళ్ళూ నేను వ్రాయడం లేదేమిటి--అని ఆలోచిస్తున్న వాళ్ళకీ, హమ్మయ్య--పీడ విరగడయ్యింది--వ్రాయడం మానేశాడు--అని సంతోషించిన వాళ్ళెవరైనా వుంటే వాళ్ళకీ--నా క్షమాపణలు!