Sunday, October 24, 2010

మన......

.......దౌర్భాగ్యం

  • ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, ఈతముక్కల లో జ్వాలాముఖి అమ్మవారికి 10,001 "గారెలతో", అవికూడా వివిధ రంగుల్లో, అలంకరించారట.


'పచనం' చేసిన ఆహార పదార్థాలకి 'అంటు' అనేది వుంటుందని నమ్మేవాళ్లు ఇదివరకు. దేవుళ్లకీ, దేవతలకీ వారికి నివేదించే ప్రసాదాలు కూడా వారికి తగిలించకుండా దూరంగానే వుంచుతారు. 

ఇలాంటి గ్రామదేవతలకి అలాంటివి వుండవు, మాంసమూ, మద్యం తో సహా యేవైనా తగిలించవచ్చు అంటారా? అవున్లెండి--మధ్యలో మనకెందుకు!

  •  అజ్మల్ కసబ్ గుర్తున్నాడుగా?


వీడు జైల్లోనే వుండగా, తనకు చికెన్, మటన్ పెట్టలేదనీ, పత్రికలూ టీవీ ఇవ్వలేదు అనీ ఇలా రోజుకో వీరంగం వేస్తున్నాడు. 

వాణ్ని అక్కడే వుంచి, వీడియో కాన్‌ఫరెన్స్ ద్వారా విచారణ సాగిస్తున్నారు. విచారణ సమయం లో అనేక వెకిలి వేషాలు వేస్తున్నాడట. మొన్న యేకంగా జడ్జీగారి మొహం మీద పడేలా కెమేరామీదే "వుమ్మి" వేశాడట!

అయినా మన న్యాయమూర్తులు, వాడు "మానవహక్కుల వుల్లంఘనలతో సంబంధం వుండే అంతర్జాతీయ న్యయ స్థానానికి" తన కేసుని అప్పగించాలని డిమాండు చేస్తే, వుదారంగా "ప్రభుత్వానికి నీ కోరిక ని పంపిస్తాం" అన్నారట!

వీడికి ఈ బ్లాగరు ఈ క్రింది టపా లో 


విధించమన్న శిక్షనే విధించాలని దేశ భక్తులెవరైనా వుద్యమం లేవదీస్తే బాగుండును.


  •  ప్రపంచ చరిత్రలో, తామర్లేన్ (కుంటి తైమూర్), చెంఘిజ్ ఖాన్ లు అత్యంత కౄరులని, (తుగ్లక్ ఓ పిచ్చివాడనీ) పేరుపడి అన్ని దేశాలవాళ్లకీ తెలుసు.


ఇప్పుడు మంగోలు దేశమూ లేదు, అక్కడెక్కడా వాళ్లపేర్లతో పట్టణాలు గానీ, పేటలు గానీ, రోడ్లు గానీ వున్నట్టు దాఖలాలు లేవు.

మరి మన దౌర్భాగ్యమేమిటో, మనదేశం లో వున్నాయి ఇప్పటికీ!

గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలం, కొండవీడు ప్రాంతం లో "చెంఘిజ్ ఖాన్" పేట లో, ఇస్కాన్ 150 కోట్లతో ప్రారంభిస్తున్న ప్రాజెక్టుకి రోశయ్య భూమి పూజ చేశారు. వాళ్లు "వెన్నముద్ద వేణుగోపాల స్వామి" అలయనికి బంగారు తాపడం చేసి, "స్వర్ణ దేవాలయం" గా తీర్చి దిద్దుతారట.

ఆమధ్య పేపర్లలో వాళ్ల ప్రాజెక్టుగురించీ, మధ్యలో ఓ పేద్ద హంస ఆకారం లో ఓ కట్టడాన్నీ, గార్డెన్లనీ--ఇలా ఓ ప్లాను చిత్రాన్నీ ప్రచురించారు.

బాగానే వుంది--కానీ ఈ "చెంఘిజ్ ఖాన్ పేట" యేమిటీ?

తైమూరు సంగతి నాకు తెలియదుగానీ, తుగ్లక్ పేరుతో ఇంకా అనేక నగరాల్లో మార్గాలూ, వాడి "ఆబాద్" పేరుతో నగరాలూ మనదేశం లో వున్నాయి. 

మన అనేక "ఆబాదు"లని పేర్లు మార్చడానికి మనకి యెలాగూ తోకలేవడం లేదు! 

కనీసం "వెధవల" పేర్లతో వున్నవేనా మార్చలేరా? వాటికీ, మీ "ప్రత్యేక జాతి సోదరులకీ" కూడా సంబంధం వుందా? వాళ్ల వారసులేనా వీళ్లు?

కానివ్వండి! ఇంకెన్నాళ్లో.....!

Saturday, October 23, 2010

ఆకాశానికి నిచ్చెనలు........

(మాకు) స్విస్ బ్యాంకులనిండా డబ్బులు!  •  మొత్తానికి జిల్లాలో దసరాకి సామాన్యుడికి అదనం గా మరో అరకేజీ సంగతలా వుంచి, అసలే "చక్కెర" లేకుండా చేశారు.


కావలసిన 570 టన్నులకీ కేవలం 71 టన్నులే వుందట. అది దాదాపు 300 దుకాణాలకే సరిపోయిందట--అదికూడా పండగ అయిపోయాక తరలించారట.

భీమడోలు, హనుమాన్ జంక్షన్, వుయ్యూరు ల్లోని మిల్లుల్లో చక్కెర నిలవలు లేవని, కర్ణాటక నుంచి దిగుమతి చేస్తారట!

ఈ జిల్లాల్లో మిగిలిని మిల్లులమాటేమిటో, పైమూడు మిల్లులూ తయారుచేసే ఖండసారి చెక్కరే, ఇవేరోజుల్లో మార్కెట్ లోని మామూలు దుకాణాల్లో సన్న చక్కెరకు బదులుగా యెలా అమ్ముతున్నారో?  • ద్వారకాతిరుమల శ్రీవారి తూర్పు గోపురం యెదురుగా "కిరిచి" షెడ్డు నిర్మిస్తారట. దిగువ, మధ్యతరగతి నిరుపేదలు అన్ని వసతులతో వుచిత వివాహాలు జరుపుకొందుకు ఈ షెడ్డు వుపయోగిస్తుందట.


ఇంకా కొండపైన "యాదవకుంట" ని "యాదవ పుష్కరిణి"గా తయారు చేస్తారట.

ఇంకా, గరుడాళ్వారు విగ్రహం నించి ఆలయానికి వెళ్లేందుకు ఘాట్ రోడ్డుని నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించి సుందరీకరిస్తారట.

ఇవన్నీ ఆ ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వెల్లడించారట.

ఇంతకీ, ఈ "కిరిచి" అనేది యేభాషో, దాని అర్థమేమిటో యెవరికైన తెలుసా?


  • పల్లెవాసులకి అంతర్జాలాన్ని మరింత చేరువ చెయ్యడానికి, బీ ఎస్ ఎన్ ఎల్ వారు గ్రామీణ "కియోస్క్"లు యేర్పాటు చేస్తున్నారట. వాటిలో యెవరైనా గంటకి కేవలం రూ.5/- మాత్రమే చెల్లించి, అంతర్జాలం లో విహరించవచ్చునట.


ప గో జి లో ఇలాంటి 126 కేంద్రాలు యేర్పడతాయట. ఇప్పటికే, వాళ్ల "బిల్లు చెల్లింపు కేంద్రాలు" వున్న 29 చోట్ల ఇవి యేర్పరిచారట.

జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 155 ఎక్స్ ఛేంజిలు వుండగా, అన్నిట్లోనూ "ప్రైవేటు వ్యక్తులకి" బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లని "వుచితంగా" ఇచ్చి ఈ కియోస్క్ లు యేర్పాటు చేయాలని ఆలోచనట!

ఇంతకు ముందు వీధికి పదహారు చొప్పున యేర్పాటైన "ఎస్ టీ డీ; ఐ ఎస్ డీ; పీ సీ వో"ల దగ్గర రూ.5,000/- కి బ్యాంకు గ్యారంటీ తీసుకొని అనుమతులిచ్చారు. ఈ రోజున యెన్ని వున్నాయి? వాటి గ్యారంటీల మాటేమిటి? యెవరెంత నష్టపోయారు? ఇలాంటి ప్రశ్నలు అడిగేవాడు యెవడూ లేదు, సమాధానం చెప్పేవాళ్లూ లేరు!


  • "బోఫోర్స్" గన్ లని ఆకాశానికి యెక్కుపెట్టి, వాటితో అక్కడికి నిచ్చెనలు వేసి, మీకు "సూ ఋ సం" ల ద్వారా; "మెప్మా"ల ద్వారా డబ్బులిప్పించి, మీచే చంద్రయాన్ చేయించి, "కామన్వెల్త్" ఆటలాడించి, మీరు కోటీశ్వరులుగా భూమికి తిరిగొచ్చే యేర్పాట్లు చేస్తున్నాం!--అని మన చెవుల్లో పువ్వులు పెడుతూంటే--సహిస్తారా?


తేల్చుకోండి మరి!

Wednesday, October 20, 2010

మన రైళ్లూ.........

"మన..........'ఖ భక్తీ"

మన రైళ్లలో రిజర్వేషన్లలో జరుగుతున్న అక్రమాలగురించి మనం టపాలు వ్రాసుకున్నతరవాత, (ఆ టపాల లింకులు పత్రికలకి చేరిన తరవాత) పత్రికలు పరిశోధన చేసి కథనాలు వ్రాస్తున్నాయి.

మన ద మ రై పరిధిలో ప్రతి రోజూ 280 కి పైగా సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రయాణిస్తుంటే, ఒక్క హైదరాబాదు నుంచే రోజూ 160 కి పైగా రైళ్లు వెళుతున్నాయట.

వీటిలో 3 నెలల ముందునించే రిజర్వేషన్ మొదలవుతుంది. కొన్నేళ్ల క్రితం ట్రావెల్ యేజంట్ సంస్థలు 'గుంపగుత్తగా' రిజర్వేషన్లని చేసేసుకొంటూండడం తో, "వ్యక్తుల పేర్లతో మాత్రమే" అదీ ఒక దరఖాస్తుపై 6 గురికి మాత్రమే ఇవ్వాలని నిబంధన విధించి పాటిస్తున్నారు. (ప్రయాణీకుల వయసులు కూడా వుంటాయనీ, అవీ ముఖ్యమైనవే అనీ కావాలనే మరిచి పోయారు!)

యేజంట్ సంస్థలు రాష్ట్రం లో 180 వరకూ వున్నాయట. ఇప్పుడు వీళ్లు తెలుగువాళ్ల మామూలు పేర్లు--వెంకటేశ్వర రావు; సాంబశివరావు; వెంకట్రావు; సుబ్బారావు; సురేష్; రమేష్; శ్రీనివాస్; సాయి; లాంటి పేర్లని వుపయోగిస్తున్నారట. ఇందుకోసం క్రింది స్థాయి సిబ్బందికి 20 నించి 50 రూపాయలు (6 పేర్లున్న ఓ టిక్కెట్టుకి) లాభిస్తోందట.

ఈ టిక్కెట్ కౌంటర్లలో క్యూ లలో జరిగే "సైక్లింగ్" గురించి ఇదివరకే వ్రాశాను. పాపం యేజంట్ల గుమాస్తాలు వాళ్ల పొట్టకోసం ఇవన్నీ చేస్తున్నారు. కౌంటర్లలో సిబ్బంది కూడా, వీళ్లకి 12 టిక్కెట్లిస్తే, సామాన్యులకి మూడో నాలుగో టిక్కెట్లైనా ఇస్తున్నారు. నిజానికి ఇవి పెద్ద లెఖ్ఖలోకి రావు.

ఐ ఆర్ సీ టీ సీ లెవల్లోనూ, తత్కాల్ రిజర్వేషన్లలోనూ లక్షలాది రూపాయల అవినీతి ముందు ఇవెంత? 

పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలు మాని, సో కాల్డ్ రైల్వే విజిలెన్స్, కమర్షియల్ సెక్షన్ ల వాళ్లు పెద్ద చేపలకి వలలు వేస్తే, ఈ దరిద్రం తీరుతుంది!

అసలు దీనంతటికీ బాధ్యత కనీసం రెండుబోగీలకైనా ఒక టీటీయీ ని నియమించకుండా, మొత్తం రైలు అంతటికీ ఒకే టీటీ తో పంపిస్తున్న వున్నతాధికారులదే! (జనరల్ టిక్కెట్టు కూడా తీసుకోకుండా, స్లీపర్ బోగీలలో జొరబడుతున్నవాళ్లని నిరోధించేవాడు యెవడూ లేడు!)

అన్నట్టు మొన్న 09-10-2010 న, ఆ మర్నాడు రైల్వే ఎడిషనల్ జీ ఎం వస్తున్నాడని, భీమవరం నుంచి రైల్వే కాంట్రాక్టు సిబ్బందిని రప్పించి, నరసాపురం స్టేషన్ లో వెలగని దీపాలనీ, అపరిశుభ్రంగా వున్న తాగునీటి కుళాయిలనీ, పట్టాలపై, ప్లాట్ ఫారాలపై చెత్తనీ అర్జంటుగా--వెలిగించి, శుభ్రం చేయించారట! 'వున్నతాధికారులొస్తేగానీ......'అని ప్రయాణీకులు చెవులుకొరుక్కున్నారట.

09-10-2010 నే, ప గో జి పాలకొల్లు దగ్గరున్న "దగ్గులూరు" లో 35 అడుగుల (షిర్డీ) సాయిబాబా విగ్రహాన్ని ఆవిష్కరించారట. ఈ సందర్భం గా "గణపతి పూజ"; "పుణ్యహవాచనం"; "మండపారాధన"; "దీక్షా ధారణ"; "రక్షా బంధన"; (35 అడుగుల) బాబాకి "పంచామృతాభిషేకం"; "అంకురార్పణ" నిర్వహించారట. 

"భారీ అన్నసమారాధన"; కార్యక్రమం జరుగుతున్నంతసేపూ భక్తుల "ప్రత్యేక" గీతాలూ కొన....సాగాయట.

(యెవరు యెంత డబ్బు దొబ్బించుకున్నరో, యెవరు యెంత నొక్కేశారో--ఆ బాబాకే తెలియాలి మరి!)

Tuesday, October 12, 2010

మన తెలుగు

నిర్వాకాలు

"అయోధ్యపై కేంద్రానికి 'నిర్దుష్ట' వైఖరేమీ లేదు" అన్నాట్ట వీరప్ప మొయిలీ. (అంటే 'దుష్ట' వైఖరి వున్నట్టేనా? లేక 'నిర్దిష్ట ' అనడానికి పొరపాటున నిర్దుష్ట అన్నాడా?)

మన తెలుగు పాత్రికేయుడు అలా వ్రాసి, ప్రచురించాడంతే! యెందుకంటే మొయిలీ తనకి రాని తెలుగులో మాట్లాడడు కదా!

*   *   *

మొన్న హైదరాబాదు "దేశోధ్ధారక భవన్" లో, గాంధీ జయంతి వారోత్సవ ముగింపు సభల్లో, ముఖ్య అతిథి 96 యేళ్ల కొండా లక్ష్మణ్ బాపూజీ--'డిసెంబరు 31 తరవాత ప్రత్యేక తెలంగాణా ఇవ్వకుంటే ఆత్మార్పణకి సిధ్ధపడతాను' అని ప్రకటించాడట! (కానీ 'చేసుకుంటాను' అని ప్రకటించలేదు చూడండి!)  చింత చచ్చినా పులుపు చావలేదు అందామా అంటే--1969 లో చెన్నారెడ్డి తో కలిసి, వుధృతమైన వుద్యమాన్ని చంక నాకబెట్టిందెవరు? అనే ప్రశ్న వస్తుంది కదా?

*   *   *
మొన్న మన రాష్ట్ర డీజీపీ కార్యాలయం లోని స్టోర్స్ నుంచి ఓ వంద "తూటా రక్షణ కవచాలు" (బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అనుకుంటా) మాయమయ్యాయట--అకస్మాత్తుగా చేసిన తనిఖీలో ఈ విషయం బయట పడేటప్పటికి, మళ్లీ అవి అక్కడే ప్రత్యక్షమయ్యాయట! 

ఇందుకు బాధ్యుడని భావించిన డీ ఎస్ పీ ని బదిలీ చేసి, ఆరా తీస్తే, ఆయన తన వుద్యోగాన్ని సాయుధ విభాగాన్నించి సివిల్ విభాగానికి మార్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడని తేలిందట. ఈ "కన్వర్షన్" అంటే మాటలా? ఖర్చు కనీసం 10 నుంచి 15 లక్షలైనా వుంటుందట! అందుకనే "కక్కుర్తి" పడ్డాడేమోనంటున్నారు!

నిజం గా ఈ కక్కుర్తి ఫలిస్తే, రాష్ట్ర ప్రభుత్వానికీ, ప్రజలకీ యెంత నష్టం? అసలు వాటిని యెవరికి "అమ్మాలనుకున్నాడు?" లాంటి ప్రశ్నలెవరూ అడగడం లేదుట! వాడికి సహకరించింది యెవరు? అని మాత్రమే "ఆరా" తీస్తున్నారట! (ఆరూపం గా ఇంకొంత మంది మీద కక్ష తీర్చుకోవచ్చు కదా?)

ఇప్పుడు ఇలాంటివాటి నివారణకోసం ప్రత్యేక "సాఫ్ట్ వేర్" రూపొందించి, పరిశీలిస్తున్నారట!

మన పిచ్చి గానీ, ఇన్నాళ్లూ సాఫ్ట్ వేర్ వుంటేనే అన్నీ అరికట్టబడ్డాయా? (ప్రభుత్వమూ--గుత్తేదారులూ--సలహాదారులూ--కోట్ల కోట్లూ--మామూలే! "ప్ర గు స కో కో మా")

యేమంటారు?
*   *   *

అన్నట్టు--కవచాలు అంటే గుర్తొచ్చింది. పూర్వం యుధ్ధాలకి వెళ్లే సైనికులు బాణాలనుంచీ, కత్తుల నించీ రక్షణగా వొళ్లంతా వివిధ రకాల తొడుగులు (చర్మం తో గానీ, లోహంతో గానీ తయారైనవి) ధరించి వెళ్లేవారట.

ఇప్పుడు మన వివిధ గుళ్లలో శ్రీవార్లకీ, అమ్మవార్లకీ--వెండితోనూ, బంగారం తోనూ కవచాలు చేయించి, వొళ్లంతా తొడిగేస్తున్నారు! (ఇంతకు ముందు తగరం తోగానీ, రాగితోగానీ ఇలాంటి కవచాలు తగిలించిన దాఖలాలు లేవు!)

అసలు కవచాలూ, రక్షలూ, యంత్రాలూ అంటే--మంత్రాలతోనూ, బీజాక్షరాలతోనూ యేర్పాటు చేసేవేగానీ, ఇలాంటి సైనిక కవచాలూ, ఇనప కచ్చడాలూ కాదు.....అని వీళ్లకి యెవరు చెపుతారు?

Friday, October 8, 2010

కుహనా......

......సామరస్యం


హమ్మయ్య! అయోధ్య గురించి తీర్పొచ్చేసింది--60 యేళ్లో యెంతో నానిన తరవాత--అదీ సర్వ జన సమ్మతం గా--అని కొంతమంది సంతోషించేశారు.

"ఇదేదో రొచ్చు గుంట లా వుంది--రండ్రా చేపలు పట్టేద్దాం" అంటూ తయారైపోతున్నారు కొంతమంది సెక్యులరిస్టులు--తమ సోదరులమీద ప్రేమ కారి పోతూ!

ఇక, ప్రముఖ సామరస్య వాదులు తమ కలాలని దులిపి, వ్యాసాలు వ్రాసేస్తున్నారు. కొంతమంది సిండికేటెడ్/ఫ్రీలాన్స్ జర్నలిస్టులు తమ అమూల్యాభిప్రాయాలనీ, రాబోయే వందేళ్లలో యెవరు యెలా ప్రవర్తించాలో సలహాలనీ గుప్పించేస్తున్నారు.

వుదాహరణకి ఓ వ్యాసం లో--

"అయోధ్య కోసం 60 యేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న మహంత్ భాస్కర దాస్, హషీం అన్సారీ ఆప్త మిత్రులు. భిన్న వాదనలు వినిపించడానికి ఒకే వాహనం లో న్యాయస్థానానికి వచ్చేవారు.
(వాళ్లిద్దరూ జంటిల్మెన్ కాబట్టి!......వాళ్లూ కొట్టుకు చచ్చి వుంటే వీళ్లకి మరో రకం వ్రాతలకి ఆస్కారం వుండేది మరి)

ఆయోధ్య లోని అన్ని ఆలయలకీ దేవతా విగ్రహాల అలంకరణకి పూల హారాలూ, భక్తులు సమర్పించే పూల మాలలూ తయారు చేసేది అష్రాఫీ భవన్ ప్రాంతం లో నివసించే 15 ముస్లిం కుటుంబాల వారే. హ్రస్వ దృష్టి వున్నవారికి అది కేవలం జీవనోపాధిగానే కనిపించవచ్చు కానీ......(ట).

రెండు దశాబ్దాల క్రితం కాశ్మీరీ పండిత్ లు పారిపోవడం వల్ల అనేక ఆలయాలు ఆలనా, పాలనా లేనివయ్యాయి. కానీ పహల్గాం లో 900 యేళ్ల నాటి శివాలయానికి....ముస్లిములే పూజారులై.....పండిత్ లు తిరిగి వచ్చి ఆలయ బాధ్యతలు చేపట్టాలని కోరుతున్న.....(ట).

పంజాబులో....కేరళలో....కర్ణాటకలో....అనేక మసీదుల్ని హిందువులే పునర్నిర్మించారు (ట).


అబ్దుల్ వాహిద్ అనే ఆయన వారసత్వం గా వచ్చిన వృత్తివ్యాపకం "రామ్ లీలా" లో పాల్గొనే రామ, లక్ష్మణ, సీత, రావణ, హనుమ పాత్రధారులకి ఆహార్యాలు రూపొందించడమే. అతని ముగ్గురు కుమారులూ అదే పనిలో వుంటారు. ఆయన అసలు పేరు మరుగున పడి, ఇప్పుడు "రాం సింగ్ డ్రెస్ వాలా" అంటున్నారు (ట).


రిటైర్డ్ ఇంజనీరు సికిందర్ వార్సీ, తన మిత్రుడు మెకానిక్ మొహమ్మద్ ఇస్లాం లు "రామాయణాన్ని" మృదుమధురం గా గానం చేస్తున్నారు (ట) గత రెండు దశాబ్దాలుగా, యెవరు పిలిచినా.

వారణాసి లో "నజ్ నీన్" రామ చరిత మానస్ ని ఉర్దూలోకి చకచకా అనువదిస్తోంది. ఇప్పటికి సుందరకాండ ముగిసింది, మరో నెలన్నరలో పూర్తవుతుంది (ట)."

(అన్నట్టు--తులసీదాసు యెప్పుడూ "అయోధ్య రామాలయం" గురించి వ్రాయలేదు/పాడలేదు అంటూ అప్పటికి ఆ ఆలయమే లేదు అంటున్నారు జన విఙ్ఞాన వేదిక వారు--ఆయన గ్రుడ్డివాడని మరిచి పోతున్నారు!)

ఇంకా అనేక వుత్సవాల్లో, పూజల్లో, అనేక రాష్ ట్రాల్లో--దేశవ్యాప్తం గా "సామరస్యం" వెల్లి విరుస్తోంది (ట).

బాగానే వుంది. 

వీళ్లందరితో యెవరికైనా, యెప్పుడైనా, యెందుకైనా తగవు వచ్చిందా?

వస్తున్నది మహమ్మదీయుల్లో, అదీ సున్నీల్లో, "కొంతమంది" కడివెడి పాలల్లో విషం చుక్క జల్లే--మూర్ఖుల వల్లనేకదా?

ఆమాత్రానికి "వోవరాక్షన్"లు యెందుకు?

ఇలాంటి వాడే చిదంబరం--అయోధ్య తీర్పు మీద వ్యాఖ్యానించిన వెంటనే, మసీదు కూల్చివేత గురించి విలేఖర్లు అడిగితే, మాయా బజారు సినిమాలో సూర్యకాంతం లెవెల్లో సోనియా 'అలా చెప్పరాబాబూ! అమ్మ మెచ్చుకొంటుంది 'అన్నట్టు వెలిగి--"అది ఖచ్చితం గా నేరమే......." అని, మళ్లీ యెందుకైనా మంచిదని, "నా దృష్టిలో" అని ముక్తాయించాడు!

Wednesday, October 6, 2010

క్రీడల......

కామన్వెల్త్

'కామన్వెల్త్ ' అంటే సామాన్యుల (అందరికీ చెందే) సంపద. (బ్రిటిష్ కామన్వెల్త్ సంగతి వేరు)

కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవం బ్రహ్మాండం గా జరిగింది. చూసేవాళ్లకి కళ్లు చెదిరాయి--మనసులు పొంగాయి.

దాదాపు 10 నించి 20 వేల మంది సిబ్బందీ, కళాకారులూ, సాంకేతికులూ పడ్డ శ్రమ ఫలించింది. గొడవలూ అవినీతీ వంటివాటి సంగతి యెలా వున్నా, అదేదో కుజ దోషమో యేదో అన్నట్టు, మనవాళ్లేమి చేసినా చివరి వరకూ ఆందోళనలూ, టెన్షన్లూ, అడుగడుగునా అనుమానాలూ, అసలు జరుగుతుందా లేదా అనే సందేహాలూ, ఇలాంటివి తప్పకపోయినా, చివరికి అంతా "సవ్యం"గానే జరిగిపోతుంది.

యేడేళ్ల కుర్రాడు కేశవ్ పాపం తబలా చక్కగా వాయించాడు. మిగిలిన కళాకారులందరితోపాటూ, యెన్ని నెలలు, రోజులు, గంటలు సాధనా, రిహార్సల్సూ చేశారోగాని, వాళ్ల శ్రమ ధన్యం అయ్యింది. 

పాపం, కేశవ్ లో మాత్రం చివరిలో అలసట స్పష్టం గా కనిపించింది. బాబూ కేశవ్! ఈ ప్రదర్శనలు ఇప్పణ్నించీ మనకొద్దు గానీ, భవిష్యత్తులో పెద్ద విద్వాంసుడు కావడానికి ఇంకా కృషి చెయ్యి!

ఇక అక్కడ యేర్పాట్లూ అవీ బ్రహ్మాండం అని విదేశీయులు కూడా మెచ్చుకొంటున్నారు. 

ప్రత్యేకం గా భోజనాల గురించి--

భారత్, ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, పశ్చిమ దేశాలకి చెందిన పదార్థాలన్నీ వుంచుతున్నారట.

ఆఫ్రికాకు చెందిన జాలీఫీ, కబాబ్స్, మాంసం
ఆసియాకి చెందిన పాడ్ థాయ్, నూడుల్స్, సీఫుడ్, చికెన్, బటర్ చికెన్
పాశ్చాత్య దేశాలకి చెందిన లాంబ్ చాప్స్, చిల్లీ కాన్స్, ఫ్రైస్
ఈటలీకి చెందిన పిజ్జా, పాస్తా, పుట్టగొడుగులూ
భారత్ కు చెందిన చికెన్ రోల్స్, పాలక్ పనీర్ ప్రత్యేక వంటకాలట.

క్రీడాకారుల దేహాలనించి సాల్ట్స్, మినరల్స్ తగ్గకుండా, "ఐసోటోనిక్ డ్రింక్స్" కూడా వుంచారట. ఇక ఓ డైటీషియన్ కూడా సలహాలివ్వడానికి వుంటాడట.

ఒక్కో సెషన్ కీ 12000, మొత్తం 36000 మందికి భోజనాలు 24 గంటలూ సిధ్ధం గా వుంటాయట.

రోజుకి 15 టన్నుల మేక మాంసం, యేడు టన్నుల కోడి మాంసం, (చేపలు, పీతలూ వగైరాల సంగతి తెలీదు) 700 కిలోల బియ్యం తో వంటలు చేస్తున్నారట. 36000 లీటర్ల నీళ్లూ, పళ్ల రసాలూ, డ్రింక్స్ అందుబాటులో వుంచుతున్నారట.

టన్నులకొద్దీ మాంసాలకోసం యెన్ని జీవుల్ని చంపుతున్నారోగానీ, అవేవీ 'దుబారా' కాకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులదే సుమా!

(ఆ సంగతులు క్రీడలు పూర్తయ్యే వరకూ బయటికి రావు).

సంతోషకర వార్తేమిటంటే, మన క్రీడాకారులు "పతకాలు" బాగానే సాధిస్తున్నారు!

మేరా భారత్ మహాన్!