Saturday, February 28, 2009

స్కామాయణం-2

ప్రతీ సంవత్సరం, వ్యవసాయాధికారులూ, నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (నాబార్డ్), జిల్లాల్లో లీడ్ బ్యాంకులూ కలిసి, యే పంటకి యెంత పెట్టుబడి అవసరం అవుతుంది, మిగిలిన వ్యయాలెంత అవుతాయి, సార్వాకి యెంత, దాళ్వాకి యెంత—ఇలా లెఖ్ఖలు వేసి, యెకరానికి ఇంత అని నిర్ణయిస్తారు. ఆ ప్రకారం బ్యాంకులు ఋణాలు మంజూరు చేస్తాయి. ఇక ఒక పద్ధతిలో, మామూలు జాగ్రత్తలు తీసుకుంటూ, ఋణాలు పంపిణి చేస్తాయి. ఇలా విడివిడిగా కాకుండా, ఒక కార్ఖానా కి అనుబంధంగా, వారి పంట ఆ కార్ఖానాకే ఇస్తామని, వారు చెల్లించే సొమ్ము బ్యాంకులో వారి ఋణ ఖాతాకి జమ కట్టవలసింది అనీ రైతులు ఒప్పందాలు చేసుకుంటారు. చక్కెర పంటకి చక్కెర కార్మాగారాలూ, పొగాకు కి పొగాకు బోర్డూ—ఇలా అన్నమాట. ఇవి తిరిగి వసూలవడం ఖాయం కాబట్టి, ఈ యేర్పాటు తో బ్యాంకులు ‘కళ్ళు మూసుకుని’ ఋణాలు ఇచ్చేస్తాయి! అంటే, నిజంగా కళ్ళు మూసుకుని కాదు—అంత నిశ్చింతగా అని! ఇలా ఇచ్చినా, తమ మామూలు జాగ్రత్తలు—పట్టాదారు పాస్ పుస్తకాల్లో నమోదు చెయ్యడం, దస్తావేజు పాస్ బుక్ నకలు తీసుకుని అట్టే పెట్టుకోవడం, తాము యే సర్వే నెంబర్లలో యెంత విస్తీర్ణానికి యే పంటకి అప్పు ఇచ్చారో సంబంధిత తహసీల్దారు కార్యాలయానికీ, వ్యవసాయాధికారులకి తెలియ చెయ్యడం—లాంటివి తీసుకుంటాయి! నెలవారీ జరిగే సమావేశాల్లో, లీడ్ బ్యాంకు అధికారులూ, అన్ని బ్యాంకుల మేనేజర్లూ, అధికారులూ, జిల్లా అధికారులతో, కలెక్టరు సమీక్షిస్తూ వుంటారు! వీటిని బట్టే రాష్ట్రంలో యే పంట దిగుబడి యెంత వుంటుంది లాంటి అంచనాలు తయారు చేస్తారు! మరి ఇంత పకడ్బందీగా వ్యవహారం జరుగుతున్నప్పుడు, స్కాములకి ఆస్కారం యెక్కడ? సాధారణంగా, ఒక రైతుకి పంట ఋణం అందించాలంటే, బ్యాంకు ఉద్యోగికి కాగితాలు అన్నీ వున్నాయా లేదా, అన్ని చోట్లా సంతకాలు పెట్టారా లేదా అని సరి చూసుకొని, కంప్యూటరులో ఋణ ఖాతా తెరిచి, అందులోంచి రైతు పొదుపు ఖాతాలోకి డబ్బు జమ చేసి, తహసీల్దారుకి ఇతరులకీ పంపవలసిన నివేదికల్లో వివరాలు పొందు పరచడానికి కనీసం ఇరవై నిమిషాలు పడుతుందనుకుందాం. ఇంకా రైతులు సంతకాలు పెట్టిన ఋణ పత్రాలని ఖాళీలు పూరించడానికి ఇంకో పావు గంట పడుతుంది కానీ, వాటిని తరవాతెప్పుడో నింపుకుంటారు—సీజన్ అయి పోయాక! ఈ లెఖ్ఖన రోజూ యెంతమంది రైతులకి పంట ఋణాలు మంజూరు చెయ్యగలరు? పంట ఋణాల సీజన్ లో బ్యాంకుల దగ్గర వుండే రైతు సమూహాలని యెప్పుడైనా చూశారా?బ్యాంకు చుట్టూ వున్న అన్నిరకాల వ్యాపారాలూ మహజోరుగా సాగుతాయి! ఒక బ్యాంకు శాఖ అక్షరాలా అయిదువేల యేడువందల తొంభై యెనిమిది మందికి పంట ఋణాలు మంజూరు చేసిందంటే—ఒక్కొక్కడికీ కనీసం ఇరవై నిమిషాల చొప్పున యెన్ని వేల గంటలు పడుతుంది? ఇదసలు సాధ్యమేనా? సాధ్యం చేస్తున్నాయి మన బ్యాంకులు! ‘ఔట్ సోర్సింగు’ ద్వారా! మరి ఇక్కడే లొసుగులు వుంటాయి! (మిగతా మరోసారి)

Friday, February 27, 2009

స్కామాయణం

బ్యాంకులకి మన రిజర్వ్ బ్యాంక్ ద్వారా ప్రభుత్వం కొన్ని నిర్దేశాలు చేస్తూ వుంటుంది—బ్యాంకులిచ్చే ఋణాల్లో ఖచ్చితంగా ఇంత శాతం వ్యవసాయానికీ, ఇంత శాతం యెగుమతులకీ, చిన్నతరహా పరిశ్రమలూ, రవాణా, చిల్లర వ్యాపారాలకీ, గృహ , విద్యా, స్వయం ఉపాధి లాంటి ప్రాధాన్యతా రంగాలకీ—ఇలా ఇవ్వాలి! మిగిలినదే తన ఇష్టం వచ్చినట్లు—వ్యక్తిగత ఋణాలూ, వాహన కొనుగోలు ఋణాలూ ఇలాంటి ఋణాలు ఇచ్చుకోవచ్చు! ప్రతీ బ్యాంకూ, లెఖ్ఖల ప్రకారం నిర్దేశిత శాతం (ప్రస్తుతం తమ మొత్తం డిపాజిట్లలో ఒక శాతం) వ్యవసాయ, వ్యవసాయాధారిత ఋణాలు మంజూరు చేస్తూనే వుంటాయి. మరి నగరాల్లో తప్ప ఒక్క గ్రామం లోనూ ఒక్క శాఖా లేని ఐ సీ ఐ సీ ఐ బ్యాంకు లాంటి బ్యాంకులు తమ వ్యవసాయ ఋణాల్లో నిర్దేశిత లక్ష్యాలని యెలా చేరుకొంటున్నాయి? అని మన జాతీయ బ్యాంకుల యాజమాన్యాలు తలలు బద్దలు కొట్టుకున్న రోజులు వున్నాయి! నిజంగా ఇదొక చిన్న ఠస్సా! (ట్రిక్!) నగరాల్లో పెద్ద పెద్ద కోల్డ్ స్టోరేజీలు కట్టించడం—కూరగాయల దగ్గర నించీ, మాంసం, చేపలూ, ఆకు కూరలూ, పువ్వుల వరకూ నిలవ చెయ్యడానికి—వాటికి ఋణాలు ఇవ్వడం! (కొన్ని వందల కోట్లు వీటికి ఇచ్చెయ్యవచ్చు) ఇవి కాకుండా, గ్రామాల్లో ఒక యేజంటునో, యేజన్సీనో నియమించి, ఒక సభ జరిపించి, ఋణ పత్రాలమీద రైతుల సంతకాలు తీసుకొని, అక్కడికక్కడే పంట ఋణాలు పంపిణీ చేసెయ్యడం! (ఒక్క రోజులోనే కొన్ని వందల గ్రామాల్లో ఇంకొన్ని వందల కోట్లు ఇలా ఇచ్చెయ్యవచ్చు!) మామూలుగా బ్యాంకులు గానీ, సహకార బ్యాంకులు గానీ, వ్యవసాయ పరపతి సంఘాలుగానీ, ఇప్పుడు—అంటే ఈ పంటకి ఇచ్చిన ఋణాలని పంట రాగానే తిరిగి చెల్లించమంటాయి. మళ్ళీ రెండో పంటకి అప్పు ఇవ్వాలిగా? అందుకని మీరు ఇవాళ కట్టెయ్యండి, మళ్ళీ రేపు తీసుకోండి! అంటాయి. ఇలా నూరు శాతం వసూళ్ళు చూపించుకొని, నూరు శాతం మళ్ళీ అప్పులిచ్చినట్టు చూపిస్తూ వుంటాయి! ఇక కొత్త ఋణాలంటారా! వ్యవసాయ యోగ్యం కాని భూమి వ్యవసాయ యోగ్యం అయితేనేకదా—కొత్త ఋణాల ప్రసక్తి? (ఇలాంటి కేసులు చాలా తక్కువ.) లేక పోతే భూమి అదే—యజమాని మాత్రమే మారతాడు! అంతే! ఇలాంటి పరిస్థితుల్లోనే ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పంట ఋణాల ‘స్కాము’ల్లాంటివి జరుగుతున్నాయి! (మిగతా మరోసారి)

Thursday, February 26, 2009

బ్యాంక్

దీనికి తెలుగులో మన 'పారిభాషిక భాషా పద కోశం' కూడా సరైన పదం ఇవ్వలేక పోయింది! భాష పుట్టక క్రితమే, బ్యాంకింగ్ జరిగేదట! ఒక చెట్టు బెరడు మీద, అప్పు ఇచ్చిన వాడికి ఓ గుర్తూ, తీసుకున్నవాడికో గుర్తూ, తీసుకున్న మొత్తానికో గుర్తూ, తీర్చవలసిన గడువుకో గుర్తూ, ప్రతిఫలం యేమైనా అనుకుంటే దానికో గుర్తూ—ఇలా గుర్తులు వేసి, దాన్ని నిలువుగా సరిగ్గా సగానికి చీల్చి, ఋణ దాత దగ్గరోటీ, గ్రహీత దగ్గరోటీ పెట్టుకునేవారట—సాక్షికో గుర్తు తో సహా! అదీ బ్యాంకింగుకి ఆది! ఇకపోతే, మన తొలి తెలుగు నవల ‘రాజశేఖర చరిత్రం’ లో గానీ, తొలి తెలుగు నాటకం ‘కన్యాశుల్కం’ లో గానీ బ్యాంకుల ప్రసక్తి రాలేదు! చిలకమర్తివారి గణపతిలో మాత్రం, వాళ్ళ తాత పునహా, సతారాల్లో (పెళ్ళికోసం) సంపాదించిన సొమ్ము ‘నారాయణ కర్ను’ గారి మీద ‘దర్శన హుండి’ వ్రాయించి తెచ్చుకున్నాడు గానీ, నారాయణ కర్ను గారిని బ్యాంకరు అని వ్రాయలేదు! మన తొలి తెలుగు బ్యాంకరు శ్రీ భోగరాజు పట్టాభి శీతారామయ్య గారు సైతం, ఆంధ్రా బ్యాంక్, భారత లక్ష్మీ బ్యాంక్ అనే పెట్టారుగానీ, తెలుగు పదం సూచించలేదు! గౌరవ తెలుగు పండితులెవరైనా, లేదా రీసెర్చ్ స్కాలర్లెవరైనా ఈ విషయం లో పరిశోధిస్తే, వాళ్ళకి డాక్టరేటు రావడమే కాదు—మనం కూడా సంతోషిస్తాం! అవునా? పీ. ఎస్.:- మన తాతల కాలం లో వుంటూ వుండే ‘భోషాణం పెట్టె’ కన్నా పెద్ద బ్యాంకరు యెవరండీ?

Wednesday, February 25, 2009

తెలుగులోనే మాట్లాడదాం!

ఇక రెండో విషయం యేమిటంటే, అప్పుడెప్పుడో బ్రహ్మానందరెడ్డి హయాం నించీ, వెంగళరావు మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిపించడం, అలా అంజయ్య హయాంవరకూ తెలుగు అభివృద్ధికి చా………లా కృషి చేసేశారు! అందులో తెలుగు సాంకేతిక పదకోశం, నిఘంటు నిర్మాణం లాంటివి ఉన్నాయి! అదుగో అక్కడే జనం తెలుగంటే భయపడ్డం మొదలు పెట్టారు! ఆటోమేటిక్ రైల్వే సిగ్నల్ అనడానికి ‘ధూమ శకట ఆగమన నిర్గమన నిర్దేశక స్వయం చాలిత సూచిక’ అనీ, ఇలాంటి ఘోరమైన అనువాదాలు బోళ్ళు చేసేసి, జనాన్ని తెలుగునించి పారద్రోలారు! ఇక అన్నగారు తెలుగువెలుగుల ప్రాంగణాలూ, లలితకళా తోరణాలు ఇలా కొన్ని శాశ్వత నిర్మాణాలు, చా…….లా కృషీ చేసి, మళ్ళీ తెలుగుకి ప్రాణం పోశారు! తెల్ల యేనుగులైపోయిన అకాడెమీలని రద్దేశారు! ఇంకా కొన్ని చేశారు! కానీ, యేకంగా బుద్ధుడి కాలానికి వెళ్ళిపోయి ‘దమ్మ మహా మాత్ర’ ల వంటివాటిని తీసుకొచ్చేసరికి, మన బ్యూరోక్రాట్ దొరలు తెలుగు వుత్తరాల్ని తెలుగు భాషలో ఇంగ్లీషు టైప్ రైటర్లపై వ్రాయించడం మొదలు పెట్టేసరికి, దీని కన్నా ఇంగ్లీషే నయం అనిపించింది జనాలకి! తరవాత, చెంద్రబాబు హైటెక్ ఆంధ్ర ప్రదేశ్ త్వరగారావాలని, తెలుగు ని నిర్లక్ష్యం చేశారు! మన వై యెస్ గారికి రామచంద్రరావు గానీ, సూరీడుగానీ “‘తెలుగు యజ్ఞం’ చేసి, దానిక్కూడా టెందర్లు పిలవచ్చు” అని సలహా ఇవ్వక పోవడంవల్ల ఆయన తెలుగు కి దూరంగా వున్నా, తమిళ తంబీల తొ ప్రెస్టేజీకి పోయి మరీ ‘ప్రాచీన భాష’ హోదా తెచ్చారు! (మరి వచ్చినె కోట్లని యెవరు నంజుకుంటున్నారో ఇప్పటివరకూ దాఖలాల్లేవు!) అసలు యేమి జరగాలి? మొదట మన తెలుగు పండితులూ, మీడియా ‘అన్య భాషా పదాల’ మీదున్న అపోహల్ని తొలగించుకోవాలి. మన భాష అనేక పదాల్ని పార్సీ, ఉర్దూ, హిందీ, సంస్కృతం, ఫ్రెంచ్, డచ్చి, ఇంగ్లీషు, లాంటి స్వ/పరభాషల్లోంచే కాకుండా, ఇతర భారతీయ భాషల్లోంచి కూడా స్వీకరించింది! వాటిని అలాగే వాడచ్చు—అని ప్రచారం చెయ్యాలి. ఉదాహరణకి—రోడ్డు, రైలు, నకలు, అర్జీ, తనఖా, ప్రాంశరీనోటు—ఇలా! రెండవది, ప్రభుత్వ వ్యవహారాలన్నీ, తెలుగులోనే సాగాలి. తెలుగు లో అందిన అర్జీల మీద తెలుగులోనే దస్త్రం నిర్మించాలి. వుత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరగాలి. కోర్టుల్లో కూడా వాద ప్రతివాదాలూ వచ్చీ రాని ఇంగ్లీషులోనో, సోకాల్డ్ స్పోకెన్ ఇంగ్లీషులోనో కాకుండా తెలుగులోనే జరగాలి. రికార్డులు కూడా తెలుగులోనే నిర్మించాలి. ఈ కంప్యూటరు యుగంలో, తెలుగు సాఫ్ట్ వేర్ వుండగా ఇది యేమాత్రం అసాధ్యం కాదు. కేవలం సంకల్పం వుండాలంతే! మరేదో ఇతర భాషా రాష్ట్రానికి వెళ్ళిన వాడికి ‘పురికొస’ కావలసి వస్తే, “ఈ వుడ్ లైక్ టు పర్చేజ్…’దిస్ థింగ్’…..ఆ…’వాట్ యూ కాల్’…..ఆ…..జ్యూట్ రోప్! ఆర్ జ్యూట్ త్రెడ్! నో నో జ్యూట్ ట్వైన్!” అంటే పరవాలేదు గాని, మన వూళ్ళో, మన వీధిలో కొట్టు దగ్గరకి వెళ్ళి, (బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాము కాబట్టి) ఇలా అడగడం హాస్యాస్పదం కాదూ? ఆలోచించండి!

Monday, February 23, 2009

పరాకాష్ఠ!

తిమ్మనగారు పారిజాతాపహరణం వ్రాస్తూ, దాన్ని భువనవిజయం లో యెప్పటికప్పుడు చదివి వినిపిస్తూ వుండేవాడు. ఈ లోగా ఒక రోజు, రాజుగారు రాత్రి బాగా ప్రొద్దు పోయాక శయనమందిరానికి వెళ్ళి, అప్పటికే రాణి మంచి నిద్రలో వుండడంవల్ల, (బహుశా ఆయన పాన మత్తుడుకూడా అయి వున్నందువల్ల) రాణి గారి కాళ్ళ దగ్గర కాస్త చోటుంటే, అక్కడ పడుక్కున్నాడట! ఓ రాత్రివేళ, రాణీగారు వొత్తిగిల్లినప్పుడు, ఆమె కాలు రాజుగారి తలకి తగిలిందట.రాజుగారికి కూడా ఆ తగలడం తెలిసింది! యెంత రాణీ గారైతే మాత్రం, యెంతైనా మహారాజు కదా, తలమీద తన్నితే అహం దెబ్బతినదూ! అప్పటినుంచీ రాజుగారు తన ముద్దుల రాణీ పట్ల వుదాసీనంగా వుంటున్నారట! ఈ అవైనాన్ని పసిగట్టి, మన అరణపు కవిగారు షెర్లాక్ హోం స్ లెవెల్లో కూపీల్లాగి, కారణం తెలుసుకొని, పారిజాతాపహరణం లో పరమాత్ముడికీ, సత్యకీ ‘ఆ సీను’ ప్రవేశ పెట్టారుట! నిజంగా ఆ సన్నివేశం—పరమాత్ముడు సత్య కాలొత్తుతూ, ‘నీ కాలికేం దెబ్బ తగల్లేదుగా?’ అని అనునయించడం—అబ్బ! శృంగారానికి పరాకాష్ఠ కాదూ! ఆ సీను భువన విజయం లో చదవగానే, రాయలవారి పెదాలపై దరహాసం మొలిచి, హాసమై, అట్టహాసమై—ఇక……..టట్టడాం! మన అరణపుకవిగారి ఓ దీర్ఘ నిడు+ఊర్పు! (అయి పోయింది)

ఇంకో గమ్మత్తు

దడిగాడువానసిరా!
ఇది తెలియనివాళ్ళెవరూ వుండరు—సాధారణంగా! ఓ పెద్దాయన వ్రాసినది ఓ సమీక్షకుడికి నచ్చలేదు! అయినా సమీక్ష రాయాలి! చూస్తే చాలా పెద్దాయన! ఇంకేమీ వ్రాయలేక, ఇలా వ్రాశాడట—తన కసితీరేలా! తరవాతేమయ్యింది అని నన్నడక్కండి! ఇంతకీ గమ్మత్తు యేమిటంటే— మేము హైస్కూల్ లో వుండగా, ఈ ప్రయోగం మాకు తెలిసి, మేము కూడా దీని మీద ప్రయోగాలు చేసేవాళ్ళం! నేను ఒకరోజు, క్లాసులో పాఠం జరుగుతూ వుండగా, ఓ పుస్తకం మీద ‘దడిగాడువానవిదిచసిగేరతి’ అని వ్రాసి, నా పక్కవాణ్ణి చదవమన్నాను. వాడు మామూలుగా తిరగేసి చదివి, ఉడుక్కున్నాడు. సరే, అయిపోయిందనుకుంటున్నారా! తరవాత తెలుగు క్లాసులో మేష్టారు ‘అందరూ కాంపోజిషన్ వ్రాశారా? పుస్తకాలు తెచ్చి నా టేబులు మీద పెట్టండి’ అనగానే, అందరూ అలాగే చేసేశాము! వ్రాతా! వీపునకు తేకే! అని సామెత లేదుగానీ, ఆ తరవాత తెలిసింది—నేను నా పక్కవాణ్ణి ఉడికించడానికి వ్రాసింది నా తెలుగు కాంపొజిషన్ పుస్తకం మీద అని! యేమి జరిగిందో వేరే చెప్పాలా!

Sunday, February 22, 2009

తెలుగులోనే మాట్లాడదాం!

క్రితం సంవత్సరం ఆగష్టు 15న బెంగుళూరులో (అప్పుడే అది బెంగళూరు గా మారింది) జెండావందన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చూస్తూ వుంటే, అది అయిపోయాక పోలీసు క్రీడలు, సాహాసాలూ ప్రదర్శిస్తూంటే, మోటారు సైకిల్ మీద ఓ పోలీసు ఓ గోడని చేదించుకుంటూ రెండో వైపుకి వస్తే, వ్యాఖ్యాత దాన్ని వాళ్ళ భాషలో ‘గోడె గుద్దాట’ అని వర్ణిస్తూంటే, నాకు బల్బు వెలిగింది! మనం తెలుగే యెందుకు మాట్లాడలేక పోతున్నాం? ఆని! మనం తెలుగు మాట్లాడాలంటే, ముందు ‘మన సంస్కృతం’ వచ్చేస్తుంది—యెంతటివాడికైనా! నాకు తెలిసిన సంస్కృతం చాలా కొంచెం! మా అన్నయ్య హై స్కూల్ లో చదివేటప్పుడు, తన రెండవ భాషగా ‘స్కోరింగ్ సబ్జెక్ట్' సంస్కృతం తీసుకొని, శబ్దాలూ అవీ బట్టీ పడుతుంటే, వాళ్ళ స్వబోధినిలో చదివాను— “కాకః కృష్ణః; పికః కృష్ణః—కో భేదః పిక కాకయోః? వసంతకాలే సంప్రాప్తే, కాకః కాకః; పికః పికః!” అని! అదొక్కటే తెలుసు నాకు సంస్కృతంలో! మరి ‘మన సంస్కృతం’ యేమిటి అంటారా? అదేనండీ—‘నీయమ్మ’ ‘నీయక్క’ ‘నీయబ్బ’ ఇలాంటి మాటలు లేకుండా యెవరైనా తెలుగు మాట్లాడగలరా? కన్నడ వాడిలా ‘గుద్దాట’ అన గలమా? అవసరంలేనిచోట, మాటల్ని ‘బూతులుగా’ అవసరం అయినచోట ‘బూతుల్ని’ మాటలుగా ఉపయోగించడం తెలుగువాడి స్పెషాలిటీ! మా తెలుగు మేష్టారు చెప్పినట్టు, ‘ఆ బస్సు ఆగుద్దా? యేగుద్దా?’ అని అడిగే వాళ్ళకి, మనం ‘అలా కాదురా! ఆగుతుందా, యేగుతుందా అని అడగాలి’ అని నేర్పించడానికి ప్రయత్నిస్తాము! అంతేగానీ, వాడు వాడింది ‘బూతు’ కాదు అని సరిపెట్టుకోలేం! అయినా ఈ బూతులూ, ఊతపదాలూ మన భాషలోనే వున్నాయా, ఇతర భాషల్లో లేవా? మరి వాళ్ళు మాతృభాష నిర్భయంగా మాట్లాడుతుంటే, మనకీ ఖర్మ యేమిటీ? అలోచించండి!

Friday, February 20, 2009

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

పరాకాష్ఠ!
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారని, మన ఆంధ్ర ప్రదేశ్ ఆస్థాన కవిగా కొన్నేళ్ళు వున్నారు. తెలుగు సాహిత్యాన్ని ఔపోశన పట్టిన వాళ్ళల్లో ఆయన అగ్రగణ్యుడు! ఆయన ‘అనుభవాలూ, జ్ఞ్యాపకాలూను ’ చదివితే, ఆ రోజుల్లో, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పరిస్థితులు కళ్ళకు కడతాయి! ఇక ఆయన చిన్న కధలకి వస్తే, ‘వడ్లగింజలు’ ఈ నాటికీ, యేనాటికీ, ఓ మిస్టరీ! మన కంప్యూటర్లు లెక్క కట్టవలసిన దాన్ని, ఆయన అప్పుడే చెప్పారు! శ్రీ కృష్ణ దేవరాయలుకి తన ముద్దుల భార్యతో అరణపు కవిగా వచ్చాడుట—నంది తిమ్మన—అదే—‘నానా సూన వితాన…….’ అంటూ ముక్కు మీద పద్యం చెప్పిన మన ‘ముక్కు తిమ్మన’! ఆయన బాధ్యత—అప్పటి రాజకీయ పరిస్థితులనిబట్టి, అమ్మాయికి యే కష్టం కలుగకుండా, మొగుడితో కాపురం చేసుకునేలా చూసుకోవడం. అంతే! దానికి ఆయన యెంత కష్ట పడ్డాడు! అమూల్యమైన ‘పారిజాతాపహరణం’ కావ్యాన్నే వ్రాశాడు! అది యెలా అన్నది శ్రీ శాస్త్రి గారి చిన్న కధల్లో చదవండి! (ఇంకా వుంది)

Sunday, February 15, 2009

మన తెలుగు

అన్నమయ్యకి తెలుగు రాదా?
నా సమాధానం—ఖచ్చితం గా వచ్చు! ఆయన మాతృ భాషే తెలుగు! ఆయన పదకవితలు వ్రాసింది జాను తెలుగులో! కాని—ఈ జానుతెలుగుని వక్రీకరించారు మన పండితులు. శ్రీగిరి శ్రీపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నమాచార్య పీఠం స్థాపించి ఆయన తాటాకుల మీద వ్రాసిన, వాళ్ళ కొడుకు రాజుగారి సహాయం తో రాగి రేకుల మీద చెక్కించిన పదకవితలని పరిష్కరించమంటే, వాళ్ళు చేసిన నిర్వాకమది! ‘అదివో అల్లదివో….’ పాటనే తీసుకోండి—‘పదివేల శేషులు’ యెక్కడనించి వచ్చారు? వున్నది ఒక్కడే ఆది శేషుడు, వాడికున్నది పదివేల పడగలూ! అసలు ఆయన వ్రాసిన ‘పదివేలు శేషుని’ ని ఇలా పరిష్కరించారన్నమాట! ‘పన్నగపు దోమతెర పైకెత్తవేమయ్య!’ అట! అన్నమయ్య కాలంలో దోమలు వున్నాయో లేదో తెలియదుగాని, దోమ తెరలు మాత్రం ఖచ్చితం గా లేవు! మగవాళ్ళూ ఆడవాళ్ళూ కూడా మొలచుట్టూ పంచెలూ, చీరలూ ధరించేవాళ్ళు! శ్రీ కృష్ణ దేవరాయలంతటివాడే, మట్టులాగూలు వేసుకునేవాడు లేదా పంచెని ఆ ఆకారం లో కట్టుకునే వాడు. కావాలంటే తన భార్యలతో సహా ఆయన చెక్కించుకున్న విగ్రహాలని హంపీలోనూ, శ్రీపతి లోనూ చూడచ్చు! యెప్పుడో విదేశీయులు వచ్చినప్పుడు మాత్రం, పారశీకం నించి వర్తకులు తెచ్చిన పొడవాటి అంగీనీ, రంగు పంచెనీ ధరించి, తలపాగా మీద తురాయితో కనిపించేవాడట. మరి అలాంటి రోజుల్లో, దోమతెరలెక్కడనించి వచ్చాయి? పైగా పన్నగానికి, దోమతెరకి సంబంధం యేమిటి? ఆయన వ్రాసినది—‘పగడంపుదౌను తెర’ అనీ. ఇలాంటివి చాలా వున్నాయి. విజ్ఞులు మార్పులు చేయిస్తే, తెలుగు భాషకి యెంతో సేవ చేసినవారవుతారు. ఒకటి మాత్రం చెప్పుకోవచ్చు—ఆ పదకవితలకి విస్తృత ప్రచారం తెచ్చింది మాత్రం వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ వెయ్యో సంవత్సరం ఉత్సవాలో యేవో చేస్తారట! శుభం!

Monday, February 2, 2009

బ్యూరాక్రసీ

మన బ్యూరాక్రసీ
ఇంకో గమ్మత్తేమిటంటే, నీ ముక్కెక్కడుందీ అని అడిగితే—మీకు తెలుసుగా?—అలా చూపిస్తుంది! ఒక నగరం లో, ఒక ‘బ్రతికిన కాలేజీ’ (అదేనండీ—జూ పార్క్) స్థాపిస్తున్నారట! సంబంధిత శాఖల్లో ఓ దాంట్లో, ఒక అధికారి తమ గుమస్తాని అక్కడ పెట్టడానికో బోర్డు తయారు చెయ్యాలి, దాని మీద యేమి వ్రాయాలో మేటరు డ్రాఫ్ట్ రాసి పంపించు! అన్నాడట. ఆ గుమాస్తా వెంటనే, చిన్న నోట్ వ్రాసి పంపించాడట—‘మనుషులకి ప్రవేశం నిషేధం’ అని! అధికారి ముక్క చీవాట్లు పెట్టాడు—‘అసలు నీకు డ్రాఫ్ట్ వ్రాయడం నేర్పింది యెవరు? యెన్నేళ్ళ సర్వీసు నీకు?’ వగైరా వగైరాలతో! అని కొన్ని సూచనలు ఇచ్చి, ‘ఇలా డ్రాఫ్ట్ పెట్టు’ అన్నాడట! మనవాడు బాగా ఆలోచించి, ఇలా తయారు చేశాడు—‘మెడకాయమీద తలకాయ వున్న మనుషులెవరైనా లోనికి ప్రవేశిస్తే, మాచే తీసుకొనబడు సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులగుదురు’! అని. “మళ్ళీ ఈ ‘మాచే’ యెవరూ? యేమిటి?” “……ప్రవేశిస్తే, ఫలానా ఫలానా ప్రభుత్వం యొక్క అటవీ శాఖ; వన్య మృగ సం రక్షణ శాఖ; పర్యావరణ శాఖ; సామాన్య పరిపాలన శాఖ లేదా ఇతర సంబంధిత శాఖలచే తీసుకొనబడే………….” “బాగుంది! నోటు అంగీకరించడమైనది.” టెండర్లు పిలిచి బోర్డు వ్రాయించి, తగిలించడానికైన ఖర్చు—అక్షరాలా ఎనభై మూడు వేల ఆరువందల నలభై యేడు రూపాయలు! అప్పుడే తమాషా మొదలయ్యింది! రూల్సు వున్నది బ్రేక్ చెయ్యడానికే కదా? ఒక రోజు, ఓ మనిషి—వున్నాడు, తలకాయ వుంది—కానీ మెడకాయ కనిపించడంలేదు (పాపం ఓ రకం వికలాంగుడు!) దర్జాగా లోపలికి వెళ్ళిపోయాడు! తెల్లమొహం వేసిన కాపలా వాళ్ళు మళ్ళీ తమ శాఖకి మొర పెట్టుకున్నారు! వెంటనే, బోర్డులో మేటరు మారింది—‘మెడకాయ వున్నా లేకపోయినా, రెండు చెవుల మధ్యా తలకాయ…….” ఆని! మళ్ళీ మర్నాడు, ఒకటే చెవి వున్నవాడు దర్జాగా…………..! మర్నాడు, బోర్డు మారింది—“మెడకాయ వున్నా లేక పోయినా……రెండు చెవులూ వున్నా లేక పోయినా…….కళ్ళున్న మనిషి…..”! ఆని. ఒకే కన్నున్న మనిషి వెళ్ళిపోయాడు! “…..కళ్ళు రెండు వున్నా, లేకపోయినా, రెండుకాళ్ళు వున్న………..” మీకు తెలిసిపోయిందిగా! మరి ఈ రోజుకి, ఆ బోర్డు సరిపోక, చుట్టూ వున్న కాంపౌండ్ గోడ మీద, వ్రాయడం, చెరిపించడం, మళ్ళీ తెల్ల రంగు వేసి, మళ్ళీ వ్రాయించడం….ఇలా ఇప్పటికైన ఖర్చు—అక్షరాలా ఎనభైమూడు లక్షల అరవై నాలుగు వేల యేడు వందల యాభై రెండు! ఇదెక్కడ అంటారా? యేమో! నాకూ తెలియదు—రాశ్శేఖర్రెడ్డినో, చంద్రబాబునో అడగండి! చిరంజీవికి అంత అనుభవం లేదుగా!