Sunday, March 9, 2014

ఓటు హక్కూ...........


.............సామాన్యుడూ

ఉదయాన్నే, కలో గంజో తాగి, కొంప బయటికి చేరాడు "సామాన్యుడు." (7 AM)

వీధి చివరనుంచి మైకులో కేకలు. "...............మన ప్రియతమ నాయకుడూ, ఫలానా పార్టీ తరుఫున ఫలానా పదవి కోసం పోటీ చేస్తున్నవాడూ, మన వాడూ, మంచి వాడూ, పిలిస్తే పలికేవాడూ, పిలవకపోయినా వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించేవాడూ, అవసరమైతే ఓదార్చేవాడూ.......వస్తున్నాడు మీ దగ్గరకే......." అంటూ. (యెండలు ముదిరాయికదా.....భోజనం టైము లోపల ఓ పాతిక ఇళ్లు తిరగ్గలిగినా........)

రానే వచ్చాడు అధికార మదాంధుడైన ఓ అభ్యర్థి. "నమస్తే అన్నా! నువ్వెప్పుడూ మన పార్టీకే ఓటు వేస్తావని తెలుసు. అయినా అడగడం నా బాధ్యత. ఈ సారి కూడా........" అంటూంటే

"నాకు ఆథార్ కార్డు రాలేదు........గ్యాస్ బండ తెచ్చుకోలేకపోతున్నాను. నాకేం బాధలేదు. మళ్లీ కట్టెలపోయ్యే దిక్కు. రేషన్‌ రావడం లేదు. పింఛన్‌ రాలేదు. ఆథార్ రద్దు చేసి, కుంభకోణాన్ని ప్రకటించి రా........అప్పుడు చూస్తాను ఓటు సంగతి....."

కత్తివాటుకి నెత్తురు చుక్క లేకుండా పోయిన ముఖంతో, "సరి, సర్లే, నీ ఓటు మాత్రం నాకే" అంటూ ఆ ఆభ్యర్థి నిష్క్రమణ, మందీ, మార్బలంతో.

హమ్మయ్య అనుకొని, తన పని మొదలుపెడుతుంటే, 

(ఇక్కణ్ణుంచీ రాబోయే అండర్ లైన్‌ చేసిన పొట్టి వాక్యాల బదులు, పైన వున్న అండర్ లైన్‌ చేయబడ్డ రెండు వాక్యాలనీ చదువుకోండి.)

పావు గంటలోనే మళ్లీ మైకులో కేకలు. రానే వచ్చాడు ప్రథాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి. (7.20 A.M)

"నీ రెండుకళ్లూ విడిపోయేలా బుర్ర బద్దలు కొట్టేయచ్చని లేఖ ఇచ్చావు కదా? ఇప్పుడు బుర్ర నిలువుగా పగిలి, రెండు కళ్లూ తో సహా బుర్రంతా విడిపోయి చాలా అసహ్యంగా వున్నావు. అదేమైనా ఆతికించుకోగలిగితే, అప్పుడు కనిపించు........."

కత్తివాటు............(మామూలే)

మళ్లీ తనపని.......(మామూలే) (8 A.M)

ఈసారి యువనేత తాలూకు అభ్యర్థి.........."బాబూ......మీ నాయకుడికీ, మీకూ బాగా కొవ్వెక్కిందటగా.........(వాడు తిని పారేసిన తిండే మీరూ తింటున్నారుగా) మా కొండకెళ్లిన ప్రతీసారీ చెప్పులతో వెళ్లి, వాడికే జై కొట్టించుకుంటున్నాడుటగా? బుధ్ధి ఒచ్చేవరకూ యే యెన్నికల్లోనూ పోటీ చెయ్యద్దు.........."

క.వా....మ.త.ప (మామూలే) (8.30 A.M)

"ఇది మీ సత్తా, మీ సత్తాయే మా సత్తా" అంటూ వచ్చాడింకోడు. "ఓట్లు సంపాదించిన పార్టీలన్నింటికీ, అదే లెక్కన పదవులు కట్టబెట్టాలంటాడు కదా మీ నాయకుడు? నీకు నెగ్గే అవకాశం యేమాత్రం లేదని తేలిపోయినప్పుడన్నా, మీకు వేస్తారనుకున్న ఓటర్లని, ఒద్దు....గెలిచే లేదా మనకి నచ్చే పార్టీకి వెయ్యండి, అని యెందుకు చెప్పరూ.........ఓట్లు చీల్చడమే మీ ధ్యేయమా?"

క.వా...మ.త.ప. (మా) (9.30 A.M)

చీపురు పట్టుకొని వచ్చాడొకడు........పైవాడికి చెప్పినట్టే సమాధానం....క.వా..మ.త.ప. మా. (10 A.M)

"యెర్రజెండెర్రజెండెర్రజెండెన్నీయల్లో.......సుత్తీ, కొడవలీ, నక్షత్రం......" అంటూ వచ్చాడొకడు. "చారిత్రక తప్పిదాన్ని సరిచేసుకొని, ప్రథాని పదవి కోసం నానా గడ్డీ కరిచినోళ్లనీ, నానా  కులాలోళ్ళనీ నాకినోళ్లనీ, నానా విగ్రహాలూ పెట్టించుకొని, కోట్లు మింగినోళ్లతోనీ కలిసి.....ఫోఫో" క వా మ త ప మా (11.30 A.M.)

నిత్య సంతోషి (గ్రహణం మొర్రో యేమో--"మా కార్యకర్తలని పోలీసులు చితగ్గొట్టేశారు" అంటూ చెప్పినా నవ్వుతూనే కనబడే) రాష్ట్ర నాయకుడి పార్టీ అభ్యర్థి.........."మీ పార్టీ కూడా అదేదో మూడో దాంట్లో జేరుతుందటగదా? ఇంకెందుకు మీకు ఓట్లు? అడవిగాచిన వెన్నెల అయిపోతుంది. ఓట్లు చీల్చి, వాడెవణ్ణో నెగ్గేలా చేసి, వోటర్ల అభిమతాన్నే వమ్ము చేసేస్తున్నారుగదా......దానికన్నా మూసుకు కూచోరాదూ!" కవామతపమా (1 P.M.)

"హారీళ్లమ్మా కడుపులు చల్లగుండా.......యాలగంజేలయిపోయింది......దగ్గరున్న టిఫిన్‌ సెంటర్లో......మూడు బజ్జీలో, రెండు బోండాలో (అక్కడాటైములో అవే దొరుకుతాయి మరి) తిని ఒచ్చేత్తే, ఓ కునుకేసి, మళ్లీ........" అని బయలుదేరాడు "సామాన్యుడు."

ఆ పని చేస్తూండగా (కునుకేస్తూండగా) మళ్లీ.........'నా పార్టీయే నాకూ, నా రాష్ట్రానికీ ద్రోహం......' అంటూ ఇంకొకడు. "సీ డబ్ల్యూ సీ నిర్ణయం రాగానే, 'విభజన అనివార్యమైతే.......' అన్న నాటకుడితోసహా అందరూ రాజీనామాలు ఇస్తే, ఈ దరిద్రం వుండేదికాదుకదా?"

కవామత............(3-00 P.M.)

"ఓ పార్టీవోడు నన్ను బహిష్కరించాడన్నా, ఇంకోడితో నేను జేరనన్నాను, ఇంకోడు యెంత పెటుబడి పెడతావన్నాడు......ఇలా ఎందుకని మీలాంటోళ్ల మద్దతుతో సొతంత్రంగా నిలబడ్డానన్నా......."

"బాగుంది గానీ, నెగ్గాక యెవరితోనూ కలవను అని ఒట్టేస్తేనే......."

కవామత.........(3.30 P.M)

"నేనొచ్చా....ఒచ్చేశా.....ఆ.......ఆ......ఆ.....అసెంబ్లీ ఇంటికి దారేది అని వెతుక్కోవలసిన పనేలేదునాకు .
3 నిమిషాల్లో దేన్నైనా ఖాళీ చేయించే గలను. అయినా, మీ ఓటు నాకేస్తే మీకు మంచిది............" 

"ఫోరా బాబూ ఫో......మీ అన్న అంతజేశాడూ........" కవామత..........(4.30 P.M)

(మధ్య మధ్య ఇతరులూ, మున్‌సిపాలిటీ అభ్యర్థులూ వస్తూనే ఉన్నారు)

చివరికి "దా అన్నా....చా తాగుతూ మాట్లాడుకుందాం. మా నాయకుడు చిన్నప్పుడు చా అమ్మాడులే........"

"బాబూ........ఓటొచ్చినప్పణ్నించీ ప్రతీ యెలక్షన్‌ లోనూ ఓటేస్తూనే వున్నా......ఇప్పుడు మాత్రం ఓటరు లిస్టులో నా పేరు లేదుట. ఇప్పటివరకూ యెవడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ముందాపని చూసి రా......" (6-30 P.M.)

"హూ! ఇయాల్టికింకేం పని." అనుకుంటూ సెంటరు చేరేసరికి, "దా అన్నా.....ఇలాంటి రోజుల్లోనే కాస్త మందేసుకోవాలి........" అంటూ ఓ పార్టీ కార్యకర్త.

ఛీ అంటూ తిరిగి వెళ్తూ, "అందరు ఓటర్లూ నాలాగే వుంటే యెంతబాగుండును. నాకు ఓటున్నా, ఈసారి నోటా కే యేద్దును......."

ఇంకా యేమేమిటో సణుక్కుంటూ సాగాడు సామాన్యుడు.

Tuesday, March 4, 2014

శ్రీగిరి శ్రీపతి--తి తి దే........


............అన్యమతస్తులూ 

మొన్ననే వేరే చోట తి తి దే గురించి సణగడానికి యేమీ లేదు అని వ్రాశానో లేదో, అవకాశం రప్పించాడు జగన్‌.

తన అనుచరులు 300 మందితో శ్రీగిరి శ్రీవారి ఆలయం చేరుకొని, చెప్పులతోనే వైకుంఠం వైపు వెళ్లబోతుంటే, అనేక మంది గట్టిగా అరవడంతో, ప్రక్కన విప్పి వెళ్లాడట. ఆలయ ప్రవేశానికి ఇవ్వ వలసిన డిక్లరేషన్‌ కూడా ఇవ్వలేదట. ఇదివరకోసారి అలా ఇవ్వకుండా వెళ్లి, తన అనుచరులనుంచే విమర్శలు యెదుర్కొన్నాడు. అయినా బుధ్ధి రాలేదు. రాకపోవడం కాదు. అహంకారం! హిందూ మనోభావాలపై యే విధమైన గౌరవం లేకపోవడం!

ఇంతకు ముందు, వాళ్ల బాబు అక్కడ యేడు కొండలు ఎక్కడున్నాయి? వున్నవి రెండే కదా! అని కొక్కిరించి, ఆ కొండలన్నీ లెఖ్ఖపెడుతూనే కూలిపోయాడు. అయినా వీడికి బుద్ధి రావడం లేదు. 

దేవస్థానం వారు ఆ మూకకి ఎల్-1 కేటగిరీ క్రింద ప్రత్యేక పాస్ లు జారీ చేసి మరీ ప్రత్యేక మర్యాదలతో దర్శనం చేయించారట. అందుకోసం రెండు గంటలకి పైగా క్యూలైన్లు ఆపేసి, వీఐపీ దర్శనాలు కూడా ఆపేసి, అందరినీ ఇబ్బంది పెట్టారట. అంతేకాదు, వాడి కోసం ఓ ఇరవై నిమిషాల ముందే, నైవేద్యం గంట మోగించి, శ్రీవార్ని కూడా ఇబ్బంది పెట్టారట. రంగనాయకుల మంటపం లో వేదాశీర్వచనం కూడా పలికారట--వాళ్లకి యెంత సిగ్గులేదో!
అనంతరం, జేఈవో శ్రీనివాసరాజు స్వయంగా వాణ్ని సత్కరించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలని అందజేశారట. ప్రథాన అర్చకుడు రమణ దీక్షితులతో కలిసి, పడికావలి దగ్గర నిల్చొని, వాళ్ల దర్శనాలని పర్యవేక్షించారట. వాడు బసచేసిన ఆదిత్య బిర్లా విశ్రాంతి సముదాయం లో వందలాది మందికి, భోజన, అల్పాహార విందు యేర్పాటు చేశారట. 

వాడికి బుధ్ధిలేకపోతే పోయింది, కూడా వెళ్లిన రెడ్లందరూ కిరస్తానీలు కాదు కదా....వాళ్లయినా చెప్పరా? నటి రోజా కూడా వుందట కూడా. వీళ్లకీ హిందువులంటేనూ, వాళ్ల దేవుళ్లంటేనూ లెఖ్ఖ లేదా?

వెంటనే ఆ జేఈవోనీ, ప్రథానార్చకుణ్నీ ఇంటికి పంపించాలనీ, ఇంకా సహకరించిన సిబ్బంది అందరినీ శిక్షించాలి అనీ హిందూ సంఘాలవాళ్లు డిమాండ్ చెయ్యవలసిన సమయం ఆసన్నం అయింది.

దేశం లోని హిందువులందరూ, ముఖ్యంగా సోకాల్డ్ వేదపండితులూ, కాస్త వాక్శుధ్ధి వున్న వారందరూ, వాడినీ, వాడి అనుచరులనీ--ఇంకో యేడు జన్మలెత్తినా యే పదవీ లభించకుండా, జైళ్లలో మగ్గిపోయేలా శపించవలసిన సమయం ఆసన్నం అయింది.

శ్రీగిరి, శ్రీపతులూ, ఆ చుట్టుప్రక్కల హిందూ సంఘాలన్నీ వాడు మరోసారి కొండ యెక్కడానికి ప్రయత్నిస్తే కాళ్లు విరగ్గొడతామని ప్రకటించవలసిన సమయం ఆసన్నం అయింది.

మూర్ఖంగా ఆ ప్రయత్నం చేస్తే, మైకుల్లో ఆ విషయం ప్రచారం చేసి, అందరూ వాళ్లని అడ్డుకొనే ప్రయత్నం చేయవలసిన, ప్రభుత్వం వారు అవసరమైతే పోలీసు బలగాన్ని వుపయోగించి, కాల్పులు జరిపించైనా, వాణ్ని అడ్డుకోవలసిన సమయం ఆసన్నం అయింది.

ఓ ఏటీఎం దగ్గర సెల్ ఫోన్లో మాట్లాడుతూ లోపలికి వెళ్లబోయినవాడిని, అక్కడ వున్న గార్డు, అలా వెళ్తే మిషన్‌ పనిచెయ్యకపోడానికి ఆస్కారం వుంది అని చెప్పబోతే, నేను యెవరినో తెలుసా? జగన్‌.......అన్నాడంటే, వాళ్లలో కొవ్వు యెంతగా పేరుకుపోయిందో తెలియడం లేదూ?

రేపు రాబోయే యెన్నికల్లో వాడూ, ఆపార్టీ వాళ్లూ ఓటడగడానికి వస్తే, ముఖమ్మీదే వాళ్లని నిలదియ్యవలసిన సమయం ఆసన్నం అయింది......

హిందూ ప్రజలారా! మేలుకోండి!

Monday, March 3, 2014

ఆత్మలూ.....--3


.............సాక్షాత్కారం

యెలా? అంటే..............

మనం (అంటే నేను అనబడే ఆత్మ) పైన కొంచెం యెత్తులో వుండి, మన (అంటే నేను  అనుకునే) శరీరాన్ని చూసుకోగలుగుతాం! అది కొంత యెత్తు అంటే ఓ పది అడుగులు కావచ్చు, సాధన పెరిగే కొద్దీ 100 అడుగులు కావచ్చు. కాసేపు అంటే కొన్ని క్షణాలు కావచ్చు, అరగంటైనా కావచ్చు, మామూలు వెలుగు మన శరీరాన్ని సోకడం వరకూ కావచ్చు. 

అదే ఆత్మ సాక్షాత్కారం. అంటే మనని మనం చూసుకోవడం. అంతే. యెవరు చెప్పినా, 'నీలో వున్న నిన్ను చూసుకో' అనే చెప్పారు. దాన్ని చాలామంది అపార్థం చేసుకొన్నారు, కొంతమంది విపరీతార్థాలు తీశారు. 

ఒకటి మాత్రం స్పష్టం--శరీరధారులై వుండగా, మన ఆత్మ మన శరీరాన్ని చూడగలదు కానీ, మనం అనబడే శరీరం ఆత్మని చూడలేదు! దాన్ని ఆత్మ సాక్షాత్కారం అని యెలా అనగలం?

సంక్రాంతి పండగకి మా జిల్లాల్లో సిరిబొమ్మ అని--నేలలో ఓ స్థంభం పాతి, దాని మీద అడ్డంగా ఇంకో పెద్ద స్థంభాన్ని యేర్పాటు చేసి, అడ్డంగా పెట్టిన స్థంభాన్ని యేటవాలుగా పైకి లేచేలా చేసి, క్రింది భాగాన్ని పాతిన స్థంభానికి తాళ్లతో కట్టేస్తారు. యేటవాలుగా వున్న స్థంభం చివర కత్తి పట్టుకొని, పెద్ద మీసాలతో, తలపాగా, పంచె చొక్కా తో వున్న వీరుడు బొమ్మని తగిలిస్తారు. యేటవాలు దూలాన్ని క్రింద వైపు పట్టుకొని, పాతిన స్థంభం చుట్టూ తిరిగితే, పైనున్న వీరుడు మరింత పెద్ద వృత్తాకారం లో పైన తిరుగుతూ వుంటాడు. 

విజయనగరం లో పైడితల్లి జాతరకైతే, పై స్థంభం చివర ఓ కుర్చీ యేర్పాటు చేసి, పూజారిని అందులో కూర్చోబెట్టి తిప్పుతారు. దాదాపు 40 అడుగుల యెత్తున అతన్ని (నిద్రాహారాలు లేకుండా అంటారు) త్రిప్పుతారు.

ఈ శతాబ్దం మొదట్లో నేను కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పనిచేస్తూ వున్నప్పుడు, జాతరల్లో మనుషులని, కొన్ని చోట్ల ఆడవాళ్లని కూడా, వీపుకి ఇనుప కొక్కాలు త్రాళ్లతో బిగించి, ఆ త్రాళ్లని పై స్థంభానికి కట్టి--దశావతారం సినిమాలో కమల్ హాసన్‌ లా--తిప్పేవారు. పేపర్లలో ఫోటోలు కూడా వచ్చేవి. తరవాత్తరవాత పోలీసులు గట్టి చర్యలు తీసుకొని, మనుష్యులని వ్రేలాడదీయడం మానేశారు. దాన్ని వాళ్లు 'షిడి' లేదా 'సిడి' అనేవారు. 

యెందుకు వ్రాశానంటే, భూమిలో పాతిన స్థంభం మన శరీరం అనుకుంటే, పైన తిరుగుతున్న వీరుడు మాన ఆత్మ అన్నమాట. 

మరి సిడి యేది?

మన బట్టలు కుట్టే దరాన్ని వ్యతిరేక దిశలో తిప్పి, పురి వదిలించేస్తే, రెండు మూడు పలుచని దారాలుగా విడిపోతుంది. పేనినప్పుడు గట్టిగా వుండే దారం, పురి విప్పేస్తే, ముట్టుకుంటే తెగిపోయేలా వుంటాయి ఆ దారాలు. వూలు దారాలని గమనిస్తే యెలా వుంటాయో అలా వుంటాయి అవి. 

మన ఆత్మ కీ శరీరానికీ మధ్య అలాంటి దారాలు, కనిపించీ కనిపించకుండా బంధాన్ని యేర్పరుస్తూ వుంటాయి. ఆ బంధం వున్నంతకాలం మనం జీవించి వున్నట్టే. సాధనలో యెప్పుడైనా ఆ బంధాన్ని వదిలించుకొని, దూరం గా వెళ్లాలని ఆత్మ ప్రయత్నిస్తే, వెంటనే మెలుకువ వచ్చేస్తుంది. కాబట్టి మనం భయపడఖ్ఖ్రర్లేదు. 

సాధన పెరిగే కొద్దీ, ఆ వృత్తం వ్యాసం పెరిగి పరిధి విస్తృతం అవుతూ వుంటుంది కానీ, అలా ఒకవైపు ఓ నాలుగడుగులు యెక్కువ దూరం ఆత్మని తీసుకెళదాం అనుకున్నా, సాధ్యం కాదు. కాబట్టి, ఆత్మ తలుచుకుంటే యెక్కడికైనా వెళ్లిపోగలదు అనేది ఓ అపోహ మాత్రమే!

(ఇంకొంత మరోసారి)