Sunday, June 27, 2010

కుంభకోణం డాట్ కామ్

ఐ ఆర్ సీ టీ సీ

కొంపలంటుకున్నాయి బాబోయ్! అని అందరూ గగ్గోలు పెడుతుంటే,  'హమ్మయ్య! నా చుట్ట వెలిగించుకోడానికి నిప్పు వెతుక్కునే బాధ తప్పింది!' అన్నట్టుంది "ఈనాడు" వ్యవహారం.

మమత ప్రవేశపెట్టిన 'దురంతో', నాన్ స్టాప్, పూర్తి ఏ సీ, రైళ్ళు యెలాగూ ఖాళీగానే వెళ్ళిపోతున్నాయి.

ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన రైళ్ళు సైతం, ఐ ఆర్ సీ టీ సీ వారి పుణ్యమా అని, టీటీలకి కాసులు కురిపిస్తూ, 
ఖాళీగానే వెళ్ళిపోతున్నాయి!

హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ, కోల్ కత్తా వెళ్ళే యే రైలుకైనా, నెలా రెండు నెలల ముందే స్లీపర్ బోగీల్లో రిజర్వేషన్ పూర్తయిపోతోంది.

ఇక తత్కాల్ ఒక్కటే గతి--డబ్బులెక్కువైనా (ఇంకా చాలా లొసుగులున్నా) అనుకుంటే, 'రెండు రోజుల ముందు మాత్రమే' దొరుకుతాయి. 

ఉదయం 8.00 గంటలకి బుక్కింగ్ ప్రారంభం అవుతుంది. 7-30 నించీ బ్రౌజర్ తెరుచుకొని, ఐ ఆర్ సీ టీ సీ సైట్లో లాగిన్ 
అయినా, 'ఎవైలబుల్' అని అన్ని టిక్కెట్లూ చూపిస్తూ వుంటుంది. 

కానీ, 8.00 అవ్వడం పాపం, ఛస్తే ఎవైలబులిటీ చూపించదు! 

అది చూపించే టైముకి తత్కాల్ టిక్కెట్లన్నీ, 'వెయిటింగ్ లిష్ట్--12 నించి 126' వరకూ చూపిస్తూ వుంటాయి! ఇక వెయిట్ లిష్ట్ 1 వచ్చినా, కనీసం ఆర్ ఏ సీ కైనా వస్తుందని నమ్మకం లేదు!

(ఈ రిజర్వేషన్ పధ్ధతి సాఫ్ట్ వేర్ గురించి మరోసారి మాట్లాడదాం)

దాదాపు ఈ సంవత్సరం ఏప్రిల్ నించీ ఇదే పరిస్థితి!

అలాగని నిజం గా అందరూ అన్ని బోగీల్లోనూ నిండుగా ప్రయాణిస్తున్నారా అంటే--స్లీపర్ బెర్తుకి 200, ఏ సీ 3 టయెర్ కి 500, ఏ సీ 2 టయెర్ కి 1000--ఇలా దండుకుంటున్నారు--టీ టీ లు. 

తీరా అంతా ఇచ్చి, వెళితే, బోగీ అంతా ఖాళీగా వెక్కిరించి, యెంత మోసపోయామో అని ముక్కు మీద వేలేసుకుంటాం!

ఇక 'ఆటో అప్ గ్రెడేషన్' అనేదొకటుంది--మనం ఓ క్లాసు టిక్కెట్ బుక్ చేసుకుంటే, దానికి పై క్లాసులో ఖాళీ వుండడం జరిగితే, ఆటోమేటిక్ గా అదే టిక్కెట్ తో పై క్లాసులో ప్రవేశార్హత లభిస్తుంది!

మూడేళ్ళ క్రితం ఇలా జరిగి, ప్రయాణీకులు యెంతో సంతోషించేవారు!

ఇప్పుడా సౌకర్యం కాకెత్తుకెళ్ళిపోయింది! బోగీలు ఖాళీగానే వెళ్ళిపోతున్నాయి!

ఇంకో రహస్యం తెలుసా? 

రిజర్వేషన్ల గురించి యేమాత్రం పట్టించుకోకుండా, తరచూ మహానగరాలకి రాజభోగం గా ప్రయాణాలు సాగించే నా స్నేహితుడొకరిని ఈ మధ్యే, "మీ చర్మ రహస్యం యేమిటి సినీ తారగారూ?" అన్నట్టు ప్రశ్నించాను. ఆయన చిద్విలాసం గా నవ్వుతూ, "లక్స్ సబ్బు" అన్నంత వీజీగా, 

"ఓ రెండు గంటల ముందు స్టేషన్ కి వెళ్ళిపోయి, యెవరైనా రైల్వే వుద్యోగిని (ఆఖరికి పోర్టర్ అయినా సరే) పట్టుకొని, ఓ 200 పారెస్తే, 'ఎమర్జెన్సీ' కోటాలో ఓ టిక్కెట్టు (మీరడిగిన క్లాస్ లో) పట్టుకొచ్చి ఇస్తారు! ఇంక రాజభోగం కాకేమిటి?" అని క్రొశ్నించాడు.

అస్తమానూ ఈ చిట్కా పని చేస్తుందా అని అడిగితే, "ప్రతీరోజూ వీ వీ ఐ పీ లు రైళ్ళలో ప్రయాణించరుగా? ఒకవేళ ఆ రోజు అలాంటివాళ్ళు ప్రయాణిస్తూ, ఎమర్జెన్సీ కోటా కూడా నిండినా, ఇంకో వంద మనది కాదనుకుంటే, ఆ ఐ పీ ల తైనాతీకెవడికో ఒకడికి నామం పెట్టి, ఆ టిక్కెట్ మన చేతికి ఇస్తారు!" అని రైలుగీత బోధించాడు!

ఈ మధ్య టీ వీ చానెళ్ళలో కూడా ఐ ఆర్ సీ టీ సీ, వుద్యోగుల కుమ్మక్కు--అంటూ వార్తా కథనాలు వస్తున్నాయి!

ఇంతకీ ఈనాడు ప్రసక్తి యెందుకు అంటారా?

ఇవాళ పత్రికలో (27-06-2010) "ఐ ఆర్ సీ టీ సీ కల్పిస్తున్న సౌకర్యాలు, బుక్కింగ్ చేసుకునే విధానం" వగైరాలపై వ్యాసం వెలువడింది! 

ఇక మీ ప్రయాణానందాన్ని అనుభవించండి మరి!

Friday, June 25, 2010

'ప్రశ్న వీరులు '

లీకువీరులు

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు వారు నిర్వహించే పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయట.

ఇప్పుడే కాదు గత పది సంవత్సరాలుగా ఈ లీకులు జరుగుతున్నాయట!

లీకువీరుడు సాక్షాత్తూ ఆ బోర్డు చైర్మనేనట!

అసలు ఈ పోటీ పరీక్షలెందుకు? పాఠశాలల్లో, కళాశాలల్లో చెప్పే చదువుమీదా, వాళ్ళు పెట్టే పరీక్షల మీదా నమ్మకం లేక! అంటారా! అదికాదు.

అసలు వుద్దేశ్యం--ఒక రంగం లో ఒక వుద్యోగానికి అవసరమైన ప్రత్యేక నైపుణ్యాన్ని గుర్తించడానికి అభ్యర్థులకి పరీక్ష పెట్టేవారు--రాజుల కాలం నించీ!

మరి ఇప్పుడు ఇవి వెర్రితలలు యెందుకు వేస్తున్నాయి?

పరీక్ష ప్రశ్నపత్రాలు రచించేవాళ్ళవల్లా? ఆ ప్రశ్నలకి 'కీ' వెలువరించేవరకూ యెవరికీ సమాధానాలు తెలియక పోవడం వల్లా? సందట్లో సడేమియాగా ప్రశ్న పత్రాలు లీక్ చేసి, జవాబులు వాళ్ళే చెప్పి, అవసరమైతే ప్యాసు చేయించి, వుద్యోగాలు కట్టబెట్టే వాళ్ళవల్లా? వీటికోసం అనేక '...సెట్' లు కనిపెట్టి ప్రవేశపెడుతున్న మన రా.నా. లూ, వాళ్ళ తైనాతీ బ్యూరోక్రాట్లూ--వల్లా?

'..........కర్ణుడీల్గె' అన్నట్టు సవాలక్ష కారణాలు.

తెలుగు భాష జూనియర్ లెక్చరర్ వుద్యోగం కోసం పరీక్ష లో ఇచ్చే ప్రశ్నల గురించి ఓ సారి వ్రాశాను.

అలాగే, బ్యాంకు లో వుద్యోగానికి--గుమాస్తాలైనా, అంకెల్ని గుర్తుపట్టడం, తప్పుల్లేకుండా కూడడం వస్తే చాలు. ఇప్పుడు కంక్ప్యూటర్లు వచ్చాక, అది కూడా అఖ్ఖర్లేదు--కీబోర్డు మీద అక్షరాల్నీ, అంకెల్నీ గుర్తుపట్టడం వస్తే చాలు!

కానీ, 'టెస్ట్ ఆఫ్ రీజనింగ్' పేరుతో, "టేబుళ్ళు అన్నీ గుర్రాలైతే, కుర్చీలన్నీ గొర్రెలైతే, పుస్తకాలన్నీ కాకులైతే, పెన్నులన్నీ కోడీకలైతే, గొర్రెమీద కూర్చొని, కాకులమీద వేటితో వ్రాస్తారు?" అనే ప్రశ్న వింటే, 'మావూళ్ళో సహం పిచ్చోడి వయస్సు 24 కాబట్టి, నీ వయసు ఖచ్చితం గా 48' అని ఇంటర్వ్యూ చేసేవాడికి సమాధానం చెప్పిన మన హీరోలు గుర్తు రావడం లేదూ?

అప్లికేషన్ దగ్గరనించీ అడ్డం గా డబ్బులు వసూలు చేసి, కొన్ని లక్షలో, కోట్లో పోసి, ఈ పరీక్షలు నిర్వహించి, నిరుద్యోగులతో యెందుకు ఆడుకోవాలి?

ఇంకో విచిత్రం తెలుసా?

ఆబ్జెక్టివ్ టైపు పరీక్షలు వచ్చిన కొత్తలో, ముందు 'జవాబు పత్రం' ఇచ్చి, ఓ అరగంట క్లాసు పీకేవారు--జవాబులు యెలా గుర్తించాలి, సమయం యెలా పాటించాలి--వగైరాల గురించి.

మా మూడు 'వీ' ల హనుమంతరావు, జవాబు పత్రం ఇచ్చిన పది నిమిషాల్లోనే అది పూర్తి చేసి ఇచ్చేసి, ఆ క్లాసు పీకుతున్నవాణ్ణి--ఇంకా యేమైనా వుంటే పట్రా! అని సవాలు చేశేవాడు.

వాడి రహస్యం యేమిటి అని ఆరా తీస్తే, 'యేముందీ! ఒంటెద్దు బండి నడుస్తూవుండగా, యెద్దు వుచ్చ పోస్తే యే వరుసలో నేలమీద పడుతుందో, అదే వరుసలో జవాబులు టిక్కులు పెట్టెయ్యడమే!' అని చిద్విలాసం గా వాక్రుచ్చేవాడు! (ఆ విధానం లోనే వాడికి గుమాస్తానించి అధికారిగా ప్రమోషన్ వచ్చింది అన్నది వేరే సంగతి! వాడి ఇంటర్వ్యూ సంగతి మరోసారి!)

ఇంతకీ విచిత్రం యేమిటంటే--

ఎంసెట్ ఇంజనీరింగులో యెనిమిది మందీ, మెడికల్ లో ఆరుగురూ అభ్యర్థులు మూడు గంటలు పరీక్షా కేంద్రాల్లో కూర్చొనే వున్నా, ఓ ఎం ఆర్ షీట్లలో 'అసలేమీ' వ్రాయకపోయినా, (మా మూడు 'వీ' ల హనుమంతుడు సూత్రం కూడా పాటించక పోయినా), 'రిజర్వేషన్' దృష్ట్యా వాళ్ళకి సీట్లు వచ్చాయట!

పైగా, ఇలాంటి సంఘటనలు 'ప్రతీ యేడాదీ' జరుగుతూనే వుంటాయని సాక్షాత్తూ ఎంసెట్ అధ్యక్షుడు డీ ఎన్ రెడ్డి వెలిబుచ్చారట! దీనికి తోడు, ఇంటర్ మార్కులకి వెయిటేజీ ఇవ్వడం వల్ల, వాళ్ళ ర్యాంకు పెరిగే అవకాశం కూడా వుందట!

అన్నట్టు, ఇంజనీరింగులో సీట్ల సంఖ్య 2,50,000 కి పెరిగిందట!

ఇదివరకు వీధి బళ్ళలో 'మీ చదరలు మీరే తెచ్చుకోవాలి' అనేవారు. ఇప్పుడు "సీట్లు ఫ్రీ--కూర్చోడానికి మీకు 'సీట్' వుంటేచాలు!" అంటారేమో!

(అనుకోకుండా పెద్ద టపా వ్రాసేశాను--నా పిచ్చిగానీ, ఓపిగ్గా చదివేవాళ్ళెంతమందో, విషయం గ్రహించేవాళ్ళెంతమందో, ప్రతిస్పందించేవాళ్ళెంతమందో--యేమిటో!)