మన ప్రభుత్వ గణాంకాలు
దువ్వూరివారు మొన్న వుండబట్టలేక అనేశాడు--మన ప్రభుత్వ గణాంకాలు సరైన దృశ్యం చూపించడంలేదు అనీ, వాటిని వివిధ రకాలుగా సవరించుకొని అర్థం చేసుకోవలసి వస్తూంది అనీ, వృధ్ధి రేటు, ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా దానికి అతీతం కాదు అనీ! (వెంటనే ప్రభుత్వ 'గణాంకులు ' ఆయనమీద 'వూచల్లా వుబ్బెత్తున ' లేచారు! అది వేరే సంగతి.)
బ్యాంకు వుద్యోగులకి, దశాబ్దాల ట్రేడ్ యూనియన్ పోరాటాల ఫలితంగా, ఆ నాయకుల దూర దృష్టి ఫలితంగా, 'కరువు భత్యాన్ని ' "వినియోగదారుల ధరల సూచీ--సీ పీ ఐ--కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్" ఆథారంగా లెఖ్ఖించడం ప్రవేశపెట్టారు. అంతేకాకుండా, ప్రభుత్వ, యాజమాన్యాల ప్రమేయం లేకుండా, సీ పీ ఐ మీద ఆథారపడి, కరువు భత్యం పెరిగేలా/తగ్గేలా యేర్పాట్లు చేశారు. (ఆ మహానుభావులు యేలోకానవున్నారోగానీ, ఇప్పటిక్కూడా, మా పెన్షన్లమీద దాని ప్రభావం చక్కగా వుంది!) నిజం చెప్పాలంటే, బ్యాంకు వుద్యోగులెప్పుడూ ద్రవ్యోల్బణం గురించి పెద్దగా బాధపడలేదు!
నేను బ్యాంకులో చేరినప్పటికి (1973) సీ పీ ఐ "బేస్" 1960 = 100. అంటే, 1960లో సీ పీ ఐ యెంత వుందో ఆ గణాంకాన్ని ఆథారంగా చేసుకొని, తరువాత సీ పీ ఐ యెంత పెరిగిందో దాన్ని బట్టి, ఆటోమేటిక్ గా, ప్రతీ ఫిబ్రవరి, మే, ఆగస్ట్, నవంబరు నెలల్లో కరువు భత్యాన్ని సవరించేవారు--అది పెరిగినా తగ్గినా. అందుకే, "బ్యాంకు వాళ్ల జీతాలు యెక్కువ!" అని యేడిచేవారు ఇతర వుద్యోగులూ, సామాన్యులూ.
రాను రాను, ఆంధ్రా బ్యాంకు వుద్యోగులచేత 61 రోజుల సమ్మె చేయించిన (కమ్యూనిస్టు పార్టీ సభ్య ట్రేడ్ యూనియన్) నాయకులు--ఆ సమ్మె సఫలం అయితే, కార్మికులకి చాలా మంచిది, విఫలం అయితే, ప్రభుత్వాలకి మంచిది!--ఇందిరాగాంధీ సూచనలమేరకు, అప్పటి రాజకీయ అవసరాల నిమిత్తం--వెన్నుపోటు పొడిచారు! సమ్మె విఫలం అయ్యింది. (చివరగా పార్టీ "క్లోజ్డ్ డోర్" మీటింగులో, మా నాయకుడు కామ్రేడ్ దువ్వూరి కృష్ణ మూర్తి తన చుట్ట నుశి దులిపేస్తూ, "మీరేమి నిర్ణయం తీసుకున్నా నాకు దీనితో సమానం" అని వాక్ అవుట్ చేశారట!). నిజంగా ఆయనెంత గొప్ప నాయకుడంటే, ఆ సమ్మె ఫలితంగా, వుద్యమం ఫలితంగా, వుద్యోగాలని కోల్పోయిన వాళ్లని సైతం, మళ్లీ వుద్యోగాలలో చేరేలా చేసి, ఏ ఒక్క వుద్యోగీ 'వెంట్రుక ' కూడా వూడకుండా, అందరినీ రక్షించారు--1975 మార్చి లోగా!
తరువాత, ట్రేడ్ యూనియన్లు కాంగీ తో కుమ్మక్కయి, అంతకు ముందు వున్న 'సెటిల్ మెంట్లనీ', వ్యవహారాలనీ కాలరాయడం ప్రారంభించాయి. (ఏమర్జెన్సీ పుణ్యమా అని, నాలుగేళ్లకోసారి జరిగే వేజ్ రివిజన్లు వెనకబడ్డాయి. కమూనిస్ట్ పార్టీలు ఎమర్జెన్సీని సమర్థించదమే దీనికి కారణం.) తరువాత, ఓ కొత్త విధానానికి తెరతీశాయి ఆ పార్టీలు. అదే "డీ యే మెర్జర్"! అంటే, 1960 బేస్ గా లెఖ్ఖిస్తున్న సీ పీ ఐ ని, బేస్ 1970 గా మార్చి, అక్కడివరకూ పెరిగిన పాయింట్లని "బేసిక్" లో కలిపెయ్యడం, డీ యే కోసం కొత్త లెఖ్ఖింపు ప్రారంభించడం. ఇప్పటికీ ఆ విధానం కొనసాగుతూనే వుంది.
చెప్పొచ్చేదేమిటంటే, 1960 బేస్ గా వున్న సీ పీ ఐ మీద యెంత పెరుగుదల వుందో, అంతా కరువు భత్యం ఇవ్వాలా వద్దా? మధ్యలో "బేస్" మార్చడం యెందుకు? ఇది సామాన్యులకి అర్థం కాదు!
అలాగే, ద్రవ్యోల్బణం సూచీలని--డబ్ల్యూ పీ ఐ--హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆథారంగా లెఖ్ఖించడం (పరిగణనలోకి తీసుకొనే వస్తువుల్లో నట్లూ, బోల్టులూ వంటివాటి ధరలని పరిగణించడం తప్పు) అనీ, పైగా "బేస్" ని మార్చడం శుధ్ధ పొరపాటు అనీ, ఇప్పుడు ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం "ఒక నెల క్రితం ఇదే తారీఖున" వున్న రేట్లని బేస్ గా గరహించడం పెద్ద బ్లండర్ అనీ--దువ్వూరివారే కాదు, యెవరైనా వొప్పుకోవలసిందే కదా?
ఈ లండాచోరీలు ఇలా వుంటే, వో ప్రక్కన మన దేశ కంపెనీలు, మనదేశంలో పెట్టే పెట్టుబడులు తగ్గిపోతున్నాయట! అవునుకదా? ఆంధ్ర లో తెలంగాణా; ఒరిస్సా కర్ణాటకల్లో పోస్కో; యూపీలో రాహుల్; ప. బెంగాల్లో మమత; గుజరాత్ లో సీ ఎం మీద అనేక కేసులూ, ఆరోపణలూ; ఛత్తీస్గఢ్, వుత్తరాఖండ్ లాంటి, ఈశాన్య రాష్ట్రాల్లాంటి చోట్ల మావిస్టులూ వగైరాలూ; పేట్రేగి పోతుంటే, (కాశ్మీరులోనైతే, 'మ్యూజిక్ షో'లు కూడా జరగట! మ్యూజిక్ షోలకి అనుమతి ఇస్తే, వ్యభిచారానికి యెందుకు ఇవ్వకూడదు? అనె ఫేస్ బుక్ మొత్తం నిండిపోయిందట! ఇంకా అక్కడ సినిమాలు గత మూడేళ్లుగా ప్రదర్శింపబడడంలేదట. సెల్ ఫోన్లవల్ల ఆడపిల్లలు చెడిపోతున్నారట, అందుకని వాటిని 'ఝీలం ' నదిలో పారెయ్యాలట! ఇంకా, ఓ సెకండరీ స్కూల్ లోని ఆడా, మగా పిల్లలందరూ, తమ ప్రథానోపాధ్యాయుల, ఇతర వుపాధ్యాయుల/వుపాధ్యాయినుల పర్యవేక్షణలో పిక్ నిక్ కి వెళ్లినా, అది తప్పట!) యేమి జరుగుతుంది?
ఇలాంటి పరిస్థితుల్లో, దేశంలో యెవరు పెట్టుబడులు పెడతారు? అని మేథావులని పట్టి పీడిస్తున్న ఓ సందేహం!
మీరేమన్నా జవాబు చెప్పగలరా? ప్రయత్నించండి!
2014 వరకూ ఆగాలా? అది కూడా చెప్పండి మరి!!!!!