Monday, March 26, 2012

అధర్మం పెరిగిపోతూంది......




ఇంకా యెప్పుడు.....యెవరు అవతరిస్తారో!?

ఓ సినిమా సీను.....

హీరో డీయస్పీ--యూనిఫామ్ లో.....చొక్కా బొత్తాలు విప్పేసి, నడుం బెల్టూ, క్రాస్ బెల్టూ లూజుగా వేళ్లాడుతూ, నెత్తిమీద టోపీ లేకుండా, జుట్టు అలా అలా అలవోకగా యెగురుతూ, యెడం చేతిలో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ చేతిలో వుండే పెద్ద గన్నుని ఇష్టం వచ్చినట్టు వూపుతూ, డైలాగులేస్తూంటాడు. 

హీరో వెనుక ఓ నలుగురు పోలీసులు. సీన్లో ఓ జనరల్ స్టోర్.   వెనుక పెద్ద గోదాములో--పెద్ద పెద్ద బస్తాల్లో, అట్టపెట్టెల్లో "అక్రమ" సరుకులు నిల్వ చెయ్యబడి వున్నాయని అనుమానం. షాపు యజమాని ధైర్యంగానే జవాబిస్తూంటాడు. హీరో......

"ఆ! ఈ షాపూ, వెనక్కాల గోడవునూ నీవేనా? సరే. తనిఖీ చెయ్యాలి. తాళాలు తెరువమ్మా....!" 

యజమాని--"లేవు" 

"యెక్కడవున్నాయో తెలుసుగా?" 

"తెలీదు" 

తన గుప్పిడి మూసి, అతని ముఖానికి చాలా దగ్గరగా ఒక్కసారిగా చాపి, "ఇందులో వుంటాయి. బయటికి రప్పించనా?" 

"నాకు తెలీదు అని చెప్పానుగా?" 

"తెలీదంట్రా....పాపం. రప్పించేద్దామా?" పక్కనున్న కానిస్టేబుల్ తో. 

"ఆయ్! తప్పదనుకుంటానండి!" మీసాలెగరేస్తూ, వెకిలినవ్వుతో ఆ క్యామెడీ అర్టిస్ట్. 

వెనుకనుంచి యగమాని భార్యా, పిల్లలూ, ఇద్దరు ముగ్గురు ఇరుగూ పొరుగూ హడావిడిగా వచ్చి చూస్తూ వుంటారు. 

హీరో, పిడికిలితో అతని గడ్డం క్రింద బలంగా ఒక్క "డిష్యుం" అనేసరికి, అతను యెగిరి, షాపు సీలింగుకి బుర్ర తగులుతూ, ఓ రేక్ మీద భళ్లున పడి...... 

"బాబూ...బాబూ....ఆయన్నేమీ చెయ్యకండి....ఇవిగో తాళాలు" అంటూ వాళ్లావిడ. తలుపులు తెరవగానే, "ఆహా! అన్నిరకాల సిగరెట్లూ, గుట్కాలూ, పొగాకు వుత్పత్తులూ......ఓ రెండు కోట్లుంటాయా? వీటన్నింటినీ సీజ్ చేసి, తాళాలు వేసి, సీలు వెయ్యండ్రా! బాబూ, ఇంక నడుస్తావా? జీపెక్కు." అంటూ గెంటుకుంటూ ఆ యజమానిని పట్టుకుపోతాడు.

{సాధారణంగా, ఫిబ్రవరి 29 న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ బడ్జెట్, తరవాతి ఏప్రిల్ 1 నుంచీ అమల్లోకి వస్తుంది--సభ వొప్పుకుంటే. దానికోసం, డిసెంబరు నెలనుంచీ బుర్రోవాదులు క్రితం యేడాది బడ్జెట్ అంచనాలూ, వాటిని సవరించడం, పనిలో పనిగా వచ్చే బడ్జెట్లో యే రంగాన్ని యేవిధంగా బాదాలి.....వగైరాలతో సతమతమైపోతూంటారు. మంత్రిగారు ఫలానా రంగం నుంచి నాకు అదనంగా ఇన్నికోట్లు కావాలి......అంటే, వీళ్లు "అదెంతపని" అంటూ క్రొత్త క్రొత్త పధ్ధతులనీ, అవసరమైతే "లాటిన్" పేర్లనీ కనిపెట్టేసి, "పన్నులు" విధించేద్దామంటారు. (ఈ బడ్జెట్లూ, లెఖ్ఖలూ, పన్నులూ గురించి వ్రాస్తే, ఓ బృహద్గ్రంధం వ్రాయాలి). గత ఇరవై యేళ్లకి పైగా, ప్రతీ బడ్జెట్లోనూ, రకరకాల పన్నులతో బాధింపబడేవి......ఇంకేమిటి?.......పొగాకు వుత్పత్తులు--ముఖ్యంగా సిగరెట్లు! (వాటిని వుపయోగించేవాళ్లు వినియోగదారులు కాదు. వాటి వాడకం తగ్గించే నెపంతో వాళ్లని యెలాగైనా దోచుకోవచ్చు......అందరూ! యెవరూ అడగరు.) ఇంకేం! దోపిడిదారులకి ఓ సువర్ణావకాశం! జనవరి నుంచే సిగరెట్లు దొరకవు. దొరికినా క్రమంగా రేట్లు పెరిగిపోతూ వుంటాయి. కంపెనీవాళ్లేమి చేస్తారు? ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా వాళ్ల వుత్పత్తులన్నీ మార్కెట్ అయిపోవాలి! అమ్మకాలు పెరిగినట్టు చూపించుకోవాలి. స్టాక్ అంతా మార్కెట్లోకి తరలిస్తారు. అంత స్టాక్ వున్నా, బజార్లో అవి దొరకవు. మూడు నెలలతరవాత, పెరిగిన రేట్లతో అమ్ముకొని, "అక్రమ" లాభాలు గడిస్తారు.}       

ఓ చిన్న పట్టణంలో, నిజంగా జరిగిన సీను.......

రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు మొన్న శనివారం (24-03-2012) రాత్రి, ఆ జనరల్ స్టొర్ పై ఆకస్మికంగా దాడి చేశారు--ఇతర సిబ్బందీ, పోలీసు అధికారుల సమన్వయంతో! భారీ నిల్వలు బయటపడ్డాయి. ముందు గోదాము తెరవమని వ్యాపారిని అడిగితే, తాళాలు లేవన్నాడట. 

"పంచనామా చేసి, తాళాలు పగులకొట్టి, సరుకు జప్తు చెయ్యమని ఆదేశించి, ఆయన వెళ్లిపోయారట. 

తీరా వాళ్లు ఆ పనికి వొడిగట్టకముందే, కుటుంబ సభ్యులు తాళాలు తీసి, సరుకుని వాళ్ల కళ్లముందరే, ఇంటి పైభాగానికి తరలించడం మొదలెట్టారట! 

ఆర్ ఐ ఆగ్రహం వ్యక్తం చెయ్యడంతో మళ్లీ వాటిని గోదాములోకి చేర్చారట. ఈలోగా కొందరు తోటి వ్యాపారస్తులు, సరుకు విలువని తక్కువగా చూపిస్తే వొప్పుకుంటామన్నారట. 

బాగా ప్రొద్దుపోవడంతో మల్లగుల్లాలు తేలకపోవడంతో, అందరూ అలిసిపోయిన స్థితిలో, అధికారులు చేతులెత్తెయ్యడంతో, వ్యాపారి మళ్లీ సరుకు తరలించేసుకున్నాడట

(తరవాత కేసు బుక్ చేశారో, విచారించడం మొదలెట్టారో లేదో పేపర్లలో రాలేదు!)

యదా యదాహి ధర్మస్య.......అభ్యుథ్థానమధర్మస్య......!