Saturday, January 31, 2009

వేలం వెఱ్ఱి

వేలం వెఱ్ఱి
…….అంటే యేమిటో తెలుసా? నాకూ తెలీదు! మన బీర్బల్ గారిని అడుగుదాం రండి! కట్ చేస్తే……….! మారు వేషం లో, పాదుషా అక్బర్, మంత్రి బీర్బల్ పట్టణంలో పర్యటిస్తుండగా, పాదుషా వారికి సందేహం వచ్చిందట—ఒక మసీదు ముందు నించి వెళుతుండగా—“బీర్బల్! అసలు వేలం వెఱ్ఱి అంటే యేమిటీ?” అని! “అదోరకం వెఱ్ఱి జహా ్‌పనా!” అన్నాడట బీర్బల్! అంతలో, మసీదు వైపు ముఖం పెట్టుకుని పడుకొన్న గాడిద ఒకటి కనిపించిందట వారికి. వెంటనే బీర్బల్ దాని దగ్గరకి వెళ్ళి, దాని చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి, దాని తోక లోంచి ఓ వెంట్రుకని పీకి, నెత్తి మీద వేసుకున్నాడట. పాదుషావారు అడిగితే, “జహాపనా! ఈ గాడిద చాలా పుణ్యాత్మురాలు! అందుకనే మసీదు వైపు—అంటే మన మక్కా వైపు ముఖం పెట్టుకొని నిద్రిస్తోంది! దీని చుట్టూ ప్రదక్షిణలు చేసి, దాని వెంట్రుకొకటి తల మీద వేసుకొంటే, మనకి దాని పుణ్యంలో సగం అయినా వస్తుంది!” అన్నాడట. వెంటనే పాదుషా వారు ఆచరించారు! అది చూసిన సామాన్య ప్రజలందరూ ఆచరించారు! సాయంత్రానికల్లా ఈ వార్త దావానలంలా వ్యాపించి, చుట్టుపక్కల ఊళ్ళలోని ప్రజలూ వచ్చి ఆచరించారు! వెరశి—ఆ గాడిద బొచ్చు లేకుండ, ఉత్తి చర్మంతో మరణించింది! ఆ రాత్రి వార్త తెచ్చిన భటుణ్ణి పంపించి, అక్బర్ తో అన్నాడట బీర్బల్—“జహాపనా! వేలం వెఱ్ఱి అంటే యేమిటో తెలిసిందా?” అని! పగలబడి నవ్వడం అక్బర్ వంతు—మన వంతు! అదీ! గమ్మత్తు! మన ముస్లిం సోదరులేమైనా అంటారా?

No comments: