Saturday, May 30, 2009

'తెలుగు....

—పదాలు'
‘చొళ్ళెము’ అనే పదం యెప్పుడైనా విన్నారా? చదివారా? అర్థం యేమిటో తెలుసా? —స్త్రీలు చుట్టుకొనే ముడి, సిగ, కొప్పు అని! నౌఖర్లూ, చాకర్లూ అంటారు—మరి నౌఖరు అనే మాట హిందీలోని నౌఖరీ నించి వచ్చింది! దీనికి చాకర్లూ కలిపి, ద్వంద్వ పదం తయారు చేశారు మన పెద్దలు!—ఇంతకీ చాకర్లు అంటే యెవరు? ఇంకెవరు—చాకలి వారు, రజకులు! ‘బంట్రోతు’ అంటే అది ఇంగ్లీషు పదం అనుకుంటారు! కానీ ఇది అచ్చమైన తెలుగు పదం—‘బంటు + రౌతు’—సమాచారాన్ని అందించడానికి గుర్రం మీద వెళ్ళే (రౌతు) బంటు (సిపాయి) అని అర్థం! దీనికి మరో తెలుగు పదం జోడించి, ‘డవాలు’/’డవాలా’ బంట్రోతు ని చేశారు! పాశ్చాత్య భాషలో ‘డఫాలు’ ని, అది ధరించే వాడిని ‘డఫేదారు’ అనేవారు—హిందీ లో. ఆదే మాటని తెలుగీకరించి డవాల్ అన్నారు! ఇప్పటికీ, రెవెన్యూ శాఖలో కలెక్టర్ల దగ్గరా, తహశీల్దారు ల వద్దా వుండే ఈ బంట్రోతులకే ‘ఫుల్ పవర్స్ ‘! ఈ బంట్రోతునే ‘బిళ్ళ బంట్రోతు’ అని కూడా అంటారు—డవాల్ మీద అందరికీ కనిపించేలాగ ఓ ఇత్తడి బిళ్ళ తగిలించి వుంటుంది—తన పేరు, వుద్యోగం వగైర వివరాలతో! అసలు తెలుగులో మూడువంతులకి పైగా సంస్కృత పదాలే కదా? ఆ పదాలని మన విభక్తి ప్రత్యయాలు చేర్చి, తెలుగీకరించుకున్నాము! ఉదాహరణకి ‘రామ:’ = ‘రాముడు’ మరి ఇలాగే అన్యభాషా పదాలెన్నో అన్ని భాషల్లోంచీ తెలుగీకరించబడ్డాయి! రోడ్ = ‘రోడ్డు’, లైట్ = ‘లైటు’; రెయిల్ = ‘రైలు’ ఇలాగ! మరి వీటిని మాట్లాడితే అది తెలుగు కాదంటే యెలాగ? ఇంకా ‘ప్రాంశరీ నోటు’, ‘నగదు’, ‘నకలు’ ‘దఖలు’ ఇలాంటివెన్నో! అలాగే మన తెలుగు పదాల్ని ఇంగ్లీషు కూడాస్వీకరించింది కదా—పందికొక్కు = ‘బేండికూట్’—ఇలాగ! ఇంకా కొత్తపదాలు వాడుకలో ప్రవేశ పెట్టబడ్డాయి—రైల్వే సిగ్నల్ కి మనవాళ్ళు వాడే మాట—సింపుల్ గా ‘రెక్క’ అని! దీనికి—ధూమశకట ఆగమన నిర్గమన నిర్దేశక స్వయంచాలిత సూచిక—అనడం అంత అవసరమా? మన మీడియా మరీను—మన తెలుగు భాష దినమో, సంవత్సరమో వస్తే, ‘ఐదు నిమిషాలు పూర్తిగా తెలుగులో మాట్లాడండి’ అని మైక్ ముందు పెట్టి, వాళ్ళు కష్టపడి తెలుగులోనే మాట్లాడుతూ మధ్యలో ‘రోడ్డు’ అనో, ‘బస్సు’ అనో అనగానే, మైక్ లాగేసుకుని ‘అదిగో ఇంగ్లీషు…..’ అనేస్తారు! ఈనాడు వార్తా పత్రిక ఈ విషయం లో కొంత కృషి చేస్తోంది—కానీ, వాళ్ళు ఇంకోరకం తెలుగు ని ప్రవేశ పెడుతున్నారు! ఫైలు = దస్త్రం, కాంట్రాక్టర్ = గుత్తేదారు—ఇలాగ! ‘దస్త్రం' అంటే, ఒక వస్త్రం లో చుట్టి ముడి వేయబడ్డ లెఖ్ఖల పుస్తకాలు! గ్రామం తాలూకు పన్నులూ, ఖర్చులూ అన్నీ వ్రాశి, తాలుకాఫీసు లో ‘జమాబందీ’ కి దస్త్రాలని తీసుకెళ్ళేవారు—కరణాలు, మునసబులూ! వ్యాపారాలు చేసుకొనేవాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆచారాలని బట్టి ఊగాది రోజునో, దీపావళి రోజునో, యేప్రిల్ ఒకటినో—కొత్త దస్త్రాలు తెరుస్తారు! మరి ఫైలు కి సరైన పదం? ‘కూర్పు’, లేదా ‘గుప్పెన’—ఫైలింగ్ అంటే కొన్ని కాగితాలని ఓ క్రమ పద్ధతిలో కూర్చడమే కదా? మరి ఒక దారానికి కొన్ని పూసలు ‘గుప్పితే’ (అంటే గుచ్చడం, కూర్చడం) అది ‘గుప్పెన’! కాంట్రాక్ట్ ని తెలుగులో ‘గుత్త’ అంటారు. గుత్తకు తీసుకున్న వాళ్ళు ‘గుత్తదారులు’! మరి గుత్తేదారులు యెక్కడనించి వచ్చారు? ‘శషభిషలు’ లేకుండ, చక్కని తెలుగు మాట్లాడవచ్చు! తెలుగు రాని వాళ్ళు ‘వెల్ ‘ అనో, మధ్యలో ‘ఆ….’ అనో అన్నట్టు మనం అనకుండా వుంటే చాలు! ప్రతీదానికి ‘ఐ ఫీల్ గ్రేట్’ అనో, ‘ఐ కాంట్ ఎక్స్ ప్రెస్’ అనో అనకుండా చూసుకుంటే చాలు! గరికపాటి నరసిం హా రావు కూడా, తన భాషణం ముగించి, ‘తెలుగులోనే మాట్లాడదాం’ అని ముగిస్తారు! కాని, తన భాషణం లో అప్పుడప్పుడు ఇంగ్లీషు పదాలు వాడతారు—మనకి ఇంకా బాగా అర్థమవడానికి! అలాగే ఎస్ పీ బాల సుబ్రహ్మణ్యం కూడా, తన కర్యక్రమాలని పూర్తిగా తెలుగులోనే జరిపిస్తారు—అప్పుడప్పుడు ఒకటో రెండో ఇంగ్లీషు/హిందీ మాటలతో! ఆయన కూడా, పోటీ (కాంపిటీషన్) కి ‘స్పర్ధ’ ఇలా కొన్ని వాడుతుంటారు! ఇక మన దూరదర్శన్ లో తెలుగు పండితులూ, కవులూ చక్కటి తెలుగులోనే మాట్లాడడం లేదూ?—ఆవృత్తి మొదలైన మాటలతో! మనకి కావలసింది ముఖ్యం గా గాఢమైన సంకల్పం! అంతే!

14 comments:

కత్తి మహేష్ కుమార్ said...

బెంగాలీలో ఉద్యోగాన్ని "చాకరీ" అంటారు. అక్కడ్నించీ నౌకరీ-చాకరీ వచ్చిందేమో!

సూర్యుడు said...

చాకరీ సంగతి తెలీదు కాని, మనవాళ్లు చాకిరీ అంటూంటారు, గాడిద చాకిరీ అని అంటే బోలెడంత పని అని అర్ధమనుకుంటా, అలా అయితే చాకిరీ అంటే పని అనేమో. ఉద్యోగాన్ని, పనిని పర్యాయాలుగా వాడుతుంటారు. ఉద్యోగం దొరికిందా అనే బదులుగా పనిదొరికిందా అని.

Shashank said...

చాలా బాగా చెప్పారండి. ఈ మధ్యలో చిరాక్ గా ఇంకో కొత్త పదం - పదం కంటే ఒక వాక్యం - వినిపిస్తోంది. అసలు అది వింటే నాకు పరమ కంపరం.. అదేనండి "నేను హ్యాపీ గా ఫీల్ అయ్యా" "నువ్వు హ్యాపీ గా ఫీల్ అవ్వు" అసలు హ్యాపీ గా ఫీల్ అవ్వడం ఏంటో. ఎంచక్కా నేను ఆనందిస్తా నువ్వు సాంతోషిస్తావని అని అనచ్చుకద? హ్యాపీ గా ఫీల్ అంటారు.. ఇంకొకటి "హైడ్రాబ్యాడ్" అల అన్నవాళ్ళాందరిని వెళ్ళగొట్టాలి హైదరాబాదు నుండి.

చిలమకూరు విజయమోహన్ said...

తెలుగులో క్రొత్త క్రొత్త పదాల గురించి,మంచి ఉచ్చారణ గురించి మాజీ హోంమంత్రి శ్రీ జానారెడ్డి గారిని సంప్రదించండి. ఇప్పుడెలాగూ ఆయనకు తీరికే. :)

Praveen's talks said...

కేవలం తెలుగు, హిందీలాంటి భాషలే కాదు, ఇతర భాషలు కూడా గమనించండి. అరబ్ భాషలో "డ" అనే సౌండ్ ఉండదు. వాళ్ళు "డ" స్థానంలో "ద" పలుకుతారు. ఆంగ్ల భాషలో "ద" స్థానంలో "డ" పలుకుతారు. అరబ్బీయులు "సద్దాం హుస్సేన్" అంటే ఆంగ్లేయులు "సడ్డాం హుస్సేన్" అంటారు. అరబ్బీయిలు "ఫిలాస్తీన్" అంటే ఆంగ్లేయులు "పాలెస్టిన్" అంటారు. ఆంగ్లేయులు "గాజా" అని పిలిచే నగరాన్ని అరబ్బీయులు "ఘాజా" అంటారు. సంస్కృతం భాషలోని "నారంగ" అనే పదాన్ని అరబ్బీయులు "నారంజ్" అంటారు. ఇలా భాషలలో అనేక కంపేరిజన్స్ చూడొచ్చు.

Krishna Sree said...

డియర్ కత్తి మహేష్ కుమార్!
డియర్ సూర్యుడూ!

మీరిద్దరు చెప్పిందీ నిజమే!

చాకరీ అంటే వుద్యోగమే! మరి చాకిరీ అంటే, వూడిగం! వెట్టి చాకిరీ లాంటిదన్నమాట!

వుద్యోగం అంటే, తగిన ప్రతిఫలం తప్పకుండా ముట్టేది--ఇది సాధారణం గా ముందే మాట్లాడుకొంటారు.

ఇక చాకిరీ అంటే, ప్రతిఫలం ఇంత అని వుండదు--ఆశ్రయించబడ్డ వారి సంతోషం కొద్దీ ముడుతుంది! ముట్టేది తక్కువైతే అప్పుడు 'గాడిద చాకిరీ' అనే మాట వస్తుంది!

ఉదాహరణకి, ఇంటి చాకలినీ, ఇంటి మంగలినీ పిలవకుండా యే శుభ/అశుభ కార్యం జరగదు!

పెళ్ళిళ్ళూ, పురుళ్ళూ వంటి సందర్భాల్లో, మామూలుగా గెడ్డం గియ్యడానికి 2 రూపాయలు ఇచ్చేవాళ్ళూ, పెళ్ళి లేదా వొడుగు సందర్భంగా మంగలికి, ఏ అర్థ నూట పదహార్లో చదివిస్తారు!
పురుళ్ళలో చాకలికీ పురిటి కట్నం తో బాటు చీరలు పెట్టక తప్పదు!

ఇంక మోతుబర్ల ఇళ్ళళ్ళో పాలేళ్ళు వుంటారు!

ఇలాంటివాళ్ళే 'చాకర్లు '

ఇదో చక్కటి తెలుగు మాట!

ధన్యవాదాలు!

Krishna Sree said...

డియర్ Shashank!

ఇవి మన అన్యభాషా కథానాయికల నించి, మన టీవీ యాంకర్ల ద్వారా టీనేజ్ విద్యార్థినీ విద్యార్థులకి వ్యాపిస్తున్న వైరస్ లు! మిమ్మల్ని పిలవమంటే, 'షషాంక్' అంటారు!

నయం! వీళ్ళని హైడ్రాబ్యాడ్ నించి వెళ్ళగొట్టాలా? మీ తెలుగోళ్ళనే వెళ్ళగొడతామంటున్నారే--తెలంగాణులు! (వాళ్ళు నెగ్గలేదు కాబట్టి సరిపోయింది!)

వీలైతే వాళ్ళని సంస్కరించండి!

ధన్యవాదాలు!

Krishna Sree said...

డియర్ చిలమకూరు విజయ మోహన్!

పాపం ఆయన 'సమ్యమమనం' పాటిస్తుంటే యెందుకండీ రెచ్చగొడతారు!

ధన్యవాదాలు!

Krishna Sree said...

డియర్ Praveen's talks!

మీరెక్కడికో.....వెళ్ళిపోయారు! రామాయణం లో పిడకలవేట!

అక్కడిదాకా యెందుకు? మన బెంగాలీ సోదరుడొకడు, 'బెంకట్రాబ్, బెంకట్రాబ్, భై ఆర్యూ బాండరింగ్ ఇన్ ది భరండా?' అని అడగలేదూ?

మన గొడవంతా అన్యభాషా పదాలని తెలుగీకరించుకోవడం గురించి కదా!

ధన్యవాదాలు!

Krishna Sree said...

డియర్ తెలుగోళ్ళూ!

ఇంకా ఇంకా మంచి విషయాలు చదవండి--వ్రాయండి!

ధన్యవాదాలు!

Praveen's talks said...

రసాయనాల పేర్లు కూడా తెలుగులో మార్చి వ్రాస్తారు. Phosphorus - భాస్వరం, Nitogen - నట్రజని, ఇలా.

Krishna Sree said...

డియర్ Praveen's talks!

మీ బాధేమిటో నాకర్థం కాలేదు కాని--రసాయన శాస్త్రానికొస్తే, మన దేశం లోనే అది వృద్ధి చెంది, చైనా మీదుగా పాశ్చాత్య దేశాలకి వెళ్ళింది! భాస్వరం, నత్రజని మొదలైన పేర్లు మనవాళ్ళు పెట్టినవే--పాశ్చాత్యులు తమ భాషల్లోకి స్వీకరించారు!

వేల సంవత్సరాల క్రితమే మనవాళ్ళు లోహాలనీ, రసాయనాలు వాటిలో తేగల మార్పుల్నీ అవుపోసన పట్టారు! మైలుతుత్తం, తుతినాగం, తగరం, నవాసారం, పాదరసం, ఇలా లోహాల మీదా, రసాయనాల మీదా అనేక ప్రయోగాలు చేశారు! శస్త్రాస్త్రాలు తయారు చెయ్యడమే కాదు, వైద్యం లో కూడా వాటిని ప్రయోగించేవారు!

ధన్యవాదాలు!

హరి దోర్నాల said...

"మీ తెలుగోళ్ళనే వెళ్ళగొడతామంటున్నారే--తెలంగాణులు..."

మీ పోస్టు బాగుంది. కాని మీ పై కామెంటు నచ్చ లేదు. తెలంగాణా వారు తెలుగోళ్ళు కాదని మీ ఉద్దేశ్యమా? తెలంగాణా అన్న పదం లోనే ఎక్కువ తెలుగు తనం ఉందని తెలుసు కోండి. ఇంకో విషయం: హైడ్రాబ్యాడ్ అని హైదరాబాద్ వారెవారూ అనరు. మరో విషయం మీరు గుర్తించాలి, ప్రత్యేక తెలుగు రాష్ట్రం (తెలంగాణా) కావాలి అన్నారు కాని ఇక్కడ ఉన్న వారిని వెళ్ళ గొడతామని కాదు.

ఏ భాష అయినా పరిపుష్టం కావాలంటే అన్ని భాషలనుండి పదాలను గ్రహించి తనలో ఇముడ్చు కోవాలి. కాని మన వారికి మన పదాలంటేనే గిట్టవు. ఒక ప్రాంతంలో వాడే పడాలంటే మరో ప్రాంతం వారికి చిన్న చూపు.

ఉదాహరణకు హైదరాబాదు లో ఎవరైనా 'బొక్కల దవాఖాన' అంటే 99% మంది ఇతర ప్రాంతాల వారు ఈసడించు కుంటారు. 'బొక్క' తెలుగు పదం కాదా? ఇక పొతే దవాఖాన. అంత కంటే మంచి తెలుగు పదం ఏమి వాడ తారు మిగతా ప్రాంతాల్లో? 'ఆసుపత్రి' (Hospital) ఆంగ్ల పదానికి వికృతి మాత్రమే కదా? నాకు తెలిసి వైద్య శాల అని ఎవరూ పలకరు. ఒక వేళ పలికినా తెలుగులో ఒకటికి రెండు సమానార్థకాలు ఉంటే తప్పేమిటి?

ఇలాంటి భాషా/ప్రాంతీయ దురభిమానాల వల్లనే ప్రాంతీయ విభేదాలు పెచ్చరిల్లుతాయని కనీసం విద్యా వంతులు, మేధావులు గుర్తిస్తే మంచిది. ప్రతి ప్రాంతం వారు ఇతర ప్రాంతం యొక్క భాషని, సంస్కృతిని గౌరవిస్తే ఏ సమస్యా ఉండదు. మన భాషలోకి ఎన్నో సంస్కృత, తమిళ, కన్నడ, ఒరియా, ఆంగ్ల పదాలు వచ్చి చేరాయి. అలాగే కొన్ని ఉర్దూ పదాలు కూడా కలిస్తే భాషకు లాభమే కాని నష్టమేమీ ఉండదు. నిజానికి ఇప్పటికే చాలా ఉర్దూ పదాలు ఆంధ్రా లోనే వాడుకలో ఉన్నాయి. ఉదా: దస్తావేజులు, మునసబు, తహశీల్దారు, ఖరీదు, పహారా మొదలయినవి.

Krishna Sree said...

డియర్ హరి దోర్నాల '!

ఆ కామెంట్ ఒకరు వ్రాసిందానికి నా సమాధానం కానీ, నా కామెంట్ కాదు అని గమనించాలి మీరు--అది 'హైడ్రాబ్యాడ్' అని వ్రాసినవారికి, నా సరదా హెచ్చరిక మాత్రమే!

ఇక వెళ్ళగొట్టడం దగ్గరకి వస్తే,

'తెలుగు కార్పొరేట్ కాలేజీలని వెళ్ళగొడతాం' అనలేదూ?
'తెలుగు బోర్డులు పీకెయ్యండి ' అనలేదూ?
(తెలంగాణా ప్రజలు కాదు--వాళ్ళ సోకాల్డ్ నాయకులు!)

'ఇక్కడ వెంఢ్రుఖలు అంధముగా నరకబడును ' లాంటి మంగలిషాపుల ముందు వుండే బోర్డులని, తెలుగులోకి మార్చుకోవడం నేర్పింది--తెలుగువాళ్ళు, నేర్చుకొన్నదీ తెలుగువాళ్ళే!

'నాతెలంగాణ కోటి రతనాల వీణ ' అన్నవాడూ, 'వచ్చిండన్నా, వచ్చాడన్నా, వరాల తెలుగు ఒకటేనన్నా' అన్నవాడూ చాలరూ?

నేను మొదటినించీ అంటున్నదీ అదే--దవాఖానా కూడా తెలుగే అని!

కొంచెం నిదానంగా చదవండి మరి!

ధన్యవాదాలు!