Friday, October 30, 2009

పూజలు


పుష్పాలు


.....అవే 'మన్మధ బాణాలు'! 


'చూత, కేతకీ........' మొదలైన పుష్పాలని యే పుష్ప బాణాన్ని యే సందర్భం లో యెవరి మీద మన్మధుడు ప్రయోగిస్తాడో కూడా మన కవులు వ్రాశారు. ఈ పువ్వులనే స్త్రీలు తమ సిగలో తురుముకుంటారు! మరందుకే గదా వాటిని మన్మధ బాణాలన్నది!


ఈ పుష్పాలు కాకుండా దేవుని పూజలకి కొన్ని ప్రత్యేకించారు--ఆయా దేవుళ్ళ ప్రీతి ప్రకారం. వీటిని స్త్రీలు సిగల్లో తురుముకోరు! అవన్నీ మన దృష్టిలో సువాసనలేని పూలు. కామవికారాలు కలిగించని పూలు. దేవుళ్ళని పూజించడం లో మన వుద్దేశ్యం వాళ్ళకి కామవికారాలు కలిగించాలని కాదు కదా? అవన్నీ అనవసరం, నేను ఆ సువాసన పూలే పూజ చేస్తాను అని యెవరైనా అంటే, వాళ్ళకో నమస్కారం!  


విచిత్రమేమిటంటే, ఇప్పుడు 'మన్మధ బాణాలతో' దేవుళ్ళని అలంకరిస్తున్నారు--పుష్ప యాగాలు చేసేస్తున్నారు!  


పండగ వచ్చినా, కార్తీకం లాంటి కొన్ని ప్రత్యేక మాసాల్లోనూ, స్త్రీలు అలంకరించుకునే మల్లెలూ, కనకాంబరాలూ, చామంతులూ, రోజాలూ మొదలైన వాటి ధర ఆకాశం పైకి యెక్కి కూర్చొంటోంది! కారణం--జనాలు వేలం వెర్రిగా కొన్నైనా ఈ పూలు కొని, దేవుళ్ళ నెత్తిమీద పోస్తుండడం! వీళ్ళ పుణ్యం సంగతి దేవుడెరుగు--వ్యాపారులు బాగుపడ్డానికి దోహదం చేస్తోంది ఇది!  


నిజంగా పసుపు గన్నేరు, తెల్ల గన్నేరు, బిళ్ళ గన్నేరు, నాగ మల్లి, మందార, మంకెన, కరవీర, జిల్లేడు లాంటి పువ్వుల్నెవరూ అమ్మడం లేదు--యెవరూ కొనడం లేదు--దేవుళ్ళకి అర్పించడం లేదు! గుళ్ళలో పూజారులు మాత్రం, ఉదయాన్నే స్వాములకీ, అమ్మవార్లకీ వీటితోనే అర్చన ప్రారంభిస్తారు!  


పసుపు గన్నేరు--విష్ణువుకీ, తెల్ల గన్నేరు, బిళ్ళ గన్నేరు అమ్మవార్లకీ, నాగ మల్లి, మందార, మంకెన, కరవీరాలు శివుడికీ, జిల్లేడు గణపతికీ ప్రీతికరమైనవి. ఇక కలవలూ, తామరలూ చెప్పక్కర్లేదు.  


ఒక్క మొగలి పువ్వుకి దేవుళ్ళని పూజించే అర్హత లేదు--బ్రహ్మతరఫున అబధ్ధ సాక్ష్యం చెప్పినందుకు!  


ఇంకా, పొగడ పువ్వుకొక్కదానికే, నేల రాలినా, దేవుడి మస్తకం చేరే అర్హత వుందంటారు! మిగిలిన యే పువ్వుకీ లేదు. (ఇదెందుకో నాకు తెలీదు--తెలిసినవాళ్ళెవరైనా చెపితే సంతోషం.)  


మరి ఈ పుష్ప యాగాలూ, జనాలు నష్టపోవడం, వ్యాపారులు బాగు పడడం, ఇవన్నీ యెందుకు?

6 comments:

భాస్కర్ రామరాజు said...

ఒకరికి లాభం, ఒకరికి నష్టం.
ఇవే అమ్ముతాం కొంటే కొను లేకపోతే నీ కర్మ.
అలా ఉంది పోకడ.
పులేకాదు, ఏదైనా! మానవత్వం, భావం, మనం అనేవి పొయ్యాయి. ఉదా ॥ ఓ వైపు వరదొచ్చి ఉన్నది ఊడ్చేసి నీళ్ళలో ముంచేస్తే, ఇంకో వ్యాపారులు పాల పొట్లం యాభై అని అమ్ముతున్నారు. ఇవీ మన సాంస్కృతిక సాంప్రదాయ ముద్రలు.

ఉష said...

పారిజాతంకి కూడా రాలినాక కూడా దైవపూజకి పనికివస్తుందని విన్నాను.
http://3psmlakshmi.blogspot.com/2009/06/blog-post.html ఇవే మీరనే పొగడపూలు అయితే వీటికేనా ఆ అర్హత వున్నది అని అనుమానం [మాత్రమే?] ఎందుకంటే అన్ని పూజా పుష్పాలు వాడిన నాన్నగారు ఇవి వాడటం నేను చూడలేదు. మీరన్నది పున్నాగ పూల మాట కాదనీ అనిపిస్తుంది అవుననీ తోస్తుంది మరి.

చిలమకూరు విజయమోహన్ said...

పొగడపువ్వుకు కాదండి ఆ అర్హత ఒక్క పారిజాతానికే సొంతం.

కృష్ణశ్రీ said...

డియర్ భాస్కర్ రామరాజు!

యే వస్తువు ధరైనా, సరఫరా--గిరాకీ లను బట్టే వుంటుంది! మీరిచ్చిన వుదాహరణలో (మానవత్వం సంగతి పక్కనపెడితే) ఆ ధర సమంజసమేనేమో!

కానీ, 'కృత్రిమ గిరాకీ' సృష్టించి, బాగుపడాలనుకొనే వ్యాపారులు చేస్తున్నది మాత్రం ద్రోహం! దానికి బలవుతున్న వినియోగదారులు ఇలాంటి ట్రిక్కులకి దూరంగా వుంటే మంచిదని నా అభిప్రాయం!

ధన్యవాదాలు!

కృష్ణశ్రీ said...

డియర్ ఉష!

వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు పేర్లతో పిలుస్తారు--మొక్కలనీ, పూలనీ.

లక్ష్మిగారి బ్లాగుకి లింక్ పంపించినందుకూ, మీరందరూ ఇంత శ్రధ్ధగా బ్లాగింగ్ చేస్తున్నందుకూ నాకు చాలా సంతోషం!

ఇక నేనుకూడా, ఖచ్చితం గా చెప్పలేదందుకే! మా నాన్నగారు కూడా ఈ పూలు పూజకి వాడలేదు--యెందుకంటే అవి దొరికేవి కాదు!

లక్ష్మిగారి బ్లాగులో పెట్టిన ఫోటోలు పొగడపువ్వులవే--అదొక వెరైటీ.

మా ఇంటిదగ్గర 'బొడ్డపాటివారి' దొడ్లో పెద్ద చెట్టు వుండేది--దాన్ని పొగడచెట్టు, బొగడ చెట్టు అనేవారు. ఆ పువ్వులు ఫోటోలోని పువ్వుల లానే వుండేవిగానీ, పువ్వు మధ్యలో 'ఆరెంజ్' రంగు వుండి, మధ్యలో రంధ్రం వుంటుంది. రేకులు కొద్ది బ్రౌన్ రంగులో, లావాటి దారాల్లా ఇంకా యెక్కువ వుంటాయి. ఉదయం నిద్రలేచేసరికి, నేలమీద 'ఒత్తుగా' రాలి వుండేవి. వాటిని దండ గుచ్చితే, ఓ ఆరంగుళాల పొడవు దండ కి కొన్ని వేల పువ్వులు (మధ్యలో వుండే రంధ్రం గుండా) సూదికి గుచ్చవలసి వచ్చేది. ఇంకా, ఆ మాల నించి ఓ పవిత్రమైన సువాసన వచ్చేది!

ఆ ఙ్ఞాపకంతో వ్రాశాను!

ఇప్పుడు కొంతమంది భక్తులు ఆ మొక్కలని అటవీ శాఖనించి సేకరించి, పెంచుతున్నారు--భవిష్యత్తులో పూజలకి వుపయోగపడతాయని! ఇవి నర్సరీల్లో కూడా దొరుకుతున్నట్టు లేదు!

ఇక పారిజాతం సంగతి కూడా నాకు ఖచ్చితం గా తెలియదు.

ధన్యవాదాలు!

కృష్ణశ్రీ said...

డియర్ చిలమకూరు విజయమోహన్!

చాలా సంతోషం!

ధన్యవాదాలు!