Sunday, June 27, 2010

కుంభకోణం డాట్ కామ్

ఐ ఆర్ సీ టీ సీ

కొంపలంటుకున్నాయి బాబోయ్! అని అందరూ గగ్గోలు పెడుతుంటే,  'హమ్మయ్య! నా చుట్ట వెలిగించుకోడానికి నిప్పు వెతుక్కునే బాధ తప్పింది!' అన్నట్టుంది "ఈనాడు" వ్యవహారం.

మమత ప్రవేశపెట్టిన 'దురంతో', నాన్ స్టాప్, పూర్తి ఏ సీ, రైళ్ళు యెలాగూ ఖాళీగానే వెళ్ళిపోతున్నాయి.

ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన రైళ్ళు సైతం, ఐ ఆర్ సీ టీ సీ వారి పుణ్యమా అని, టీటీలకి కాసులు కురిపిస్తూ, 
ఖాళీగానే వెళ్ళిపోతున్నాయి!

హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ, కోల్ కత్తా వెళ్ళే యే రైలుకైనా, నెలా రెండు నెలల ముందే స్లీపర్ బోగీల్లో రిజర్వేషన్ పూర్తయిపోతోంది.

ఇక తత్కాల్ ఒక్కటే గతి--డబ్బులెక్కువైనా (ఇంకా చాలా లొసుగులున్నా) అనుకుంటే, 'రెండు రోజుల ముందు మాత్రమే' దొరుకుతాయి. 

ఉదయం 8.00 గంటలకి బుక్కింగ్ ప్రారంభం అవుతుంది. 7-30 నించీ బ్రౌజర్ తెరుచుకొని, ఐ ఆర్ సీ టీ సీ సైట్లో లాగిన్ 
అయినా, 'ఎవైలబుల్' అని అన్ని టిక్కెట్లూ చూపిస్తూ వుంటుంది. 

కానీ, 8.00 అవ్వడం పాపం, ఛస్తే ఎవైలబులిటీ చూపించదు! 

అది చూపించే టైముకి తత్కాల్ టిక్కెట్లన్నీ, 'వెయిటింగ్ లిష్ట్--12 నించి 126' వరకూ చూపిస్తూ వుంటాయి! ఇక వెయిట్ లిష్ట్ 1 వచ్చినా, కనీసం ఆర్ ఏ సీ కైనా వస్తుందని నమ్మకం లేదు!

(ఈ రిజర్వేషన్ పధ్ధతి సాఫ్ట్ వేర్ గురించి మరోసారి మాట్లాడదాం)

దాదాపు ఈ సంవత్సరం ఏప్రిల్ నించీ ఇదే పరిస్థితి!

అలాగని నిజం గా అందరూ అన్ని బోగీల్లోనూ నిండుగా ప్రయాణిస్తున్నారా అంటే--స్లీపర్ బెర్తుకి 200, ఏ సీ 3 టయెర్ కి 500, ఏ సీ 2 టయెర్ కి 1000--ఇలా దండుకుంటున్నారు--టీ టీ లు. 

తీరా అంతా ఇచ్చి, వెళితే, బోగీ అంతా ఖాళీగా వెక్కిరించి, యెంత మోసపోయామో అని ముక్కు మీద వేలేసుకుంటాం!

ఇక 'ఆటో అప్ గ్రెడేషన్' అనేదొకటుంది--మనం ఓ క్లాసు టిక్కెట్ బుక్ చేసుకుంటే, దానికి పై క్లాసులో ఖాళీ వుండడం జరిగితే, ఆటోమేటిక్ గా అదే టిక్కెట్ తో పై క్లాసులో ప్రవేశార్హత లభిస్తుంది!

మూడేళ్ళ క్రితం ఇలా జరిగి, ప్రయాణీకులు యెంతో సంతోషించేవారు!

ఇప్పుడా సౌకర్యం కాకెత్తుకెళ్ళిపోయింది! బోగీలు ఖాళీగానే వెళ్ళిపోతున్నాయి!

ఇంకో రహస్యం తెలుసా? 

రిజర్వేషన్ల గురించి యేమాత్రం పట్టించుకోకుండా, తరచూ మహానగరాలకి రాజభోగం గా ప్రయాణాలు సాగించే నా స్నేహితుడొకరిని ఈ మధ్యే, "మీ చర్మ రహస్యం యేమిటి సినీ తారగారూ?" అన్నట్టు ప్రశ్నించాను. ఆయన చిద్విలాసం గా నవ్వుతూ, "లక్స్ సబ్బు" అన్నంత వీజీగా, 

"ఓ రెండు గంటల ముందు స్టేషన్ కి వెళ్ళిపోయి, యెవరైనా రైల్వే వుద్యోగిని (ఆఖరికి పోర్టర్ అయినా సరే) పట్టుకొని, ఓ 200 పారెస్తే, 'ఎమర్జెన్సీ' కోటాలో ఓ టిక్కెట్టు (మీరడిగిన క్లాస్ లో) పట్టుకొచ్చి ఇస్తారు! ఇంక రాజభోగం కాకేమిటి?" అని క్రొశ్నించాడు.

అస్తమానూ ఈ చిట్కా పని చేస్తుందా అని అడిగితే, "ప్రతీరోజూ వీ వీ ఐ పీ లు రైళ్ళలో ప్రయాణించరుగా? ఒకవేళ ఆ రోజు అలాంటివాళ్ళు ప్రయాణిస్తూ, ఎమర్జెన్సీ కోటా కూడా నిండినా, ఇంకో వంద మనది కాదనుకుంటే, ఆ ఐ పీ ల తైనాతీకెవడికో ఒకడికి నామం పెట్టి, ఆ టిక్కెట్ మన చేతికి ఇస్తారు!" అని రైలుగీత బోధించాడు!

ఈ మధ్య టీ వీ చానెళ్ళలో కూడా ఐ ఆర్ సీ టీ సీ, వుద్యోగుల కుమ్మక్కు--అంటూ వార్తా కథనాలు వస్తున్నాయి!

ఇంతకీ ఈనాడు ప్రసక్తి యెందుకు అంటారా?

ఇవాళ పత్రికలో (27-06-2010) "ఐ ఆర్ సీ టీ సీ కల్పిస్తున్న సౌకర్యాలు, బుక్కింగ్ చేసుకునే విధానం" వగైరాలపై వ్యాసం వెలువడింది! 

ఇక మీ ప్రయాణానందాన్ని అనుభవించండి మరి!

6 comments:

కథా మంజరి said...

రైలు గీతని చక్కగా బోధించారు. జనాలను వెర్రి కుట్టెలుగా చేసి ఆడుకుంటున్న రైల్వేల లీలలు ఎంత చెప్పినా తరగవు. ఇక, మన పత్రికలంటారా? అవి అసత్య కథనాల విష పుత్రికలని మహా కవి ఏనాడో చెప్పాడు కదా ?

A K Sastry said...

జోగారావుగారూ!

చాలా సంతోషం.

ధన్యవాదాలు.

Anonymous said...

రైల్వే లనే కాదండీ మన వ్యవస్థ లో ఏది తీస్కొండి ఇలానే బ్రష్టు పట్టి వుంటాయి..ప్రజలు ఈ విదానాలకి అలవాటు పడిపోయారు...

Vamsi said...

ఇక తత్కాల్ ఒక్కటే గతి--డబ్బులెక్కువైనా (ఇంకా చాలా లొసుగులున్నా) అనుకుంటే

ఆ ఇంకా లొసుగులు ఏమిటొ చెప్తె ంఎము తెలుసుకుంటాం

వంశీ క్రుష్ణ

A K Sastry said...

డియర్ kvsv!

భ్రష్టుపట్టివున్న వ్యవస్థలనేమీ చెయ్యలేమంటే బాగానే వుంది--మొన్నటిదాకా చక్కగా పని చేస్తున్న, కంప్యూటరైజ్డ్ వ్యవస్థని చెడగొట్టేశారంటే, మన సాఫ్ట్ వేర్ల మాటేమిటి? వాటివల్ల మనకి వొరుగుతున్నదేమిటి?

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ జొన్నాదుల!

తత్కాల్ నిబంధనలు ఓ సారి చదవండి.

ధన్యవాదాలు.