Monday, September 27, 2010

పురాతత్వ వెర్రీ

వారసత్వ సంపదలు

బ్రిటిష్ వారికన్నా ముందు, డచ్చివారు తమ వ్యాపారాన్ని ప గో జి, నరసాపురం కేంద్రం గా సాగించేవారు.

వ్యాపార రీత్యా వూళ్లు తిరుగుతూ, విశ్రాంతి కోసం రెస్ట్ హౌస్ లూ, ట్రావెలర్స్ బంగళాలూ, రహాదారి బంగళాలూ నిర్మించుకున్నారు. 

నరసాపురం లో ట్రవెలర్స్ బంగళా/రెస్ట్ హౌస్ సబ్ కలెక్టర్ ఆఫీసు యెదురుగా ఓ ఐదెకరాల్లో వుండేది. ప్రభుత్వం వారు దాన్ని 8 మూలలా ఆక్రమించి, ఎం డీ వో ఆఫీసూ, మునిసిపల్ ఆఫీసూ, ఫైర్ స్టేషనూ, ఓ హై స్కూల్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఇప్పుడు మళ్లీ కొత్త మునిసిపల్ ఆఫీసూ--ఇలా నిర్మించేశారు. అసలు బంగళా వుందో లేదో, బయటికి కనపడడం లేదు. అందులో వుండే రక రకాల ఫల, ఇతర వృక్షాలూ, గుర్రాల పచ్చికా వగైరా యెప్పుడో దాదాపు నాశనం అయిపోయాయి.

గవర్నరు దగ్గరనించీ, యెవరు వచ్చినా ఆ రెస్ట్ హౌస్ లోనే బసచేసేవారు!

అలాగే, వీరవాసరం గ్రామం లో ఓ విశ్రాంతి భవనం నిర్మించారు. ప్రత్యేకం గా చుట్టూ గుర్రపు శాలా, మధ్యలో విశ్రాంతి గదులూ నిర్మించారు. ఈ భవనాన్ని కొన్నాళ్లు పాఠశాలలకోసం వుపయోగించారట. తరవాత పై (పెంకుల) కప్పు పాడైపోవడం తో మరమ్మతులు చేయించి, కొన్నాళ్లు సాగించారట. మళ్లీ కొద్ది రోజులకే ఆ కప్పు పాడైపోవడం తో ఇప్పుడు ఆ వంకతో భవనాన్ని పూర్తిగా తొలగించడానికి ప్రయత్నిస్తున్నారట! స్థానికులు దీన్ని వ్యతిరేకిస్తున్నారట.

నిజానికి "హెరిటేజ్" భవనాలు అంటే ఇలాంటివి! అంతేకానీ, యేలూరులో యెక్కడో బయటపడిన ఆంగ్లేయుల సమాధులూ, ఇంకెక్కడో తురకల సమాధులూ ఇలాంటివి కాదు కదా? మన ప్రభుత్వం, పురావస్తు శాఖా, గీతా రెడ్డీ ఇలాంటివాటిని పరిరక్షిస్తే బాగుండును. 

వాటిలో యేమి శిల్పకళ, లేదా యేమి ప్రత్యేకత వుందని కుతుబ్ షాహీ సమాధుల్ని పరిరక్షించడం?

ఇంకో ప్రక్క, బ్రిటీష్ వాళ్ల కాలానివీ, తరవాతవీ రాగీ, ఇత్తడి నాణాలని యెక్కువ ధరలకి కొంటున్నారట!

వాటి పురాతన విలువలకోసం కాదు--వాటిలో పంచలోహాలూ వుంటాయనీ, పూజలూ, ప్రతిష్టలూ, భూమిపూజలూ వంటి వాటిలో వీటిని వుపయోగించడం శ్రేయస్కరమనీ--యెంత ధరకైనా కొనేస్తున్నారట!

ఓ నలభై యేళ్ల క్రితం భారత ప్రభుత్వం పూర్తి రాగి తో 20 పైసల నాణాలని విడుదల చేస్తే, అలాంటివి ఓ ఇరవయ్యో యెన్నో కరిగించి, చేతికి రాగి కడియాలు చేయించేసుకునేవారు! అప్పట్లో అలా రాగి కడియాలు ఓ చేతికి ధరించడం వల్ల ఆరోగ్యానికి మంచిది అని విద్యార్థులతో సహా అందరూ చేయించుకొని, ధరించేవారు--అదో ప్రథ ఆ రోజుల్లో!

ఒకో కాలానికీ ఒకో వెర్రి మరి!

No comments: