Tuesday, October 12, 2010

మన తెలుగు

నిర్వాకాలు

"అయోధ్యపై కేంద్రానికి 'నిర్దుష్ట' వైఖరేమీ లేదు" అన్నాట్ట వీరప్ప మొయిలీ. (అంటే 'దుష్ట' వైఖరి వున్నట్టేనా? లేక 'నిర్దిష్ట ' అనడానికి పొరపాటున నిర్దుష్ట అన్నాడా?)

మన తెలుగు పాత్రికేయుడు అలా వ్రాసి, ప్రచురించాడంతే! యెందుకంటే మొయిలీ తనకి రాని తెలుగులో మాట్లాడడు కదా!

*   *   *

మొన్న హైదరాబాదు "దేశోధ్ధారక భవన్" లో, గాంధీ జయంతి వారోత్సవ ముగింపు సభల్లో, ముఖ్య అతిథి 96 యేళ్ల కొండా లక్ష్మణ్ బాపూజీ--'డిసెంబరు 31 తరవాత ప్రత్యేక తెలంగాణా ఇవ్వకుంటే ఆత్మార్పణకి సిధ్ధపడతాను' అని ప్రకటించాడట! (కానీ 'చేసుకుంటాను' అని ప్రకటించలేదు చూడండి!)  చింత చచ్చినా పులుపు చావలేదు అందామా అంటే--1969 లో చెన్నారెడ్డి తో కలిసి, వుధృతమైన వుద్యమాన్ని చంక నాకబెట్టిందెవరు? అనే ప్రశ్న వస్తుంది కదా?

*   *   *
మొన్న మన రాష్ట్ర డీజీపీ కార్యాలయం లోని స్టోర్స్ నుంచి ఓ వంద "తూటా రక్షణ కవచాలు" (బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అనుకుంటా) మాయమయ్యాయట--అకస్మాత్తుగా చేసిన తనిఖీలో ఈ విషయం బయట పడేటప్పటికి, మళ్లీ అవి అక్కడే ప్రత్యక్షమయ్యాయట! 

ఇందుకు బాధ్యుడని భావించిన డీ ఎస్ పీ ని బదిలీ చేసి, ఆరా తీస్తే, ఆయన తన వుద్యోగాన్ని సాయుధ విభాగాన్నించి సివిల్ విభాగానికి మార్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడని తేలిందట. ఈ "కన్వర్షన్" అంటే మాటలా? ఖర్చు కనీసం 10 నుంచి 15 లక్షలైనా వుంటుందట! అందుకనే "కక్కుర్తి" పడ్డాడేమోనంటున్నారు!

నిజం గా ఈ కక్కుర్తి ఫలిస్తే, రాష్ట్ర ప్రభుత్వానికీ, ప్రజలకీ యెంత నష్టం? అసలు వాటిని యెవరికి "అమ్మాలనుకున్నాడు?" లాంటి ప్రశ్నలెవరూ అడగడం లేదుట! వాడికి సహకరించింది యెవరు? అని మాత్రమే "ఆరా" తీస్తున్నారట! (ఆరూపం గా ఇంకొంత మంది మీద కక్ష తీర్చుకోవచ్చు కదా?)

ఇప్పుడు ఇలాంటివాటి నివారణకోసం ప్రత్యేక "సాఫ్ట్ వేర్" రూపొందించి, పరిశీలిస్తున్నారట!

మన పిచ్చి గానీ, ఇన్నాళ్లూ సాఫ్ట్ వేర్ వుంటేనే అన్నీ అరికట్టబడ్డాయా? (ప్రభుత్వమూ--గుత్తేదారులూ--సలహాదారులూ--కోట్ల కోట్లూ--మామూలే! "ప్ర గు స కో కో మా")

యేమంటారు?
*   *   *

అన్నట్టు--కవచాలు అంటే గుర్తొచ్చింది. పూర్వం యుధ్ధాలకి వెళ్లే సైనికులు బాణాలనుంచీ, కత్తుల నించీ రక్షణగా వొళ్లంతా వివిధ రకాల తొడుగులు (చర్మం తో గానీ, లోహంతో గానీ తయారైనవి) ధరించి వెళ్లేవారట.

ఇప్పుడు మన వివిధ గుళ్లలో శ్రీవార్లకీ, అమ్మవార్లకీ--వెండితోనూ, బంగారం తోనూ కవచాలు చేయించి, వొళ్లంతా తొడిగేస్తున్నారు! (ఇంతకు ముందు తగరం తోగానీ, రాగితోగానీ ఇలాంటి కవచాలు తగిలించిన దాఖలాలు లేవు!)

అసలు కవచాలూ, రక్షలూ, యంత్రాలూ అంటే--మంత్రాలతోనూ, బీజాక్షరాలతోనూ యేర్పాటు చేసేవేగానీ, ఇలాంటి సైనిక కవచాలూ, ఇనప కచ్చడాలూ కాదు.....అని వీళ్లకి యెవరు చెపుతారు?

No comments: