Friday, June 17, 2011

నిరసనలూ, నిరశనలూ


దీక్షలు

చంటి పిల్లాడు కూడా, తనకి కావలసింది దొరకనప్పుడో, ఇష్టంలేనిది జరిగినప్పుడో, "నిరసన" ప్రకటిస్తాడు (తనకు తోచిన, తనకు చాతనయిన రీతిలో)! అది మానవ జాతికేకాదు, పశు పక్ష్యాదులన్నింటికీ, ప్రకృతికీ భగవంతుడిచ్చిన వరం! తనకి ఓ అన్యాయం జరిగింది, జరుగుతోంది, జరగబోతోంది అని నిరసన తెలపడం స్వతంత్ర దేశ పౌరులందరి రాజ్యాంగ ప్రసాదిత హక్కు. ఆ నిరసన తెలియజెయ్యడానికి యెవరికి తోచిన, చాతనైన మార్గం వారు అనుసరించడం జరుగుతూంది. ఈ నిరసనలు, సమస్యనిబట్టి, సామూహికంగా కూడా తెలపడం జరుగుతూంది.

ఈ నిరసన మార్గాలలో కొన్ని--గొంతెత్తి అరవడం, తిట్టడం, ప్రచురించే వాళ్లుంటే, ఓ జోకో, కార్టూనో, కవితో, కధో వెయ్యడం, ప్రచురించేవాళ్లు లేకపోతే, ఓ కరపత్రం ప్రచురించి పంచిపెట్టడం, పోలీసు ఫిర్యాదో, న్యాయపరమైన చర్యలో తీసుకోవడం, నిరాహార/నిరశన దీక్ష చెయ్యడం, సామూహికంగానైతే, వూరేగింపులూ, ర్యాలీలూ, ఘెరావోలూ, ధరణాలూ, హర్తాళ్లూ, బందులూ, రాస్తా/రైలు రోకోలూ, ముట్టడులూ, సామూహిక "రిలే" నిరాహార దీక్షలూ, గడ్డి బొమ్మల దహనాలూ, ఇంకా "వినూత్న" అంటూ, "అర్థ నగ్న" (మన అదృష్టం కొద్దీ ఒక సగమే!); "మోకాళ్లపై"; కొండొకచో తలక్రిందులుగా వగైరాలూ--ఇలా యెవరి వూహకందిన పధ్ధతిలో వారు తెలియజేస్తున్నారు.

మన జాతిపితమీద ఓ పెద్ద విమర్శని వ్రాసి, స్వయంగా ఆయనకే చదువుకోడానికి ఇస్తే, ఆయన అది చదివి, ఆ కాయితాలకి గుచ్చిన గుండుసూదిని తీసుకొని, కాయితాలు తిరిగి ఇచ్చేశాడట. యేమని అడిగితే, "వాటిలో విలువైనది మాత్రమే నేను గ్రహించానుకదా?" అన్నాట్ట.

జాతి నిర్మాత, పార్లమెంటులో, "గడ్డిపరక కూడా మొలవని ఆక్సాయ్ చిన్ లాంటి ప్రాంతం చీనావాళ్లు ఆక్రమిస్తే, దానిగురించి ఇంత గొడవ చేస్తారేమిటి?" అని విసుక్కొంటే, ప్రతిపక్ష నాయకుడు "మీ బట్టతలమీద గడ్డి పరక మొలవదుకాబట్టి దాన్ని కూడా.....?" అనడిగాడట.

"నేను రక్షణ మంత్రిని అయ్యాను కాబట్టి, ఇంక యుధ్ధాలు వుండవు" అని కొత్తగా శాఖ మారిన మంత్రి ప్రకటిస్తే, "ఆ విషయం నాకు ఖచ్చితంగా తెలుసు" అన్నాడట ప్రతిపక్ష నాయకుడు. "యెలా?" అని అందరూ ఆశ్చర్యపోతుంటే, "ఇంతకు ముందు మీరు ఆహార మంత్రిగా వున్నారు--దేశంలో ఆహారం లేదు కదా?" అన్నాడట.

"యేమిటో! ప్రసంగించినంతసేపూ టోపీని ముందునుంచి వెనక్కీ, వెనకనుంచి ముందుకీ త్రిప్పడం తప్పిస్తే, దానివల్ల ప్రయోజనమేమిటో తెలియడంలేదు!" అని అపహాస్యం చేసిన ప్రతిపక్ష నాయకుడిని, మన ముఖ్యమంత్రి వొకడు "నా టోపీ తిరిగినంతసేపూ, మీ బుర్ర తిరుగుతూ వుండడమే నాకు వచ్చే ప్రయోజనం" అన్నాడట.

రెండో ప్రపంచయుధ్ధం ముందు, అప్పటికి కేవలం పార్లమెంటు సభ్యుడిగానే వున్న "చర్చిల్", ఓ కాలేజీలో బహుమతి ప్రదాతగా వెళ్లి, "సాధారణంగా, నాలాంటివాళ్లు తమ ప్రసంగం--'నేను చదువుకున్నప్పుడు నాకే ప్రైజులూ రాలేదు, నిజంచెప్పాలంటే, మా క్లాసులో అట్టాడుగున వుండేవాణ్ణి' అంటూ ప్రారంభిస్తారు! కానీ, నాకలా ప్రారంభించే అవకాశం లేదు--యెందుకంటే, నాకే ప్రైజులూ రాకపోయినా, నేను మా క్లాసులో 'అట్టడుగున' వుండే వాణ్ని కాదు....దానికి కొంచెం మాత్రమే 'పైన' వుండేవాణ్ని!" అని ప్రారంభించాడట.

ప్రపంచ ప్రఖ్యాతులైన వాళ్లు ఇలా తమమీద తామే జోకులేసుకొని, ఇతరులకి ఆ ఛాన్స్ ఇచ్చేవారుకాదు.

ప్రొద్దునే పేపర్లన్నీ చూసి, వాటిలోని కార్టూనులని చూసి, ఎంజాయ్ చేసి, కార్టూనిస్టులని మెచ్చుకొంటూ, వీలైనంతవరకూ తమ పంధా మార్చుకొంటామంటూ వుత్తరాలు కూడా వ్రాసేవారు!

తరాలు మారాయి.

ఇప్పుడు, ప్రభుత్వోద్యోగులు తమ నిరసనలో భాగంగా దిష్టిబొమ్మని దహనం చేస్తే, తరువాత చర్చలకు వచ్చిన వాళ్లతో, "నా బొమ్మని దహనం చేశారుగా? మళ్లీ యేమొహం పెట్టుకొని నా దగ్గరకి వచ్చారు?" అని రుసరుసలాడినవాడొకడు! (దహనం అవసరం లేకుండానే పోయింది వాడి దేహం!)

రేపు నిరసన తెలియజెయ్యడానికి కలెక్టరు అనుమతి ఇస్తే, ఇవాళ రాత్రే ప్రైవేటు గూండాలనీ, పోలీసులనీ మోహరించేసి, ప్రొద్దున్నే దొరికినవాళ్లని దొరికినట్టు బాదేసి, కాల్పుల్లో కొంతమందిని పొట్టనపెట్టుకొనే అమాత్య వర్యులు కొంతమంది.

ఓ వారం రోజులపాటు వూరుకొని, తరవాత "నిరసనలకి మీకు అనుమతి లేదు" అంటూ, ప్రత్యేక విమానాల్లో ముఖ్యులని తరలించే "ప్రథానీ", ఆయన తైనాతీలూ!

ఇదీ నేటి దృశ్యం!


మహాత్మా గాంధీ మనకిచ్చిన వరం "నిరాహార"/"నిరశన" దీక్ష! "సత్యాగ్రహం" ప్రకటించడానికి ఇదో తిరుగులేని అస్త్రం! (నిరాహారకీ, నిరశన కీ తేడా యేమిటి? అంటే--ఇప్పుడవన్ని యెవరైనా పాటిస్తున్నారో, లేదో గానీ--అశనము అంటే అన్నం. అది తప్ప, ఫలాహారాలూ, పాలూ, పళ్ల రసాలూ తీసుకొంటూ సాగించేది "నిరశన". అసలు యేవిధమైన ఆహారం (తినేవి) తీసుకోకుండా, ద్రవ పదార్థాలతో మాత్రమే కొనసాగించేది "నిరాహారం". నీళ్లలో వుప్పూ, కొద్దిగా నిమ్మరసం మాత్రమే స్వీకరిస్తారు వీరు. అందుకే వాళ్ల దీక్షని విరమింపచెయ్యడానికి, నీళ్లు కలపని నిమ్మరసం వుప్పుతో త్రాగిస్తారు!)

ఇప్పుడది "దుర్వినియోగం" అవుతున్న తీరు చూస్తూంటే, 'వజ్రాయుధం పదును పోయిందా?' అని సందేహం రాకమానదు.

ఈ దీక్షల్లో, 24 గంటల దీక్షలూ, 12 గంటల/6 గంటల/4 గంటల/టిఫినుకీ, భోజనానికీ మధ్య దీక్షలూ ప్రక్కన పెడితే, "ఆమరణ" అనేది ఇప్పటికీ వజ్రాయుధమే! కానీ ఆ వజ్రాయుధ ప్రయోగానికి కూడా కొన్ని పరిస్థితులు కలిసి రావాలి.

అలాంటి ఆయుధం పరువు తీసే, కేసీఆర్, లగడపాటి, జగన్ వగైరాల దీక్షలవల్ల ప్రయోజనం యేమిటి?

ఆ మధ్య "నెట్" లోనే చూశాను--ఒకావిడ, జర్నలిష్టు అనుకుంటా, ఈశాన్య రాష్ట్రాల్లో యెక్కడో కొన్ని నెలలుగానో, సంవత్సరాలుగానో తన "నిరశన దీక్ష" కొనసాగిస్తూందట. చట్టం ప్రకారం మూడు నెలలకు మించి ఆమెని నిర్బంధంలో వుంచడానికి వీల్లేకపోవడంతో, హాస్పటల్లో మూడు నెలలు ఆవిడ బ్రతికేలా చూసి, వదిలేస్తారట. బయటికి వచ్చినరోజే ఆవిడ నిరాహారంగా గడపడంతో, రాత్రి 12 అవగానే మళ్లీ ఆవిడని అరెష్టు చేసి ఆస్పత్రికి తరలించి, మళ్లీ ఓ మూడు నెలలు మరణించకుండా చూస్తారట!!! ఇలాంటి "ఒంటరి" పోరాటాలవల్ల ప్రయోజనం యేమిటి? వ్యక్తిగతంగా ఆవిడకి సానుభూతి తెలపడం తప్ప మనం చెయ్యగలిగింది యేముంది?

"నిరశన" దీక్ష సుదీర్ఘంగా కొనసాగిస్తూ "మరణించి", తన అభీష్టాన్ని నెరవేర్చుకొన్నవాళ్లలో ప్రథముడు మన "పొట్టి శ్రీరాములు" మాత్రమే. (చచ్చి సాధించాడు అంటారు చూడండి--అలాగ!)

అలా సాధించుకోలేకపోయిన వాళ్లలో, 72 రోజులపాటు దీక్షని కొనసాగించి, మరణించినవాడు "దర్శన్ సింగ్ ఫెరుమాన్"! ఆయన చండీగఢ్ ని పంజాబులో విలీనం చెయ్యాలంటూ దీక్ష సాగించాడు. ఇప్పటికీ అదే రికార్డు. ఆయన కోరిక తీరనే లేదు.

అప్పటిలో, ఆసుపత్రికి తరలించడాలూ, జీవన మద్దతు ప్రక్రియలు (లైఫ్ సపోర్ట్ సిస్టంస్) నిర్వహించడాలూ, వగైరాలు లేవు. (వుంటే ఆయన ఇంకెన్నాళ్లు కొనసాగించేవాడో....రికార్డు యెన్నిరోజులకి చేరునో!)

మొన్న, "రాందేవ్" యెనిమిది రోజులు సాగించాడు. (జరిగిన కథ అందరికీ తెలిసినదే!)

అదే రోజుల్లో, ఆయనకన్నా ముందునుంచీ, ఒకాయన తన దీక్షని కొనసాగిస్తున్నాడు--మీడియాగానీ, ప్రభుత్వాలుగానీ, ప్రజలు గానీ పట్టించుకోలేదు! చివరికి ఆయనని బలిపెట్టారు! (అప్పుడు కొంతమంది నిట్టుర్చారు!)

ఆయనే, "స్వామీ నిగమానంద"! హరిద్వార్ 'మాతృ సదనం ' ఆశ్రమానికి చెందిన 35 యేళ్ల ఈ సన్యాసి, మొన్న ఫిబ్రవరి 19 నుంచి, ఉత్తరఖండ్ ప్రభుత్వం హరిద్వార్ సమీపంలో గంగానది ప్రక్కన గనుల త్రవ్వకాలని నిషేధించి, గంగని కాపాడాలి అంటూ తన నిరశన దీక్షని కొనసాగించాడు. మొన్న ఏప్రిల్ 27న ఆయనని హరిద్వార్ జిల్లా ఆసుపత్రికి తరలించారట. అక్కడకూడా తన దీక్షని కొనసాగిస్తూ, మే 2న 'కోమా' లోకి వెళ్లిపోతే, ఇంకో పెద్దాసుపత్రికి తరలించి జీవన మద్దతు ప్రక్రియలని ప్రారంభించినా, 115 రోజుల తరవాత, జూన్ 14న మరణించాడు. ఆయన చుట్టూ మీడియా కెమేరాలు లేవు, పత్రికా ప్రతినిధులు లేరు, ప్రజలు లేరు, బంధు మిత్రులసలే లేరు! పైగా, ఆయన మరణించగానే, కాంగీవాళ్లు, ఆ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రే దానికి బాధ్యుడు అంటూ గోల మొదలెట్టారట--మరి 115 రోజులపాటు యేమి చేశారో? వాళ్లతో గుంటనక్క జైరామ్ రమేష్ కూడా గొంతు కలిపాడట! ఆ స్వామికి సన్నిహితుడైన హరిద్వార్ ప్రజా సంఘం అధ్యక్షుడు "ఆసుపత్రిలో ఆయనకి విషం ఇవ్వడం వల్ల ఆయనకి గుండె పోటు వచ్చి చనిపోయాడు" అన్నాడట. మే 15నే పోలీసులవద్ద, మైనింగ్ మాఫియా ప్రోద్బలంతో ఆ ఆసుపత్రి డాక్టర్ ఆయనకి విషమిచ్చాడు అని ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసినా, సహజంగానే యెవరినీ అరెష్టు చెయ్యలేదని మాతృ సదనం వాళ్లు అన్నారట!



నాయకులకీ, ప్రజలకీ నా విఙ్ఞప్తి--బ్రతికి సాధించండి! పిల్లలకి మనం చెపుతామే--అపజయం విజయానికి తొలిమెట్టు, చచ్చి సాధించేదేమీ లేదు, ఆత్మహత్య మహాపాపం, ఆత్మహత్య అనేది పిరికివాళ్లు చేసే పని, బతికుంటే బలుసాకు తినొచ్చు, వూపిరుంటే వుప్పు అమ్ముకొని బతకొచ్చు--ఇలాంటి పిచ్చి పిచ్చి నీతులు? "ఈజిప్టు" తరహాలూ అవీ అంటూ మొదటికే మోసం తెచ్చుకోవద్దు. మీ వెనకాల కనీసం కొన్ని లక్షలమంది వుంటేనే, అదీ ఆఖరి అస్త్రంగానే ఇలాంటి దీక్షలు చేపట్టండి--అదీ డ్రామాలకో, ప్రభుత్వం వారు విరమింపచెయ్యకపోతారా అనే ధీమాతోనో వద్దు--అదీ, నిజంగా ఆత్మార్పణ ద్వారానైనా "లక్ష్యం" సిధ్ధిస్తుంది....తరువాతివాళ్లైనా దాన్ని సాధిస్తారు అని నమ్మకం వుంటేనే!

రాజకీయులూ! నిరసన కార్యక్రమాల్లో, ఘెరావోలూ, బందులూ, హర్తాళ్లూ మొదలైనవి సహజమరణం చెందినట్టే. ఇక రాస్తా/రైలు రోకోలు మానండి. ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు--మిమ్మల్ని సమర్ధించే ప్రజలకి ఇబ్బంది కలగజెయ్యనివి--కనిపెట్టండి. లేదా, ప్రతీ శాసన సంస్థా, ప్రభుత్వ కార్యాలయం వగైరాల ముందు "నిరసన" కేంద్రాలు యేర్పాటు చేసేలా చట్టాలు చేసి, అక్కడకి వెళ్లి తన్నులు తినే కార్యక్రమాలకి శ్రీకారాలు చుట్టుకోండి!

మీకు అప్పుడే మా మద్దతు సంపూర్ణంగా వుంటుంది!

జై భారత్!

7 comments:

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
A K Sastry said...

టపాకి సంబంధంలేని పై రెండు వ్యాఖ్యలని తొలగించాను. ఆ విషయాలపై, ("కుల...." వగైరాలు) వేరే చోట వ్రాయడానికి ప్రయత్నిస్తాను.

Anonymous said...

This post is really excellent and one of your BEST post in this blog.

Praveen Mandangi said...

http://hittingontheface.blogspot.com/2011/06/blog-post_8430.html

A K Sastry said...

పై మూడో అన్నోన్!

విషయం నచ్చినందుకు చాలా సంతోషం! దయచేసి, వీలైనంత ప్రాచుర్యం కల్పించండి.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ ప్రవీణ్!

ధన్యవాదాలు.