Tuesday, June 28, 2011

తెలంగాణ భాషా........


......."తెలుగు భాష" వేరా?

"తెలుగు భాష" కు అక్షరములెన్నీ? అవి యేవి? (యే ఆరో క్లాసు తెలుగు పరీక్షాపత్రంలోనో ఆ ప్రశ్న వచ్చిందనుకోండి--ఇప్పటి తెలివైన విద్యార్థులు "తెలుగు భాషకు అక్షరములు యేబదియారు (56). అవి 'అ మొదలు ఱ ' వరకూ--అని ఠక్కున చెప్పేస్తారు). 
 
ఓ వెయ్యి సంవత్సరాల క్రితం (అప్పటికి ఆరో క్లాసు లేదనుకోండి), సమాధానం వేరేగా వుండేది. ఓ ఐదువందలేళ్ల క్రితమైతే వేరే సమాధానం వచ్చేది. ఇంక, మూడు వందలా, రెండువందలా, వంద సంవత్సరాల క్రితం కూడా వచ్చిన సమాధానం, ఇప్పటి తెలివైన తెలుగు విద్యార్థులు చెప్పేదేననుకుంటా. యెందుకంటే, మొదట్లో తెలుగు భాషకి "అచ్చులూ, హల్లులూ" అనే విభజన లేదు. భాష అవసరం ఓ వ్యక్తి భావాలని యెదటివాడికి తెలియజెయ్యడానికే కదా? అలా తెలియజెయ్యడం ప్రక్రియలో భాగం, "వ్రాయడం" కదా? అప్పట్లో అంత "స్పష్టత" అవసరం లేకపోవడంతో, అచ్చులే లేవు. 
 
వుదాహరణకి, "బాటసారియొకడు దన యూరినుండి బయలుదేరి, వేరొక జోటికి బయనమైనాడు. దారిలోనొక భయంకరమైనయడవియున్నది. కష్టములకోర్చి యాతడు దానినధిగమింపదలచినాడు....." ఈ కథలో అచ్చుల అవసరం యేమి వుంది? 
 
11వ శతాబ్దం వాడైన నన్నయ, 13వ శతాబ్దం వాడైన తిక్కన, 14వ శతాబ్దం వాడైన యెర్రన, నన్నయ "వాగనుశాసనుడు"గా ప్రవేశపెట్టిన వ్యాకరణాన్నే అనుసరించారు. తరువాతెప్పుడో, "ఇతరుల వస్తువులని దొంగిలించడంలో నిపుణుడు (శ్రేష్టుడు)--అంటే, "పరవస్తు చిన్నయ సూరి" బాల వ్యాకరణం వ్రాసాక, తన పంచతంత్రం వ్రాశాక, తెలుగు భాషకు అక్షరములు యేబదియారు......అని పుట్టింది. ఆయనే అచ్చులూ, హల్లులూ, వుభయాక్షరములూ--అని ప్రవేశపెట్టాడు(ట). అంతక్రితం మన భాష "ఆన్‌ధ్రము". (వుభయాక్షరాలు లేవు.) ఇంకా, "తలకట్టు" స్థానంలో వచ్చే "అకార, ఇకార, ఉకార....." వగైరాలు లిపిలో నిర్దేశించబడ్డాయి. వుదాహరణకి, "క; కి; కు; కృ; కే; కై" ల దాకా. కొ వ్రాయాలంటే, క కి ఎ కారం ఇచ్చి, ప్రక్కన ఉ కారం ఇచ్చేవారు! "కౌ" వ్రాయాలంటే, "కవు" అని వ్రాసేవారు. (ఇప్పటికీ, "మొహం" అంటే, మ కి ఎ కారం ఇచ్చి, ప్రక్కన ఉ కారం ఇస్తాం. "మోసము" అని వ్రాయాలంటే, మ కి ఎ కారం ఇచ్చి, ప్రక్కన ఊ కారం ఇస్తాము. అలాగే, ఇదివరకు "నోటిసు" అని వ్రాయాలంటే, న కి ఎ కారం ఇచ్చి, ప్రక్కన ఊ కారం ఇచ్చేవాళ్లు! కానీ ఇప్పుడు న కి ఓ కారం డైరెక్టుగా ఇచ్చేస్తున్నాము! "కౌలు" అని వ్రాయాలంటే, క కి ఎ కారం ఇచ్చి, ప్రక్కన ఊ కారం ఇచ్చేవారు. ఇప్పుడు క పైన డైరెక్టుగా ఔ కారం ఇచ్చేస్తున్నాము. అవీ భాషా, లిపి పరిణామాలంటే.

దేవులపల్లివారికి ఓ సందేహం వచ్చిందట--"మావి చిగురు తినగానే 'కోవిల ' పలికేనా? కోవిల గొంతు వినగానే, మావి 'చివురు ' తొడిగేనా? యేమో! యేమౌనోగానీ, ఆమని....ఈవని!" అని. బాగానే వుంది.....చెట్టు ముందా? విత్తు ముందా? అనడంలో ఓ వెరయిటీ. ఓ రోజు, కాకినాడ సూర్యకళా మందిరం లో ఆయనకి సన్మానం జరుగుతూంటే, ఓ 'పినాకొ ' ఆయన్ని "కోయిల; కోయెల; కోకిల--ఇలా అన్ని మాటలుండగా, "కోవిల" అని యెందుకు వ్రాశారు? అని ప్రశ్నించాడు, వ్రాతపూర్వకంగా. ఆయన కూడా వ్రాతపూర్వకంగానే జవాబిచ్చారుట--"మీరు మాట్లాడేది తెలుగు, నేను వ్రాసినది 'తెనుగు '!" అని. అదీ తేడా. 
 
అసలు "తెలుగు" యెలా వచ్చింది? "తెనుగు" యెలా వచ్చింది? "మా ఆరువేళ్ల" మేష్టారు శేషాచార్యులుగారు చెప్పినట్టు, "త్రిలింగ--అంటే మూడు లింగాల మధ్య వున్న దేశం, తెలుగు దేశం! వాళ్లది తెలుగు భాష!" "త్రి నగ దేశం--అంటే మూడు కొండల మధ్య వున్న దేశం--అదే "తెనుగు" దేశం!" (ఆ మూడు లింగాలూ, ఆ మూడు నగాలూ మీరే తెలుసుకోండి!)

మరి మధ్యలో, ఈ "తెలంగాణా భాష" యెక్కడనుంచి వచ్చిందీ?

........తరువాయి మరోసారి.       

4 comments:

గిరీష్ said...

:)

A K Sastry said...

డియర్ గిరీష్!
సంతోషం.
మీ బ్లాగ్ చూశా. బాగుంది. కీపిటప్.
ధన్యవాదాలు.

kiran said...

మరి మధ్యలో, ఈ "తెలంగాణా భాష" యెక్కడనుంచి వచ్చిందీ?

ఈ కొస మెరుపు బావుంది. ఇదే మాట అంటే ఉలుక్కున్నే తే వాదులు అభిజాత్యం ఎక్కువ అంటారు. అంతెందుకు గూగుల్ transliterator లో కూడా తెలుగు అని ఉంటుంది కాని తెలంగాణా అని ఉండదు. :)

A K Sastry said...

డియర్ kiran!

ప్రతీవాడూ తాను మాట్లాడేదే, తాను వ్రాసేదే సరియైన తెలుగు భాష అనుకోవడంలో తప్పులేదు. ప్రపంచం తెలుగు భాషగా అంగీకరించిన వ్యావహారిక భాషా, 11వ శతాబ్దం నుంచీ వ్రాయబడుతున్న తెలుగు సాహిత్యం (నన్నయ్యా, తిక్కనా, యెర్రాప్రగ్గడా వేరు వేరు ప్రాంతాలవాళ్లు!), నేటి పత్రికల, సినిమాల భాషా--ఇవన్నీ కూడా గోదావరి, కృష్ణా జిల్లాలవాళ్ల డామినేషన్ వల్లే వచ్చాయి అని వాదించే వక్ర దృష్టులకీ, తాను చదివిందీ, నేర్చుకున్నదీ తెలుగులోనే నేర్చుకొని, తల్లి పాలు త్రాగి, రొమ్ముని గుద్దినట్టు--"యెక్కడి తెలుగు తల్లి? యెవరికి తల్లి?" అని ప్రశ్నించినవాణ్ని ఓ పెద్ద నాయకుడిగా అంగీకరించినవాళ్ల 'కామన్ సెన్స్' ని మనం యేమీ అనకూడదు.

ధన్యవాదాలు.