Friday, July 8, 2011

యూపీయే ప్రభుత్వమూ

కాంగీల వ్యవహారం

రోకలి నానేసి, అది పూర్తిగా కరిగినప్పుడే "సరైన సమయం" అనీ, అప్పుడే "సరైన నిర్ణయం" అనీ జనాలని నమ్మిచడంలో వుద్దండులు కాంగీలు. లేకపోతే, 13 మంది ఎంపీల రాజీనామాలని పరిశీలించడానికి స్పీకరమ్మకి ఆగస్ట్ 1 వరకూ పడుతుందట. అప్పుడు తీరిగ్గా వాటిగురించి "మాట్లాడుతుందట"! గులాం నబీ అంటాడూ, "విస్తృత ప్రజాభిప్రాయం" సేకరించాలట. అన్ని కోట్లూ, అంత సమయం తగలెట్టి, శ్రీకృష్ణ కమిటీ చేసిందేమిటో? పిచ్చి 'దంబరం '--ఆ రెండు పార్టీలూ తమ అభిప్రాయం చెప్పాలి, అప్పటి వరకూ యేమీ చెయ్యలేము ' అంటాడు. ఆ రెండిట్లో ఒకటి తమ పార్టీయేనట! రెండోది తెలుదేశం. వాళ్లు ప్రణబ్ ముఖర్జీకి చెప్పినా, శ్రీ కృష్ణ కమిటీకి చెప్పినా, వాళ్ల ఎంపీలు కూడా రాజీనామా చేసినా, అది స్పష్టమైన అభిప్రాయం కాదట!

ఇంక పెట్టుబడిదారీ పత్రికల్లో, అనేక పరిష్కారాలు సూచించబడుతున్నాయి. అందులో ఒకటి, తెలంగాణా ఇచ్చేసి, హైదరాబాదుని మాత్రం "హాంకాంగ్" తరహాలో స్థానిక ప్రభుత్వం చేతిలోనే వుంచాలట. అప్పుడే సీమాంధ్ర వాళ్లకి నమ్మకం వుంటుందట! హాంకాంగ్ పరిస్థితి వేరు అనీ, అది రెండు దేశాల మధ్య తగాదాకి పరిష్కారం అనీ మరిచిపోతున్నారు! మరి అలా అయితే, మన దేశం లోనే 'చండీగఢ్' వుందికదా? దాన్ని పంజాబ్, హర్యాణా రెండు రాష్ట్రాలకి రాజధానిగా వుంచారు కదా? అదీ ఓ పరిష్కారమే కదా? అసలు సమస్య సృష్టించబడడానికి మూలం యేమిటీ, దాని పరిష్కారం అవసరమా, అయితే అదెలాగ అనేవి వొదిలేసి, యెందుకు విషయాన్ని జటిలం చెయ్యడం?

ఇదివరకు రెండుసార్లు ఇందిరాగాంధీ పరిష్కరించిన విధానం యెలాగూ అందుబాటులోనే వుంది. ఎస్ ఎల్ నరసిమ్హం గారు తమ అస్త్రాన్ని యెప్పుడో పదునుపెట్టి వుంచారు. అందుకనే, కాంగీ ఎంపీలు ముఖాలు వ్రేళ్లాడేసుకొని వెనక్కి వచ్చేశారు. కోదండరాం, కేసీఆర్ ప్రకటించిన వుద్యమ కార్యక్రమమే ఐకాస కార్యక్రమమని ప్రకటించినవాడు, మళ్లీ అన్నిపార్టీల అభిప్రాయం అంటూ కార్యక్రమాన్ని వాయిదా వేశాడు. (కేసీఆర్ యేమీ మాట్లాడడం లేదు--ఇప్పుడు అందరు నేతలూ "ఒకే తాటి" పైకి వచ్చారని ప్రకటించారు కాబట్టి, రేపటి నుంచి ఆ తాటిని ముక్కలు చెయ్యడం మొదలెడతాడు చూడండి!).

అసలు గొడవంతా, నేనే అధిష్టానం అని విర్రవీగిన కేకే, ఇతర సీనియర్లు అధిష్టానం దగ్గర వొకరిమీద వొకరు చెప్పుడుమాటలు చెప్పుకొన్న ఫలితంగా, సీ డబ్ల్యు సీ పదవి వూడగొట్టడంతో వచ్చింది--ఆవేశం కట్టలు తెంచుకోడం!

అయినా, అధిష్టానం లెఖ్ఖలు వాళ్లకున్నాయి మరి!

మరి పరిష్కారం అంటారా? రోకలి నానాలికదా?!

2 comments:

Anonymous said...

బాగా చెప్పారు.

తెలుగుదేశాన్ని ఫినిష్ చేద్దామని కాంగ్రెస్సూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ ఈ ఉద్యమాన్ని రహస్యంగా ప్రోత్సహిస్తూ వచ్చారు. అందుకనే వేర్పాటువాదులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఎన్నో అభాండాలు మోపుతున్నా వాస్తవాల్ని తెలంగాణ ప్రజలకు తెలియజెప్పడానికి గత పదేళ్ళలో ఆం.ప్ర, ఎప్పుడూ పూనుకోలేదు. తెలుగుదేశం ఐడియాలజీ అయిన తెలుగుజాతీయవాదం ఫినిష్ అయిపోతే ఇహ రాష్ట్రంలో తమదే రాజ్యం అనీ, 1970 ల నాటి ఏకచ్ఛత్రాధిపత్య ఏకపార్టీ పాలనని పునరుద్ధరించవచ్చుననీ, అప్పటిలాగానే మిగతా పార్టీలన్నిటినీ ఉపగ్రహాలుగా మార్చుకోవచ్చుననీ కలలు గన్నారు. ఇప్పుడు సమైక్యవాదుల అవతారమెత్తిన లగడపాటి, దగ్గుబాటి, రాయపాటి, జేసీ దివాకర్ రెడ్డీ అందఱూ మొదట్లో - అంటే పదేళ్ళకు ముందు ఈ తెలంగాణ ఉద్యమ కుట్రలో భాగస్వాములే.

అయితే ఎక్కడ తేడా వచ్చిందంటే - "ఈ ఉద్యమం తెలుగుదేశాన్ని నాశనం చేయడానికి" అని కాంగ్రెస్‌వాళ్ళంతా రహస్యంగా అనుకున్నారు గానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు దాన్ని ఒక నిజమైన ఉద్యమంగా మార్చేస్తారని, నిజంగానే రాష్ట్రవిభజన దాకా తీసుకెళతారనీ కలగనలేదు. విషయాలు అక్కడిదాకా ముదిరిపోయాయని, తెలంగాణ కాంగ్రెస్‌‍వాళ్ళు తమని నమ్మించి మోసం చేశారనీ మొట్టమొదటిసారిగా 2009 డిసెంబరులో బయటపడ్డాక ఆంధ్రా కాంగ్రెస్‌వాళ్లకీ, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకీ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనడం మొదలుపెట్టింది.

నాయుడు ఇదంతా ఎప్పుడో గ్రహించి అడ్డం తిరిగాడు. " ఏ ప్రాంతంవారు ఆ ప్రాంతపు ఐడియాలజీతో పోరాడొచ్చుననీ, రాష్టం విడిపోతే తాము రెండుచోట్లా ఉంటా"మనీ ప్రకటించేసరికి కాంగ్రెస్ అధిష్ఠానానికి దిమ్మదిరిగి బొమ్మ కనపడింది. దీనికి తోడు జగన్ రూపంలో ఇంకో ప్రతిపక్షం బయలుదేరేసరికి "ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం లేకుండా ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించడం కుదరదు" అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు.

A K Sastry said...

పై అన్నోన్!

సంతోషం.

చక్కగా వ్రాయగల్గిన మీరు, ఓ బ్లాగ్ నిర్వహించి, ఇప్పటికే నిర్వహిస్తూంటే ఆ ప్రొఫైల్ తో వ్యాఖ్యానించొచ్చు కదా?

ధన్యవాదాలు.