......ఆలయాలూ, ఆచారాలూ
"గురువాయూరప్పా! అనువగు తెరువే ఇదియప్పా! దినము దినమునా ఈ యుగమందున తిరునాళ్లేనప్పా! గురువాయూరప్పా....." ఇది ఓ నలభై యేళ్లక్రితం భక్తిరంజనిలోననుకుంటా మన ఆకాశవాణిలో నాకు వినిపించిన పాట. స్వామి అయ్యప్ప కన్నా ముందు, పళని స్వామి కన్నా ముందు, ఈ యాత్ర వుండేదిట.
అలాంటి గురువాయూరు దర్శించడం ఓ మంచి అనుభూతి!
ద్వాపర యుగాంతంలో ద్వారక సముద్రంలో మునిగిపోయినప్పుడు, శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని యెలా కాపాడాలా అని అలోచించిన "గురువు" అంటే బృహస్పతి, వాయువుని వేడుకొన్నాడట. వాయువు వొప్పుకొని, శ్రీకృష్ణుడి విగ్రహాన్ని మోసుకొంటూ వచ్చాడట. ఆ విగ్రహాన్ని యెక్కడ పెట్టాలి అనే మీమాంసలో, గురువు వెతుక్కుంటూ దక్షిణాదికి వచ్చి, ఓ కొండమీదున్న శంకరుణ్ణి వేడుకొన్నాడట--నువ్వు కొండ దిగితే, ఇక్కడ కృష్ణుణ్ని పెట్టుకొంటాం--అని. శంకరుడు వొప్పుకోగానే, అక్కడ శ్రీకృష్ణుణ్ని వెలిపించారట! అందుకనే ఆ గుడికి "గురు-వాయు" ఊరప్ప అని పేరు వచ్చిందట. ఆ గుడిని ఖాళీ చేసిన శంకరుడు, కొండ క్రింద "మైమ్మాయూర్" (మహిమ వల్ల యేర్పడ్డ వూరు) కి చేరాడట. గురువాయూరు దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో ఈ శంకరుణ్ని దర్శించుకుంటారు.
గురువాయూరు పెద్ద దేవస్థానం. కాంప్లెక్స్ చాలా విశాలంగా వుంటుంది. సీజన్లో (దేవుళ్లకి కూడా సీజన్లు వుంటాయి!) ఆవరణ అంతా ఇసకేస్తే రాలనంత మంది భక్తులు వుంటారట. కారు పార్కింగ్ కి వెతుక్కుని, అక్కడ ధోతీ, కండువా లోకి మారి, (పేంట్లూ చొక్కాలూ బనీన్లూ విప్పేసి) గుడి ఆవరణలోకి, అనేక షాపులూ, హోటెళ్లూ వగైరాలు దాటుకుంటూ, వెళ్లి క్యూలో నిలబడాలి.
అదృష్టమేమిటంటే, ప్రతీరోజూ సాయంత్రం 6 గంటలకి, సీనియర్ సిటిజెన్లకి ఓ ప్రత్యేక క్యూ వుంటుంది.
మా డ్రైవెర్ కం గైడ్ "సంతోష్" పుణ్యమా అని, మాకు ఈ సంగతి తెలిసింది. తనుకూడా, అధికారులదగ్గర ప్రత్యేక అనుమతి తీసుకొని మరీ మమ్మల్ని ఆలయ ప్రవేశం చేయించాడు ఆ క్యూలో!
....మరోసారి.