Tuesday, August 16, 2011

కేరళలోని......2




......ఆలయాలూ, ఆచారాలూ

(ఇంతకు ముందటి నా టపాలో ఓ చిన్న పొరపాటు దొర్లింది. అప్పటికి మైనరుగా వున్న మహారాజు మహారాణిగారి మేనల్లుడు కాదు. అంతకు ముందటి మహారాజు మేనల్లుడు. యెందుకంటే అప్పట్లో "మాతృస్వామ్యం" అమలులో వుండేది.)

కాలడి--జగద్గురు శంకరాచార్యులు పుట్టిన వూరు. పెరియార్ నది శాఖ ప్రక్కనే వుంది. ఆయన తరువాతివాళ్లలో ఒకరైన ఓ శృంగేరీ పీఠాధిపతి పరిశోధన చేసి, కాలడి లోని శంకరుల తల్లి సమాధిని కనుగొన్నారట. ఆ ప్రక్కనే వున్న ఇంట్లోనే శంకరుని జననం జరిగిందని నిర్థారించి, శంకరుడికి కూడా ఓ గుడి నిర్మాణం జరిగింది. ముందు శారదాంబ గుడి, తరువాత శంకరుని తల్లి సమాధి (అప్పటిలో పాతిన ఓ శిలా దీప స్థంభం ఇప్పటికీ వుంది), గణపతి ఆలయం, శంకరుని ఆలయం వున్నాయి ఆ ఆవరణ లో. దర్శనానికి టిక్కెట్టులేదు. కారు పార్కింగుకి, చెప్పులకి టిక్కెట్లు లేవు. అర్చనకి మాత్రం 10 రూపాయలనుకుంటా టిక్కెట్టు. పంచె, చొక్కా నిబంధన లేదు. ఫోటోలూ వీడియోలూ నిషిధ్ధం. అలా అని అవన్నీ డిపాజిట్ చేసెయ్యమనలేదు. శంకరుని గుడి ముందు మంటపం లోపల చుట్టూ శంకరుని జీవిత ఘట్టాల వర్ణ చిత్రాలు ప్రదర్శించారు. అక్కడ ఓ వీడియో కెమేరా, ఫ్లాష్ లైట్లూ తో హడావిడి కనిపిస్తే, యేదైనా సినిమా షూటింగా అని అడిగాను. కాదు--మఠం వాళ్లు తీయిస్తున్నారు అని చెప్పారు. అదన్నమాట సంగతి.

అలువ (అల్వేయి) లో, పెరియార్ నది ప్రక్కనే ఓ ప్రసిధ్ధ శివాలయం వుంది. మేము వెళ్లేసరికి సమయం మించిపోయింది. బయటనుంచే ఫోటో తీసుకొని వచ్చేశాము.

ప్రత్యేకత యేమిటంటే, ఆలయాలూ, రాజ ప్రాసాదాలూ వగైరాలు చాలా మటుకు నాలుగు వైపులా షెడ్డుల్లా నిర్మించి, పై కప్పుని కలపతోనూ, బంగాళా పెంకుతోనూ నిర్మించారు. కేరళలో వర్షపాతం యెక్కువ, కలప విరివిగా దొరుకుతుంది అనే కారణాలతో అయి వుండొచ్చు. గాలి గోపురాలూ, గర్భ గుడిపైన విమానాలూ వుండవు. మనవాళ్లకి కొంచెం ఆశ్చర్యంగా వుంటుంది.


No comments: