......విపరీత పోకడలు
రాజుని చూసిన కళ్లతో మొగుణ్ని చూస్తే మొత్తబుధ్ధేసిందట ఒకావిడకి.
ఆ సామెత ఈ సందర్భంలో సరిపోదుగానీ, ఇంకేమీ తోచలేదు నాకు.
రిపబ్లిక్ డే పెరేడ్ లో మన సైన్యాలూ, విద్యార్థులూ చేసే కవాతు చూస్తాము. యెంత చక్కగా వుంటుంది!
మరి మన "పోలీసులు" జిల్లా కేంద్రాల్లోనూ అక్కడా చేసే పెరేడ్, గౌరవ వందనాలూ చూస్తే......యే ఒక్కడి కాలూ ఇంకొకడి కాలితో; యే వొక్కడి చెయ్యీ ఇంకొకడి చేతితో; యే ఒక్కడి టోపీ ఇంకొకడి టోపీతో; యే వొక్కడి ఆయుధమూ ఇంకొకడి ఆయుధంతో; యే వొక్కడి చూపూ ఇంకొకడి చూపుతో.......యేమాత్రం యేకీభవించవు!
సాధారణంగా ఇలాంటివాటికి, వున్న సిబ్బందిలో మెరికల్లాంటివాళ్లనే యెంచుకుంటారు. మరి "మెరిక"లే ఇలా వుంటే, మిగిలినవాళ్లెలా వుంటారో వూహించుకోండి!
నేనైతే, ఇలాంటి వందనాలు స్వీకరించడానికి సిగ్గుపడతాను. పొరపాటున జరిగిపోయినా, మీడియావాళ్ల కాళ్లా వేళ్లా పడైనా, ఆ ఫోటోలు పేపర్లో రాకుండా చూసుకుంటాను, అవసరమైతే వాళ్లకేదైనా ముట్టచెప్పయినా సరే. అన్నట్టు మనకి కావలసిన పని చేయించుకోడానికి యేదైనా ఇస్తే అది లంచం అట. కానీ, యే పనైనా చెయ్యొద్దు అని ముట్టచెప్పేది లంచం కానే కాదుట. ఇదో కొత్త కోణం!
ఈ మాత్రానికి, పోలీసు రిక్రూట్ మెంట్ కి జరిగే తతంగాలు చూశారా?
యే సంస్థ అయినా, తమకి ఫలానా పోస్టులో ఇన్ని ఖాళీలు వున్నాయి, అర్హతలు ఇవీ అంటూ ప్రకటన జారీచేసి, వాటికి దరఖాస్తు చేసుకొనే విధి విధానాలన్నీ, యేమాత్రం అసందిగ్ధతకి తావులేకుండా వ్యవహరిస్తాయి.
మనపోలీసు మాత్రం తన సొంత పంథా అనుసరిస్తుంది!
రాష్ట్రవ్యాప్తంగా, మహా వుంటే ఓ 100 సబిన్స్పెక్టర్ పోస్టులు ఖాళీగా వుంటాయి. లేదూ, ఓ వెయ్యి వున్నాయనుకుందాం. వాటికోసం "స్వయంగా" దరఖాస్తులందించాలని ప్రకటన యేమిటి?
పాపం నిరుద్యోగులు, అంతకు ముందు రోజే బయలుదేరి, యే అర్థరాత్రో, తెల్లవారుజామునో ఫలానా చోట క్యూలు కట్టడం మొదలెడతారు. తినీ, తినకా (చాలామంది తినడానికి డబ్బులు లేకా--తిరుగు ప్రయాణానికి మాత్రమే డబ్బులు దాచుకొని) రాత్రి వరకూ పడిగాపులు పడతారు రోజులతరబడీ!
మొన్నీమధ్య, జనవరిలో, మా ఏలూరు రేంజి పరిథిలో, ఓ నాలుగైదురోజులపాటు ఈ ప్రహసనం సా.....గి, ఓ 22,000 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారట. రోజుకి మూడు వేలో, నాలుగు వేలో.....ఒక్కోరోజు యే వెయ్యో.....ఇలాగ!
ఓరోజు పత్రికలవాళ్లు గొడవచేసి, అభ్యర్థులకి కనీస సౌకర్యాలు లేవు, చాలా తక్కువ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు, ఈ సర్టిఫికెట్ లేదు, ఆ జెరాక్స్ లేదు అంటూ అభ్యర్థులని వేధిస్తున్నారు...అంటూ వార్తలు వ్రాస్తే, ఆ మర్నాడు ఇంకో కవుంటరు అదనంగా తెరిచి, అందరికీ కాస్త తాగునీరూ, నీడకోసం టెంట్లూ వగైరా కల్పించారట!
చివరాఖరికి, అభ్యర్థులందిరికీ మార్చి నెలలో, దేహధారుఢ్య పరీక్షలూ, 5 కి మీ పరుగూ, ఇతర (వ్రాత వగైరా) అర్హత పరీక్షలూ నిర్వహిస్తాము అని ప్రకటించారు!
అంతకి ఓ పదిరోజుల ముందే, ఏ పీ పోలీసు కోడ్ ప్రకారం, "కానిస్టేబుళ్ల, ఎస్ ఐ ల" పరీక్షల్లో, శారీరక ధారుఢ్యం అర్హతకు 800 మీటర్లు దూరాన్ని 2 నిమిషాల 25 సెకన్ల నుంచి, 3 నిమిషాల 35 సెకండ్ల మధ్య లంఘిస్తే సరిపోతుందని వుందనీ, దాన్ని ఆ శాఖ 5 కీ మీ లకి పెంచడం దారుణమనీ హై కోర్టులో ఒకాయన రిట్ వేశాడట.
ఇంకా, ఈ 5 కి మీ పరుగుల్లో, కనీసం ఒకళ్లయినా ప్రాణాలు కోల్పోవడం, ఇంకో ఇద్దరు ముగ్గురు చావు తప్పి కన్ను లొట్టపోయిన వార్తలు తరచూ మనం చూస్తూనే వున్నాము.
అది అంత అవసరమా అని ప్రశ్నించుకొన్న బాసెవడూ లేడుట.
ఇంక మళ్లీ ఆ 22 వేల మందినీ, ఫలానారోజు పరీక్షలకి రమ్మని, ఆ యెండలో పొద్దుణ్నించీ చొక్కాలు విప్పేసి క్యూల్లో నిలబడమంటారు.....తరవాతెప్పుడో యెత్తూ, బరువూ, చాతీ కొలతలు తీసుకోడానికి! మళ్లీ ఆ మర్నాడో యెప్పుడో, పరుగులు.....! ఆ తరవాతెప్పుడో రాత పరీక్ష.
ఇంకా తరవాత, మౌఖిక పరీక్ష. ఇలా సా.....గుతూ వుంటుంది.
ఆఖరికి యెప్పుడో ఓ వందమందిని యెన్నుకుంటే, అదీ ఓ రికార్డే!
ఇలాంటివాటినికూడా మానవహక్కుల కమీషన్ సువో మోటోగా విచారిస్తే బాగుండును!