Sunday, April 29, 2012

మంత్రాలూ...............చింతకాయలూ

మహానుభావుడు మా పేరి మేష్టారు యెద్దేవా చేసేవాళ్లని అనుకరిస్తూ, "మంతరాలకి సింతకాయలు రాల్తాయేటి?" అని ప్రశ్నించి, "మర్రాలవేటి? ఇంకామాట్టాడితే పళ్లు కూడా రాలతాయి!" అని జవాబిచ్చేవారు.

మరి ఇప్పటి కొత్త కొత్త మంత్రాలకీ, పూజా యజ్ఞ యాగాదులకీ యేమి రాలతాయో.

ఓ పెద్దాయన కాలేజీలో పాఠం చెపుతూండగా, ప్రక్కవూరినుంచి తెలిసున్నాయన ఆయనతో పనివుండి వచ్చాడట. మేష్టారు క్లాసు అయిపోతోంది, ఇప్పుడే వస్తాను అంటే అక్కడే ఓ చెట్టుక్రింద నిలుచున్నాడట. ఆ ప్రక్కనే రెండు గాడిదలు కూడా వున్నాయట. మేష్టారు బయటికి రాగానే, "మీ వూళ్లో గాడిదలు యెక్కువండీ" అన్నాట్ట ఆయన. దానికి మేష్టారు "మరేనండీ! వున్నవి చాలనట్టు ప్రక్క వూళ్లనుంచి కూడా వచ్చేస్తున్నాయి!" అని చురకేశాడట.

మొన్నటిదాకా శ్రీశైలం లో కన్నడ భక్తులూ, పూజారులూ సందడి చేశారు. అంతకు ముందు తిరుమలలోననుకుంటా, మరాఠా భక్తులూ, పూజారులూ. అరవ్వాళ్లు మన రాష్ట్రంలో తిరుప్పావై వగైరాలతో చేస్తున్న సందడి చూస్తూనే వున్నాము. ఇప్పుడు కేరళ నంబూద్రీల వంతు అనుకుంటా.

భద్రాచలం దగ్గర "అతి రాత్రం" నిర్వహిస్తున్నారు. ప్రవర్గ్యం; పిన్వనం; గరుడాకృతి చితికరణం; మండూక మార్జనం; సామోపస్థానం వగైరాలతో యాగం చేస్తూంటే, శనివారం రాత్రి కుంభవృష్టి కురిసిందని పేపర్లు వ్రాశాయి.

బాగుంది.

గత వారం రోజులుగా, అనంతపురం జిల్లా రాయదుర్గంలో మొత్తం 253 మిల్లీ లీటర్ల వర్షం కురిసిందట! (అంటే చదరపు అడుగుకి పావు లీటరు పైగా!). అక్కడ యే మహారాత్రాలూ యెవరూ నిర్వహించిన దాఖలు లేవు మరి.

గీతలో "యజ్ఞము వలన మేఘమూ, మేఘం వలన వర్షమూ, వర్షం వల్ల అన్నమూ పుడతాయి" అని చెప్పాడు. 

అసలు భారతంలో భగవద్ గీతే లేదు, తరవాత ప్రవేశపెట్టారు అనేవాళ్లూ వున్నారు.

యెవరి ఇష్టం వారిది! కదా......!

6 comments:

చిలమకూరు విజయమోహన్ said...

భద్రాచలంలో జరుగుతున్న అతిరాత్ర యాగ ముఖ్య ఉద్దేశ్యం మంచి వర్షాలు పడి దేశమంతా సుభిక్షంగా ఉండాలని,ఒక్క భద్రాచలం ప్రాంతానికే పరిమితం కాదని పెద్దలు గ్రహించాలి.

Hari Podili said...

21 శతాబ్దంలో కూడా ఇలాంటి యజ్ఞాలు, యాగాలు చేసి ,మూఢ నమ్మకాలను ఇంకా డెవలప్ చేయడం తప్పితే,దేశానికీ ఒరిగిందేమీ లేదు.ఈ డబ్బే వో village
development కు ఉపయోగించిఉంటే,కొద్దో గొప్పో ఆ village develop ayiundedi

♛ ప్రిన్స్ ♛ said...

ఏది ఏమైనా... ప్రతి ఒక్కటి మానవుడు తన తెలివితో వ్రాసినవే... ఈ ఒక్క విషయము గాని ఆకాశం నుంచో మరో చోటునుంచో రాలేదు...కాని నమ్మకాలూ మానవుడిని ప్రశాముగా ఉంచినప్పుడు... అది చాలు కదా! ఎవరి నమ్మకాలూ వారివి...

Ammanamanchi Krishna Sastry said...

డియర్ చిలమకూరువారూ!

వుద్దేశ్యం మంచిదేనండి. కానీ, అంతమంది, అన్నిగంటలపాటు పెద్ద పెద్ద స్పీకర్లలో 'వేదం' చదువుతూంటే--దేవతలెవరూ ఆ చుట్టుప్రక్కలకి రాకుండా పారిపోతారేమో అనీ, అపభ్రంశాలు దొర్లి ఇంకేమైనా జరుగుతుందేమోననీ నా భయం! (సరదాగా అంటున్నాను యేమీ అనుకోకండి!)

చాలా సంతోషం.

ధన్యవాదాలు.

Ammanamanchi Krishna Sastry said...

డియర్ Hari Podili!

మీరన్నది కూడా బాగుంది.

సంతోషం.

ధన్యవాదాలు.

Ammanamanchi Krishna Sastry said...

డియర్ ప్రిన్స్!

నేనన్నదీ అదే కదా....యెవరి ఇష్టం వారిది అని!

సంతోషం.

ధన్యవాదాలు.