.....పుక్కిటి పురాణాలూ
ఇంకా ఆయన, "భగవద్గీతలో మొదటి అధ్యాయంలోనే కృష్ణుని మాటలు చదివితే, ఓ సినిమాలో విలన్ 'వాళ్ల బ్రతుకుల మీద నాకు విరక్తి పుట్టింది.....వాళ్లని చంపెయ్యండ్రా....!' అనడం గుర్తుకొస్తుంది.
పైగా ధర్మ యుధ్ధంలో అలా చంపెయ్యాలట. మామూలుగా విలన్లలాంటివాళ్లు అలా యెవరినిబడితే వాళ్లని 'విరక్తి' కలిగిందికదా అని చంపించెయ్యకూడదట. ఇలా అంటారు వ్యాఖ్యాతలు!"
........ఇలా చెపుతూ వుంటారు.
నన్నడిగితే, ఇలాంటి పురాణాలు పుక్కిటపట్టినవాళ్లు--విష్ణుచిత్తుడు తనకి దొరికిన పాపకి సూడికుడుత్త నాచ్చియర్ అని పేరు పెట్టాడు అనీ, యశోద కృష్ణుణ్ణి 'తిరగలి' కి కట్టేసింది అని ఈనాడు 'అంతర్యామి' కాలమ్‌లో రాసెయ్యచ్చు! (పాపం ఆ ఆర్టిస్ట్ రోలు బొమ్మనే వేశాడు--అతనికి ఈ పుక్కిటి పురాణాలు తెలియవేమో!)
ఇంకా అంటే, వికీపీడియాలో మనకి 'తెలిసినవన్నీ' వ్రాసెయ్యచ్చు--నేటి తరానికి 'నెట్' లో కనపడేవే అక్షర సత్యాలు మరి--పాతాళం పైన తలాతలం వుంది అని వ్రాసినా, ఇంకేవేవో వ్రాసినా!
ఇంకోటి గుర్తొచ్చింది. ఈ మధ్య అమీష్ త్రిపాఠీ అనేవాడొకడు శివుడి మీద ఓ "పుస్తకత్రయం" వ్రాస్తానని ప్రకటించి, ఇప్పటికే ఓ రెండు పుస్తకాలు ప్రచురించేసి, బోళ్లు డబ్బులు చేసేసుకున్నాడు.
మొదటిది అదేదో '.........మెలూహా' అని. అందులో దక్షుడూ, సతి, వీరభద్రుడూ, నందీ, భృంగీ, నీలకంఠ ఇలా అందరూ వుంటారు. ఆయుర్వతి అని ఓ డాక్టరు వుంటుంది. బృహస్పతి మందర పర్వతమ్మీద సోమరసం తయారు చేస్తూ వుంటాడు. నాగజాతివాళ్లు ఆ పర్వతాన్ని నాశనం చేసి, బృహస్పతిని చంపేస్తారు దక్షుడూ వాళ్లకి సోమరసం అందకుండా! అయినా ఓ పెద్ద యుధ్ధం చేసేసి, శతృరాజుని బంధించేసి అయోధ్యకో యెక్కడికో తీసుకొచ్చేస్తాడు నీలకంఠ. ఈ నీలకంఠ యెప్పుడూ నందీ వాళ్లతో 'గంజాయి చిలుం' పీలుస్తూ వుంటాడు.
ఇంక రెండో 'సీక్రెట్ ఆఫ్ ది నాగాస్' నవల్లో, అంతకు ముందు నవల్లోనే చెప్పినట్టు నాగజాతివాళ్లందరూ వికలాంగులనీ, కాళీ మాతా (నల్లగా వుండి యెప్పుడూ నాలుక బయటికి వేళ్లాడుతూ వుంటుందనేమో), ఆవిడ కొడుకులాంటి గణేషుడూ (యేనుగుతలా, చిన్న చేతులూ కాళ్లూ, బానపొట్టా వుంటాయికాబట్టి)--ఇలా నాగజాతికి చెందినవాళ్లనీ, మళ్లీ నీలకంఠ ఇంకెవరిమీదో యుధ్ధానికి వెళ్లడానికి రాముడు తిరిగిన ప్రదేశాలన్నీ చుడుతూ, మధ్యలో పరశురాముడనే దోపిడీ దొంగని ఓడించడం, గోదావరీ తీరందాకా ప్రయాణించడం--ఇలా నడుస్తుంది.
(వాడు ఇవన్నీ శివపురాణంలోనూ, దేవీ పురాణంలోనూ వున్నాయని చెప్పినట్టుకూడా గుర్తు నాకు.)
నిజంగా శోచనీయమైన విషయం యేమిటంటే, మన భారతదేశంలోని పాఠకులు ఇంగ్లీషునవలలకోసం మొహంవాచిపోయి వున్నారో, లేక ఇవే అసలైన పురాణాలని భక్తి పురస్సరంగా కొని చదివేస్తున్నారో! మరి లేకపోతే అవి "ఇండియన్ బెస్ట్ సెల్లర్ లిస్ట్" లో "టాఫ్" లో వున్నాయంటే........!
పైగా మన అగ్రహీరో "ఆ నవలలని సినిమాలుగా తియ్యాలంటే దమ్ముండాలి, డబ్బులుండాలి గానీ, తీస్తే సూపర్ హిట్లు అవుతాయి" అన్నారట.
తెలుగు సినిమా ప్రేక్షకులూ పాతాళానికి కాస్త దగ్గరగానే వున్నారని వాళ్ల అంచనా అనుకోవచ్చు మనం.
(మళ్లీ మరోసారి)