.........బ్రతకనివ్వాలా?
మళ్లీ "ప్రపంచ తెలుగు మహా" సభలకి యెన్ని కోట్లో కేటాయించారట! (ప్ర. తె. మ. అని నామకరణం కూడా చేసేశాడు ఈనాడు వాడు.)
యే సభలు చూసినా యేమున్నది గర్వకారణం?
భాషోధ్ధరణకల్లా మూలం బొకేలిచ్చి, మాలలు--కొండొకచో గజమాలలు వేసి, శాలువాలు కప్పడం, జ్ఞాపికలు అందించడం, ఫోటోలు పత్రికల్లోనూ, వీడియోలు టీవీల్లోనూ వచ్చేలా చూసుకోవడం! నిజంగా అద్భుతమైన భాషా సేవ!
మరి తెలుగు భాష యెలా బ్రతికి బట్టకడుతుంది?
గురజాడ 150 వ జయంతీ, నన్నయ 500 వ నో యెన్నోనో జయంతీ, శ్రీకృష్ణ దేవరాయల ఫలానా పట్టాభిషేకోత్సవం, ప్ర. తె. మ. లూ, తానా, తంతా లాంటి సభలూ "ఘనంగా" జరుపుకొంటేనా?
తెలుగు సినిమాలకి ఇంగ్లీషు పేర్లు పెట్టి, పాటల్లో ఇంగ్లీషూ, హిందీ, ఇతర దేశ భాషలే కాకుండా, ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, జపనీస్ లాంటి భాషల్లోని పదాలు వుపయోగించడం వల్లనా?
"యెక్కడి తెలుగుతల్లి? యెవడికి తల్లి?" అనడిగేవాళ్ల వల్లనా?
ప్రాథమిక విద్య నుంచీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు బోధించడం వల్లనా?
పోటీ పరీక్షల్లో ప్రశ్నల్లో పేపరు ఇచ్చేవాళ్ల "పాండిత్యం" వెలిబుచ్చేలాంటి చర్యలవల్లనా?
రాష్ట్రంలో యెక్కడా యే పేరైనా ఇంగ్లీషులోనో, ఇతర భాషల్లోనో (తెలుగు కాకుండా) వ్రాయడం వల్లనా?
ప్రభుత్వ, కచేరీల, వ్యవహారాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలూ, దస్త్రాలూ (తెలుగులో తప్ప) నిర్వహించడం వల్లనా?
ఇంకా ఇలాంటివన్నీనా?
మనం, మిగతా రాష్ట్రాలు మాతృభాష విషయంలో మనకన్నా చాలా ముందున్నాయి అంటామనుకోండి, ఇక మంత్రులూ, అధికార్లూ స్విట్జర్ లేండూ, దక్షిణ ఆఫ్రికా, మాచు పిచ్చూ లాంటి చోట్లకి, వాళ్లు వాళ్ల భాషల్ని యెలా కాపాడుకొంటున్నారో తెలుసుకోడానికి "స్టడీ" టూర్లకి వెళతామంటారు--మన మాజీ రాష్ట్రపతి ప్రపంచం మొత్తం, బంధు మిత్ర పరివారంగా "సౌహర్ద్ర" పర్యటనలు చేసేసినట్టు!
ఆ మధ్య ఓ లబ్ధ ప్రతిష్టుడైన సినీ గీత రచయితని మామూలుగా విలేఖరులు "తెలుగు భాషని బ్రతికించుకోడం గురించి యేమి చెపుతారు?" అనడిగితే, "అసలు తెలుగు యెక్కడుంది? దాన్ని బ్రతికించుకోడం యెందుకు? తత్సమాలూ, తద్భవాలూ లేకుండా తెలుగు మాట్లాడండి యెవరైనా?" అంటూ మండి పడ్డాడు. (ఆయన చాలామటుకు ఇంగ్లీషు పదాలతోనే పాటలు రాస్తున్నట్టున్నాడు! పైగా భుక్తి కోసమో, తప్పదనో పాటలు ఛస్తే వ్రాయను--నా ఆత్మ సంతృప్తి కోసమే వ్రాస్తాను అని మరీ ఢంకా బజాయించాడు.)
తెలుగు భాషకి వచ్చిన ముప్పు ఇంగ్లీషు నుంచిగానీ--సంస్కృతం నుంచో, కన్నడ, తమిళ, మలయాళీ, ఉర్దూ, పార్శీ, మరాఠీ, హిందీ వగైరా భాషల వల్లా కాదు కదా? మరి ఆయన "కవి హృదయం" యేమిటో?
మరి ఇంతకీ.....బ్రతికించాలా......బ్రతకనివ్వాలా? ఆ చేసేది యెవరంటారు?
No comments:
Post a Comment